సీ. చిఱునవ్వు లొలుకుచు చిలిపిచేష్టలు చేయు
చిన్నికృష్ణుని లీల లెన్న తరమె?
రాధామనోహరరాగరంజితవేణు
గానలోలుని చెప్ప వాణి కగునె?
నరున కజ్ఞానంపు తెర తీయ గీతను
తెలియ చెప్పిన రీతి తెలుప వశమె?
గాంగేయకృతనుతిగంగాఝరీనామ
సాహస్రి కెవ్వడు శక్తినొసగె?
తే.గీ. దుష్టసంహార మొనరించి శిష్టరక్ష
ణ మ్మొనర్పగ దేవకీనందను డయి
పూర్ణవిష్ణ్వవతారుడై పుడమి నుద్ధ
రించు శ్రీకృష్ణమూర్తి నర్చింతు మదిని
ఉ. నందకుమార! నాహృదయనందననర్తనలీల చూచి యా
నందము నొందు భాగ్యము ననారత మిమ్మ! యనుగ్రహంబు నీ
వందఱియందు చూపి చరితార్థుల చేసిన దివ్యరూపమున్
చందనచర్చితాభ్రసమచారువపుర్ధర! చూప రావయా!
కం. పిల్లనగ్రోవిని మోవిని
సల్లలితరసామృతంబు స్వరఝరియై మా
ఉల్లముల దొంగిలించగ
అల్లన పలికించు నల్లనయ్యను కంటిన్
చం. మురళిని కాను నీ మృదులమోహనవాదనభాగ్య మొందగా;
సిరిసిరిమువ్వ కాను వ్రజసీమల నర్తన చేయ; కానుగా
మరుకపుపింఛ మగ్రమగు మస్తకభూషణమై స్ఫురింపగా;
నిరతము నిన్ను కొల్చుమది నీవె వసించిన చాలు మాధవా!