Menu Close
అద్వైతం
-- భావరాజు శ్రీనివాస్ --

బ్రహ్మం:

పై సమీకరణం అంతటా ఉన్నది ఒకే ఒకటి(1). అది బ్రహ్మం. బ్రహ్మమే, చీకట్లో తాడు పాముగా కనిపించినట్టు, అజ్ఞానంలో జీవుడిగా, జగత్తుగా, ఈశ్వరుడిగా కనపడుతోంది. అందుకే బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అన్నారు. ఉపనిషత్తులు కూడా జీవుణ్ణి ‘అయమాత్మా బ్రహ్మ’ అని జగత్తుని ‘సర్వం ఖిల్విదం బ్రహ్మ’ అని ఈశ్వరుణ్ణి ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అని మూడింటినీ బ్రహ్మం గానే పేర్కొన్నాయి.

నేనే జీవుణ్ణి, నా శరీరమే జగత్తు, నా అంతరాత్మే ఈశ్వరుడు. కాబట్టి నేను గుర్తించినా గుర్తించక పోయినా (జంతువులు గుర్తించవు) నేను కూడా బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి. నేను, నా శరీరం, నా అంతరాత్మ -ఇలా మూడింటినీ, మూడుగా వేరు వేరుగా చూస్తే, మూడింటిదీ తలోదారీ అవుతుంది. వాటి మధ్య ఘర్షణ వస్తుంది. మనిషొక చోట ఉంటే మనసొక చోట ఉంటుంది. మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతుంది. మూడింటికీ ఉన్న సంబంధాన్ని, బ్రహ్మాన్ని గుర్తిస్తే, వాటి మధ్య ఐక్యమత్యం వస్తుంది. మనోవాక్కాయ కర్మల్లో ఏకత్వం వస్తుంది. ఐకమత్యమే బలం.

శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారి 'జగమంత కుటుంబం' పాటలో  “జగమంతకుటుంబం నాది, ఏకాకి జీవితం నాది" అని పాడుకుంటున్నది బ్రహ్మమే. బ్రహ్మమే జగమంత కుటుంబంలో రెండుగా (జీవుడు x జగత్తు), అంటే (భార్య x భర్త),(కవి xకవిత) - ఇలా ఒకరికొకరు వరసైన జంటలుగా మారి, తనతో తనే రమిస్తున్నది. ఏకాకిజీవితంలో ఈశ్వరుడై ఏకాంతంగా, జీవజగత్తులకు అంతరాత్మగా, సాక్షిగా ఉంటున్నది. జీవ జగదీశ్వరులుగా జన్మించి, జీవించి, మరణిస్తున్నది బ్రహ్మమే.

నేనెవరు? జీవుణ్ణా, బ్రహ్మాన్నా? రాజ్యం కంటే, యుద్ధం కంటే ఈ ప్రశ్నే ముఖ్యమై అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మమై గీతను బోధించాడు. నేనెవరు? ఈ ప్రశ్నతో నిద్ర పట్టని శ్రీరాముడు అర్ధరాత్రి లేచి వెళ్ళి వసిష్టుడి తలుపు తట్టాడు. లోపల్నుంచి "ఎవరు నువ్వు?" అని వసిష్టుడు ప్రశ్నించగానే, అది తెలియకే వచ్చానన్నాడు రాముడు. ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ కథ అందరికీ తెలుసు. పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ఒక అన్వేషణగా సాగి, తిరిగి పేరు గుర్తు చేసుకోవడంతో ముగుస్తుంది. నేనెవరు? అన్న ప్రశ్నతో మొదలయ్యే జీవుడి అన్వేషణ కూడా 'అహం బ్రహ్మస్మి' అని గుర్తుకు తెచ్చుకోవడంతో ముగుస్తుంది.

మోక్షం

మొదటిభాగంలో మనోవాక్కాయకర్మల్లో ఏకత్వాన్ని, చిత్తశుద్ధిని సాధించి, జీవుడు సామాజిక జీవితంలోకి అడుగు పెడతాడు. సామాజికంగా ఎంత ఎదిగినప్పటికీ మరణించక తప్పని జీవుడు రెండవ భాగంలో జననమరణ చక్రాన్ని relativityని దాటిపోయి మోక్షాన్ని, అమృతత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు.

advaitham-eeswarudu

ఫోటో లోని మొదటి సమీకరణం లో జీవుడు(mind, idea), జగత్తు(matter, thing) తో relation లో ఉన్నాడు. ‘X’ (into symbol) ఈ  సంబంధాన్ని సూచిస్తున్నది. ఈ సంబంధమే, రిలేషనే relativity, సంసారం. ఈశ్వరుడు ఈ relativity ని, సంసారాన్ని దాటి ఏకాంతంగా, స్వేచ్ఛగా ఉన్నాడు. ఇది సన్యాసం (absolute). ’గజేంద్రమోక్షం’ కథలో గజేంద్రుడు, తనను మొసలి బారి నుండి కాపాడమని దైవాన్ని ప్రార్ధించినట్టు, జీవుడు, జగత్తుతో ఏర్పడిన బంధం నుండి, సంసారం నుండి బయట పడాలని, జగత్తునుండి దృష్టి మరల్చి, relativityకి (సృష్టికి) అవతల ఎక్కడో ఉన్నాడని ఊహించే ఈశ్వరుడి (దైవం) పై దృష్టి సారిస్తాడు. కానీ relativity ని దాటి ఈశ్వరుడి స్థాయిని అందుకోలేక ఆ ఈశ్వరుణ్ణి అక్కడనుంచి తీసుకొచ్చి , జగత్తులో ఒక గుడి కట్టి, ఆయన్ను అందులో  ప్రతిష్టించి భక్తి భావంతో ఆయనతో కూడా సంబంధం పెట్టుకుని, తనకు ప్రతికూలంగా మారిన జగత్తును, తనకు అనుకూలంగా మార్చమని ఆయన్ను ప్రార్ధిస్తూ ఉండడం వల్ల, జీవుడు సంసారం నుండి బయట పడక పోగా, ఈశ్వరుణ్ణి కూడా జగత్తులోకి, సంసారంలోకి లాగి, ఆయనకు అన్నీ సమకూర్చలేక సతమతమౌతూ సంసారాన్ని మరింత పెంచుకుంటున్నాడు. లోకంతో సంబంధం పెట్టుకోవడం కోసం లౌకిక వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నట్టే ఈశ్వరుడితో సంబంధం పెట్టుకోవడం కోసం మత వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాడు.

Relativity లో ఉండడం వల్ల జీవ, జగత్తులో ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. జీవుడు లేకపోతే (మరణిస్తే) జగత్తు లేదు. ఈ రెండూ లేకపోతే సంసారం లేదు. అందువల్ల జీవించి ఉండగానే relativity (సంసారం) నుండి విముక్తి పొందాలి. జీవించి ఉండగానే పొందే ముక్తే జీవన్ముక్తి.

పోనీ, జీవించి ఉండగానే జగత్తుపై మమకారాన్ని వదిలిపెట్టేసినా శరీరం (అహంకారం) ఉన్నంత కాలం జగత్తుతో సంబంధం తప్పదు. జగత్తు నుంచి తప్పించుకున్నా దాన్ని గూర్చిన ఆలోచనల నుంచి జీవుడు తప్పించుకోలేడు. అహంకారమే విత్తనమై జగత్తుతో సంబంధం పెట్టుకుని సంసార వృక్షాన్ని విస్తరింప చేస్తుంది. అహంకారం నుండి బయట పడెయ్యమనే గజేంద్రుడు ప్రార్ధించింది.

శాస్త్రజ్ఞుడు, జీవుడి స్థానంలో ఉండి తను చూసే జగత్తులో ఒక పదార్ధానికీ, మరో పదార్ధానికీ, శరీరం లో ఒక అవయవానికీ మరొక అవయవానికీ, మనస్సులో ఒక ఆలోచనకు, మరొక ఆలోచనకు ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటున్నాడు. ఐనస్టీన్ మాత్రం జీవుడి స్థానంలో కాకుండా ఈశ్వరుడి స్థానంలో ఉండి అక్కడనుండి జీవ జగత్తుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించి సాపేక్ష సిద్ధాంతాన్ని (theory of relativity) ప్రతిపాదించిన తరువాత సృష్టిని గూర్చిన దృష్టి మొత్తం మారిపోయింది.

స్వేఛ్చను పొందాలంటే జీవుడు relativity ని దాటి ఈశ్వరుడై పోవాలి. ఈశ్వరుడంటే జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? నేను స్వతఃసిద్ధంగా ఈశ్వరుణ్నేనని, ఆ స్థితిని (జ్ఞానాన్ని) కోల్పోయి జీవుణ్ణవడం వల్ల జగత్తుతో సంబంధం (సంసారం) ఏర్పడిందని గుర్తించే జ్ఞానం. ఈ జ్ఞానం శివుడికి ఉందనడానికి ఆయనకు జ్ఞాననేత్రం ఉండడమే నిదర్శనం. ఈ జ్ఞానంతోనే, తనను జీవుణ్ణి చేసి relativity లో సంసారంలో, మాయలో పడెయ్యబోయిన మన్మధుణ్ణి (మనస్సును) గుర్తించి ధగ్ధం (control) చేసి తన ఈశ్వర స్థాయిని కోల్పోకుండా నిలుపు కున్నాడు. ‘నేను’ ఈశ్వర స్థానం నుంచి జీవుడి స్థానానికి పతనమవ్వడం వల్ల ఈశ్వర స్థానం ఖాళీ అయి ఆ స్థానంలో మరొక ఈశ్వరుణ్ణి (ఇష్ట దైవాన్ని) ప్రతిష్టించవలసి వచ్చింది.

జీవుడు తన నిజ స్వరూపాన్ని గుర్తించి ఈశ్వరుడై ఆస్థానంలో ఉండి జీవ జగత్తుల మధ్య జరిగే వ్యవహారాలను ‘సాక్షి’ గా చూస్తూ ఉండిపోదామనుకున్నా జగత్తు ఉండనివ్వదు. అతణ్ణి వ్యవహారంలోకి, వివాదంలోకి లాగి జీవుణ్ణి చేసి మళ్ళీ సంసారంలో పడేస్తుంది. ఈ ప్రమాదం (సంసారం) నుంచి ఈశ్వరుడు తప్పించుకోవాలంటే జగత్తు ఉండకూడదు. ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకోసం ఈశ్వరుడు (జ్ఞానం) తను సాక్షిగా ఉండి చూస్తున్న relativityని, జీవజగత్తులను(అహంకార, మమకారాలను) రెండో సమీకరణంలో చూపించినట్టు తనలో కలిపేసుకుని ‘బ్రహ్మం’ అయిపోవాలి. అపుడు నదులన్నీ సముద్రంలో లయమై తమ ఉనికిని కోల్పోయి సముద్రంగా మారినట్టు, జీవజగదీశ్వరులు ముగ్గురూ జ్ఞానసాగరం (బ్రహ్మం) లో లయమై తమ ఉనికి కోల్పోయి బ్రహ్మంగా మారిపోతారు. ఇప్పుడు జగత్తు బ్రహ్మమే (సర్వం ఖిల్విదం బ్రహ్మ). అలాగే జీవుడు (అయమాత్మా బ్రహ్మ), జ్ఞాన స్వరూపుడైన ఈశ్వరుడు (ప్రజ్ఞానం బ్రహ్మ). ఇపుడు బ్రహ్మం తప్ప రెండోది లేదు. ’ఏకమేవా అద్వితీయం బ్రహ్మ’. నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రంగా మారిన తర్వాత వాటిమధ్య బేధం ఎలా లేదో, కనపడదో, జీవజగదీశ్వరులు మూడూ బ్రహ్మమైనపుడు వాటిమధ్య భేదం లేదు. కనపడదు. మూడింటినీ(అన్నింటినీ) సమానంగా, సజాతీయంగా బ్రహ్మంగా చూడడం -ఇది spiritual communism. ఈ సమత్వాన్ని సాధన చేసేవాడే సమర్ధుడు.

****సశేషం****

Posted in October 2025, ఆధ్యాత్మికము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *