విసుగ్గా మళ్లీ టైమ్ చూసుకుంది నీరజ.
‘ఇందాకనగా బయల్దేరుతున్నామన్నారు! ఒకత్తీ రాదేమిటి?’ అనుకుంటుండగానే, తలుపు కొట్టిన శబ్దం వినిపించి, గబగబా వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా నవ్వుతూ నిలబడిన ముగ్గురు అక్కలని చూసి, “ఓహో! అందరూ కలుసుకుని వచ్చారా! అందుకే ఇంత లేటయింది,” అంటూ లోపలకి దారితీసింది నీరజ.
“అవునే, నేను వచ్చేదారిలోనే కదా వీళ్లిద్దరూ… అందుకే నా కార్లో పికప్ చేసుకుంటానని చెప్పాను,” అంది వారిజ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ.
“పెద్దక్కదంతా ప్లానింగేగా!” అని నవ్వింది జలజ.
గిరిజ కూడా నవ్వుతూ, “ఎందుకే ఇంతర్జంటుగా రమ్మన్నావు? ఇంతకీ నాన్నేరీ?” అనడిగింది. గిరిజ ప్రశ్నకు మిగతావారు కూడా ఆసక్తిగా, నీరజ వైపు చూసారు.
“నాన్న పైరూమ్లో పడుకున్నారు. ఆయన లేచేలోగా, మనం మాట్లాడుకునే ముఖ్య విషయం ఒకటుంది. పదండి, బెడ్రూమ్లోకి పోదాము, రండి!” అంటూ గదిలోకి దారి తీసింది నీరజ.
నీరజ మాటలకి వాళ్ల ముగ్గురికీ మరింత ఉత్సుకత పెరిగిపోయింది. జలజ, వారిజలిద్దరూ విశాలమయిన డబుల్ కాట్ మీద కూలబడ్డారు. అక్కడే ఉన్న కుర్చీమీద గిరిజ కూర్చుంది.
ఈలోగా నీరజ అందరూ తినడానికి స్నాక్స్ మధ్యలో పెట్టి, తను కూడా ఒక కుర్చీ లాక్కుని కూర్చుంది.
“ఇవన్నీ తింటూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. అమ్మ పోయి పదేళ్లవుతోంది. ఈ పదేళ్లల్లో మనందరి పెళ్లిళ్లు, పురుళ్లు అన్నీ అయిపోయాయి. ‘ఎవరు రమ్మన్నా రాకుండా ఇక్కడ నాన్న వెలగపెడుతున్న రాచకార్యాలేమిటో!’ అనుకునేవాళ్లం కదా! ఇదిగో ఇప్పుడు చూడండి!” అంటూ టేబుల్ మీద ఉన్న కవర్లోంచి, కొన్ని ఫొటోలు అందరి మధ్య పడేసింది.
ఆత్రంగా తలొక ఫొటో తీసి చూసిన, వారిజ, గిరిజ, జలజ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు.
ఆ ఫొటోలలో తమ తండ్రి గిరిధర్‌తో ఉన్న ఒక నడివయసు స్త్రీ తలలో మల్లెలతో, నిండు అలంకరణతో ఉన్న ఫొటోలు వివిధ పర్యాటక ప్రదేశాలలో తీయించుకున్నట్లుగా తెలుపుతున్నాయి.
ఫోటోలపై ఉన్న డేట్స్, ప్రదేశాలు కూడా అవి గత రెండు మూడేళ్ల క్రితంనుండి గత నెల వరకూ ఉన్న ఫోటోలని చెప్తున్నాయి. నాన్న ఒంటరిగా ఉండలేక, ఏవో ఊళ్లు వెడుతున్నట్లు తెలుసు కానీ ఇలా హనీమూన్ జంటల్లాగ ఎవరితోనో ఇలా దిగిన ఫొటోలు చూస్తే నోట మాటరాలేదు కాసేపు.
“ఇదేమిటే! ఇవన్నీ నీకెక్కడ దొరికాయి? మొన్నేగా వచ్చావు?” అంది గిరిజ, నీరజనుద్దేశించి.
“ఇవేకాదు అక్కా! నిన్న నాన్న బయటకు వెళ్లాడు కదా, ఆవిడ దగ్గరకే వెళ్లాడేమో రాత్రి వరకూ రాలేదు. ఏమీతోచక, నాన్న గది సర్దాను. బెడ్ మీద పరుపు అదీ తీసి సర్ది, నాన్న బట్టల బీరువా కూడా సర్దాను. ఆ అలమారాలో అట్టడుగున దొరికాయి. కిందటి నెల కూడా గోవా వెళ్లారు. రాత్రే కాల్ చేద్దామనుకున్నాను. నాన్న వచ్చేసారు. నేను ఎలా స్పందించాలో తెలియని షాక్‌లో ఉన్నాను. ఏదేమైనా, ఈ విషయం అడగాలంటే నాకన్నా పెద్దవాళ్ళు మీరున్నారు కదా… అందరం కలిసి అడిగేద్దామని అర్జంటుగా రమ్మన్నాను,” అంది నీరజ.
ఆ మాట విని దీర్ఘంగా నిట్టూర్చి, “ఈ వయసులో తోడు కావల్సి వచ్చిందా ఈయనకి? ఈ విషయం తెలుస్తే అల్లుళ్లు ఏమనుకుంటారు? మనందరికీ ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులు అన్నీ దానికే ఇవ్వాలనుకుంటున్నారేమో! మనం పిచ్చి భ్రమలో ఉన్నాము…” అంది గిరిజ.
గిరిజ మాటకి అడ్డొచ్చి, “ఈ డెబ్భయ్యేళ్ల వయసులో తననెవరూ చూడటంలేదని చెప్పుకుని ఈవిడని చేసుకున్నాడేమో… ఈ వయసులో ఇవన్నీ అవసరమా? ఆవిడకైనా సిగ్గులేదా, ఈ ఏజ్‌లో ఇలాంటివి చేయడానికి… ఇవి చూసి అల్లుళ్లు కూడా నేర్చుకుంటారు. మన దగ్గరకి వచ్చి ఉండమంటే ఆడపిల్లల దగ్గర ఉండలేనని చెప్తే నిజమనుకున్నాము. మన పరువు అత్తారిళ్లల్లో తీసేసినట్లే!” అని ఉక్రోషంగా అరుస్తున్న జలజను, “హుష్! అరవడం కాదు! నిలదీసి అడగాలి!” అనంటున్న వారిజ కళ్లు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. గుమ్మంలో నిలుచున్న తండ్రిని చూడగానే, ఒక్కసారిగా నిలబడ్డారు ఆడపిల్లలందరూ.
తనని చూడగానే సైలెంట్‌గా నిలబడిన కూతుళ్లను చూసి, “మీ అందరికీ నేను దాచిపెట్టిన నా పర్సనల్ విషయాలు తెలిసిపోయాయి కదా! మీరు ఏమేమి అడగాలనుకున్నారో ఎందుకిలా జరిగిందో అవన్నీ ఆ వ్యక్తి సమక్షంలోనే మీకు నేను చెప్తాను. పదండి హాలులోకి…” అని హాలులోకి దారితీసిన తండ్రిని మౌనంగా అనుసరించిన వారు, హాలులో సోఫాలో కూర్చుని ఉన్న స్త్రీమూర్తిని చూసి షాకయ్యారు.
తమని చూడగానే లేవబోతున్న ఆమెని ఉద్దేశ్యించి, “కూర్చో శ్యామలా!” అని వారించాడు గిరిధర్!
పచ్చనిరంగులో కాస్త వడలినట్లుగా ఉన్నా, ఒత్తయిన తలకట్టు, కళకళలాడుతున్న ముఖంలో నుదుట ఎర్రని బొట్టు, కాటుక పెట్టిన కళ్లతో, కట్టుకున్న ఆకుపచ్చచీర పోటీ పడుతున్నాయి. ఆవిడని చూడగానే అప్రయత్నంగానే చేతులు జోడించారు గిరిజ, వారిజ, జలజ, నీరజ.
చిరునవ్వుతో, “రండమ్మా, ఇలా కూర్చోండి!” అనంటూ తమ ఇంట్లో తమకే మర్యాద చేస్తున్న ఆమెని చూస్తూ, మౌనంగా వెళ్లి కూర్చున్నారు.
“చూసావా శ్యామలా! ఆరోజే చెప్పాను. పిల్లల ఎదురుగా తలదించుకునే అవసరం లేదు, వారిని కన్విన్స్ చేద్దాము. పెళ్లే చేసుకుందామని! నువ్వు వినలేదు. నీ పిల్లలు ముగ్గురూ ఒప్పుకోరని, నీ పోయిన భర్త పెన్షన్ నీకు రాదని… ఇలా లివింగ్ రిలేషన్లో ఉందామన్నావు. ఈరోజు నా పిల్లలకి తెలిసింది. రేపు నీ పిల్లలకి తెలుస్తుంది. పెళ్లికి ముందే ఇప్పటి తరం వారు ఇలాంటి రిలేషన్లో ఉండాలని ప్రయత్నించడం, మధ్యలో విరమించడం ఆ పైన ఇంకేవో చేయడం చేస్తూ ఉన్నారు. వాళ్లు వయసులో ఉన్నవారు, ఏది చేసినా వారికి కన్నవారి సపోర్ట్ ఉంటుంది. మనలాంటి వయసుమళ్లిన ఒంటరి జీవితాలకు, ఎవరి సపోర్ట్ ఉండదు. ఇంతవరకూ మనని కట్టుకున్నవారికి, కన్నపిల్లలకి న్యాయం చేసాము. అక్కడ మన అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఒంటరిమోడులా నువ్వొక పదిహేనేళ్లు, నేనొక పదేళ్లు బ్రతికాము. బాధొచ్చినా, భయమేసినా పంచుకోడానికి తోడులేని జీవితాలు దశాబ్దాలుగా గడుపుతూ, మూడేళ్ల క్రితం ఒక సంస్థ పెట్టిన కార్యక్రమానికి కాస్త ధైర్యం చేసి వచ్చి ఇలా దగ్గరయ్యాము. మనిద్దరి అంగీకారాలు తెలుసుకున్న మేడమ్ పెళ్లి చేసుకోమంటే నేను ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోలేదు. ఈ వయసులో శారీరక వాంఛల కోసం కాదు, మనకంటూ ఎవరూ లేని ఒంటరితనం భర్తీ చేసుకోవడానికే అని ఎంతమందికి అర్థమౌతుంది?” ఆగి ఊపిరి తీసుకున్నాడు గిరిధర్.
“ఎవరింటి దగ్గర ఉన్నా వారికేదో రకంగా ఉపయోగపడితే ఫర్వాలేదు! లేకుంటే వారి ఒద్దికలో మనముండటమే! వారి కోపతాపాలు, వారి సమయానుకూలాలకు అనుగుణంగా ఉండటమే! నేనూ నాది అన్నమాట లేని ఆధారిత జీవితాలే! అదే ఒకరికొకరుంటే మిగిలిన జీవితమయినా ఒకరి నీడలో ఉండాలనే ఒక ఆశ! ఆ ఆశ ఉన్నవారే ఇలా చేరికవుతారు. దీనికి పెళ్లి అనే భద్రత అవసరం అంటే వినలేదు.
నీకు టైఫాయిడ్ వస్తే నెల రోజులు నిన్ను అంటిపెట్టుకుని ఉండి నిన్ను మనిషిని చేసాను. నాకు వైరల్ ఫీవర్ వస్తే పది రోజులు నా ఆలనా పాలనా నువ్వే చూసుకున్నావు. మనిద్దరం ఒకరికొకరు ఉన్నామనే కదా, మన అనారోగ్యాల గురించి మన పిల్లలకి కూడా చెప్పలేదు! మనిద్దరికీ ఒకరిమీద మరొకరికి భరోసా ఉంది. ఇప్పుడు నీ మాట నేనిక వినను. నా ఆస్తి అంతా పిల్లలకి పంచేసాను. వాళ్లు ఏ విషయంలోనూ భయపడనవసరంలేదు. నా తదనంతరం నా పెన్షన్, ఈ ఇల్లు, నీకు వస్తాయి. నీ తర్వాత నా పిల్లలు ఈ ఇల్లు పంచుకోవచ్చు. అలాగే నీ ఆస్తంతా నీ పిల్లలకి ఇచ్చేసి, శాశ్వతంగా నా మనిషిగా నా ఇంటికొచ్చేయి… నీ భర్త పెన్షన్ వదిలేయి! నీకు ఏ లోటు లేకుండా నా పోయిన భార్య స్థానంలో నిన్ను నేను చూసుకుంటాను…” అని ఒక నిముషం ఆగాడు గిరిధర్.
తన జేబులోనుండి తీసిన పసుపు తాడుకి కట్టిన మాంగల్యం చూపిస్తూ, “మనకున్న గౌరవాలు తగ్గకూడదనుకుంటే, ‘నిన్ను నేను ఉంచుకున్నాను’ అని నా పిల్లలు నన్ను అసహ్యించుకోకూడదు, నీ పిల్లలు కూడా నువ్వెవరితోనో అక్రమసంబంధం పెట్టుకున్నావని అనుకోకూడదు. రా, ఈ తాళి కట్టించుకో! అమ్మాయిలూ, నాన్న తప్పు చేయలేదనుకున్నవారు వచ్చి నా పక్కన నిలబడండి. తప్పు చేసాననుకున్నవారు నన్ను నా తల్లిలా క్షమించండి!” అన్న గిరిధర్ మాటలకి చలించిపోయారు శ్యామల, ఆయన కూతుళ్లు నలుగురూ. వారి కన్నుల్లో అప్పటికే కన్నీరు చెమరించింది. ఒక్క అంగలో కూతుళ్లు నలుగురూ తండ్రికి అటూ ఇటూ నిలబడ్డారు.
గిరిధర్ గుండె ఆనందంతో ఉప్పొంగింది. ఆనందాతిశయాలు నిండిన గొంతుతో “చూసావా శ్యామలా! నా బంగారు తల్లులు నన్నే సమర్థిస్తున్నారు. నీ పిల్లలకి కూడా వారే నచ్చచెప్తారు, రా!”
పిలుస్తున్న గిరిధర్ చెంతకు మెల్లగా వస్తున్న శ్యామల అచ్చం తమ తల్లిలాగే అనిపించిందా క్షణంలో గిరిధర్ కూతుళ్ళకి.
“రండి అమ్మా! మీరేమి ఆలోచించొద్దు! మీ పిల్లలకి మేము నచ్చచెప్తాము. మా నాన్న మీరు, ఆనందంగా ఉంటే చాలు! మనందరం ఒకటే!” అని పిలిచింది గిరిజ.
ఆ పిలుపుకి, ఆమాటలకి మిగతావారు ఆమోదంగా తలలూగిస్తే… శ్యామల, గిరిధర్ల హృదయాలు పులకరించిపోయాయి.
తనని సమీపించిన శ్యామలని చూపించి, “మీకు ఇంకొక అమ్మ ఉన్నట్లే! ఆ గ్యారంటీ నేనిస్తాను!” అంటూ తన చేతిలోని పసుపుతాడుకి ఉన్న మాంగల్యాన్ని కట్టబోతూ, “మా పెళ్లికి ఫొటోలు లేవా?” అని చమత్కరించాడు, గిరిధర్.
“ఎందుకుండవు నాన్నా, మేమంతా తీస్తాము కదా!” అంటూ జలజ తన మొబైల్‌తో ముందుకు నడిచింది.
అందరి కన్నులలో మెరిసిన కొత్తకాంతుల మెరుపులు జలజ తీస్తున్న చిత్రాలలో ప్రతిఫలించాయి.
Story for the present generation, very nice, thank you,