Menu Close
ఆధ్యాత్మికసాధన
- ఆదూరి హైమవతి -

రైతు పొలమును చక్కగా సకాలంలో దున్ని, నారు పెట్టి, నాటి, నీరు పోసి, కలుపు మొక్కలను జాగ్రత్తగా పెరికివేసి, ఎరువువేసి సాగు చేసినప్పుడే పంట ధాన్యమును అందుకోగలడు. ఎఱువు వేయకుండా, నారు పెట్టకుండా, నీరు పోయకుండా, పొలమును దున్నకుండా కేవలం విత్తనాలు చల్లితే  పంట వస్తుందా? రానేరాదు.

అలాగే ఆధ్యాత్మిక జీవనానికి నాల్గు గుణములను అలవర్చుకోవాలి. అప్పుడే సాధనకు తగిన ఫలితాన్ని పొందగలము. ఆనందాన్ని, శాంతిని, సంతృప్తిని అందుకోగలము.

ఆ నాలుగు గుణముల గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను. మొదటిది మైత్రి, రెండవది కరుణ, మూడవది ముదిత, నాల్గవది తితీక్ష.

మొదటిది మైత్రి - మన వయస్సుకు, మన సంపదకు, మన చదువుకు, మన పరిస్థితికి తగిన వారితోనే మనం స్నేహం చేయాలి. అధికులతో స్నేహం చేస్తే వారు మనలను లొంగదీసుకునే ప్రయత్నం చేయవచ్చు. లేక అవమానించవచ్చు. అలాగే మనకంటే చిన్నవారితో స్నేహం చేస్తే మనం వారిని అదుపులో పెట్టే ప్రయత్నం చేయవచ్చు. దానికి వారు బాధ పడవచ్చు, మనలను ద్వేషించవచ్చు, దూషించవచ్చు. తద్వారా స్నేహం చెడిపోతుంది. కనుక, సమానులతోనే స్నేహంచేయాలి. ఇతరులకు కీడు చేసేవారితోను, దురాలోచనలతో, దుష్ప్రవర్తనతో మెలగే వ్యక్తులతోను స్నేహం చేయకూడదు.

రెండవది కరుణ - దీనిని కూడా మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రసరింప జేయకూడదు. మనకంటే చిన్నవారిపైన, వయస్సులోనూ, సంపదలోనూ, ఆరోగ్యములోనూ, ఇతర సామాజిక పరిస్థితులలోనూ తక్కువ స్థాయిలో ఉన్నవారిపైన మన కరుణను ప్రసరింపజేయాలి. దీనివల్ల కరుణ యొక్క విలువ పెరిగి స్థాయి బలపడుతుంది.

మూడవది ముదిత - మనకంటే అధికులను చూసి అసూయ పడకుండా, వారిపట్ల మన మనస్సులో ఎలాంటి దుర్భావములకు చోటివ్వకుండా, ఈర్ష్యపడకుండా, వారి అభివృద్ధిని చూసి ఆనందించడమే ముదిత.

నాల్గవది తితీక్ష - అనగా, సుఖదుఃఖముల పట్ల, నిందాస్తుతుల పట్ల, లాభనష్టముల పట్ల సమదృష్టిని వహించడం.

ఈ నాల్గింటినీ ఆచరిస్తే పురుషార్థములను సాధించినట్లే. వీటిని అలవర్చుకోవడానికి చిత్తశుద్ధి అవసరం. ప్రతిజీవి యందు ఉన్నది భగవంతుడొక్కడే అనే విశ్వాసాన్ని అభివృద్ధి పర్చుకుంటే చిత్తశుద్ధి కల్గుతుంది. చంచలత్వానికి కారణములైన రజోగుణ, తమోగుణములను దూరంచేసుకుని నిశ్చలత్వాన్ని సాధించాలి. సత్వగుణాన్ని కాపాడుకోవాలి.

మనవద్ద ఉన్న పాత్రలోని నీరు మలినంగా ఉన్నప్పుడు దానిలో సూర్యుని ప్రతిబింబము సరిగా కనిపించదు. కదిలే జలములో కూడా ప్రతిబింబము కదిలినట్లుగా కనిపిస్తుంది. మన పాత్రలోని నీరు పరిశుద్ధంగా, నిశ్చలంగా, ఉన్నప్పుడు దానిలో సూర్యుని యొక్క ప్రతిబింబమును చక్కగా చూడగలము.

మన దేహమే ఒక పాత్ర. మనస్సే జలము, ఆత్మయే సూర్యుడు. తామసిక మనస్సును మలిన జలముతోను, రాజసిక మనస్సును కదిలే జలముతోను, సాత్విక మనస్సును పరిశుద్ధ జలముతోను పోల్చవచ్చును.

అందరియందు ఒకే ఆత్మ ఉన్నప్పటికీ ఉపాధి భేదము చేత మనం నిశ్చలత్వమును, నిర్మలత్వమును సాధించలేక పోతున్నాము. మనయందున్న దోషములను, ఇతరుల యందున్న మంచిని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే మన మనస్సు పరిశుద్ధం అవుతుంది.

దోమల బాధ నుండి మనలను మనం కాపాడుకోను దోమ తెరవేసుకుంటాం. కానీ, ఆ దోమతెరలోనే దోమలు చేరి ఉంటే దోమతెర వలన లాభమేమి? కనుక, మొట్టమొదట మనలో దోషములు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మన ఆధ్యాత్మిక సాధనలు మన భక్తి ప్రపత్తులను  నిలబెట్టేందుకే ఏర్పడినవని గుర్తుంచుకోవాలి.

స్వార్థము, స్వప్రయోజనముల కోసం చేసే సాధనలు ఆనందాన్ని, శాంతిని, సంతృప్తిని ఇవ్వలేవు. అప్పుడు మనం దేనినీ స్థిరంగా, నియమం ప్రకారం చేయలేము. రామాయణంలో ఈక్రింది సంఘటన ద్వారా దీనిని చక్కగా గ్రహించవచ్చు.

కైకేయ రాజ్యము నుండి తిరిగి వచ్చిన భరతుడు, తండ్రి అయిన దశరథుని మరణవార్తను విని, తల్లియైన కైక వద్దకు వచ్చి 'తండ్రిగారి మరణం ఎలా జరిగిందని’ కారణం అడిగాడు. దానికి సమాధానంగా కైక “నాయనా! దీనికి కారణం నేనే. నీ ఉన్నతి కోసం, నిన్ను రాజును చేయదలచి నేను ఈ కోరికలు కోరినాను. మీ అన్న రాముడు 14 సం. అడవులకేగాడు. రామ వియోగముచేత నీ తండ్రి మరణించినాడు” అన్నది. ఆమె దృష్టికి ఈ కోరిక చాలా గొప్పదిగా అనిపించింది. కాని, భరతునికి అది చాలా కఠినంగా తోచింది.

వెంటనే తల్లితో “క్రూరురాలా! చెట్టును కొట్టి కొమ్మలను నాటడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది బుద్ధిహీనుల లక్షణం” అన్నాడు. తనకోసం కోరికలు కోరానన్న తల్లిని ద్వేషించి, దూమగా ఉన్నాడు.

అలాగే, ఈనాటి మానవుడు దైవత్వమనే చెట్టును త్రుంచి, ప్రకృతి తత్త్వమనే కొమ్మలను నాటుతున్నాడు. భక్తి ప్రపత్తులు లేని సాధనలు మిక్కిలి హేయమైనవి. అలాంటి సాధనలు సత్ఫలితములను ఇవ్వలేవు.

మైత్రి, కరుణ, ముదిత, తితీక్ష అనే సద్గుణాలు లేకపోతే సాధనలు సంతృప్తిని, శాంతిని, ఆనందమును అందించలేవు. కనుక, ఆధ్యాత్మిక సాధనకు ముందుగా ఈ మూల సూత్రాలను అలవర్చుకోవాలి.

********

Posted in August 2024, ఆధ్యాత్మికము

1 Comment

  1. Aduri.Hymavathi

    సిరిమల్లె సంపాదకులకు, నా ఆధ్యాత్మిక వ్యాసం ప్రచురించి ప్రోత్సహించినందుకు ధన్యవాదములు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!