ప్రేరణ:
మన మనస్సు ఎప్పుడు ఏ సందర్భానికి స్పందిస్తుందో తెలియదు. ఆ స్పందనలు కొన్ని చక్కటి వితరణ కలిగిఉన్నప్పుడు మనలో ఆలోచనల ప్రవాహం అలవోకగా జనిస్తుంది. అటువంటి సన్నివేశం నాకు ఈ మధ్యనే వచ్చింది. వేసవికాల ప్రారంభంలో మేము అనుకోకుండా విమానంలో పశ్చిమం నుండి అంటే కాలిఫోర్నియా నుండి తూర్పుకు అంటే వాషింగ్టన్ డి.సి కి వెళ్ళడం జరిగింది. ఆ ప్రయాణంలో విమాన కుదుపులు, గవాక్షం నుండి కనపడుతున్న ప్రకృతి సౌందర్యాలు, పంచభూతాల ప్రత్యక్షం, అన్నింటా అనుభూతితో నా మనసు కూడా వివిధ రూపాల స్పందనలకు లోనైంది. అప్పుడు కలిగిన ఆలోచనలకు అక్షరరూపం కల్పించి ఒక చిన్న వచన కవితగా మీ ముందుకు తీసుకొని వచ్చాను. మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. - మధుప్రియ
అనుకోకుండా ఒక రోజు,
ఆకాశ వీధిలో పయనించే అవకాశం జనించింది
దక్షిణ పశ్చిమ వాహక సౌలభ్యంతో
వినువీధుల విస్తృత పరిధులలో
విమానయానం కడు రమ్యంగా సాగింది.
వేల అడుగుల ఎత్తునుండి
మనిషి కన్నా చిన్నవిగా
కనిపిస్తున్న పర్వత శ్రేణులు
శ్వేత వర్ణంతో శోభిల్లుతున్న వాటి శిఖరాలు
ఎవరో శిల్పి చెక్కినట్లు
అందమైన కళా కృతులతో
కనిపిస్తున్న వైనం
ఒక అనిర్వచీయమైన అద్భుత దృశ్యం
ఆకాశవీధి నుండి అవనితల్లి
అనేక వర్ణాల చిత్రపటమౌతుంది.
ఆశాపూరిత ఊహాలోకంలో
అన్ని ఆలోచనల రూపాలు
ఆకర్షణీయంగా ఆవిష్కరింపబడతాయి.
నిజస్వరూప భావాలు వాస్తవికతకు దూరమైననూ
ఊహలలో విహరించే ఉత్సాహంలో
అన్ని వర్ణాలు అత్యత్భుతమనిపిస్తాయి.
ఆశావహులకు భూతలస్వర్గ భావన గోచరిస్తుంది.
ఊహల ఊపిరిలు ఉరికెత్తుతున్నవేళ
వినీల ఆకాశంలో విరజిమ్ముతున్న
ఆ వెలుగురేఖల కాంతి పుంజాలు,
ఆదిత్యుడు అనురాగపూరిత ఆహ్వానాన్ని
అందించిన భావనతో స్ఫురిస్తున్నాయి.
మిన్నునుండి చూస్తుంటే మన్నుమీది
అత్యంత పెద్ద కట్టడాలు కూడా అరచేతిలో ఇమిడిపోయే భావన
అన్ని వాహనాలు చీమల బారులౌతాయి
కారుచీకటి కమ్ముకున్న వేళ
నలుదిక్కులా మినుగురు పురుగుల వంటి కాంతి పుంజములు
పైన తారల సహజ కాంతి
క్రింద నేల మీది కృత్తిమ సాంకేతిక వెలుగు జిలుగులు,
చీకటి వెలుగుల జీవనవ్యవస్థను గుర్తుచేస్తున్నాయి.
దట్టమైన మేఘాల మధ్యన
వత్తిడికి లోనౌతూ, కుదుపులను భరిస్తూ
విమానయానం ఉత్కంఠ భరితమై
ఉద్వేగానికి కారణమౌతున్నది.
వేల అడుగుల ఎత్తునుండి
మేఘాలను చీల్చుకుంటూ
నేలతల్లి ని తాకుతున్న వేళ
పలకరింపుతో పులకరింప జేసిన వాన చినుకుల విన్యాసం
మదిని మురిపించిన ఆహ్లాదకర వాతావరణం
అనుకోని ఆతిధ్య అపురూప వరం
ఆకాశ ప్రయాణం అదో అద్భుత
పంచ భూతాలు ప్రేమతో పలకరించిన సజీవ జీవన దృశ్యం