Menu Close
mother and baby
ఆదర్శ మాతృమూర్తులు
-- ఆదూరి హైమవతీ శ్రీనివాసరావు --

పరమ పవిత్రమైన మన భారతదేశంలో తల్లిదండ్రులు నిరంతరం తమపిల్లల పెంపకం గురించి తగు జాగ్రత్త వహిస్తూనే ఉన్నారు, తపన పడుతూనే ఉన్నారు. పిలల్ల పెంపకంలో తండ్రి బాధ్యత కంటే తల్లుల బాధ్యత ఎప్పుడూ అధికంగానే ఉంటుంది.

‘తల్లివడి ప్రధమ బడి' అనేమాట పరమసత్యం. మెదటి దైవం తల్లే! 'మాతృదేవోభవ, పితృదేవోభవ' -- అనే మన భారతీయ సంస్కృతీ సౌరభాలను గురించి మహాత్ములంతా అడుగడుగునా చెప్తూ తల్లి బాధ్యతను గుర్తుచేస్తూ - ‘మొదటి దైవమే కాక తల్లి మొదటి గురువు కూడా’ అని చెప్పనే ‘తల్లివడి ప్రధమ బడి' అన్నారు.

ముందు తల్లి చూపులతో, నవ్వులతో, సౌఙ్ఞలతో బిడ్డను వడిలో ఉంచుకుని పాలుపడుతూ, స్నానంచేయిస్తూ, బట్టలుతొడుగుతూ, వంటికి మసాజ్ చేస్తూ తన భావనలను మనస్సు ద్వారా, చూపుల ద్వారా బిడ్డకు తెలియ పరుస్తుంటుంది. తాబేలు తన పిల్లలను నదికి ఆవలి గట్టున ఉంచి, ఈవలి గట్టునుండి వాటిని చూస్తూ, తన చూపులతో పెంచుతుంది!.

తల్లి తన తలంపుల ద్వారా తన పిల్లల పెరుగుదలకు కృషిచేస్తూ, బిడ్డల మనోభావాలను తెల్సుకుని, ఆలన పాలన అందిస్తూ వారి ప్రతి స్పందనలకు అనుగుణంగా బిడ్డలకు అర్ధమయ్యేలాగా మౌనభాష నేర్పు తుంది.

ఆపైన వారికి చిన్నచిన్నమాటలు చెప్తూ భాష నేర్పుతుంది. అత్త, తాత, అమ్మ, నాన్న, బామ్మ మొదలైన మాటలతో ఇంటి సభ్యులను పరిచయం చేస్తూ సంఘంతో సాంగత్యం ఏర్పరుస్తుంది. బిడ్డ పెరిగే కొద్దీ తినడం, తాగడం, వంటి చిన్నచిన్నపనులతో పాటు పెద్దలు ఇంటికివస్తే నమస్కరించడం, కూర్చోమని చెప్పడం, మంచి తీర్ధం తెచ్చి ఇవ్వడం వంటి మర్యాదలు నేర్పుతూ మొదటి గురువుగా నిలుస్తుంది.

మన భారతీయ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శం! మన పురాణాల్లో ఆదర్శ మాతలు చిరస్మరణీయులు! తల్లి తన కర్తవ్యాన్ని ఆదర్శవంతంగా ఎలా నిర్వహించాలో మనకు పురాణ గాధల ద్వారా తెలుస్తుంది. అనేక సందర్భాలలో 'ఆదర్శమాతలను' గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రస్తావిస్తూనే ఉన్నారు.

కౌసల్య తన కుమారుడైన శ్రీరామచంద్రునికి, కుంతి తన కుమారులైన పంచ పాండవులకు, చారిత్రక యుగంలో శివాజీకి జిజియాబాయి, ఆధునిక యుగంలో రామకృష్ణ పరమ హంసకు చంద్రమణీదేవి, ఈశ్వర చంద్ర విద్యాసాగరునికి భగవతీదేవి, గాంధీజీకి పుతలీ బాయి, తల్లులై భారతజాతి రత్నాలను లోకానికి అందించి ఆదర్శమూర్తులై నిలిచారు.

వీరంతా తమ బిడ్డలకు చిన్నతనం నుండీ సుద్దులు, బుధ్ధులూ చెప్తూ ఎవరెవరిని ఎలా గౌరవించాలో నేర్పారు. దైవభక్తి, దేశభక్తి, సంఘనీతి నూరిపోశారు. ఏ తల్లైతే ధర్మ మార్గాన్నిచిన్నతనం నుండీ ఇలా బోధిస్తుందో ఆమె ప్రపంచంలో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, ఆహింసల స్థాపనకు జ్యోతి ప్రజ్వలన చేసినట్లే!

అలాంటి తల్లులు విరివిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా ధర్మం తప్పని జనాలతో నిండి ప్రశాంతత నెలకొంటుంది. భారతీయ సంస్కృతిలో ‘జననికీ జన్మభూమికీ’ విశిష్ట స్థానం ఇచ్చారు. పుడమి కన్నతల్లి పూజనీయులు కదా!

వారిమించువారు వసుధలేరు ,
కన్నతల్లికన్న ఘనతఏది?
కన్నభూమికన్న స్వర్గమేది?-
జన్మభూమితోను, జన్మనిచ్చిన తల్లి తోను
స్వర్గం సైతం సరితూగదని చెప్తారు.

ముందుగా రామాయణం లోని తల్లులను చూద్దాం:

రామునికి తల్లి కౌసల్య అందరినీ ప్రేమించడం, పెద్దలను గౌరవించడం పసితనం నుండే ‘బాలరాము’నికి నేర్పిందిట. కుమారునిగా, అన్నగా, శిష్యునిగా, భర్తగా, రాజుగా, వీరునిగా, ప్రతిశూరునిగా, స్నేహితుని గా, న్యాయ పాలకునిగా, తండ్రిగా, తన బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వహించేందుకు కౌసల్య పెంపకమే కారణం అని చెప్పవచ్చు.

కౌసల్య బాల శ్రీరామునికి నేర్పినమాట శ్లోకరూపంలో --
యంపాలయతి ధర్మం -- తం వృత్తేన నియమేనచ
సవై రాఘవ శార్దూల -- ధర్మత్వం అభిరక్షతు.

'ఓ రఘువంశ శార్దూలమా! రామా! నీవు 'ధర్మాన్ని' నియమంగా, నిరంతరం నీ వృత్తిగా భావించి పాలించు', అంటూ ఉగ్గుపాలతో ధర్మాన్ని బోధించింది!

విశ్వామిత్రుడు యాగసంరక్షణార్ధం శ్రీరాముని పంపమని దశరధుని కోరను కోసలకు వచ్చినపుడు, శ్రీరాముడు తండ్రి కబురందుకుని సభలో ప్రవేశించి ముందుగా తన తల్లి కౌసల్యకు, తర్వాత తండ్రి దశరధునికి, ఆపైన గురువు వశిష్టునికి, చివరగా అతిధి అయిన విశ్వామిత్రునికి పాదాభివందనం చేస్తాడు.

తల్లి తండ్రిని చూపితే, తండ్రి గురువును చూపుతాడు, గురువు దైవాన్ని చూపుతాడు. అంటే వరుసక్రమంలో ప్రాధాన్యతను అనుసరించి గుర్తించి గౌరవించి, వర్తిస్తూ ఆయా వ్యక్తుల ద్వారా మానవునికి ఆవస్యకమైన సులక్షణాలు నేర్చుకోవాలని అర్ధం.

‘రామో విగ్రహవాన్ ధర్మః’ -అనే మాట వినగానే తల్లి కౌసల్య గుర్తురాక తప్పదు ఎవరికైనా. అందుకే ‘కౌసల్యా సుప్రజారామ –పూర్వా సంధ్యా ప్రవర్తతే-' అంటూ ఆ తల్లి కుమారునిగా మనం వేంకటేశ్వర సుప్రభాతం లో ప్రతిరోజూ పాడుతున్నాం.

రావణసురుని మరణానంతరం లక్ష్మణుడు రామునితో "అన్నా! ఈ ‘బంగారులంకను మీరుపాలిస్తే, అయోధ్య భరతునికి వదిలేయవచ్చు కదా! ఈ లంక సిరిసంపదలతో స్వర్గానికి దీటుగా ఉంది!" అనగా, సత్యధర్మాలు మూర్తీభవించిన రామచంద్రుడు ..

"లక్ష్మణా! తల్లి కురూపి అని మరొక అందమైన స్త్రీని తల్లిగా భావించ గలమా! 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపిగరీయసీ!' అని తెల్సుకో !" అన్నాడు. తల్లి కౌసల్య పెంపకమే రాముని అంత ఆదర్శవంతునిగా చేసిందని చెప్పుకోవచ్చు. ఆయన అవతారపురుషుడైనా మానవ జాతికి ఆదర్శం అందించే నిమిత్తం ఈవిధంగా తాను ఆమె మాటలు అనుసరించి, తన తల్లిని లోకంలోని తల్లులకు ఆదర్శమాతగా నిలిపాడు.

ఇహ లక్ష్మణుని తల్లి ఐన సుమిత్రను తీసుకుంటే ఆమె సహనాన్ని, ఓర్పును నేర్పుగానూ, తన వివేకాన్ని, విచక్షణనూ అడుగడుగునా చూపుతుంది. మితభాషి, అవసరం మేరకే మాట్లాడుతుంది. ఆ సద్గుణాలే పుణికి పుచ్చుకున్నాడు లక్ష్మణుడు.

కైక శ్రీరాముని వనవాసానికి పంపమని కోరింది కానీ లక్ష్మణుని కాదు. ఐతే రాముని వెంట మౌనివేషంలో కదలిన లక్ష్మణుని ’ఆగమని' ఒక్కమాటైనా అనలేదు. ఏ ఇతర తల్లులైనా అలామౌనం వహించరు. అన్న వెంటవెళుతున్న లక్ష్మణుని 'రాజును అనుసరిస్తున్న సేవకుని’ గాభావించింది.

ఒక కుమారుడైన శతృఘ్నుడు భరతుని వెంట తిరుగు తుండగా, మరొక కుమారుడైన లక్ష్మణుడు వనవాసానికి వెళుతున్నా ఆమె ఏ మాత్రం జంకక, బాధపడక తన బిడ్డలు ధర్మ మార్గాన్నిఅనుసరిస్తున్నందుకు, భ్రాతృ బంధానికి కట్టుబడుతున్నందుకు సంతోషించింది.

సుమిత్ర ఆధ్యాత్మిక ఙ్ఞాన సంపత్తుగల వనిత. శ్రీరాముని శీలమును చక్కగా గమనించి తన పుతృడైన లక్ష్మణుడు అతడిని అనుసరించినట్లైతే ధర్మం తప్పని వాడుగా పేరు గాంచుతాడని నమ్మింది. వనవాసానికి అన్నతో వెళుతున్న తనయునితో ---
"రామం దశరధం విధ్ధి - మాం విధ్ధి జనకాత్మజాం
అయోధ్యాం అటవీం విధ్ధి - గఛ్చతాత యధాసుఖం"

"నాయనా లక్ష్మణా! నీవు శ్రీరాముని సేవించుటకే జన్మించావు. అరణ్యంలో శ్రీరాముడే నీ తండ్రిగా, సీతమ్మే నీతల్లిగా, అడవే అయోధ్య గా వారిరువురికీ సేవచేస్తూ ఉండు. అదే నీ ధర్మం." అని ఆ మాతృమూర్తి తన పిల్లలకు అన్నలను అనుసరించడం వారి ధర్మం అనీ, కష్ట మైనా సుఖమైనా అన్న మాటే అనుసరణీయమనీ చెప్పకే చెప్పింది. 'భాతృ మార్గాను సరణను’ సుమిత్ర తన పిల్లలద్వారా ఈ లోకానికి తెలియపరచింది.

ఈహ సీతమ్మను తీసుకుంటే, నిండు గర్భిణిని అడవులకు పంపినా దాన్ని రాజధర్మంగా భావించిందే కానీ, భర్తను తూలనాడ లేదు, నిరంతరం రామ నామం స్మరించింది. తాను భర్తకు దూరమైనా తనపై నీలాప నిందలు వచ్చినా, కుమలక, మనస్థాపాన్ని పైకి కనపడనీయక తన కుమారులైన 'లవ కుశు' లను రాజభవనంలో సర్వసుఖాలూ పొందవలసిన వారైనా, ఆమె వారికేమాత్రం ఆ విషయాలు తెలియనీయక, ముని వాటికలో ముని పుత్రుల వలె పెంచింది. విలువిద్యలూ ధైర్యసాహసాలూ నేర్పింది. మహావీరులుగా తయారు చేసింది. ఆశ్రమంలో కష్టాలూ అసౌకర్యాలూ అన్నీభరిస్తూ ధైర్యంగా లవకుశులను తీర్చి దిద్దింది. తండ్రి గురించీ ఏమాత్రం వారి మనస్సుల్లో విరోధ భావన కానీ, ఏహ్య భావన కానీ రానీక, రాముని ధర్మమూర్తి గా తెలియ పరచింది. తల్లి సీతమ్మ ఆశీస్సులతో, ఆమె పెంపకం లో వారు లోకోత్తమవీరులై నారు. సీతమ్మతల్లి ఆదర్శమాతైంది. ఓర్పుకు, సీతమ్మను చెప్తాం, ఆమె ఓర్పే నేర్పై తన బిడ్డలను తీర్చిదిద్దిన ఆదర్శమాత, ఒక మహా బలవంతునికి, ధర్మమూర్తికీ, సామ్రాఙ్ఞి ఐనా కష్టాలన్నీ భరించి, స్త్రీలకు ఆదర్శమై నిలిచింది. కొందరు 'సీత' పేరు తమబిడ్డలకు పెట్టనే భయ పడతారు. అన్నికష్టాలు ఆ తల్లి గనుక భరించింది మన వల్ల కాదంటారు.

ఇక భాగవతంలోని తల్లులనుచూద్దాం:- శ్రీకృష్ణుని పెంపుడు తల్లయిన యశోద కృష్ణుడు తనబిడ్డే అని నమ్మి, తాను కన్నయ్యను ఎంత ప్రేమించినా తన కుమారుని చూడవచ్చిన వారికి ఎత్తుకోను ఇచ్చి వారి కోరిక తీర్చేది. ఎవరు వచ్చి చనుబాలు పడతామన్నా అభ్యంతరం చెప్పేది కాదు. అందువల్లే రాక్షసస్త్రీ అయిన పూతన, సుందరమైన రూపంలో వచ్చి పాలు పడతానంటే ’కొత్తవనిత’ అనైనా భావించక, పసి బిడ్డలపట్ల ఆమె అనురాగాన్ని కాదనక నమ్మి ఇస్తుంది.

తమకు ప్రీతికరమైన దానిని ఇతరులకు ఇవ్వను మనం సాధారణంగా ఇష్టపడం, కానీ యశోద ’అమ్మదనం' ఎంత గొప్పదో చూడండి. తన బిడ్డను ఇతరులు ముద్దు చేస్తున్నా, ఏమాత్రం అసూయ పడని స్వఛ్ఛ మైన వెన్నవంటి మనస్సు ఆమెది, అందుకే కృష్ణయ్య 'వెన్నదొంగ' అయ్యాడేమో!
ఓయమ్మనీకుమారుడు
మాఇళ్ళనుపాలు పెరుగు మననీడమ్మా!
పోయెదమెక్కడికైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ! ….
అంటూ కృష్ణుని కొంటె చేష్టల గురించి చెప్పవచ్చిన గొల్ల భామ లతో యశోద ఇలా అంటుంది.

అన్య మెరుగడు తనయంత నాడుచుండు
మంచివాడిత డెగ్గులుమానరమ్మ
రామలార! త్రిలోకాభిరామలార!
తల్లులార! గుణవతీమతల్లులార! –
అంటూ తన బిడ్డ మంచివాడనీ, అలాంటి చిలిపి పనులు చేయడనీ అమాయకుడనీ వారితో అంటుంది యశోద. ఏతల్లైనా తన బిడ్డ చెడ్దవాడంటే ఊరుకుంటుందా! మన బిడ్దపై ఇతరులు నేరారోపణ చేస్తే మనం వెంటనే వారితో జగడమైనా ఆడుతాం, లేదా మన బిడ్డని 'పరువు తీస్తావా?' అని కోపంతో విచక్షణారహితంగా కొడతాం. కానీ, యశోద నిదానంగా ఆలోచించి వారితో .“ నాబిడ్డ అమాయకుడు, మీరు నిదానంగా యోచించండి, అలా చేసేవాడు కాదు. ఐనా నేను మనందలిస్తాను, వెళ్ళిరండి” అని మర్యాదగా చెప్తుంది.

ఇరుగుపొరుగులతో ఎలా మెలగాలో ఆ తల్లి మనకు నేర్పింది. చెరసాలలో ఉన్న దేవకీదేవి తనకన్నబిడ్డడు ఎక్కడైనా కానీ సుఖంగా, క్షేమంగా ఉంటే చాలని భావించింది. బిడ్డ పెరుగుదలను ఊహల్లో నింపుకుని దూరం నుండే ప్రేమను పంచి, బిడ్డను మనస్సులోనే చూచుకుంటూ ఆలోచనల్లో ఆడుకుంటూ జీవించింది. ‘అమ్మ మనస్సు’ బిడ్డ క్షేమాన్ని నిరంతరం ఎలా కోరుకోవాలో, అమ్మ ఆశీర్వచనాలు బిడ్డ భవిష్యత్తు కెంత శక్తిని ప్రసాదిస్తాయో దేవకీ దేవి మనకు నేర్పింది. ఆమె ఆదర్శమాత కాదామరి!

గుట గుట చనుబాలు త్రాగుచుండగ చూడ జాలనైతి,
ఎన్నితాళ్ళను కట్టినా చాలని నీ పొట్ట ముద్దాడ జాలనైతి
ప్రసవ వేదన పడుట నాపాలివంతు ,
నీదుముచ్చటలు పడుట యశోదవంతు. ---- అని పోతన, దేవకీదేవి మనస్సులోని బాధను వర్ణిస్తాడు.

ఐనా ఆమె అలా తన బాలుణ్ణి హృదయంలోనే దర్శిస్తూ అతని ముచ్చటలు విని సంతసించింది.

ఇప్పుడు భారతంలోకి చూస్తే, కుంతీమాత భర్త లేని అసహాయ. ఐదుమంది పసిపిల్లలతో ఒక్కతే , తమపై ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని దాయాదుల ఇంట ఎంతో చాక చక్యంగా మెలుగుతూ వారితో సఖ్యంగా ఉంటూనే తన పిలల్లను ప్రఙ్ఞావంతులుగా, విద్యావంతులుగా, గుణవంతులుగా, భక్తిపరులుగా, వినయశీలురుగా పెంచింది. ఐకమత్యాన్ని ఉగ్గుపాలతో నేర్పింది. సోదర ప్రేమను లోకానికి పాండవుల ద్వారా చాటింది. కుంతి ఆదర్శమాత. బిడ్డలను కృష్ణభక్తులుగా చేసి వారికి కృష్ణుని కొండంత అండగా చేసింది. శతృవర్గoతో ఎలా సఖ్యంగా మెలిగి తమ కార్యం చక్కబెట్టుకోవాలో, బిడ్డలకోసం ఎన్ని కష్టాలనైనా ఎలాభరించాలో జగానికి చూపింది. బిడ్డలకు అండగా దండగా ఉంటూ తండ్రిలేని తనయులను ఆదర్శ సోదరులుగా పెంచింది. అంతేకాదు తన బిడ్డలైన ధర్మరాజ, భీమ, అర్జునుల కంటే తన సవతి మాద్రీ సుతులైన నకుల సహదేవులను అధికంగా ప్రేమించింది. ఇతరులెవ్వరికీ వారు కుంతి సంతానం కాదని తెల్సుకోలేని విధంగా సతీధర్మాన్ని పాటించిన ఉత్తమురాలు కుంతి.

పురాణ గాధల్లోకి వెళితే గంధర్వరాజు కుమార్తె మదాలస సైతం తన పుత్రులకు పసి తనం నుండే ఙ్ఞానబోధ చేసింది.

అఙ్ఞాన వశమున అరుదెంచినావు
రాకపోకలునీకు నిజముగాలేవు //జోజో//
పరమాత్ముడవునీవు బ్రహ్మవూనీవు
నిత్యశుధ్ధాబుధ్ధ ముక్తుడవునీవు –
అని జోలపాడుతూ ఆత్మతత్వాన్ని అందించింది.

పూర్వం తల్లులంతా తమ బిడ్డలు మంచి ముత్యాలుగా, ఙ్ఞానరత్నాలు గా మారాలని, భారతదేశ కీర్తిని దశదిసలా తేజరిల్ల జేయా లనీ కోరుకునేవారు.

ఇహ చరిత్రలోకి తొంగిచూస్తే వీర శివాజీతల్లి జిజియాబాయ్ భర్త నిరాదరణకు గురైనా చింతించక తన పుత్రుని వీరునిగా తీర్చి దిద్దింది. ప్రతి రోజూస్నానం చేయిస్తూ, బువ్వతినిపిస్తూ వీరులగాధలు రంగరించి పోసింది. రామాయణ మహాభారత కధలు కళ్ళకు కట్టినట్లు వివరించింది. వీరలక్షణాలు పసితనంలోనే శివాజీ సొత్తయ్యాయి. మంచి గురువువద్ద చేర్చి యుధ్ధ విద్యలతో పాటుగా, యదార్ధ విద్యలైన ఆధ్యాత్మిక ఙ్ఞానాన్ని సైతం శివాజీకి అందించడంలో జిజియాబాయ్ ఏమారలేదు. ఆ తల్లి కృషి ఫలితమే ‘స్వతంత్ర మహా రాష్ట్రరాజ్యస్థాపన’. ఆమెనేర్పిన దైవభక్తి, దేశభక్తి శివాజీని చక్రవర్తిగా, ఛత్రపతిగా మార్చింది. పంచమాతలను, సాధు సత్పురుషులను సేవించడo, గౌరవించడం, భారతీయ సంస్కృతి, పరస్త్రీల పట్ల మాతృభావం వీరశివాజీని మరాఠా రాజ్యానికి ఛత్రపతిని చేశాయి. అలాంటి తల్లి జిజియాబాయి పిల్లల పెంపకానికి కావలసిన పాఠాలను మనకు అందించిన చరితార్ధురాలు. ఆదర్శ మాతలలో జిజియాబాయిని చేర్చి మన హైందవ ధర్మాలను బిడ్డలకు ఎలా నేర్పాలో పెద్దలు మనకు సూచించారు.

సంఘసంస్కర్తలను తీర్చిదిద్ది సమాజసేవకై అంకితంచేసిన మాతృమూర్తులు -ఈశ్వర చంద్ర విద్యాసాగరుని తల్లి ‘భగవతీదేవి‘, వివేకానందుని తల్లి ‘భువనేశ్వరీదేవి’, రామకృష్ణ పరమహంసతల్లి ‘చంద్రమణీదేవి’, మోహన దాస్ కరంచంద్ గాంధీతల్లి ‘పుతలీ బాయి ‘వీరంతా తమబిడ్డలకు పసితనంనుండీ భారతీయసంస్కృతిని, దైవ భక్తిని, దేశభక్తిని, సమాజసేవ చేయడంలోని మెళకువలను బోధించి తమ బిడ్డలను లోకకళ్యాణం కోసం సమర్పించారు.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తల్లి భగవతీదేవి ఎంతో కష్టపడి తండ్రి లేని పిల్లడ్ని చదివిస్తుంది. స్కూల్ ఫైనల్ పరీక్షలకు ఫీజు కట్టను మూడురూపాయలు లేకపోడంతో ఆమె తన పెళ్ళినాటి పట్టుచీర అమ్మి ఫీజు కోసం ఇస్తుంది! బిడ్డకు చదువుకు కావలసిన పుస్తకాలు నోట్ బుక్కులు అచ్చు పుస్తకాలకోసం, మడికట్టుకుని దూరంగాఉన్న మంచి నీటిబావి నుండి నీళ్ళ బిందెలు మోసి ఆ డబ్బు ఈశ్వరచంద్రునికి ఇస్తుంది. అతడు స్కూల్ ఫైనల్ పాసయ్యాక టూషన్స్ చెప్తూ పై చదువులు చదువుతాడు. ఒక లాయర్ ఇంట్లో భగవతీదేవి వంట చేసేది. ఆయన ఈశ్వర చంద్రుని తెలివిని చూసి మద్రాస్ లో ’లా’ చదవను సహాయం చేస్తాడు. చదువు పూర్తయ్యాక సంపాదన మొదలయ్యాక అతడు ఒక వివాహానికి హాజరైనపుడు తల్లి కట్టుకున్న అతుకులేసిన చీరను చూసి, మిగిలినవారి వస్త్రధారణ చూసి బాధతో "అమ్మా! నీకు చీరలు, నగలుకొంటాను. ఏవికావాలో చెప్పు" అనగా భగవతీ దేవి నాకు మూడు నగలు కావాలి" అంటుంది. విద్యాసాగర్ సంతోషంతో "అడుగమ్మా! ఏంకావాలో" అనగా, ఆమె "నాయనా! నా మొదటి నగ 'ఈ ఊర్లో మంచి నీళ్ళ బావిలేక అంతా దూరంగా ఊరి బయట ఉన్నబావికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక మంచినీటి బావి త్రవ్వించమని" కోరుతుంది. ఈశ్వరచంద్రుడు అలాగే బావి త్రవ్విస్తాడు.

"అమ్మా! నీవు కోరినట్లు బావి త్రవ్వించాను. ఇప్పుడైనా నీకు ఏ నగ కావాలో చెప్పమ్మా!" అనగా , ఆమె "నాయనా ఈ ఊరి పిల్లలకు ఏదైనా అనారోగ్యం కలిగితే దూరంగా ఉన్న పట్టణంలోని వైద్యశాలకు వెళ్ళను ఇబ్బందిపడుతున్నారు, ఒక వైద్యాలయం ఏర్పాటుచేయి" అని కోరుతుంది. విద్యాసాగర్ అలాగే ఒకవైద్యశాలను ఏర్పాటుచేస్తాడు. మూడోమారు కుమారుడు నగ గురించి అడగ్గా "నాయనా! నాకీవయస్సులో నగలతో పనేమి? నీవు జీవితాంతం ఇలాగే సమాజ సేవ చేస్తూ ఉండు, అదే నా మూడో నగ" అని చెప్తుంది. అందుకే భగవతీ దేవి ఆదర్శమాత ఐంది.

ఇహ మన ‘జాతిపిత’, మోహనదాస్ కరంచంద్ గాంధీని కన్నతల్లి ‘పుతలీబాయి’ కి భారతదేశం ఎంతైనా ఋణపడి ఉంటుంది. ఆమె ‘కోకిల వ్రతం’ అని చేసేది. మూడునెలల ‘వసంత ఋతువు’ లో కోయిల కూశాకే ఆమె భోజనం చేసేదిట! ఒక రోజు మధ్యాహ్నం మూడైనా కోయిల వచ్చి కూయక పోడంతో నిరంతరం తల్లి కొంగుపట్టుకు తిరిగే ఆరేళ్ళ మోహనచంద్ ‘అమ్మ అన్నం తినలేదు, కోయిల కూయ లేదు’ -- అనే భావన మనస్సులో మెదలగా పెరట్లోని చెట్టుమాను చాటుకెళ్ళి 'కుహూ కుహూ' అని కూసి, తల్లివద్దకు వచ్చి"అమ్మా! కోయిల కూసింది! నీవు భోజనంచేయి" అనగానే పుతలీబాయ్, 'తనపై వీడికెంత ప్రేమ' అని కుమారుడ్నిముద్దు పెట్టుకోకపోగా, తనయుడి చెంపపై ఒక్క చరుపు చరిచి "ఛీ ఛీ నా కడుపున ఒక అసత్యవాది పుట్టినందుకు నేను చింతిస్తు న్నాను." అని కోప్పడగా మోహనచంద్, ఆ క్షణంలోనే ఆమె పాదాలపై చేతులుంచి "అమ్మా! ఈక్షణం నుండీ నేను సరదాకైనా అసత్యం చెప్పను" అని ప్రమాణం చేస్తాట్ట! ఆప్రమాణమే భారతదేశం పాలిట వరమై తన సత్య వాదనతో, అహింసే ఆయుధంగా దేశ స్వాతంత్య్రం కోసం శ్రమించేలా చేసింది. పుతలిబాయి ఆదర్శమాత.

కౌసల్య సతి శుక్తి గర్భమౌటానుగదా!
రాముడు దేవుడై రమణగాంచె
సీతామహాసాధ్వి చెపగిపెంచుటగదా!
కవల కుశలవులు ఘనులునగుట
జిజియాలలామంబు చెలగిపెంచుటకదా!

వీరశివాజీ యు పేరుగాంచె
పుతలిబాయి సుబుధ్ధి పెంచుటచేకదా!
గాంధి మహాత్ముడై ఘనత గాంచె!
ఈశ్వరాంబాసాధ్వి ఎత్తిపెంచుటగదా!
సత్యనారాయణ ఖ్యాతిచెందె!

అహరహమ్మును బ్రోచెడి అమ్మకంటె
ఆదరంబగు వ్యక్తులు అవనికలరె!
అమ్మ ప్రధమాక్షరంబె ఆద్యక్షరంబు
ప్రాణికోటికి అమ్మయె ప్రాణసమము.---- అన్నారు భగవాన్ శ్రీ సత్ససాయి బాబావారు. ఆదర్శమాతల ఘనత ఇదే!.

ఈ ఆధునిక యుగంలో తల్లులమంతా బిడ్డలుపుట్టగానే 'ఏంచదివించాలి? ఏఉద్యోగం వస్తుంది? ఎంతజీతం వస్తుంది? ఎన్ని లక్షలు కట్నంగా కోరవచ్చు?' అనే విషయాలనుతప్ప, మనబిడ్డ దేశానికి ఏం చేస్తాడు, సమాజసేవ ఎలాచేయగలడు? ఎంత మందికి సాయపడగలడు? భారతీయసంస్కృతిని ఏమాత్రం అనుసరించ గలడు?' అనే విషయాలను ఎన్నడూ ఆలోచించడం లేదు. మాతృదేశానికి, మాతృమూర్తికీ కృతఙ్ఞత తెలిపేవారే తక్కువైపోతున్నారు. ఎంతో మంది తల్లులు ఉద్యోగాల కోసం వెళుతూ, బిడ్డలను ఆయాలకు వదలిపోతున్నందున బిడ్డలకు ఆయాపైనే ప్రేమపెరుగుతున్నది. తల్లిని మమ్మీ అని పిలుస్తున్నారు. ఆయా రాకపోతే ఏడుస్తున్నారు కానీ అమ్మ మూడురోజులు కనిపించకున్నా బాధపడటంలేదు. ఆయాతోనే ఏటాచ్ మెంటు సెంటిమెంటు పెరుగుతుంది. ఆమె భాష నేర్చుకుంటున్నారు. ఆమెపైనే ప్రేమ, అభిమానం వారి మనస్సుల్లో ప్రోగుచేసుకుంటాయి. ఆయాపెడితేనే తిండి తింటున్నారు.

హాస్యంగా బాబావారు ఒకమారు ఇలాచెప్పారు.

రైతు కూతురైన ఒక తల్లి తన కుమారుని ఉయ్యాల్లో ఊపుతూ ఇలా పాడిందిట!

‘చేలోన నీమామ సెనగలెయ్యంగ -
భాగమిమ్మని అడుగు బాలశంకరుడా! //జో జో //
వేసిన నాడూ లేవు—కోసిన నాడూలేవు,
భాగమెట్లిత్తురా బాలశంకరుడా!//జో జో//
మా అమ్మ నీ ‘తోడబుట్టినది’ కాదా?
తగవునకు పోదాము’ధర్మ చావడి’ కీ
ధర్మచావడిలో పెద్దలందరు చేరి
‘భాగమూ ఇమ్మనిరి పిల్లనిమ్మనిరి ‘ //జోజో//

జోలపాటతోనే మామతో ఆస్థికోసం పోట్లాడటం, ఆస్థే ప్రాధాన్యమని చెప్పటం వల్ల, వాడు పెద్దై ధనసంపాదన గురించే ఆలోచిస్తాడు. సాధారణ తల్లులందరికీ పెళ్ళి ఆస్థిలో భాగం అనే ఆలోచనలే ఉంటాయని అర్ధం.

కనుక మనం మన పిల్లలను ఎలా పెంచాలో ఈ ఆదర్శమాతల ద్వారా తెల్సుకుని, మన బిడ్దలను రావణునిలా గొప్పవారుగా కాక, రామునిలా మంచి వారుగా ‘దైవప్రీతి, పాపభీతి, సంఘ నీతి, సంపన్నులుగా’ భారతీయసంస్కృతీ బధ్ధంగా జీవించేలా, మానవతా విలువలను ఆచరించే మాన్యులుగా తీర్చిదిద్దుకుందాం. ఈ ఆదర్శ మాతలను సదా స్మరిద్దాం. వారి బాటలో నడుద్దాం. భారతీయతను బ్రతికిద్దాం.

********

Posted in May 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *