ఈ రోజు రఘురామయ్యగారి పరిస్ధితి మొదటిసారి హాస్టల్‌కి వెళ్ళే కుర్రాడికిలాగా ఉంది. అందరూ తలా ఒక విషయం ఆయనకు బోధిస్తున్నారు. మనుమరాలు సెల్ఫోనుతో ఫొటోలు ఎలా తీసుకుని పంపాలో చెపితే, మనుమడు వాట్సప్ లో మెసేజ్ లు ఎలా పంపాలో, ఎలా ఫోన్ చేయచ్చో నేర్పుతుంటే, కొడుకు బ్యాంకు కార్డు ఎలా ఉపయోగించాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నూరి పోస్తుంటే, కోడలేమో ఏ ఏ ఊరగాయి ఎందులో ఉందో, వాడాల్సిన మందులు అవి ఏవి ఎందులో ఉన్నాయో చెబుతోంది. ఇంతకీ ఈ హడావిడి అంతా ఎందుకంటే, ఆయన మొదటిసారి వాళ్ళందర్నీ వదిలి వృధాశ్రమంలో ఉండటానికి వెళుతున్నారు.
రఘురామయ్యగారికి 75 సంవత్సరాలు. భార్య రాధ ఉన్నన్నాళ్ళు ఆమే ఆయనకు అన్నీ అయి చూసుకునేది. ఆయనకి ఏ సమయానికి ఏమి అవసరమో ఆమె అన్నీ అమర్చేది. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా, కాసేపు మాట్లాడుకుంటూ, కాసేపు పోట్లాడుకుంటూ, హాయిగా ఉండేవాళ్ళు. ఏమయ్యిందో, ఒక రోజు ఆమె తొందరపడి ఆయనను వదిలి పైలోకాలకు వెళ్ళిపోయింది. అదుగో, అప్పుడే ఆయనకి ఈ అవసరం ఏర్పడింది. పెద్దవాళ్లను చూసుకోవటం అంటే ఒక పసివాడిని చూసుకోవటంకంటే కష్టం. వీళ్ళకు కొన్ని నిర్దిష్టమైన అభిరుచులు, అభిప్రాయాలతో పాటు, ఇన్నాళ్ళుగా వాళ్ళు సంపాదించుకున్న మర్యాదలు మన్ననలు ఉంటాయి, వాటికి భంగం ఏర్పడితే వారు భరించ లేరు. వాళ్ళది త్వరగా అనారోగ్యం చేసే వయస్సు. మానసిక వత్తిళ్ళను తట్టుకోలేరు. వారి వయస్సు అలాంటిది. కానీ ఆయనకు ఆ బెడద లేదు. ఆయనకు ఏ లోపం లేకుండా చూసుకునే పిల్లలు ఉన్నారు. కానీ, కొన్ని పరిస్ధితులు అలా ఉంటాయి.
కొడుకు కోడలు పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తంతా ముందుంది. వాళ్లు వాళ్ళ చదువులతో హడావుడిగా ఉంటారు. కోడలు కొన్నాళ్ళు, ఉదయమే అన్నీ వండి, టేబులు మీద ఉంచి వెళ్ళేది. అవి వేడి చేసుకుని తినే క్రమంలో ఒలక పోసుకుని ఒళ్ళు కాల్చుకున్నారు. తరువాత ఒక కుర్రవాణ్ణి ఆయనకు తోడుగా ఏర్పాటు చేశారు. వాడు చేతికి అందింది తీసుకుని ఉడాయించాడు. ఆయనకేమి అపకారం చేయనందుకు సంతోషించి, ఒక వంట మనిషిని ఏర్పాటు చేశారు. నాలుగైదు నెలలు బాగానే గడిచాయి, కానీ ఆమె వాడిన నూనెలకు, కారాలకు ఆయన ఆరోగ్యం దెబ్బ తినటం మొదలైంది. అంతే కాకుండా నెలకు తెచ్చిన సరుకులు పది పదిహేను రోజులే వచ్చేవి. ఈ సమయంలోనే తన స్నేహితుడు శశి కుమార్ ఉండే ఆశ్రమానికి వెళ్ళాలని నిర్ణయించుకొని, కొడుకుని, కోడల్ని వప్పించారు. ఈ ఏర్పాట్లన్ని అందుకోసమే.
మర్నాడు ఇంటిల్లిపాది ఆయనను ఆశ్రమంలో దింపి, అన్ని వస్తువులూ సద్ది, అక్కడే భోజనం చేసి, ఏర్పట్లన్ని సంతృప్తిగా ఉన్నాయనుకున్నాక ఆయనను వదిలి వెళ్ళిపోయారు. స్నేహితుడి సాహచర్యంలో త్వరగానే అక్కడ ఇమిడి పోయారు రఘురామయ్యగారు. ఉదయమే కాఫీ తాగి అలా శశిగారి తో నడుచుకుంటూ ఆశ్రమంలో పచారులు చేసి, ఫలహార శాలలో బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని, కాసేపు ఆరామశాలలో నలుగురితో కలిసి పేపర్ చదువుతూ కబుర్లు చెప్పుకొని, గదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసుకోవటం. 12 గంటలకి గంట మ్రోగగానే భోజనాల గదికి వెళ్ళి భోజనం చేసి, కోడలు ఇచ్చిన పుస్తకం చదువుతూ నిద్ర పోవటం, 3 కి 4కి మధ్య వాళ్ళు ఇచ్చిన కాఫీనో టీనో త్రాగి సాయంత్రం మళ్ళీ అందరూ కలిసి పిచ్చాపాటీ మాట్లాడుకొని కాసేపు టీవీ చూసి భోజనం ముగిశాక గదికి చేరటం. ఈ దినచర్యతో రోజులు బాగానే గడిచిపోసాగాయి. అప్పుడప్పుడూ కొడుకూ కోడలూ, ఎప్పుడైనా మనమడూ మనుమరాలు వస్తూపోతూ ఉంటారు.
వృద్ధాశ్రమం అవటంతో అప్పుడొకరు ఇప్పుడొకరు పోయేవారు. ఆ క్రమంలోనే ఒక రోజు శశికుమార్ వంతైంది. అందరూ అక్కడ చేరారు, కబురందుకొని కొడుకులిద్దరూ వచ్చారు. మాటా మాటా పెరిగి తండ్రి నీకెక్కువిచ్చాడంటే నీకే ఎక్కువిచ్చాడని అరుచుకుంటూ, అందరూ ఎంత చెప్పినా వినకుండా తండ్రి దేహాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. రఘురాంగారే తన సొంత ఖర్చుతో ఆశ్రమం వాళ్ళచేత కార్యక్రమం పూర్తి చేయించారు.
కొడుకూ, కోడలూ, పిల్లలు వచ్చి ఆయన్ని ఓదార్చి, ఇంటికి వచ్చేయమని వత్తిడి చేశారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించి, ఇది తన వానప్రస్థాశ్రమమని, ఇక ఎక్కడకూ రానని ఖరాఖండిగా చెప్పి, అక్కడే కొనసాగారు.
తరువాత వివిధ కారణాలతో ఆయన ఆశ్రమాలు మారాల్సి వచ్చింది. ఒకరోజు ఆయన బాత్రూంలో కాలు జారి పడిపోయారు. కాలుకి ఫ్రాక్చరుతోపాటు తలకు బలమైన దెబ్బ తగిలి ఆపస్మారకమై పోయారు. ఆయనను ఆసుపత్రిలో చేర్చి, కొడుకుకి కబురు చేశారు. కబురందుకొని, కొడుకూ కోడలు కారులో బయలుదేరారు. ఒక మలుపులో స్పీడుగా వస్తున్న వాళ్ళ కారుని తప్పు దారిలో వస్తున్న ఒక ట్రాక్టరు గుద్దుకోవటంతో కారు నుజ్జునుజ్జయింది. అక్కడికక్కడే వారిరువురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోయాయి.
పదిహేను రోజుల తరువాత కోలుకున్న రఘురామయ్యగారికి కోడలు తమ్ముడు సుకుమార్ సపర్యలు చేస్తూ కనిపించాడు. సుకుమర్ చాలా కలుపుగోలు మనిషి, అందుకే తన స్నేహితుడిని వప్పించి అతని కూతురు రమణిని సుకుమార్కి ఇచ్చి దగ్గరుండి పెళ్ళి జరిపించారు. రమణి ఎంతో నేర్పు, ఓర్పు కలిగిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో ఇట్టే ఒదిగి పోయింది.
సుకుమార్ ఎంతో సున్నితంగా జరిగిన సంఘటన వివరించాడు. విషయం తెలిసి తీరని బాధకు గురయ్యారు. ఆఖరి చూపు కూడా చూసుకోలేక పోయిన తన దౌర్భాగ్యానికి కుమిలి పోయారు.
సుకుమార్ తో కలిసి ఇంటికి వెళ్లారు. పిల్లలు ఎదురు వచ్చి కౌగిలించుకుని భోరున ఏడ్చేశారు. వియ్యంకులిద్దరూ, ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు. కానీ, శకుంతలమ్మ బాధ మనసును పిండేసింది. రెండు రోజులు వాళ్ళందరితో బాధని పంచుకున్నారు.
వాళ్ళు ఆయనకి పిల్లల బాధ్యతలని వప్ప చెప్పి వెళ్ళిపోతామన్నారు. కానీ, రఘురామయ్యగారు అందుకు వప్పుకోలేదు. కొడుకూ కోడలు లేని ఆ ఇంట్లో తాను ఉండలేననీ, ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకోలేననీ చెప్పి, పిల్లల బాధ్యత సుకుమార్, రమణికి అప్పచెప్పి, అందరి వద్ద శలవు తీసుకుని, తన ఆశ్రమానికి పయనమయ్యారు.