Menu Close
Pithrudevobhava
తే.గీ. అమృతవాత్సల్య మొలికించి అంకమందు
        నిల్పి దిద్దించు అక్షరశిల్పి అతడె
        తాను పడినట్టి శ్రమను సంతాన మెపుడు
        చెందకుండగ చూచు ఆనంద మొంది

కం. క్రమశిక్షణ నేర్పుచు ఉ
      త్తమబుద్ధుల గరపి ఉన్నతంబగు చదువుల్
      శ్రమ నెంచక చదివించెడి
      సుమనస్సే తండ్రి భువిని సురవరు డతడే

కం. తనపిల్లల వృద్ధిని కని
      అనయము మురియుచును బాహ్యమందున గర్వం
      బణువంతయు రానీయక
      తను పొగడని ధన్యజీవి తండ్రియె కాడే?

తే.గీ. “దాశరథి” అంచు ఆ రామదాసు పిలిచి
        శతక మర్పింప సంతోషజనక మయ్యె
        రామచంద్రున కది పితృనామయుతము
        కాన; జ్ఞానప్రదాతకు కలదె సాటి?

తే.గీ. ఎవరు నీవన చెప్పెడి దెవరి పేరు
        తొలుత? జానకి, మారుతి నిలుచు ఎవరి
        సంతతికి చిహ్నమై అట్టి జనకునకును
        అంజలిఘటించి దీవెన లంద వలయు
Posted in June 2018, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *