Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

ఇల్లు గొప్పదా...
పొలం గొప్పదా...
డబ్బు గొప్పదా...
ఆరోగ్యం గొప్పదా...
ప్రాణం గొప్పదా...
అంతా మట్టిదా....
ఆ మట్టి నీ ఆటదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ప్రాణం ఉంటే ఆరోగ్యం కోసం
ఆరోగ్యం ఉంటే డబ్బు కోసం
డబ్బు ఉంటే ఇల్లు కోసం
ఇల్లు ఉంటే పొలం కోసం
తండ్లాడే ఈ ఆట గొప్పదా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నాకు ఎదురైయ్యే అహంకారాలు
నీ గొంతులో హాలహలమవని...
నాకు ఎదురైయ్యే నిందలు
నీ మెడలో పూలమాలలవని..
నాకు ఎదురైయ్యే వెక్కిరింతలు
నీ భక్తి పులకింతలవని....
నీ ఆటలో నా జీవన పుట
ప్రసాదమవని...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఒకడికి ఇల్లు ఉందని పొగరు
ఒకడికి చేను ఉందని పొగరు
ఒకడికి తెలివి ఉందని పొగరు
ఒకడికి ఆరోగ్యం ఉందని పొగరు
ఒకడికి ఐశ్వర్యం ఉందని పొగరు
ఏదైనా నీ ఆటలో పుట్టే చిగురు....
నీ ఆటలో వాడిపోయే వగరు...
నాకు ఇల్లు, చేను, తెలివి, ఆరోగ్యం ఐశ్వర్యం
ఉన్నా లేకున్నా
నీ తోడు ఉంటే చాలు శివయ్యా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నా గతం గాయాలు
నా భవిష్యత్తు కలలు
నా వర్తమాన అవస్థలు
అన్నీ నీ ఆటకు అభిషేకాలు శంకరా...‌
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఎవడెవడితోనో
నన్ను బాగా ఏడిపిస్తావు
అదే పనిగా బాధ పెడతావు
అందుకు చాలా కృతజ్ఞతలు శంకరా....
ఎందుకంటే,
నా మీద ఎంత ప్రేమ లేకుంటే అలా చేయగలవు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

సదాశివా
నువ్వు నాకేమీ కావా....
నా బ్రతుకులో భాగమై లేవా....
నన్ను నిన్నుగా తీసుకోవా...
ఇంతకంటే పెద్ద అబద్ధం ఉంటుందా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నా మనసేమీ బాలేదయ్యా..‌‌
ఎందుకంటే నువ్వు ఇపుడు నా మనసులో లేవయ్యా...
నువ్వు లేని మనసు బతికున్న దయ్యమయ్యా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఈ మనుషుల మందలో
మందబుద్దిగా తిరిగే నన్ను...
నీ మాయలో సుబుద్దిగా మార్చి...
మన్నులో కలిసేలోపు తీర్చిదిద్దవయ్యా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నా నీడ నువ్వే
నా తోడు నువ్వే
నా గోడు నువ్వే
నా కూడు నువ్వే
అంతా నువ్వైనప్పుడు
నేను నువ్వు కానా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

Posted in February 2026, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *