మన తెలుగు భాషలో గ్రాంధిక భాషకు, వ్యావహారిక భాషకు మధ్య ఎంతో వ్యత్యాసం గోచరించుచున్నది. అందుకు ఇతర భాషల ప్రమేయం కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా ఆంగ్లభాషా ప్రమేయం మనకు ప్రస్ఫుటంగా కనిపించుచున్నది. ఆంగ్ల భాష, మన రోజువారి జీవితాలలో ఒక భాగమై, మన తెలుగు భాషలో కూడా మిళితమై పోయింది. మా ‘సిరిమల్లె’ ముఖ్యోద్దేశం, మన తెలుగు భాషలో అంతర్లీనంగా ఏర్పడిన ఆ వ్యత్యాసమును పూడ్చుటకు ఒక చిన్న వారధిగా పనిచేసి, ప్రతి ఒక్కరిలోనూ మాతృ భాషపై అత్యంత మమకారం ఏర్పరిచి తదనుగుణంగా తేనెలొలుకు తెలుగులో మనందరం ఆప్యాయంగా పలకరించుకొని, సంభాషించుకునే విధంగా చేయడమే.
సంకల్పం స్వచ్ఛంగా మల్లె పూవు లాగా వుంటే, సారాంశం ఏదోవిధంగా మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఆలోచనే మా ‘సిరిమల్లె’ పుట్టుకకు కారణమైనది. ఈ మాస పత్రికలో, వీలైనంత వ్యావహారిక తెలుగు పదాలు మరియు మా పరిజ్ఞానంమేర గ్రాంధిక పదాలను కూడా పరిచయం చేసి, కదంబం లాంటి సకల సమగ్ర సమాచారంతో కొంచెం వినూత్నంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. మహా సముద్రం లాంటిది మన తెలుగు సాహిత్యం మరియు సంస్కృతి. ఎంతో మంది మేధావులు, పండితులు ఈ మహా సాగరాన్ని సోధించి, తమ భాషా పటిమతో చిలికి ఎన్నో ఆణిముత్యాలను, అద్భుత సమాచారాన్ని మనకు అందించారు, అందిస్తూనే వున్నారు. మా వంతు ఉడుతా భావంతో, ఒడ్డుకు చేరుతున్న చిన్న చిన్న గవ్వలను ఏరుకొని, వాటితో ఒక అందమైన ఆకృతిని మలచడమే మేము చేస్తున్న ఈ ప్రయత్నం.