Menu Close
తేనెలొలుకు
(ఆలాపన కవితా సంపుటి)
- రాఘవ మాష్టారు

ముందుమాట:

భావాలపరంగా ఆత్మకు, పరమాత్మకు వ్యతిరేకినైన నేను ఒకే ఒక్కసారి “గీతాంజలి” చదవడంతో మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది. అలా ఎన్నోసార్లు చదవడం వలన ఆ గీతాల భావాకర్షణకు నా మనస్సులోనైనది. నాలాంటి ఓ సాధారణ వ్యక్తిచేత ఈ “ఆలాపన” గీతాలకు ప్రేరణ కలిగించింది. నన్ను ఈ గేయసంపుటిని వ్రాసేందుకు ప్రోత్సహించింది.

ఇది ప్రియుని కోసం ప్రేయసి నివేదన కావచ్చు. ప్రేయసి కోసం ప్రియుని నివేదన కావచ్చు. భగవంతుని కోసం భక్తుని నివేదన కావచ్చు. ప్రేమకోసం ప్రేమ నివేదన కావచ్చు. ఇది ఒక ఆత్మార్పణ, ప్రేమార్పణ.

మానవ జీవితానికి సంపదే సర్వస్వం కాదు. అంతకు మించిన గొప్ప వరం “తృప్తి” “తీయని అనుభూతి” అవి ఈ ఆలాపన గీతాలలో మీకు సర్వదా కలగాలని మీరు కూడా ఈ గీతాలు చదివి ఓ క్షణమైనా ఆ అనుభూతి, తృప్తి పొందగలరని ఆశిస్తున్నాను. యిదే నా మనసులోని మాట.

ఈ ఆలాపన గీతాలకు “శ్రవణానందం” తో తమ ఆశీస్సులు అందించిన శ్రీమాన్ పూజ్యులైన ‘శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి’ గార్కి, ఈ కృతికి తన మౌనస్వరాల ఆకృతి నిచ్చిన శ్రీయుతులు మహనీయులైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అభినవకవన వసంతరాయలు శ్రీ ‘సి.నా.రె.’ గార్కి, ఈ రచనకు ప్రోత్సాహాన్నిచ్చిన పూజ్యులైన శ్రీ నాగభైరవ గార్కి, నా వెన్నుతట్టి ఉత్సాహపరిచిన ప్ర.ర.సం. అధ్యక్షులు శ్రీ హనుమారెడ్డి గారికి, డాక్టర్ మండవ నరసింహారావు గార్కి, నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.

పుస్తకరూపంలో ప్రచురించిన ఈ గేయాలను ఇప్పుడు మన ‘సిరిమల్లె’ లో తేనెలొలుకు శీర్షిక రూపంలో మీకు అందిస్తున్నాను. మీ అభిప్రాయాలను తెలుపకోరిక.

- నమస్కారములతో కేదారి రాఘవ (రాఘవ మాష్టారు)

1. చిరకాల వాంఛ

నీకు నచ్చేటి పాట
నీవు మెచ్చేటి పాట
నా గొంతు నిండా వుంది
పెదవి దాటి రాకుంది.

ఏ వాయిద్యం మ్రోగించాలో
ఏ రాగం ఆలపించాలో
ఏ తాళం రవళించాలో
ఆలోచిస్తూ
రోజులన్నీ గడిపేశాను.

పదాలు కుదరలేదు
రాగాలు సాగలేదు
వాయిద్యాలు మ్రోగలేదు
నీ పాట అలాగే వుంది
నీ వింకా కనిపించలేదు
నీ ముఖాన్ని చూడలేదు
నీ కంఠాన్ని వినలేదు
నీ దర్శన భాగ్యంతో నైనా
నా గొంతు పెగలుతుందేమో....

దూరంగా...
నీ మెత్తని పాదాల సవ్వడి వినిపిస్తుంది
తీరాలలో...
ఓ చిరుదివ్వె వెలుగు కనిపిస్తుంది.

నీ కలయిక కోసం
నా హృదయ పీఠం భద్రపరిచాను
నా చిరకాల వాంఛ తీరలేదు
నా మదిలో బాధ బాధగానే మిగిలిపోతుంది
గాలి మాత్రం నిట్టూర్చుతుంది...భారంగా

***సశేషం***

Posted in May 2021, తేనెలొలుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *