Menu Close
తెలుగు పద్య రత్నాలు 56
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఈ నెల పద్యం చూసేముందు చిన్న కధ చెప్పుకుందాం. సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యాక శివుడు విరాగిగా తిరుగుతూ ఉంటే తారకాసురుడు అనేవాడు బయల్దేరాడు. శివుడి భార్య పోయింది, ఆయన విరాగి కనక ఇంక ఆయనకి పిల్లలు పుట్టే సంగతి లేదు, అందువల్ల శివుడి కొడుకు వల్ల మాత్రమే తప్ప మరెవరివల్లా మరణం రాకూడదు అని అడిగేసాడు తపస్సు చేసి ఈ తారకాసురుడు. అలా వచ్చిన వరంతో దేవతలని నానా అగచాట్లూ పెడుతున్నాడు. వాడు చావాలంటే శివుడికి కొడుకు పుట్టి తీరాలి; దానికి శివుడు ఇప్పుడు పార్వతిని పెళ్ళిచేసుకోవాలి. శివుడి మనసులో కోరిక కలగాలి. అది మన్మధుడి వల్ల రావాలి తప్ప మరో విధంగా రాదు. అందువల్ల ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ‘ఇదిగో నీ వల్ల ఇలా దేవకార్యం జరగాల్సి ఉంది, అందువల్ల వెళ్ళి శివుడి మనసు మరల్చాలి,’ అని చెప్పాడు. మన్మధుడికి కంగారు పుట్టి ‘అబ్బే ఇది నేను చేయలేను అవతల ఉన్నది పరమేశ్వరుడు, ఆయన అసలే కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ అని కీర్తించబడేవాడు’ అని తప్పుకోబోయాడు. ఇంద్రుడు, మిగతా దేవతలూ వదుల్తారా? ‘అబ్బే అలా కాదు నువ్వు ఇంతవాడివీ, అంతవాడివీ’ అంటూ గొప్పగా ఉబ్బేసి చెప్పి, ‘నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, అయినా నువ్వు ఒక్కడివీ వెళ్ళక్కర్లేదు, నీ కూడా కోకిలనీ, వసంతాన్నీ పంపుతాం; నువ్వు చేయకపోతే ఇంకెవరూ చేయలేరు, దేవతలకి ఉన్న ఒకే ఒక దారి నువ్వు మాత్రమే’ అంటూ మొత్తానికి మన్మధుడు ఒప్పుకునేలా చేసారు. చుట్టూ భజన పరులు చేసే భజనకి ఒప్పుకుని ఇంటికి వచ్చాడు మన్మధుడు. మర్నాడో మరో రోజో వెళ్ళాలి ఈ పనిమీద. తనకున్న అయిదు బాణాలూ – అశోకము, అరవిందము, చూతము, నవమల్లిక, నీలోత్పలం - పట్టుకుని సిద్ధం అవుతూంటే భార్య రతీదేవి అడిగింది ఈ హుషారు అంతా దేనికో.

ఎవరితో చెప్పినా చెప్పకపోయినా భార్యతో చెప్పాలి కదా ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాడో? ఈ కధంతా చెప్పాడు రతీదేవికి; అందులో మళ్ళీ తానొక్కడే తప్ప దేవతలకి వేరే గతి లేదు, తానొక్కడే ఈ పని చేయగల గొప్పవాడు అంటూ భుజాలు ఎగరేసాడు. ఇదంతా విన్నాక రతీదేవి సొమ్మసిల్లి పడిపోయింది. లేచి బుర్ర పనిచేయడం మొదలుపెట్టాక మన్మధుడితో ఏమంటోందో చెప్పేదే ఈ నెల వీరభద్ర విజయంలో పోతన రాసిన పద్యం.

శా.
ఏలా మన్మథ! యిట్లుపల్కఁ దగవా? యీ చందముల్ మేలె? నీ
వేలా మూఢుఁడవైతి? నీదుమది దానెచ్చోటికిం బోయె? మి
థ్యాలాపంబులఁ బల్క నీకుఁ దగ భవ్యంబౌ రతిక్రీడయే
కాలారిఁద్రిపురారిఁజేరవశమే? కందర్ప! నీబోటికిన్. [వీరభద్ర విజయం 2-72]

ఏమిటి మన్మధా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడవచ్చా అసలు, ఇది మంచిదేనా (యిట్లుపల్కఁ దగవా? యీ చందముల్ మేలె)? నీ తెలివి ఏమైంది, మూర్ఖుడిలా అయ్యావు (మూఢుఁడవైతి), మీ బుద్ధి ఎక్కడకి పోయింది (నీదుమది దానెచ్చోటికిం బోయె), పిచ్చి వాగుడు వాగడం నీకు తగునా (మిథ్యాలాపంబులఁ బల్క నీకుఁ దగన్), ఇప్పుడు నువ్వు చేయబోయే పని ఏమైనా నీకు చేతనైన రతిక్రీడ అనుకున్నావా (నీకుఁ దగ భవ్యంబౌ రతిక్రీడయే), యముణ్ణి (కాలుణ్ణి), త్రిపురాసులని సంహరించిన వాడైన శివుణ్ణి చేరడం నీకు వశమా (కాలారిఁద్రిపురారిఁజేరవశమే) నీ లాంటివారికి (నీబోటికిన్)?

ఇంత చెప్పినా దేవతల కార్యం కనక మన్మధుడు బయల్దేరుతాడు. తర్వాత కధ ప్రకారం శివుడి మీదకి వేసిన మొదటి నాలుగు బాణాలు నిష్ఫలం అయ్యాక ఐదో బాణం నీలోత్పలం శివుణ్ణి గాయపరిచేసరికి ఆయన – రతీదేవి చెప్పినట్టూ – మూడో కన్ను తెరుస్తాడు. ఉత్తర క్షణంలో మొత్తం చూసినదంతా బూడిదై మిగులుతుంది. దానితో పాటూ మన్మధుడు కూడా. తర్వాత రతీదేవి క్షమించమని అడిగితే మన్మధుణ్ణి బతికించి ‘నీకు తప్ప మరెవరికీ కనబడడు’ అని వరం ఇచ్చినది కూడా శివుడే కదా. ఈ పద్యం చదివితే తెలిసేది మనం, మన శక్తీ, మనం ఎదుర్కోబోయేది ఎవరూ, వారు ఎటువంటివారూ అనేవన్నీ వెనక ముందులు తెలుసుకోకుండా ఆలోచించకుండా ఏ పనైనా చేయడానికి బయల్దేరడం మంచిది కాదు. మనని ఉబ్బేసి రెచ్చగొట్టేవారు మనకూడా రారు తర్వాత ఏమైనా తేడాలు వస్తే.

దీనితో పోల్చదగిన కధే మనం రామాయణంలో చూస్తాం. రావణుడు మారీచుడి దగ్గిరకి వచ్చి బంగారు లేడిగా వెళ్ళమనడం. అంతకు ముందే రాముడి చేతిలో చావు దెబ్బలు తిన్న మారీచుడు హితం చెప్పడం అవీ. అక్కడకీ మారీచుడు అంటాడు కూడా “రకారాదీని నామాని రామత్రస్తస్య రావణః, రత్నాని చ రథాశ్చైవ విత్రాణం జనయంతిమే.” రత్నం, రథం, రామ, రావణ అనే రకారంతో వచ్చే ఏ మాటా, పదం విన్నా నా వెన్ను వణుకుతోంది. మన వరకూ ఎందుకు, బలి, నముచి వంటి మన పూర్వుల వల్ల కూడా అధర్మం జరుగుతుంటే నిలబెట్టి వాళ్ళ తల తీయగల సమర్థుడు రాముడు. ఇదంతా శూర్పణఖ కామోద్రేకం వల్ల వచ్చిన గొడవ. నా మాట విని, రాముడి వైపు వెళ్ళవద్దు. నిప్పుగుండంలో పడే శలభాల్లాగా మాడిపోతాం.”

ఇదేమీ వినిపించుకోకుండా, ‘నువ్వు బంగారు లేడిలా వెళ్ళి తీరాలి లేకపోతే నా చేతిలో ఛస్తావు’ అంటూ రావణుడు పట్టుపట్టాక మారీచుడు బయల్దేరతాడు. అదికూడా, ‘నీలాంటి వాడి చేతిలో కన్నా రాముడి చేతిలో చావడం మంచిది. నన్ను చంపాక రాముడు మొత్తం రాక్షస కులాన్ని నాశనం చేస్తాడు సుమా’ అని వాడి మొహం మీదే చెప్పి మరీ వెళ్తాడు. ఆ తర్వాత కధ సరిగ్గా మారీచుడు చెప్పినట్టే జరుగుతుంది.

****సశేషం****

Posted in February 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *