అన్నాల వేళ కావడంతో ఒక్కో ఇంట్లోంచి ఒక్కో వాసన సుబ్బు ముక్కు పుటాలకు సోకుతోంది. వాడికి ఆ వాసనలన్నీ కొత్తగా ఉన్నాయి. నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి. రావి చెట్టు కింద అప్పటికే బుజ్జి, లష్మి, శీను వచ్చి ఉన్నారు.
మహేశ్ ఏంటిరా ఇంకా రాలేదు? అడిగాడు శీను.
ఒరేయ్ వచ్చే దారిలో మంచి మంచి వాసనలు వచ్చేయిరా అన్నాడు సుబ్బు.
మా ఇంట్లో గంజన్నమే. పక్కింటామె వంకాయ, శనగలు కూర ఇచ్చింది చెప్పింది లష్మి.
అబ్బో కూరే నాలికతో పెదాలు తడుపుకున్నాడు సుబ్బు.
ఎహె ఎప్పుడు సూడు తిండి యావే. మహేశ్ ఇంకా రాలేదు. పదండి ఆడింటికి ఎల్దాం. చెప్పాడు బుజ్జి.
నలుగురూ కలిసి మహేశ్ వాళ్ళింటికి వెళ్లారు. నాన్నమ్మ మహేశ్ కి చేతిలో అన్నం ముద్దలు పెడుతోంది. మహేశ్ ఏదో చెప్తూ అన్నం తింటున్నాడు. నలుగురికీ ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది. దూరంగా అలాగే నిలబడిపోయారు. మహేశ్ తలతిప్పి చూసేసరికి బొమ్మల్లా నిలబడిన నలుగురూ కనిపించారు. రండిరా అన్నాడు మహేశు.
శీను బుజ్జి వైపు చూసాడు. లష్మి సుబ్బు వైపు చూసింది. నలుగురూ ముందుకు కదిలి వచ్చారు. నాన్నమ్మ లోపలికి వెళ్లి ఒక గిన్నెతో వచ్చింది. అందులో నాలుగు గుడ్లు ఉన్నాయి. నలుగురిని పిలిచి ఒక్కొక్కరి చేతిలో ఒక్కో గుడ్డు పెట్టింది. ఏదో అద్భుతం తమ చేతిలో పెట్టినట్లు పొంగిపోయారు నలుగురూ.
నాన్నమ్మా నువ్వు నాకు చెప్పే గూని పొట్టోడు కథ నా స్నేహితులకు కూడా చెప్పవే. అడిగాడు మహేశు.
నాన్నమ్మ చిరునవ్వు నవ్వి, మళ్ళీ మహేశుకు ముద్దలు కలిపి పెడుతూ చెప్పడం ప్రారంభించింది.
అనగనగా ఒకూల్లో రామమ్మ ఉండేది. రామమ్మకి ఏడుగురు కొడుకులు. రామమ్మ మొగుడు రామయ్య పుల్లలకని అడివికి వెళ్లి పురుగు ముట్టి సచ్చిపోయాడు. పాపం ఏడుగురు కొడుకులని జాగ్రత్తగా పెంచుకొచ్చేది రామమ్మ. పెద్ద కొడుకు రాముడు, రెండోవాడు భీముడు. మూడోవాడు కృష్ణుడు, నాల్గోవాడు నల్లోడు, ఐదోవాడు, ఆరోవాడు కవలలు చిన్నడు, తిన్నడు, ఏడోవాడు సిమ్మాద్రి. పెద్దోడి పేరు రాముడే కానీ వాడిని ఎవరూ వాడి పేరుతో పిలవరు. వాడికి గూని ఉంది. వాడి వయసుతో పాటు గూని కూడా పెరిగింది. వాడి గూని వలన ఆఖరి వాడైన సిమ్మాద్రి కంటే పొట్టిగా, చిన్నగా ఉండేవాడు. అంచేత వాడిని అందరూ గూనోడా అని, పొట్టోడా అని, గూని పొట్టోడా అని పిలిచేవారు. పాపం రావుడికి చాలా బాధనిపించేది. ఆఖరికి వాళ్ళమ్మ కూడా వాడిపేరు రావుడని మర్చిపోయింది.
గూనోడు ఆడుతూ, పాడుతూ గడిపేసాడు. కొన్నేళ్ళకి తమ్ముళ్లు మంచి బట్టలు వేసుకుని, వేడి గంజన్నం తిని బడికి వెళ్తూ ఉంటే అమ్మా నేను కూడా బడికి వెల్తానే అని అడిగాడు. పెద్ద తమ్ముడు భీముడు కసురుకున్నాడు.
నీకెందుకురా బడి. చద్దన్నం తినేసి పోయి ఆడుకో అన్నాడు. వాడు చూడటానికి భీముడి లానే ఉంటాడు. అందుకని గూనోడు మరో మాట మాట్లాడటానికి భయపడ్డాడు. అలా చూస్తూ ఉండగానే ఏళ్ళు గడిచిపోయాయి. గూనోడికి పదహారేళ్ళొచ్చాయి. తన ఈడువాళ్ళంతా హుషారుగా పనుల్లోకి వెళ్లడం గమనించేవాడు. సన్నగా, పొట్టిగా ఉంటాడని వీడికి ఎవరూ పనులు చెప్పేవారు కాదు. ఏదైనా పని పూనుకొని చేయబోతే చేతకానివాడివి, ఓ మూల కూర్చో అనేవారు. కట్టుకోడానికి కొత్తబట్టలు అడగబోతే, దమ్మిడీ ఆదాయం లేదు, నీకు తిండి పెట్టడమే దండగ. కొత్త బట్టలు కూడా ఎందుకు? పిల్లని చూడటానికి వెళ్ళాలా? పెళ్లాడటానికి వెళ్ళాలా? అని ఆసికాలు ఆడేవారు.
గూనోడికి చాలా కోపం వచ్చేది. బాధ అనిపించేది. ఎలాగైనా బోలెడు డబ్బులు సంపాదించి, బాగా డబ్బున్నవాణ్ణి అయిపోవాలి, మంచి మంచి వంటలు వండించుకొని తినాలి. రోజుకొక కొత్త జుబ్బా వేసుకోవాలి అనుకునేవాడు. ఓరోజు అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మా! నాకు రెండు మేకపిల్లలు కొనిపెట్టు. వాటిని కొండవారకు తీసుకుపోయి మేపుకుంటాను అని అడిగాడు. రామమ్మ భీముణ్ణి పిలిచి, గూనోడు మేకపిల్లల్ని కాస్తాడంట, కొని ఇమ్మంటున్నాడు అని చెప్పింది.
భీముడు కాస్త ఆలోచించి సరే అన్నాడు. మర్నాటి నుంచి గూనోడు రెండు మేకపిల్లల్ని కొండవారకు మేతకు తోలుకొని పోయేవాడు. వాడి అమ్మ ఒక డబ్బాలో వేడి గంజి అన్నం, మిరపకాయ, ఉల్లిపాయ వేసి కట్టేసి ఇచ్చేది. ఆ అన్నం మూట పట్టుకొని, మేకపిల్లల్ని తోలుకొని కొండవారకు వెళ్ళేవాడు గూనోడు.
ఎండ బాగా ఎక్కేవరకు మేకపిల్లలు ఆకులు మేసేవి. చెట్టు నీడ చూసుకుని గూనోడు కూర్చుని అన్నం తినేటప్పుడు, వాడి కాళ్ళ దగ్గర పడుకునేవి. అన్నం తినేసి గూనోడు చెట్టు మొదట్లో నడుం వాల్చేవాడు. నడ్డి మీద గూని ఉండటం వలన ఒక పక్కకు తిరిగి పడుకునేవాడు. పొద్దు వాలగానే మేకపిల్లల్ని ఇంటికి తోలుకొని వచ్చేవాడు. ఒక వారం తిరిగేసరికి మేకపిల్లలికి ఇంటికి దారి తెలిసిపోయింది. అల్లంత దూరం ఉండగానే ఇంటికి పరుగెత్తి వచ్చేసేవి. కానీ గూనోడు వాటితో సమంగా పరుగెత్తలేకపోయేవాడు.
ఓరోజు ఏమయ్యిందంటే, మధ్యాన్నం నిద్రపోయి గూనోడు లేచేసరికి కాళ్ళ దగ్గర ఉండాల్సిన మేకపిల్లలు లేవు. ఎక్కడికి పోయాయబ్బా… అని చుట్టూ వెతికాడు. ఎక్కడా మేకపిల్లలు అవుపడలేదు. మే మే అని పిలిచాడు. దొంగలు కానీ తన మేకపిల్లల్ని ఎత్తుకుపోయారేమో అని అనుమానం వచ్చింది గూనోడికి. మేకపిల్లల్ని వెతుక్కుంటూ బయలుదేరాడు.
దారిలో తాటిచెట్టు మీద నుంచి తాటిపండు పడింది. తాటిపండు అంటే గూనోడికి చాలా ఇష్టం. గబగబా తాటిపండు తినేసి, టెంకలు పారేయబోయాడు. ఎందుకైనా పనికొస్తాం, ఉంచు అని టెంకలు చెప్పినట్లు అనిపించింది వాడికి. మరి కొంచెం దూరం వెళ్లేసరికి ఒక తాడు, కర్ర అవుపించాయి. వాటిని కూడా తీసుకున్నాడు. ఇంకా దూరం నడిచాడు. ఎక్కడా మేకపిల్లలు కనిపించలేదు. కొంచెం దూరంలో ఒక చెట్టు కింద నలుగురు మనుషులు కూర్చొని ఉన్నారు. మేకపిల్లల్ని చూసారేమో అడుగుదాం అనుకున్నాడు. కానీ వారికి కొంచెం దూరంలో ఒక పాక ఇల్లు కనిపించింది. ఎవరూ లేని చోట మనుషులు ఎందుకు ఉన్నారు? ఇల్లు ఎందుకు ఉన్నాది? అని ఆలోచించాడు. వారికి కనబడకుండా, నక్కుతూ ఆ పాక ఇంటి వైపు వెళ్ళాడు. అక్కడ కిటికీలోంచి చూస్తే మేకపిల్లలు కట్టేసి ఉన్నాయి. అమ్మో! వీళ్ళే ఆ దొంగలు అనుకున్నాడు. తాడు, కర్ర… మీ పని మీరు చెయ్యండి అన్నాడు. తాడు వెళ్లి ఆ నలుగురిని చెట్టుకేసి కట్టేసింది. కర్ర ఒక్కొక్కరికి నాలుగేసి దెబ్బలు వడ్డించింది. తాటి టెంకలు నెత్తి మీద మొట్టికాయలు వేసాయి. ఆ దొంగలు లబోదిబో మన్నారు. నీ మేకపిల్లలు ఆ పాక ఇంట్లో ఉన్నాయి అని చెప్పారు.
గూని పొట్టోడు పాక ఇంట్లోకి వెళ్ళాడు. చుట్టూ బంగారం, ఆభరణాలు, కాసులు కుప్పలుగా ఉన్నాయి. ఒక చిన్న సంచి తీసుకుని, తాను మోయగలిగినన్ని బంగారు ఆభరణాలు, కాసులు నింపుకున్నాడు. వీపు మీద సంచి వేసుకుని, మేకపిల్లల్ని తోలుకొని వచ్చాడు. ఒరే గూనోడా! నీ మేకపిల్లలతో పాటు మా బంగారం ఎందుకు ఎత్తుకుపోతున్నావురా? అని అడిగారు దొంగలు.
నన్ను బాధ పెట్టినందుకు. అని సమాధానమిచ్చాడు గూనోడు.
మేక పిల్లల్ని తోలుకొని ఇంటికి చక్కా పోయాడు. దొంగలకి భలే కోపం వచ్చింది. రేపు మళ్ళీ మేకపిల్లల్ని మేతకు తీసుకు వచ్చినప్పుడు గూనోడిని కట్టేసి కొట్టేయాలనుకున్నారు.
*********
గూనోడు రాత్రైనా ఇంటికి రాలేదని రామమ్మ బాగా ఏడ్చింది. గూనోడు పోతే పోయాడు కానీ మేకపిల్లలు పోయాయే అని ఏడ్చాడు భీముడు.
మర్నాడు పొద్దున్నే మేకపిల్లలు మే మే అనుకుంటూ ఇంటికి పరుగెత్తి వచ్చేసాయి. గూనోడేడి? అంది అమ్మ. గూనోడు మొయ్యలేక మొయ్యలేక సంచి మోసుకువచ్చాడు. బంగారమంతా గుమ్మంలో పోసి, అలుపు తీర్చుకున్నాడు.
రాత్రంతా ఏమై పోయావురా? ఈ బంగారమంతా ఎక్కడిదిరా? అని అడిగింది అమ్మ.
నిన్న సాయంకాలం మేకపిల్లల్ని దొంగలు తోలుకుపోయారు, ఆళ్ళని ఎతుక్కుంటెళ్లి, ఓడించి, మేకపిల్లలతో పాటు ఆళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా తెచ్చేను అని చెప్పాడు గూనోడు.
ఆళ్ల దగ్గర ఇంకా బంగారం ఉందా? అడిగాడు భీముడు.
సానా ఉంది చెప్పాడు గూనోడు. నేను ఎక్కువ మొయ్యలేకపోయాను. అందుకే కుసింత తెచ్చినాను” అన్నాడు.
అమ్మా! గూనోడికి వేడి గంజి అన్నం పెట్టి, కొత్త బట్టలేసి, బడికి అంపించు. మేకపిల్లల్ని నాను తోలుకెళ్తాను. చెప్పాడు భీముడు.
పొద్దు పొద్దున్నే చల్దన్నం, పిండొడం డబ్బాలో పెట్టుకొని, మేకపిల్లల్ని తోలుకొని కొండవారకు పోయాడు భీముడు. వాడికి మాచెడ్డ తొందరగా ఉంది. ఎప్పుడు దొంగలొస్తారు? ఎప్పుడు మేకపిల్లల్ని తోలుకెళ్తారు? అని ఎదురుసూస్తూ కూర్చున్నాడు. ఎండ వేళయ్యింది. చల్దన్నం తినేసరికి హాయిగా నిద్దరొచ్చేసింది. నిద్దర లేచేసరికి మేకపిల్లలు కనిపించలేదు. అద్దిగదీ నా మేకపిల్లల్ని దొంగలు తోలుకుపోయారు. ఆళ్ళని పట్టేస్తాను. బంగారం తెచ్చేస్తాను. అనుకుంటూ ముందుకు వెళ్ళాడు భీముడు.
కొంత దూరం పోయేసరికి తాటిపండు కనిపించింది. తినేసి టెంకలు పారేశాడు. తాడు కర్ర కనిపించాయి. కర్రని చేతిలోకి తీసుకొని తాడును వదిలేసాడు.
మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద నలుగురు మనుషులు కూర్చుని కనిపించారు. హమ్మయ్య! ఇప్పటి వరకు మనుషుల జాడే లేదు. వీళ్ళని అడిగితే దొంగల గురించి చెప్తారేమో” అనుకున్నాడు భీముడు.
చేతిలో కర్రతో నిజం భీముడిలా వస్తున్న భీముణ్ణి చూసి కాస్త భయపడ్డారు దొంగలు. ఒరే గూనోడు ఒస్తాడనుకుంటే ఈడెవడురా? అన్నాడు ఒకడు.
నువ్వు పల్లకుండెహే… ఆడు రానీ సూద్దాం అన్నాడు మరొకడు.
భీముడు వచ్చి మీకు దొంగలెవరైనా కనిపించారా? నా మేకపిల్లల్ని తోలుకుపోయారు అని అడిగాడు.
దొంగలు ముఖాలు చూసుకున్నారు. అదిగో ఆ గదిలో ఉన్నాయి నీ మేకపిల్లలు. వెళ్ళు అని పాక ఇంటివైపు చూపించారు. భీముడు హుషారుగా ఆ ఇంటి వైపు వెళ్ళాడు. దొంగలు వాడిని పట్టి గదిలోకి తోసేసారు. ఇప్పుడు వీడి కోసమైనా గూనోడు వస్తాడు అన్నారు.
రాత్రయ్యింది. తెల్లరిపోయింది. భీముడు రాలేదు, మేకపిల్లలు రాలేదు. రామమ్మకి కాలు, చెయ్యి ఆడటం లేదు. నాయనా కృష్ణుడు, మీ అన్న భీముడు మేకపిల్లల్ని తోలుకెళ్లాడు. ఇంకా రాలేదు. అంది.
గూనోడిని విషయమంతా అడిగి తెలుసుకున్నాడు కృష్ణుడు. బంగారం అనేసరికి కృష్ణుడికి కూడా ఆశ పుట్టింది. సరే నేను వెళ్లి దొంగల్ని కొట్టి భీముణ్ణి, మేకపిల్లల్ని విడిపించుకొని వస్తాను అన్నాడు కృష్ణుడు.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.