Menu Close

Shabdavedhi pagetitle

- గౌరాబత్తిన కుమార్ బాబు -
వెంకటగిరి పట్టణ చరిత్ర
(సంస్థాన చరిత్ర మరియు ప్రాచీన అంశాలు)

మనులాలాపేట ఆడపడుచు మల్లమ్మదేవి :-

"మల్లమ్మ పతి భక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి" అని శంకరంబాడి సుందరాచారి గానం చేశారు. ఇందులోని మల్లమ్మ ఎవరని నా సందేహం. వెంకటగిరిలో కైవల్యా వాగు ఒడ్డున మల్లమ్మదేవి యను కర్ణశాలి ఆడబిడ్డ క్రీ.శ 1849వ సంవత్సరంలో సతీసహగమనం చేశారు. వీరేనా సుందరాచారి గారు అంటున్న మల్లమ్మ?

మల్లమ్మ గురించి కడప నివాసియగు మలావతు వెంకటరామదాసు జంగం కథ రాశారు.ఈ జంగం కథను చల్లా గంగేశ్వరరావు గారు వచనంలోకి మార్చారు. మహిమీకరణ జోలికి పోకుండా కేవలం చారిత్రక విషయాలను పరిశీలించడమే నా ఉద్దేశం.

మల్లమ్మ స్వగ్రామం మనులాలాపేట. కాసా అనేది వారి ఇంటి పేరు. ఆమెను కాశీపేటకు చెందిన ఇల్లాబత్తిన రంగయ్యశెట్టికి ఇచ్చి పెండ్లి చేశారు. ఆ దంపతులు దానధర్మాలతో నిర్ధనులు అవుతారు. తరువాత రంగయ్య క్షయ భారిన పడడంతో అతనిని తీసుకుని పుట్టింటికి వెళ్తుంది మల్లమ్మ. అక్కడ అన్నలు ఆమె భర్తను నిలదీయడంతో నొచ్చుకుని తిరిగి వచ్చేస్తుంది. తన కష్టంతో భర్తను పోషిస్తూ సపర్యలు చేస్తూ ఉంటుంది. అతను కాలం చేశాక స్థానిక జమీందారు అనుమతితో సహగమనం చేస్తుంది. జంగంకథలో ఈ జమీందారు బంగారు యాచమనాయుడు అని అన్నారు గానీ క్రీ.శ 1849 నాటికి బంగారుయాచమనాయుడు గతించారు.

వాస్తవానికి రాజా రామ్మోహన్ రాయ్ కృషి వలన డిసెంబర్ 4, 1829న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ సతీ సహగమనాన్ని బెంగాల్ లో నిషేధించారు. తరువాత మిగతా ప్రెసిడెన్సీలలో కూడా నిషేధం విధించారు. క్రమంగా సంస్థానాలు కూడా నిషేధం విధించసాగాయి. అధికారం కంపెనీ నుండి బ్రిటిష్ రాణీకి మారిన తరువాత క్రీ.శ.1861లో దేశం మొత్తం నిషేధం విధించబడింది. జమీందారు అనుమతితో సహగమనం చేయవచ్చు అనే నిబంధన మల్లమ్మ దేవికి ఉపయోగపడినట్లు ఉన్నది.

మల్లమ్మ పతి భక్తి, ఆత్మాభిమానం చూచే గాక భర్త కోసం స్వచ్చందంగా ప్రాణాలను వదలడం చూసి స్థానికులు మరీ ముఖ్యంగా కర్ణ సాలెలు ఆమెకు, ఆమె భర్తకు ఆమె సహగమనం చేసిన చోటే గుడి కట్టి పూజలు చేస్తూ ఉండవచ్చు. మల్లమ్మ దేవి జంగం కథ రాసిన మలావతు వెంకటరామదాసు గారి సమాధి మల్లమ్మ దేవళం ఎదురుగానే ఉంటుంది.

పోలేరమ్మ జాతర మహోత్సవం:-

తొలి రోజుల్లో పోలేరమ్మను కాంపాలెంలోని దళితులు పూజించేవారు. గొడ్డేరు ఒడ్డున అమ్మవారి గుడి ఉండేదట. 1910-1919వ దశకంలో వెంకటగిరిలో కలరా వ్యాధి ప్రబలింది. 1917లో వ్యాధి నివారణ కోసం రాజాలు శీతల యాగం నిర్వహించి, పట్టణానికి అష్ట దిక్కుల్లోనూ యంత్రాలు పెట్టించారు. శీతల యాగంలో ఉపయోగించిన శీతలరాయిని బొమ్మిడీకాలువ ఒడ్డున ప్రతిష్టించి పోలేరమ్మగా పూజించడం , జాతరను నిర్వహించడం మొదలుపెట్టారు. కలరా వ్యాధి తగ్గడంతో రాజాలు 1919 నుండి వినాయకచవితి తరువాత జాతరను వైభవంగా నిర్వహించడం ఆరంభించారు. 1953లో పోలేరమ్మ శిలకు గోపురం నిర్మించి శ్రీ వి వి ఆర్ కె యాచేంద్ర ప్రారంభోత్సవం నిర్వహించారు. తరువాతి కాలంలో శ్రీ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి రాజ్యలక్ష్మమ్మ దంపతులు బజారు వీధి మొదట్లో పోలేరమ్మ గుడికి ఆర్చి నిర్మించారు.

వినాయకచవితి అనంతరం వచ్చే మొదటి బుధవారం వెంకటగిరి రాజాల నుండి తాంబూలాల అనుమతి తీసుకుంటారు. అనంతరం ఆ రోజు అర్ధరాత్రి కాంపాలెం గాలిగంగుల నుంచి మొదటి చాటింపు వేసి జాతరను మొదలుపెడతారు. తరువాతి బుధవారం రెండో చాటింపు. తరువాత వచ్చే ఆదివారం ఘటోత్సవం. మూడో బుధవారం అమ్మవారి నిలుపు, గురువారం అమ్మవారి ఆలయం నుండి విరూప మండపం వరకు అశేష భక్త జనుల మధ్య అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. అనంతరం విరూపం జరిగి జాతర ముగుస్తుంది.

1917వ సంవత్సరం నుంచి 1992వ సంవత్సరం వరకు వెంకటగిరి రాజుల ఆధీనంలో అమ్మవారి జాతర నిర్వహిస్తుండేవారు. 1992వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకున్నారు. 2023వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీ. వో నెం. 390 ద్వారా పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.

జాతర జరుగుతున్న సమయంలో ఎవరింట్లోనూ శుభకార్యాలు చేసుకోరు. జాతర మహోత్సవం ఐదు రోజుల పాటు సాంప్రదాయకంగా జరుగుతుంది. జాతర ముందు గ్రామ పొలిమేరల్లో రెండు రాళ్ళను శక్తి స్వరూపాలగా ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. ముందుగా భక్తులకు పుట్టమట్టితో చేసిన అమ్మవారి విగ్రహాన్ని దర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత విగ్రహానికి ముసుగు కప్పి పల్లకీలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకొస్తారు.అర్ధరాత్రి తరువాత కళ్ళు,దిష్టి చుక్క పెడతారు. అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనుక నుండి పెడతారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమ వేపాకులతో పూజలు నిర్వహిస్తారు.

జాతర సమయంలో దున్నపోతును బలి ఇవ్వడం ప్రాచీన కాలం నాటి అనాగరిక సంప్రదాయాలు నేటికీ కొనసాగుతున్నాయనడానికి నిదర్శనం.

పోలేరమ్మ జాతర ప్రాచీనత:-

ఓ వార్త పత్రిక కథనంలో ఈ విధంగా రాసి ఉంది :- మద్రాస్ ప్రెసిడెన్సీ హయాంలో మద్రాస్ రైల్వే బోర్డు 1853లో నూతన రైలు మార్గాల అన్వేషణ కోసం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ బ్రిటిష్ అధికారి రిచర్డ్ ఏ రాబర్ట్స్ పర్యవేక్షణలో మద్రాస్ నుంచి కడప, చిట్వేలు, రాపూరు మీదుగా కృష్ణపట్నంకు రైలు మార్గం నిర్మించేందుకు అప్పట్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంలో వెంకటగిరి జాతర జరుగుతుండడం, ఆ జాతరకు కడప, చిట్వేలు,రాపూరు నుంచి అధిక సంఖ్యలో జనం వెళ్లడాన్ని కమిటీ నివేదికలో ప్రస్తావించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలి వెళ్ళడం, పూజలు నిర్వహించడం తమాషాగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఈ కమిటీ నివేదికను 1855లో హెచ్ స్మిత్ ఆధ్వర్యంలో మద్రాసులోని సెయింట్ జార్జ్ గెజిట్ ప్రెస్ లో పుస్తకంగా ముద్రించారు. ఈ పుస్తకంలో వెంకటగిరి జాతర ప్రస్తావన యధాతథంగా ఉంది.

అయితే 1873లో అచ్చువేయబడ్డ నెల్లూరు జిల్లా మాన్యువల్ లో స్థానిక పండుగల జాబితాలో కలివేలమ్మ జాతర ప్రస్తావన ఉంది కానీ పోలేరమ్మ జాతర ప్రస్తావన లేదు. దీన్ని బట్టి 1910,1919 దశకం కంటే ముందు జాతర ఘనంగా జరిగిందా అనే విషయం పై మరికొంత పరిశీలన చేయవలసి ఉందనిపిస్తుంది. Census of India,1961లో పోలేరమ్మ జాతర ఆశ్వయుజ మాసం మూడో వారంలో జరుగుతుందని, సుమారు ఐదు వేల మంది ప్రజలు హాజరవుతారని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారని రాశారు.

15 అక్టోబర్ 1932 జమీన్ రైతు సంచికలో "పోలేరమ్మ జాతర" శీర్షికతో ఓ వార్త పడింది. ఆ వార్త ప్రధానంగా జాతరలో జరిగే జీవహింస గురించి. జాతరలో సుమారు నాలుగు వేల మేకలు, పొట్టేళ్ళు, దున్నపోతులు బలిచ్చుట కలదని రాశారు. అయితే అప్పటికి సుమారు నాలుగైదు ఏండ్ల నుంచి ఆదిమాంధ్రులు దున్నపోతులను నరకుట మానివేశారని రాశారు. 1932వ సంవత్సరంలో దక్షిణ భారత జీవరక్షా సంఘము వారు మద్రాస్ నుండి జాతరకు ముందు వెంకటగిరి వచ్చి జీవహింస చేయుట నీచ కార్యమని గీతాలు పాడుతూ, భజనలు చేస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ బాగా ప్రచారం చేశారు. హైస్కూల్ లో సైన్స్ ఉపాధ్యాయులైన జనకిరామయ్య గారు మరియు రాంబత్తెయ్యగారు ఈ ప్రచారానికి బాగా తోడ్పడ్డారు.

జాతరలో మాంసం తినడమే కాకుండా మద్య సేవనం కూడా విపరీతంగా జరుగుతుంది.దీంతో ఒకప్పుడు జాతర సమయంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతూ ఉండేవి. 1978వ సంవత్సరంలో ఇటువంటి కారణాలతోనే రాజాగారు జాతరను తమ ఆధ్వర్యంలో కాకుండా ప్రభుత్వాన్నే నిర్వహించమని విన్నవించారట. కానీ తరువాత మనసు మార్చుకుని వారే నిర్వహించారట.

గొడ్డేరు ఒడ్డున ఉన్న పోలేరమ్మ గుడిని దౌడు గుర్రాల దాడిలో హైదర్ ఆలీ సైన్యాలు ధ్వంసం చేశాయని, అందులో పోలేరమ్మ విగ్రహం ఉండేదని సోషల్ మీడియాలో కథనాలు ఉన్నాయి. అప్పటి పోలేరమ్మ విగ్రహం ఫోటో ఇదని కూడా అంటున్నారు. నిజానిజాలు నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.

శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ:-

శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ 7 అక్టోబర్ 1954న విజయదశమి రోజున శ్రీ సురేంద్రబాబు శ్రీమతి వెంకటరత్నమ్మ దంపతులకు మద్రాస్ లోని మైలాపూర్ లో జన్మించారు. వీరి తండ్రిగారు 1976లో స్కూల్ హెడ్ మాస్టర్ గా వెంకటగిరికి బదిలీపై వచ్చారు.

ఆధ్యాత్మిక వేత్త శ్రీ ఎక్కిరాల భరద్వాజ విద్యానగర్ లోని శ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి కళాశాలలో ఇంగ్లీష్ పండితునిగా పనిచేసేవారు. వీరు శ్రీ సాయిబాబాకు భక్తుడు. విద్యానగర్ లో బి.ఏ చదివేటప్పుడు శరత్ బాబూజీ ఎక్కిరాల భరద్వాజగారి శిష్యరికంతో సాయిబాబా భక్తునిగా మారారు. అలా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన శరత్ బాబూజీ 1976లో తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ పట్టా తీసుకున్నారు. తరువాతి సంవత్సరం షిర్డీ వెళ్లి తనకు ప్రియమైన సాయిబాబా దర్శనం చేసుకున్నారు. అదే సంవత్సరం ఉత్తర భారతదేశంలోని పుణ్య తీర్థాలను దర్శించుకుని వెంకటగిరి వచ్చారు.

అదే 1977వ సంవత్సరంలో వెంకటగిరిలో శ్రీ సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేరిట ఓ ప్రైవేట్ స్కూల్ ను స్థాపించారు. రాజావీధిలోని వెంకటకృష్ణ యాచేంద్ర భవనం తాజ్ మహల్ లో ఈ స్కూల్ ను తొలుత నిర్వహించారు. నవంబర్ 1982లో శరత్ బాబూజీ వెంకటగిరి నుండి ఒంగోల్ కు మకాం మార్చారు. అప్పుడు సాయిబాబా స్కూల్ యాజమాన్యం వ్యాపారవేత్త బొడిచర్ల కోటేశ్వరరావు చేతికి వచ్చింది. తరువాతి కాలంలో స్కూల్ రాజావీధి నుండి దక్షిణపు వీధిలోని మరో భవనానికి మారింది.

శరత్ బాబూజీ వెంకటగిరిలో ఉన్నంత కాలం రోజూ సత్సంగం నిర్వహించేవారు. వీరి వల్లే వెంకటగిరిలో సాయిబాబా భక్తి ఉద్యమం ఊపందుకుంది. పాత బస్టాండ్ దగ్గర సాయిబాబా మందిరం, కుమ్మరి గుంట వద్ద ఆశ్రమం స్థాపించబడ్డాయి. కుమ్మరి గుంటలో ప్రతి ఏటా కనుమ పండుగ రోజు జరిగే తెప్పోత్సవం ఓ ఘనమైన ఆధ్యాత్మిక వేడుకగా మారింది.

వెంకటగిరి నాటక రంగం :-

Venkatagiri amatures, a drama companyతొలుత 1905వ సంవత్సరంలో వెంకటగిరి అమెచ్యూర్స్ అనే నాటక సమాజాన్ని వెంకటగిరి జమీందార్లు స్థాపించారు. వీరు పాదుకా పట్టాభిషేకం, శకుంతల వంటి నాటకాలు వేసేవారు.

1910వ సంవత్సరంలో వెంకటగిరి విద్యార్థులు కలసి విద్యార్థి సంఘం అనే నాటక సంఘాన్ని స్థాపించారు. వీరు నాటకాలు ఆడి, దానిపై వచ్చిన డబ్బుతో టిన్ను రేకు హాలును నిర్మించుకున్నారు. ఈ సంఘంలో నిర్మాణం దర్శకత్వ బాధ్యతలను రంతుమియా చూసుకునే వారు. గుర్నాధం చెట్టి, సుబ్బయ్య, బాబూరావు, జయరాంనాయుడు, అవధానం శంకరయ్య, గురువుగారి వెంకటకృష్ణయ్య, గురువుగారి వెంకటదాసు మొదలైన వారు ఈ నాటక సంఘంలో ప్రఖ్యాతి వహించిన నటులు.

వెంకటగిరి అమెచ్యూర్స్ నాటక సమాజం కోసం రాజాగారు ఓ హాలును కట్టించారు. ఈ థియేటర్ లో బళ్ళారి రాఘవ కూడా కొన్ని నాటకాలు వేశారు.

1930 లో విద్యార్థులందరూ వెంకటగిరి అమెచ్యూర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్థాపించారు. వీరు విప్రనారాయణ , ఖిల్జీ రాజ్య పతనం, మీరాబాయి, ఉషా పరిణయం వంటి పౌరాణిక నాటకాలనే గాక, అనేక సాంఘిక నాటకాలు వేసేవారు. వీరు ఏలూరు పరిషత్తులో ఆత్రేయ రచించిన యన్.జి.ఓ నాటకం, విజయవాడ పరిషత్తులో ఆత్రేయ గారే రచించిన ఈనాడు నాటకం ప్రదర్శించి ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు.

(ఆధారం: - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర)

జాతీయోద్యమం :-

Katikaneni familyవెంకటగిరి రాజాల బంధువులైన కటికనేని వెంకటరామారావు మరియు కటికనేని కళ్యాణరావు సోదరులు స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారు.

కటికనేని వెంకటరామారావు గారు మహత్మా గాంధీ పిలుపు మేరకు తన బి.ఏ చదువుకు స్వస్తి పలికి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 5 జూన్ 1922 నుండి 4 జూన్ 1923 వరకు వెల్లూరు మరియు కడలూరు జైళ్ళకు వెళ్ళారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, కల్లు అంగళ్ళ మూసివేత వంటి ఉద్యమాలు నడిపారు. శాసనోల్లంఘన ఉద్యమం, వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కూడా కటికనేని సోదరులు విస్తృతంగా పాల్గొన్నారు.

30 డిసెంబర్ 1933న మహత్మాగాంధీ వెంకటగిరి వచ్చినపుడు కటికనేని సోదరులు తమ ఇంట్లోనే ఆతిధ్యం ఇచ్చారు. అప్పుడే కాశీ విశ్వేశ్వర ఆలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు. కటికనేని సోదరులను తమ సబర్మతి ఆశ్రమంలో చేరవలసిందిగా గాంధీజీ కోరారు. కానీ వీరు సున్నితంగా తిరస్కరించి వెంకటగిరిలోనే స్వతంత్ర పోరాటం చేస్తూ ఉండిపోయారు.

1931 సెప్టెంబర్ 8 మరియు 9 తేదీల్లో కటికనేని సోదరులు గోగినేని రంగనాయకులు, సుభాష్ చంద్ర బోస్, కాశీనాథుని నాగేశ్వరావు పంతులు వంటి వారిని పిలిచి జమిందారీ రైతు సభలు, యువజన సభ వెంకటగిరి టవున్ లో నిర్వహించారు.

బ్రిటిష్ ప్రభుభక్తులైన వెంకటగిరి రాజులు కటికనేని సోదరుల జాతీయవాద రాజకీయాలు చూసి సహించలేక వారి ఆస్తులను జప్తు చేయించి, వారి మామిడి తోటలను నరికించి, వారిని అష్టకష్టాల పాలుజేశారు.

దేశం కోసం ఇంతటి త్యాగాలు చేసిన కటికనేని సోదరుల గురించి టవున్ లో గానీ, మండలంలో గానీ అనుకునేవారే లేకపోవడం శోచనీయం. కటికనేని కళ్యాణరావు గారి మనవడే ఆంధ్రప్రదేశ్ సిఐడి డైరెక్టర్ గా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన శ్రీ కె.విజయరామారావుగారు.

జమీన్ రైతు ఉద్యమం :-

వెంకటగిరిలోనే జమీన్ రైతు ఉద్యమం ఆరంభమైంది.

తొలుత వెంకటగిరిలో ఆగస్టు 1 1931న జమీందారీ రైతులు సమావేశమయ్యారు. రైతులందరూ నెల్లూరు జిల్లా రైతు మహాసభలకు,ఆంధ్ర రాష్ట్ర రైతు మహాసభలకు ఆహ్వాన సంఘమును ఏర్పరిచారు. సుమారు 100 మందికి పైగా ఆహ్వాన సంఘం సభ్యులుగా చేరారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు గాంధీ మైదానంలో బహిరంగ సభ జరిగింది. నెల్లూరు వెంకట్రామానాయుడు తొలుత ప్రార్థన చేసి "మాకొద్దు జమీందార్ల పొందు" అనే గేయాన్ని పాడారు. ఇది రైతులలో బాగా సంచలనం కలిగించింది. ఆ సభలో వెన్నెలకంటి అప్పారావు గారు జమీందారీ రైతులకు, రైత్వారీ రైతులకు గల తేడాల గురించి విపులంగా ఉపన్యసించారు.

ప్రథమ జమీన్ రైతు మహాసభ 1931 ఆగస్టు 8 మరియు 9 తేదీలలో వెంకటగిరి పట్టణంలోని కటికనేని సోదరుల తోటలో జరపడానికి ఏర్పాట్లు జరిగినవి. అయితే అప్పటి గూడూరు సబ్ కలెక్టర్ జమీందారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. దాంతో సభ జరపడానికి వీలు లేకుండా పోయింది. తూర్పు వీధిలోని కటికనేని సోదరుల ఇంటి ఆవరణంలో 8 సెప్టెంబర్ 1931న తలుపులు బిగించి సభ జరిపారు. ఆ సభలో జమీందారీ రద్దు తీర్మానాన్ని ఆచార్య యన్.జి.రంగా ప్రవేశపెట్టారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడ్డది. యావత్తు మద్రాసు రాష్ట్రంలోనే జమీందారీ రద్దు ఉద్యమానికి ఇదే నాంది.

వెంకటగిరిలో ప్రకాశం పంతులుగారి రాజకీయ సభలు :-

19 జూలై1942న వెంకటగిరిలో రమా విలాస నాటకశాలలో ప్రకాశం పంతులు గారి రాజకీయ సభ జయప్రదంగా జరిగింది. ఆ రోజు తూర్పు వీధిలోని కటికనేని కళ్యాణరావు గారి ఇంటి నుంచి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు, దండు నారాయణరాజు గారు, కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలు రామసుబ్బమ్మ గార్లను కారులో ఊరేగింపుగా తీసుకుపోయారు. వేనకు వేలు జనులు ఉత్సవంలో పాల్గొన్నారు. బజారు వీధిలో జెండా చౌక్ వద్ద ఏర్పాటుచేసిన స్థలంలో దైవ ప్రార్థన అనంతరం రామసుబ్బమ్మ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అక్కడ నుండి ఊరేగింపు సభాస్థలం వరకు సాగింది.ఈ సభను విజయవంతం చేయడంలో వెంకటగిరి వైశ్య సంఘం వారు,స్వచ్చంధ సేవాదళం వారు కీలక పాత్ర పోషించారు.

ఈ సభ విజయవంతంగా జరగడంతో ఓ విమర్శకుడు ఆనందంతో ఈ క్రింది సీస పద్యం రాశారు :-

ఒకనాడు రైతు శ్రామిక కోటి సభజేయ నూట నలుబది నాల్గు చాటినారు
కాళేశ్వరుని సభ కారుకూతలదిట్టి మెడబట్టి గెంటంగ దొడగినారు
హరికథ జెప్ప ముష్కరులైన పోకిర్లు పసుల ప్రజపై తోలబారినారు
భారతీదేవి సభాస్థలి మాట్లాడ గురిబెట్టి రాళ్లతో గొట్టినారు
అట్టి వెంకటగిరి పట్టమందు నేడు
పరమ శాంతంబుగా సభ జరిగెనన్న
కారణంబది ఎవరు జెప్పంగగలరు?
కాలగర్భాన ఇంకేమి గాంచగలమొ
కటికనేవ్వంశసోమ ! కళ్యాణనామ!

అలానే 16 సెప్టెంబర్ 1945న వెంకటగిరిలో ప్రకాశం గారికి సన్మానం జరిగింది. ఆ సభలో రుక్మిణమ్మ గారి ప్రార్థన, శేషయ్య గారి గీతరాధన జరిగిన తరువాత పౌరులు, టవున్ కాంగ్రెస్, నెల్లూరు జిల్లా జమీన్ రైతు సంఘం, మహిళా సంఘం, హరిజన సేవా సంఘం, హిందీ ప్రేమ మండలి, యాదవ సంఘం, కమ్యూనిస్టు పార్టీ వారు ప్రకాశం గారికి సన్మాన పత్రాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా జమీన్ రైతు సంఘం మెమొరాండం కూడా సమర్పించింది. నెల్లూరు జిల్లా జమీన్ రైతు సంఘం రూ.558, పౌరులు రూ.516, యాదవ సంఘం వారు రూ.58 అంటే మొత్తం రూ.1132 ప్రకాశం నిధికి సమర్పించారు. పంతులు గారు సన్మాన పత్రాలకు సమాధానం ఇస్తూ జిల్లాలలో తన 668 మైళ్ళ సంచారంలోని కష్టాలను చెబుతూ 1942వ సంవత్సరం పోరాటం గురించి, వెనుకటి సత్యాగ్రహ చరిత్ర గురించి, జలియన్ వాలా బాగ్ ఉదంతం గురించి, కాంగ్రెస్ ప్రాధాన్యం, గాంధీజీ నాయకత్వం గురించి, జరగబోయే ఎన్నికల గురించి, కాంగ్రెస్ వాళ్ళు జైళ్లలో ఉండగా కమ్యూనిస్టులు, రాయిస్టులు చేసిన దుండగాల గురించి, కమ్యూనిస్టుల చర్యల గురించి, జమీందారీ విధానం రద్దు గురించి తాను పైకి పంపిన నివేదికల గురించి సుమారు రెండు గంటల పాటు ఉపన్యసించారు. పంతులు గారి ఉపన్యాసం దూరానికి కూడా వినిపించడానికి లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. పదివేల మంది జనులు చీమ చిటుక్కుమనకుండా ఆద్యంతాలు విన్నారు.

వెంకటగిరిలో గాంధీజీ :-

1933వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ ఉదయం మహాత్మా గాంధీ నెల్లూరు నుండి వెంకటగిరికి బయలుదేరారు. ట్రంక్ రోడ్డుపై తిప్పరాజు వారి సత్రం వద్ద సుమారు పదివేల మంది గుమిగూడి గాంధీజీకి వీడ్కోలు చెబుతూ 116 రూపాయలు హరిజన నిధికి సమర్పించారు. మహాత్మాగాంధీ తన పరివారంతో డిసెంబర్ 30 రాత్రి 9 గంటలకు వెంకటగిరి చేరి కటికనేని సోదరుల ఇంటిలో బస చేశారు. గాంధీజీ రాక సందర్భంగా ఊరంతా మామిడి తోరణాలతో, చలువ పందిళ్ళతో అలంకరించబడ్డది.

డిసెంబర్ 31వ తేదీ ఉదయం 6.30 గంటలకు గాంధీజీ హరిజన పాలెమునకు వెళ్లి అక్కడ హరిజన పఠనాలయానికి శంకుస్థాపన చేశారు. అక్కడి ప్రదేశము పరిశుభ్రంగా ఉన్నందుకు గాంధీజీ సంతోషించారు. తరువాత రౌండు బంగళాకు వెళ్లి ఫతే మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్నారు.

బహిరంగసభలో సుమారు 15 వేల మంది పాల్గొన్నారు. పౌరుల తరపున శ్రీ కనుపర్తి నారాయణరావు, తాలూకా బోర్డు తరపున శ్రీ కటికనేని కళ్యాణరావు, జమీన్ రైతు తరపున శ్రీ పెట్లూరు గోవిందరెడ్డి ,హరిజన సేవక సంఘం తరపున శ్రీ కటికనేని వెంకటరామారావు, యూనియన్ పంచాయతీ బోర్డు తరపున శ్రీ మంగపతి వెంకటసుబ్బయ్య స్వాగత పత్రాలు సమర్పించారు.

గాంధీజీ తన ఉపన్యాసంలో హరిజన ఉద్యమానికి అందరూ సంపూర్ణ సహాయం చేయాలని కోరారు. మాలలకు, మాదిగలకు ఒకరి పొడ ఒకరికి గిట్టదని ఒకరి నూతిలో నీరు మరొకరు తాగరని వినవలసి వచ్చినందుకు గాంధీజీ తన విచారం వెలిబుచ్చారు. హరిజనులు తమలో తమకు గల అంటరానితనం మానుకోవాలని మందలించారు. గాంధీజీ ఉపన్యాసాన్ని మద్రాస్ హిందీ ప్రచార సభకు చెందిన శ్రీ మోటూరి సత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. సభలో హరిజన నిధికి ఐదు వందల రూపాయలు సమర్పించడం జరిగింది. తాలూకా బోర్డు, పంచాయతీ బోర్డు, జమీన్ రైతు సంఘాల వారు సమర్పించిన వస్తువులను వేలం వేయగా 100 రూపాయలు వచ్చాయి. తరువాత మహాత్మాగాంధీ ఆయన బృందంతో కాట్పాడి ప్యాసెంజర్ లో తిరుపతికి వెళ్లారు.

(అక్కరకొచ్చిన పుస్తకం "ఆంధ్రకు గాంధీజీ రాక")

**********

Posted in వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *