Menu Close
SirikonaKavithalu_pagetitle

హరితవనాల అడవి మొగ్గ
పురపుష్పమవడానికి
నాలుగు యుగాలు

పూలతోటల పరిమళాలు
మేఘాలుగా పరివర్తన
ఆశలఆశయాలు
మలయానిలాలుగా ప్రవర్తన

కాలం
కనిపించని చక్రం
ఎప్పుడో బయలు దేరిన చోటికి
చేరక తప్పదు

ఇప్పుడు నగరాలన్నీ
వాడిపోయిన పూలకుప్పలు
వడలిపోయిన ఆకుదిబ్బలు

సంకర కంకర వనాల్లో
మురిగిన కుప్పలనుండి
రెప్పలు విప్పుతున్న పుట్టగొడుగులు

నాటి నాచు
నేటి నాటు
అది పూల దిశగా
ఇది శిలీంధ్ర దిశగా

ప్రళయం ఎప్పుడో
మళ్లీ అడవి మొగ్గల
పునరుత్థానం ఎప్పుడో

నీటి చుక్కకై మట్టి ఎదురుచూపులు
ఆకలి కొన్న నేలకు అన్నము లా
నేలన పడ్డ ఇత్తుకు సత్తువ కోసం
నింగిపై చూపులు చూస్తూనే ఉంది...

ఆకాశములో కమ్మిన మేఘుడు
ఆశల జల్లులు కురిపించడం లేదు
తడి లేని గొంతుల్లో దాహం తీరదు
అలికిన నేలకు ఆహారం దొరకదు....

ఋతు పవనపు రుచులు ఎక్కడా
గతి తప్పిన దారుల్లో దొరకక
ఎండిన మట్టి వెన్నగా మారడం లేదు
పొంగిన సువాసనలు అందడం లేదు..

వర్షపు జాడలు నింగి వీధుల్లో ఊరేగుతూ
నేలను తడిపేందుకు మొహం చాటేసే
రైతు భుజాన నాగలి నేలకు దిగుటకు
నాలుక ఆకాశము వైపే చూస్తుండిపోయే...

గుక్క పట్టి ఏడుస్తుంది పాలందక పసినేల
స్తన్యం ఇచ్చే ఆకాశం పలకరించడం మరిచిపోయే
గలగల ప్రవహించే నదులు ఎండిపోయే
నీటి ధార కోసం నిత్యం తపస్సులు చేస్తున్నాయి...

అదును తప్పుతున్న వ్యవసాయపు క్షేత్రాలు
రైతు నెత్తి కండువా కళ తప్పి చూస్తుంది
నాగలి రాత  నిరక్షరాస్యుడి గీతలా తయారయింది
పచ్చని నారుమళ్ళకు ప్రాణవాయువు అందడం లేదు...

మట్టి మనసుకు చిరుజల్లుల పలకరింపు కావాలి
ఎడారి హృదయానికి ఒయాసిస్ ప్రేమ అందాలి
బీడు భూములకు పసిడి తొడుగు అందించాలి
కడుపునిండా వర్షపు చుక్కలు ఆరగించి ఆనందించాలి..

స్వగతాలిప్పుడు గతం
వ్యక్తిగతాలిప్పుడు గతం
అంతా జనాంతికం!

ఆహ్వానాలు సామూహికం
అభిశంసనలు సామూహికం
అభినందనలు సామూహికం

ఒంటరుల సామూహికం!
సామూహిక ఒంటరితనం!

ఆతూరుపు ఈపశ్చిమం ఒక్కటేైనట్లు
పడమటికి చేరే పొద్దులు అన్నీ
మరో చోటు తూరుపున వెలుగు పొద్దులవుతుంటే,
అరచేతి గుప్పెట్లోనే అంతర్జాలంలో ప్రపంచం జేరి పలకరిస్తుంటే
చెప్పొద్దూ...
మెరుపులు మత్తులో యువత ఎదురు చూపు ఆశలెన్నో
ఊపిరి కోసం ఉనికోసం
హర్మ్యాల కోసం
ఆశయంకోసం
వయసు పొద్దుకు చేరిన
విశ్రాంతి జీవులంతా విశ్రాంతేలేక
అర్థరాత్రి అయినా మాయాజలంలో చేరి
అభిరుచుల పంపకాలలో పడి తీరిక లేకుండా...
పాపం చదువుకొన్న,
చదువుకున్న కొందరు
పడమటి వేళలో లేస్తూ
పొద్దు పొడుపుకు జోగాడుతూ
శీతల గదులలో చేరి
సూర్యోదయాలు ఎరుగక కునికిపాట్లుపడుతూ...
పనికి పొద్దులేదు
పగటి వెలుగుల్లో వెలతెల పోయినవెన్నో
పడమటిపొద్దుకు రంగలు పులుముకుని
మిసమిసలతో మిలమిల లాడుతున్నాయి.

వీధి దీపాల కునికిపాట్లలో
సగం చీకట్లు తాగిన మసక వెలుగు మత్తులో
నగరం రహస్యాల గుసగుసలు
నిశ్శబ్దం చెక్కిన నిలువెత్తు భవనాలకే తెలుసు
కాలానికి కరిగి వెలసిపోయి రాలిన ప్లాస్టిక్ పూరెక్కలకే తెలుసు.
ఓదార్పు నాటిన పాపపు చెరువుల్లో
గుర్రపుడెక్కల గుసగుసలకే తెలుసు.
గాలీ నీరూ అందక సోలిపోయిన
సౌకుమార్యపు పూపొదరిళ్ళకు అదంతా అయోమయమే.

కీచురాళ్ళ వాయులీనాల సంగీత విభావరులు
నీలాకాశం కప్పుకున్న పచ్చిక కూనిరాగాల
సరిమలు అల్లుతున్న ప్రేమ కథనాలూ
పలాయనాల వైనం
సమయం మగ్గపు నేతలో తప్పిపోయి
సంచరిస్తున్న వాస్తవం నెమరువేతలో
అలుపెరుగని గతానికీ
నిన్నటి అగాథానికీ రాబోయే రేపటి క్షీర సముద్రానికీ
మధ్య గాలివంతెనలా ఊగిసలాడే మునిమాపువేళ

కరిగి గడ్డకట్టిన పచ్చిక స్వాధీనం తప్పిన వేళ్ళతో
వెన్నెల దారాలను పోగులు పోగులుగా వడుకుతూ
విపత్తులు అశాశ్వతమనీ ఇదీ గడిచి గట్టెక్కుతాననీ
మినుకు మినుకుమనే ఖగోళం నీడన
శాశ్వత నివాసిగా వీక్షిస్తున్న అశరీరపు ఉనికి.

సుమధుర గానంలా, మనోహర నృత్య నాటికలా
భ్రమలూ విభ్రమలూ స్వర్ణ పుష్పాలై పరచుకున్న ఇక్కడ
ఆత్మలూ, శరీరాలూ నిర్వహించే సదస్సు ఇది
నీడలు కూడా సోకని నిర్జన సమాధిలో
ఈ క్షణం ఒక్కటే సజీవం, సానుకూలం

Posted in February 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *