Menu Close
Uma Bharathi
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

17

hrudayagaanam-17

పారూని చేయి పట్టి గార్డెన్ లోకి నడిపించాడు. టైం సరిగ్గా ఏడయిందేమో, ఒక్కసారిగా గార్డెన్ లోని డోమ్ లైట్స్ జిగేలుమని వెలిగాయి. చుట్టూ పందిళ్ళకి విరబూసిన రకరకాల పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నాయి. పార్క్ ఏరియా పిల్లలతో కోలాహలంగా ఉంది.

వారిని దాటుకుంటూ కాస్త ఎడంగా ఉన్న గాజేబో వైపు నడిచారు. పూలపందిరిని ఆనుకోనున్న బెంచీపై కూర్చున్నారు.

అందమైన ఆ పూదోటని తిలకించాక "బావా! ఈ గార్డెన్ ఎంత చూసినా తనివి తీరడంలేదే!” అంటూ కిరణ్ వైపు తిరిగింది. నవ్వుతూ పారూనే చూస్తున్న కిరణ్... "అదే మరి నేననేది కూడా. నిన్ను ఎంతసేపు చూసినా తనివి తీరందే!" అన్నాడు కొంటెగా.

“కొత్తగా కనిపిస్తున్నావు బావా! ఇవాళ” అని దగ్గరగా జరిగింది పారూ. అతని భుజాన తల ఆనించి "భలే ఉంది ఇక్కడ. పైన జాబిల్లి. చుట్టుముట్టిన ఈ రకరకాల పూల సువాసనలు.." వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మైమరిచి పోయింది.

ఆమె భుజం చుట్టూ చేయి వేసి, “ఐ లవ్ యు పారూ!" అన్నాడు ఆమె చెవిలో మృదువుగా. "ఐ లవ్ యు టూ" అంటూ కిలకిలా నవ్వింది పారూ.

దూరంగా ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ పందిరి దిశగా రావడంతో కిరణ్ చేతుల్లో నుండి విడివడి నవ్వుతూ దూరం జరిగింది పారూ.

తన పాకెట్ నుండి గిఫ్ట్ బాక్స్ తీసాడు. "ఏవీ నీ పాదాలు చూపించు" అన్నాడు కిరణ్.

"షాప్ లోనే చూసాను.. ఇంత ఖరీదైన కానుక ఇప్పుడు ఎందుకు బావా! ఏమి సందర్భం అసలు?" అంది కాస్త సంశయంగా.

"నీ మొదటి విదేశీ పర్యటనకి శుభాకాంక్షలతో ప్రేమగా నీకివ్వాలనుకున్నాను. నా ఆనందం నీకు సంతోషాన్నివ్వదా?" అన్నాడు చిరుకోపం ప్రదర్శిస్తూ.

"అయ్యో బావా! నీ ఇష్టమే నా ఇష్టం" అని పాదాలని ముందుకు చాచింది. పట్టీలని ఆమె పాదాలకి పెట్టి “ఎంత బావున్నాయో చూడు” అన్నాడు.

"నీ ప్రేమలా, నీలా అద్భుతంగా ఉన్నాయి బావగారూ!" అంది కాలి మువ్వలని తాకుతూ.

కిరణ్ ఫోన్ రింగయింది. పునీత్ నుండి కాల్ లిఫ్ట్ చేసాడు.

"బావా! ఇక్కడ గెస్ట్-హౌజ్ లో డిన్నర్ రెడీ. నాకు ఆకలిగా ఉంది. ఇక్కడ లలితమ్మ ఎంత బాగా వంట చేస్తుందో! ఎన్ని వంటకాలు చేసిందో! ఘుమఘుమలకి తట్టుకోలేకుండా ఉన్నాను" అంటూ పెద్దగా నవ్వాడు.

"ఇదిగో సరిగ్గా పది నిముషాల్లో అక్కడుంటాము." అన్నాడు కిరణ్.

**

ఆదివారం పొద్దుటే కిరణ్, పారూలు శ్రీనివాస్ గారింటికి వెళ్లారు. వారి కోసం ఆయన తన ఆఫీస్ లో వేచి ఉన్నారు. 'విశాలంగా ఓ అద్భుతమైన కట్టడంలా ఉంది వీరిల్లు' అనుకుంది పారూ.

"రామ్మా రా పరమేశ్వరీ! అంటూ శ్రీనివాస్ గారి కంఠం వినిపించడంతో అటుగా చూసింది.

"రండి కిరణ్, వచ్చి కూర్చోండి" అన్నారాయన. వీల్-చైర్ ఓ పక్కకి పెట్టుంది. ఆయన అసిస్టెంట్ కాస్త దూరంగా కంప్యూటర్ మీద పని చేసుకుంటున్నాడు.

ఆఫీసులోకి వెళ్ళి, ఆయనకి నమస్కరించింది పారూ. "శ్రీనివాస్ అంకుల్. మీరు చక్కగా కోలుకుంటున్నందుకు సంతోషంగా ఉంది." అంటూ ఎదురుగా కుర్చీలో కూర్చుంది. కిరణ్ ఆయన్ని ప్రేమగా హత్తుకుని, పారూ పక్కనే కూచున్నాడు.

యోగక్షేమాలు కనుక్కున్నాక... శ్రీనివాస్ గారే మాట్లాడ్డం మొదలుబెట్టారు.

"కొంచం అలిసిపోయినట్టుగా ఉన్నాను గాని పర్వాలేదు. బాగానే ఉన్నాను పరమేశ్వరీ! నీతో మాట్లాడబోయేది ఓ ముఖ్యమైన విషయమే. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం "శ్రీ క్రియేషన్స్' అనే సాంస్కృతిక సంస్థని రిజిస్టర్ చేసాను. పదేళ్ల క్రితం కేబుల్ టీవీ ఛానల్ ని కూడా లాంచ్ చేసాము.

ఇప్పటివరకూ అయితే, మేము నిర్మించే టెలీ-ఫిలిమ్స్, షార్ట్-ఫిలిమ్స్, విదేశీ డాక్యూమెంటరీలు, సీరియల్స్, వివిధ భాషల పాత సినిమాలు ప్రసారం అవుతుంటాయి. రాబోయే ఉగాదికి ఛానల్ ని పూర్తి వ్యాపార దృక్పధంతో నిర్వహించేందుకు నాలుగునెలల నుండి వేగంగా పనులు జరుగుతున్నాయి.

రాబోయే ఉగాది పండుగనాడే... ఛానల్ ఆవిష్కరణ సందర్బంగా మీ అమ్మమ్మ గారు, అమ్మగారు, నీవు కలిసి చేసే సంగీత కచేరీ కార్యక్రమాన్ని ప్రత్యేక అంశంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము.

తరువాత అన్ని రీతుల సంగీతానికి ఈ ఛానల్ ఓ చక్కని వేదికగా, యువతని ప్రోత్సహించే విధంగా తీర్చిదిద్ధేందుకు కూడా మీ తోడ్పాటుని, సహకారాన్ని అందించగలరని ఆశిస్తున్నాము." అంటూ వెనక్కి జరిగి మంచినీళ్ళు పుచ్చుకున్నారు.

నీరసించి ఉంది ఆయన గళం. "కాసేపు విశ్రాంతి తీసుకోండి మామయ్యా! మేము ఇక్కడే ఉంటాము. హార్లిక్స్ తాగుతారా?" అని కిరణ్ అంటుండగానే... అందరికీ ఛాయ్ పంపించి, ఆ వెనుకే విమల గారు వచ్చారు.

పారూ లేచి ఆమెకు నమస్కరించింది. “అంకుల్ బాగున్నారు ఆంటీ! ఇంట్లోనే రోజుకు రెండు మార్లు ఫిజికల్ తెరెపీ అట కదా!" అంటూ వాకబు చేసింది.

"కూర్చో పరమేశ్వరీ! ఔనమ్మా! దేవుని దయవల్ల ఆయన ఆరోగ్యం మెరుగవుతుందనే అనుకుంటాను." అన్నరావిడ వారికి ఎదురుగా కూర్చుంటూ.

హార్లిక్స్ సేవించి కప్పు పక్కకి పెట్టిన శ్రీనివాస్ గారు, "అయితే ఈ ప్రతిపాదనకి ముఖ్య కారణం మీ అమ్మమ్మ వేదాంతం సీతామహాలక్ష్మీ గారు. అప్పట్లో ఒక అద్భుతమైన గాయనిగా ఆమె కున్న పేరుప్రతిష్ఠలు నభూతో నభవిష్యత్. ఆమె జాతీయంగా కూడా ఖ్యాతినార్జించిన మేటి గాయని. నీకు దక్కిన పరంపర అది." అంటూ భార్య వంక చూసారు.

"అవునమ్మా! అంకుల్ చెప్పిన విషయం మీ ఇంట్లో అందరితో సంప్రదించి నిర్ణయం చెబితే, మేము సంతోషిస్తాము. పోతే, లంచ్ టైం కదా, భోంచేద్దాము రండి." అందామె.

**

భోంచేసేప్పుడు కిరణ్ ముందుగా మాట్లాడాడు. "మామయ్యా! ఈ 'శ్రీ క్రియేషన్స్ అన్న మాట మీ నుండి విని చాలా కాలమైంది. మీరు ఒక పెద్ద ఈవెంట్ గా సెలెబ్రేట్ చేశారు కూడా. ముందుకు సాగి నానుండి ఏ సాయం కావాలన్నా అడగండి." అన్నాడు.

"పరమేశ్వరి వాళ్ళ కుటుంబాన్ని హైదరాబాదు వచ్చేసేందుకు ప్రోత్సహించు కిరణ్. మీ అత్తయ్యకి పరమేశ్వరి అంటే అభిమానం. తన గురించి నిత్యం ఏదో మంచి మాటే చెబుతుంది. ఆమె తోబుట్టువులు పునీత్, జననీలకి కూడా ఈ కాస్మోపాలిటన్ నగరం నచ్చుతుంది." అన్నారు నవ్వుతూ శ్రీనివాస్.

భోజనమయ్యాక, "మీ ఇద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రతిపాదనకి మిక్కిలి ధన్యవాదాలు అంకుల్. మా నాన్నగారికి విషయం చెబుతాను. వారే మీతో మాట్లాడుతారు." అంటూ శ్రీనివాస్ దంపతులకి నమస్కరించి, కిరణ్ తో బయటికి నడిచింది పారూ.

“నేరుగా మా ఇంటికే వెళుతున్నాము పారూ. రాత్రి భోజనమయ్యాక కదా మీరు గెస్ట్-హౌజ్ కి వెళ్ళేది." అన్నాడు కిరణ్.

**

పారూ, కిరణ్ లు ఇంట్లో అడుగుపెట్టేప్పటికి పునీత్, జానీ పరిగెత్తుకుంటూ వచ్చారు. బుక్ షాప్ లో కొన్న బుక్స్ గురించి, కొత్త మాల్లో మూడు మైళ్ళు నడిచాక తిన్న మాంగో ఐస్-క్రీం గురించి చెప్పారు.

"మరో రెండు రోజులు ఉంటారా మరి?” అడిగారు రామనాధం గారు.

"లేదు తాత గారు నాకు స్కూల్, ఫుట్-బాల్ మ్యాచ్ ఉంది, అక్కకి మ్యూజిక్ ప్రాక్టీస్ ఉంది. మళ్ళీ వస్తాముగా. నాకు వకుళమ్మ చేసే చట్నీ, దోస చాలా బాగున్నాయి." అంటూ నవ్వాడు పునీత్.

"పునీత్ బాబు! ఇంకాసేపటికి మీరు గెస్ట్-హౌజ్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడే దోసలు వేయమంటావా మరి? అడిగారు వకుళమ్మ.

"వద్దమ్మా! ఆకలి లేదు. మళ్ళీ వచ్చినప్పుడు తింటానుగా." జవాబిచ్చాడు పునీత్.

"మీకు హైదరాబాదు కూడా బాగా నచ్చింది కదూ! ఇక్కడికి వచ్చేస్తారా పునీత్? నేను నీకు టెన్నిస్ నేర్పిస్తా. చదువులో సాయం చేస్తా. ఇంకా మన జననీ డాన్స్ నేర్చుకుని గొప్ప డాన్సర్ అయిపోవచ్చు." అంటూ పారూ వంక చూసి కన్ను గీటాడు కిరణ్.

"భలే.. ఇదేమి కథ. బాగుందిగా. తప్పక వచ్చేస్తాము బావా!" అంది జననీ.

"కథ కాదు జానీ! జరగబోయేదే. దేవుడి దయ కావాలి. అందుకే కాస్త సమయం ఉంది కనుక ఓ మారు బిర్లా మందిర్ కి వెళ్ళొద్దాము. ఇప్పుడు సాయంత్రం నాలుగయింది. అందరూ వెళ్లి పది నిముషాల్లో ఫ్రెష్ అయి రండి. అమ్మా పదండి మరి." అన్నాడు కిరణ్.

***

హైదరాబాదు నుండి మరునాడు ఇల్లు చేరుతూనే పునీత్, జననీ లు వారి హైదరాబాద్ సిటీ టూర్ గురించి అమ్మానాన్నలకు, అమ్మమ్మకి రసవత్తరంగా వినిపించారు. మాలినీ పిన్ని గెస్ట్-హౌజ్ లో రుచికరమైన లలితమ్మ వంటకాలు, డ్రైవర్ అంకుల్ గురించిన కబుర్లు చెప్పారు.

కిరణ్ బావ తమ 'హీరో' అన్నారు. అతని గురించి చెప్పీ చెప్పీ అలిసిపోయారు. తరువాతి అంశంగా... పారూ కాస్ట్యూమ్స్. వాటిని చూసినంతనే అద్భుతమే అనిపించింది ఇంటిల్లిపాదికీ. వాటి రంగులు, హంగులు అంతగా ఆకట్టుకున్నాయి.

"అక్కా! నీవు వీటిల్లో ఒక రాకుమారిలా ఉంటావని, కోకిలలా పాడుతావని కదా, కిరణ్ బావ కూడా అన్నాడు" అంటూ నవ్వేసాడు పునీత్.

పారూ మాత్రం “పునీత ఇక ఆపు.” అంది నవ్వేస్తూ. “నాన్నా, అమ్మా, అమ్మమ్మా, ఓ ముఖ్య విషయం ఏమంటే.. శ్రీనివాస్ గారు కోలుకుంటున్నారు. వారి 'శ్రీ క్రియేషన్స్' టీవీ ఛానల్ ఆవిర్భావ సభలో మన సంగీత గాన కచేరి ఏర్పాటు చేస్తారట.” అంటూ వివరించింది పారూ.

**

తాము హైదరాబాదుకి తరలిపోతే.. అన్న విషయాన్ని గురించి, అప్పుడప్పుడు ఇంట్లో చర్చలు జరుగడం మొదలయింది. పునీత్, జననీల భవిష్యత్తుకి... కిరణ్ ప్రభావం ఖచ్చితంగా మేలు చేయగలదని, బంధువులతో మరింత దగ్గరగా మసులుకోగలగడం ఆనంద దాయకమౌతుందనీ భావించారు.

మాలిని వద్ద ప్రస్తావించారు కూడా. అంతా విన్న మాలిని మాత్రం "మీరు ఊరు మారితే, పిల్లల్ని, మిమ్మల్ని చూడకుండా ఎలా గడపాలి శాంతా!" అంటూ వాపోయింది.

"నెలలో సగం రోజులు మీరు కూడా హైదరాబాదులో గడపవచ్చునమ్మా మాలినీ!. మా నివాసం మీది కాదా? పైగా అన్ని సదుపాయాలతో అక్కడ ఓ మహల్ ల్లాంటి నివాసం మీకూ ఉంది. అంతకన్నా ఎక్కువగా మీ ఇరువురి కుటుంబాల నడుమ విడదీయలేని బాంధవ్యమే ఉంది." అన్నారు సీతమ్మ.

***

కాకినాడ లోని పెక్కు సంగీత సాంస్కృతిక సంఘాలు కలిసి పరమేశ్వరి రామ్‌కుమార్ మొట్టమొదటి విదేశీ పర్యటన సందర్బంగా అభినందన సభని విజయవంతంగా జరిపించారు.

పరమేశ్వరి ‘విదేశీ పర్యటన కథనం’ ప్రధాన అంశంగా అన్ని న్యూస్ మీడియాల్లో మూడురోజల పాటు వెలువడింది. ఐదేళ్ల చిరుప్రాయాన మొదలయిన ఆమె సంగీత జీవన ప్రస్థానం... ఇరవైయేళ్ళ వయసుకే సంగీత, సినీ రంగాల్లో దూసుకుపోతుందని వివరిస్తూ... ఫోటో ఆల్బమ్స్ తో సహా ప్రచురించబడ్డాయి.

***

ఆస్ట్రేలియా పయనానికి రెండు రోజులు ముందుగానే మాలిని, జోసెఫ్ లతో సహా హైదరాబాద్ చేరింది రామ్ కుటుంబం. గెస్ట్-హౌజ్ లో మకాం. మరునాడు పొద్దుట రామనాధం గారి కుటుంబాన్ని కలిశారు.

అక్కడి నుండి రామ్‌కుమార్ తో పాటు సీతమ్మ గారు మాత్రం శ్రీనివాస్ గారిని కలిసేందుకు వెళ్లారు. 'శ్రీ క్రియేషన్స్' టీవీ ఛానల్ కి తమ సంగీత విభావరి కార్యక్రమం తప్పక చేస్తామని తెలియజేసారు. జనవరిలో మొదలు కానున్న 'ఆలయనాదాలు' టెలీఫిల్మ్ షూటింగ్/రికార్డింగ్ నిమిత్తం పరమేశ్వరి హైదరాబాదులోనే ఉంటుంది కనుక మరోమారు తీరిగ్గా కలుస్తామని మాటిచ్చారు సీతమ్మ.

"మంచిదమ్మా, ఉగాది కార్యక్రమమే ప్రస్తుతం ముఖ్యం. మిగతావి మీ వీలునిబట్టే చేద్దాము. ఈ లోగా ఛానల్ నడుస్తూనే ఉంటుంది. పోతే, రేపు పొద్దుటే కదా మీ ఆస్ట్రేలియా ఫ్లైట్. పరమేశ్వరికి కూడా మా శుభాకాంక్షలు చెప్పండి." అన్నారు శ్రీనివాస్ గారు.

"మరో రెండువారాల్లో పారూ పుట్టినరోజు కదూ! శుభాకాంక్షలని తెలియజేయండి." అన్నారు విమల.

**

విమల గారి ఆతిధ్యం స్వీకరించి రామ్, సీతమ్మ తిరిగి గెస్ట్-హౌజ్ చేరేప్పటికి అందరినీ నవ్విస్తూ... కబుర్లు చెబుతూ కనబడ్డాడు కిరణ్. పెద్దవాళ్ళని చూడగానే, "అంకుల్, నానమ్మగారు, మీ కోసమే చూస్తున్నాము. మీకు ఓపిక ఉంటే షాపింగ్ కి వస్తారా? ఇదో వీళ్ళకి సిటీలోని బెస్ట్ ఐస్-క్రీం, కార్న్ సూప్ కావాలంట." అన్నాడు.

"నో, నో కిరణ్! మీరు వెళ్లి వచ్చేయండి. మేము కాసేపు రిలాక్స్ అవుతాము.” అన్నాడు రామ్.

"మాకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది మనవడా!" అన్నారు సీతమ్మ.

***

చిన్నవాళ్లంతా కిరణ్ వెంట షాపింగ్ మాల్ కి వెళ్ళి, కాసేపు వాకింగ్ చేసారు. పునీత్, జననీ బుక్ షాపులో ఉంటామంటే, మరో రౌండ్ నడిచి వస్తామని ముందుకు సాగారు పారూ, కిరణ్.

ఒకరి చేయి ఒకరు పట్టుకుని దగ్గరగా నడవసాగారు.

"ఎలా పారూ! ఐ విల్ మిస్ యు. కానైతే, నీ టూర్ బ్రహ్మాండంగా జరగాలి అన్న ఉత్సాహం ఎక్కువగా ఉంది." అన్నాడు కిరణ్.

"నేనూ అంతే. విల్ మిస్ యు టూ బావా! మూడు వారాలేగా. నువ్వన్నట్టు.. ఉత్సాహంగానూ ఉంది." అంది పారూ.

"నీ కాళ్ళ పట్టాలు సన్నగా వినబడుతున్నాయి. వెరీ నైస్. ఐ లవ్ ఇట్. ఆడపిల్ల అంటే ఇంత సొగసుగా, సున్నితంగా కదిలాలి." అన్నాడు.

"ఏదో కవిత్వం చెబుతున్నావు. నేను కూడా చెబుతాను విను. నీవిచ్చిన ఈ లవ్ లాకెట్ నా మనసుకి దగ్గరగా... నీవు పెట్టిన బంగారు కాళ్ళ పట్టీలు... నీ ప్రేమ బంధాలుగా... అలా వెళ్లి ఇలా వచ్చేస్తాగా." అంటూ కిరణ్ భుజం పై తల ఆనించింది.

ముందుకి నడిచి, పునీత్ వాళ్ళున్న షాప్ కి బయట ఉన్న బెంచ్ పై కూర్చున్నారు.

"గానం, నటన, కవిత్వం... నా ప్యారీ బహుముఖ ప్రజ్ఞాశాలి.." అంటున్న కిరణ్ చెక్కిలి పై చిటికేసి "ధన్యవాదాలు బావా!" అంది నవ్వుతూ.

ఇంతలో "ఓకే.. కార్న్ సూప్, ఐస్-క్రీంకి మేము రెడీ.” అన్నాడు పునీత్, వారికి దగ్గరగా వచ్చి.

“పదండి మరి, రేపు పొద్దుటే మన ఫ్లైట్. త్వరగా తినేసి వెళ్ళాలి." ముందుకు సాగింది పారూ.

**

'సంగీత సరస్వతికి'  'పెర్త్' సంగీతాభిమానుల స్వాగతం ....

పెర్త్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టింది మొదలూ....వేలుస్వామి పిళ్ళై గారు, నేథన్ ల మ్యూజిక్ గ్రూప్ ఆహ్వాన ఏర్పాట్లకి అచ్చరువొందారు పరమేశ్వరి బృందం.

క్షణం పాటు, ఓ సుందర ప్రపంచంలో అడుగిడుతున్న అనుభూతి పొందింది పారూ.  ప్రాణప్రదమైన సంగీత సాధనలో జీవితం సాగిపోతే చాలునని అనుకున్న ఆమె... తన గానానికి పట్టం గట్టిన అభిమానులకి మనసులోనే శతకోటి వందనాలు తెలుపుకుంది.

‘తనకి మాట రాకుండా ఉండుంటే తన గానంతో ఇందరి అభిమానం, ఇటువంటి అవకాశాలు దక్కేవి కాదు కదా!’ అని ఎన్నో మార్లు అనుకుంది కూడా. ‘తన సంగీతం, తన జీవితం, తన సాధికారికత, తన సర్వం తిరిగి ఆ అమ్మవారికే అంకితం అని ఎన్నో మార్లు ప్రార్ధిస్తూ కంట తడిపెట్టుకున్న క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇరవైయొక్కేళ్ల పారూ జీవితాన.

***

ఆస్ట్రేలియా లోని పెర్త్ నగరంలో దేవీ నవరాత్రుల సందర్బంగా మొదలయిన పరమేశ్వరి కర్ణాటక గాన కచేరీలు, ఆ తరువాత మరో ఐదు పట్టణాల సంగీతప్రియుల హృదయాల్లో కలకాలం నిలిచి పోయే విధంగా జరిగాయి.

శాంతా, సీతమ్మ కలిసి కీర్తనలు, సౌందర్య లహరి నుండి శ్లోకాలు శ్రావ్యంగా ఆలపించి … ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేశారు.

వేలుస్వామి పిళ్ళై గారి ఆధ్వర్యంలో కనీ వినీ ఎరుగనంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు, పరమేశ్వరి గాన కచేరీలు నిర్వహించారన్న వార్తలు దేశ నలుమూలలకి చేరాయి. 'సంగీత సరస్వతి' పరమేశ్వరి’ అంటూ పరమేశ్వరి సంగీత నైపుణ్యానికి జోహార్లు పలికింది ఆస్ట్రేలియా లోని శాస్త్రీయ సంగీత సమాజం.

ఆ వెనువెంటనే... నేథన్ చెరియన్ ఆధ్వర్యంలో ‘వరల్డ్ మ్యూజికల్ సొసైటీ' వారి దాదాపు పది కార్యక్రమాలతో పరమేశ్వరి గానం, రూపం, ఆహార్యం యువతని బాగా ఆకట్టుకున్నాయి. అంచనాలని మించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆదరణ పొందింది గాయని పరమేశ్వరి.

మీడియాకి ఆ మూడు వారాలు 'పరమేశ్వరి పర్యటన' ఓ పతాక స్థాయి అంశంగా సాగింది. తామాశించిన దాని కన్నా మిన్నగా పారు నైపుణ్యానికి వెల్లువెత్తిన ప్రశంశకి ... ధన్యోస్మి అనుకున్నారు పరమేశ్వరి తల్లితండ్రులు, సీతమ్మ.  పునీత్, జననీలకి... పారూ పట్ల, ఆమె లోని గాన నైపుణ్యం పట్ల గౌరవం ఏర్పడింది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in February 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *