నీరులా ………

ఒక్కోసారి అనుకుంటాను
ఒక్కోరోజు అనుకుంటాను
నేను నీరులా ఉంటే బావుంటుందని
సమస్యల్లో ఇరుక్కుని
సందిగ్ధంలో పడినప్పుడు
ఆ సరస్సులా నిశ్చలంగా ఉండాలని
క్రోధంలో కోడెనాగులా పడగెత్తి కాటేయక
ఆ కాలువలా మౌనంగా సాగాలని,
పట్టరాని ఆనందం పొంగి పొర్లుతున్నప్పుడు
ఆ నదిలా ఉప్పొంగి ఉరకాలని,
చిన్నప్పటి చిలిపిచేష్టలు గురుతొచ్చినప్పుడు
జలపాతంలా పైనుంచీ దూకాలని
వృధ్యాపంలో కూడా భావలహరి ఘనీభవించక
ఆ ఏరులా నిరంతరం ప్రవహించాలని
ఒక్కోసారి అనుకుంటాను
ఒక్కోరోజు అనుకుంటాను
అంతా నీరే! కాని రూపాలేన్నో!
అంతా నీరే ! కాని ఆకృతులెన్నో!
నేనుకూడా నీటిలా అదరక చెదరక
ఆయా సమయాలకి అనుకూలంగా
వేసము మారుస్తూ మనువు సాగించాలని!
ప్రేమకోసం…..

ప్రేమ కోసం వెదుకుతూ
ఊరంతా తిరిగాను
అంగట్లో అమ్ముతారా
అరిచి బయట అమ్ముతారా
పంట బాగా రాలేదని
ధరని హెచ్చుగ పెంచుతారా!
ప్రేమ ఎలా ఉంటుందని
మా ఊరి నది నడిగితే
ఇదో! ఇలా ఉంటుందని
నా పాదాలని తాకింది
ప్రేమ అలాగే ఉంటుందా అని
మా తోట పిల్లగాలి నడిగితే
ఊహు! ఇలాగని
నా ముంగురులు రేపింది
ఇది నిజమేనా అని
మా ఇంటి చెట్టునడిగితే తన
కొమ్మల కింద నీడ నిచ్చింది
అబ్బా! ఇలా ఉంటుందా అని
మా తాత పైరు నడిగితే
పచ్చటి తన పైట పరచి
మెత్తటి పానుపు! రా! రమ్మంది
ప్రేమ కాస్త ఇస్తావా అని
తోటి మనిషి నడిగితే
తలగోక్కుని తంటాలు పడి
తడబడుతూ పార్డన్ మీ! అన్నాడు.