అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
వేంకటేశ్వరుఁడు సీ. నీ నామజపముచే నిఖిలంబు సాధ్యంబు జగదేకకల్యాణచక్రవర్తి! నీ దర్శనంబుచే మా దైన్యము నశించు మాధరాధరదివ్యమహితమూర్తి! నీ పాదసేవయే సోపాన మగు పరం ధామంబునకుఁ, గూర్చి దగిన స్ఫూర్తి నీ దాససాంగత్యమే దీపమై యస(1) దంధకారముఁ బాపి యణచు నార్తి తే.గీ. లేదు రాదన్నదే లేదు నీదుకరుణ సుంత గలిగిన, జగ మంత శుభమయంబు స్థిరచరంబుల నినుఁ గాంచఁ, దిరుమలేశ! ధరణి వెలసిన వైకుంఠధామ!(2) శరణు! (1) అసత్= ఉనికి లేనిది (2) భూమి మీద వెలసిన శ్రీహరి/ ఇలవైకుంఠ మైన వేంకటాచలములో నివసించువాడు 261 ఆంజనేయుఁడు ఉ. కార్యధురీణుఁడౌ హనుమ కాంచిన నుగ్గగు నంతరాయముల్ సూర్యుని శిష్యుఁడౌ హనుమ చూచినఁ బర్విడు రోగపీడలే యర్యమతేజుఁడౌ హనుమ యాన(1) నశించును బాపవృత్రమే యీర్య(2)యు ధైర్య మా హనుమ యించుక కన్గొన నబ్బు నిత్యమున్ (1) గోచరము కాగా (2) శాస్త్రసమ్మతమైన నడవడి 262 శ్రీవేంకటేశ్వరశోభ సీ. ఘనసారకస్తూరికానామశరదభ్ర దర(1)చక్రకాంతులు పరిఢవిల్లఁ, గుండలద్వయ మర్కకోటిచ్ఛటలు చింద, మకుటహారావళిమంజునాగ భూషణాదిద్యుతుల్ భూరిశోభాకీర్ణ మగుచుఁ బంతములాడ(2), హస్తయుగళి మణిరత్నధగధగ లనితరంబుగఁ బర్వఁ, బాదాంబుజారుణప్రభలు ప్రబల, తే.గీ. జన్మజన్మాంతరాఘసంచయమహాంధ తమస మంతంబు సేయు నీ దర్శనంబు దాససమ్మోహనం బయి తనరు నట్టి నిత్యకల్యాణమూర్తివి నీవ స్వామి! (1) శరత్కాల మేఘము వంటి తెల్లని శంఖము (2) పోటీపడగా 263 శ్రీరాముఁడు కవికులతిలకము (స్వీయవృత్తము) [చతుర్వింశతిచ్ఛందమగు సంకృతి యందు ప్రతిపాదమునకు 24 అక్షరములు, న-న-స-స-స-స-స-స గణములు మఱియు 9, 15, 21వ యక్షరములు యతి] రవికులతిలకుఁడు రాఘవరాముని రాజలలాముని రాజధర స్తవసముచితగుణశాలిని దానవసంహృతిశీలిని సత్యవచో ధ్రువనియమితు ద్విజతోషణుఁ(1) గిల్బిషదుఃఖవిదూరుని దోర్బలునిన్ పవనతనుజవిభు వాసురజాప్రియుఁ(2) బ్రార్థన సేసెద భక్తిమెయిన్ (1) బ్రాహ్మణులను / పక్షియైన జటాయువును సంతోషపఱచినవాని (2) భూమిజయైన సీతకు ప్రియుడైనవాని 264 శ్రీరామనవమి సీ. శ్రీరామనామంబు శ్రితపారిజాతంబు సర్వార్తిహర మదే శాశ్వతంబు శ్రీరామకరములు శ్రీకరమ్ములు భూమి జాకరగ్రహణశుభాకరములు శ్రీరామపదములు ఘోరశాపాపహ పద్మాదిచిహ్నసంభావితములు శ్రీరామవదనంబు సీతాసతీప్రేమ(1) సదనంబు వికచాబ్జసన్నిభంబు తే.గీ. రాముఁ గన్నదె కానుపు, రాముఁ గన్నఁ దన్మయత్వముఁ జెందని తల్లి గలదె? రామజన్మముకథ విన్న రాదు జన్మ మఱల నా రాము నా రాము మదిఁ దలంతు (1) సీతాదేవి యొక్క/యెడల ప్రేమ 265 ధనార్జన కం. మన సాధన(1) మగు ధనమే, మనసా! ధనమునకు నంత మాత్రమె విలువౌ, మన సాధన(2) మయి చెల్లన్ మన సాధనమే(3) హసించు మనకడఁ(4) గడకున్ (5) (1) బ్రతుకుటకు ఉపకరణము (2) బ్రతుకుటకు కారణము (2) మనము సంపాదించిన డబ్బే (4) మనదగ్గఱ (5) చివరకు 266