Menu Close
Lingamneni Sujatha
దైవ నిర్ణయం (కథ)
లింగంనేని సుజాత

పల్లెటూరిలో పెద్ద మండువా ఇంటి ముందు, తాటాకు పందిరి క్రింద పెళ్ళి జరుగుతోంది.

వధువు పేరు సుమతి. పదహారేళ్ళ వయసు. బంగారు రంగులో మెరిసిపోతోంది. సుమతి ఎస్.ఎస్.ఎల్.సి. పాసయింది.

వరుడు శివ రైతు కుటుంబంలో పుట్టాడు. 20 సంవత్సరాల వయసున్న శివ ఆడుతూ, పాడుతూ బి.ఏ. చదివి ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాశాడు.

సుమతి మెడలో శివ తాళి కట్టాడు. పెళ్ళికి వచ్చిన పెద్దలు, పురోహితులు, పైనుండి దేవతలు శతమానం భవతి అని ఆ జంటను దీవించారు.

శివ తండ్రి స్వామి గారికి ఆ ఊరిలో బంగారం లాంటి పది ఎకరాల పొలం ఉంది. ఆయనకు ఎనిమిది మంది సంతానం. నలుగురు ఆడపిల్లలు. నలుగురు మగపిల్లలు. ఆడపిల్లలకు తన దగ్గర ఉన్న డబ్బు కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు. శివ రెండవ కొడుకు. మిగతా ముగ్గురు కొడుకులు చదువుకోలేదు. పెద్ద కొడుకు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. చిన్న కొడుకులు ఇద్దరూ వ్యవసాయం చేస్తున్నారు.

బి.ఏ. రిజల్ట్స్ వచ్చిన తరువాత శివ ఎం.ఏ.లో చేరాడు. శ్రద్ధగా చదివి మంచి ర్యాంకులో పాసయ్యాడు. అంతటితో చదువు ఆపకుండా పిహెచ్.డి, చేయాలనుకున్నాడు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత అతనికి యు.జి.సి. ఫెలోషిప్ వచ్చింది.

సుమతి తండ్రి పిడబ్యుడి లో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం. ట్రాన్స్ఫర్లు ఉంటాయి. శివ ఎం.ఏ. చదివేటప్పుడు సుమతి తన తండ్రి ఇంటిలోనే ఉంది. సుమతి తండ్రి కడపలో ఉద్యోగం చేసేవారు.

సుమతి పక్క వీధిలో ఉన్న వొకేషనల్ ట్రైనింగ్ కాలేజి లో డి.కాం కోర్స్ లో చేరింది. ఎస్.ఎస్.ఎల్.సి. పాసయినవారు మూడు సంవత్సరాలు చదివితే డి.కాం. సర్టిఫికెట్ ఇస్తారు.

సుమతి టైపు, షార్ట్ హ్యాండ్ కామర్సు బ్యాంకింగ్ అకౌంటెన్సీ ఇంకా కొన్ని సబ్జెక్టులు ఒకటిన్నర సంవత్సరం చదవగానే, సుమతి తండ్రికి ట్రాన్స్ఫర్ అయింది. సుమతి చదువు ఆగిపోయింది. సుమతి ప్రైవేట్ గా చదివి, హిందీ విశారద పాసయింది. కుట్లు, అల్లికలు ఎంబ్రాయిడరీ నేర్చుకుంది.

యు.జీ.సి. ఫెలోషిప్ వచ్చిన తర్వాత శివ, సుమతిని తీసుకు వెళ్ళి కాపురం పెట్టాడు. శివ పిహెచ్.డి, ముగించే లోపల ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు.

వారికి కృష్ణ ,సాయి అని పేర్లు పెట్టారు. వారిద్దరికీ వయసు వ్యత్యాసం 14నెలలు మాత్రమే. అందువలన వారిద్దరూ చూడడానికి కవలపిల్లల లాగా ఉండేవారు.

శివ పిహెచ్.డి. ముగించి, గవర్నమెంట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరాడు. తన ఉద్యోగ నిర్వహణ అతి శ్రద్ధగా చేసేవాడు. మధ్య తరగతిలో పుట్టిన శివకు డబ్బు విలువ బాగా తెలుసు. తన జీతాన్ని పొదుపుగా వాడుకుంటూ, మిగిలిన ధనాన్ని భవిష్యత్తుకు రక రకాల పొదుపు పధకాలలో భద్ర పరిచేవాడు.

*******

సుమతి తన జాకెట్లు, పిల్లల డ్రెస్సులు చక్కగా కుడుతుంది. ఇంటిని కళాత్మకంగా తీర్చి దిద్దుతుంది. పిల్లలకు రకరకాల వంటలు, పిండి వంటలు చేసి పెడుతుంది. సాయంత్రం పిల్లలకు హిందీ,ఇంగ్లీష్ లెక్కలు చెబుతుంది.

శివ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో భార్యాపిల్లలతో, స్వగ్రామం వెళ్లేవాడు. ఆ ఊరిలో ఉన్న తన తల్లి దండ్రులతో, తమ్ముళ్ళతో ఒక నెల గడిపే వాడు. శివ అక్కడ ఉన్నంతకాలం, తాను సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకు, తన తోబుట్టువులకు కావలసినవి కొని ఇచ్చేవాడు. వాళ్ళకు ఆర్థిక సాయం చేసేవాడు.

శివ కొడుకులు కృష్ణ , సాయి, ఆ ఊరి చెరువుగట్టున తమ పెదనాన్న, చిన్నాన్న, బంధువుల పిల్లలతో కలిసి ఆడుకునేవారు. ఆ చెరువులోనే స్నానం చేసేవారు. చెరువులో ఉన్న తామర ఆకులను, పూలను, తామర కాయలను, తమ పాలేరు కోసుకుని వస్తే... కృష్ణ , సాయి తామరాకులలోనే అన్నం తినేవారు.

తామరపూలతో ఆడుకుని వాటి మధ్యన ఉన్న పూవు తినేవారు. ఇక తామర కాయలు వలుచుకుని, తామర గింజల పైపొట్టుని తీసి గింజలను తినేవారు.

ఆ ఊరిలోని బంధువులు సీమచింతకాయలు తెచ్చి ఇస్తే, పప్పులు వలిచి తాము తింటూ, ఇంటిలో అందరికీ పెట్టేవారు. తాత గారి పొలం నుండి పాలేరు తాటి గెలలు కోసి తెచ్చేవాడు. పాలేరు తాటి కాయలు కోసి ముంజెలు తీసి ఇస్తే, పిల్లలందరూ తినేవారు.

ఆ ఊరి పిల్లలతో పాటు కృష్ణ, సాయి సాయంత్రం కాలువ గట్టుకు వెళ్లేవారు. కాలువలో ఈత కొట్టడం నేర్చుకున్నారు. అంతే కాదు కొబ్బరి చెట్లు ఎక్కడం కూడా నేర్చుకున్నారు.

ఆ పల్లెటూరిలో తమ వయసు పిల్లలలతో గడిపిన కృష్ణ, సాయిలకు ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు, వాటి విలువ తెలిసి వచ్చింది.

ఆ తర్వాత  సుమతి నాన్న గారి ఇంటికి వెళ్ళి, ఒక నెల రోజులు ఉండేవారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత తమ ఊరికి తిరిగి వచ్చేవారు. శివ కాలేజీకి వెళ్లేవాడు. పిల్లలు స్కూలుకి వెళ్లేవారు.

****

శివ తల్లిదండ్రులకు అవసరమైనంత ఆర్థిక సహాయం చేసేవాడు. ఒక రోజు శివతో, ఆయన తండ్రి ...

“శివా! నీ అన్నదమ్ములు నీ లాగా చదువుకోలేదు. వారికి అవసరమైనప్పుడు నీకు వీలయినంత ఆర్థిక సహాయం చేయి” అన్నారు.

అలాగే నాన్నా అన్నాడు శివ.

తండ్రి కోరిక ప్రకారం శివ తన తోబుట్టువుల పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు.

సుమతి తన 35వ సంవత్సరంలో, వివేకానంద కేంద్రానికి వెళ్ళి యోగాసనాలు నేర్చుకుంది. పిల్లలకు కూడా యోగాసనాలు నేర్పించింది.

పిల్లల చదువు గురించి శివ ఏ నాడు శ్రద్ధ తీసుకునేవాడు కాదు. సుమతి పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించి, పిల్లలు 8వ తరగతి వచ్చే వరకు ఇంగ్లీష్, హిందీ, లెక్కలు తానే చెప్పేది.

ఒక నాడు సుమతి భర్త తో..."ఏమండీ! కృష్ణ 9వ తరగతి చదువుతున్నాడు. నేను 9వ తరగతి లెక్కలు చెప్పలేను. కృష్ణకు లెక్కలకు ట్యూషన్ చెప్పించండి" అంది.

అలాగే! అంటూ పిల్లలిద్దరికీ లెక్కలకు మాత్రం ట్యూషన్ పెట్టించాడు శివ.

శివకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పిల్లలను తన పక్కన కూర్చోపెట్టుకొని శివ టి.వి.లో క్రికెట్ చూసేవారు. పిల్లలకు కూడా క్రికెట్ ఆట అంటే పిచ్చి ఏర్పడింది.

తండ్రీ కొడుకులు క్రికెట్ కబుర్లు చెప్పుకుంటుంటే సుమతికి బాధగా ఉండేది. అయ్యో! పిల్లలు చదువుకోకుండా క్రికెట్ కబుర్లు ఏమిటి? అని ఆమె బాధ పడేది. పిల్లలు కూడా స్కూల్లో, సెలవు రోజుల్లో ఇంటిదగ్గర క్రికెట్ ఆడుకునేవాళ్ళు.

పిల్లలు హైస్కూల్ చదువు ముగించి కాలేజీలో చేరారు. శివ పిల్లలిద్దరినీ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు. పిల్లలిద్దరూ చదువుకోసం పొరుగు రాష్ట్రానికి వెడితే...ఇంటిలో శివ, సుమతి మాత్రమే మిగిలారు.

పెళ్లయిన కొత్తలో కూడా వారిద్దరే ఉండేవారు. పిల్లలు పుట్టారు. తల్లిదండ్రులను మురిపించారు. చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లారు.

శివ కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తూ, ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. శివ గంట ముందే కాలేజీకి వెళ్లి ఆ రోజు తాను ఎం.ఏ వాళ్ళకు చెప్పవలసిన పాఠం ఒకసారి చూసుకునేవాడు. ఈ లోపు ఎవరైనా విద్యార్థి వచ్చి, నిన్న మీరు చెప్పిన పాఠంలో నాకు సందేహాలున్నాయి అంటే ... శివ ఓపికగా చెప్పేవాడు. తన గైడెన్స్ లో పిహెచ్.డి., చేసే విద్యార్థులకు సలహాలు చెప్పేవాడు.

ఒక రోజున ఒక పేద విద్యార్థి వచ్చి, “నా వద్ద ఫీజు కట్టడానికి డబ్బు లేదు మాస్టారూ! మీరు డబ్బు ఇస్తే, ఫీజు కడతాను. మా నాన్న నాకు డబ్బు ఇచ్చినప్పుడు, మీకు డబ్బు తిరిగి ఇస్తాను” అన్నాడు.

“ఈ డబ్బు తీసుకుని వెళ్ళి ఫీజు కట్టు. నీకు వీలైతే డబ్బు తిరిగి ఇవ్వు. మీ ఇంటిలో డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంటే నాకు డబ్బు తిరిగి ఇవ్వకపోయినా ఫర్వాలేదు” అన్నాడు శివ.

తాను మధ్య తరగతి కుటుంబంలో పుట్టినందున, పేద విద్యార్థుల కష్టం శివకు తెలుసు. అందువల్ల, పేద విద్యార్థులకు, అవసరమైతే శివనే ఫీజులు కట్టేవాడు.

సుమతి భర్త కాలేజీకి వెళ్లిన తర్వాత ఇంటి పనులు ముగించుకుని,  పిల్లలను తలచుకుని వారు ఎలా ఉన్నారోనని దిగులుపడేది.

పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కదా! శివ తాను కష్టపడి సంపాదించిన ధనం ఖర్చుపెట్టి, పిల్లలను చదివిస్తుంది అని ఆలోచించి, ధైర్యం తెచ్చుకొనేది. ఆధ్యాత్మికపరమైన ఆలోచనలతో దైవ ధ్యానంలో మునిగిపోయేది.

****

సుమతి, శివల కుమారులిద్దరూ ఎం.టెక్. చదువు పూర్తి చేసుకుని, తమకు నచ్చిన, వచ్చిన ఉద్యోగాలలో చేరారు. సుమతి, శివలు, పిల్లలకు తగిన పెళ్ళి సంబంధాలు వెతికి, పెళ్లి చేశారు.

సుమతి, శివల కుమారులిద్దరూ ఆ తరువాత పిహెచ్.డి.లు కూడా చేసి ఒకరు చెన్నైలో, మరొకరు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ, పిల్లా పాపలతో ఆనందంగా ఉన్నారు.

శివ పదవి విరమణ చేశాడు. శివ ఇంటిలోనే ఉంటూ రామాయణ, భారత, భాగవత, హరివంశం, చదువుకుంటూ, రాత్రింబవళ్ళు దైవ ధ్యానంలో గడిపేవాడు.

“ఏమండీ! మన పిల్లలు ఇద్దరూ మనలను వచ్చి వాళ్ళతో ఉండమంటున్నారు కదా! మనం వెళ్ళి కొంతకాలం వాళ్ళతో పాటు ఉందాం" అంది సుమ, శివతో.

దానికి సమాధానంగా శివ...

“ఉద్యోగస్తులైన భార్యా భర్తలిద్దరూ, ఉదయమే పిల్లలను నిద్ర లేపి, వాళ్లకు స్నానాలు చేయించి, టిఫిను చేసి పెట్టి వాళ్ళను స్కూళ్లకు పంపించాలి. భార్యా భర్తలు ఇద్దరూ తాము ఉరుకుల పరుగులమీద ఆఫీసుకు వెళ్ళి ఉద్యోగాలు చేసి, సాయంత్రం అలిసిపోయి ఇంటికి వస్తారు. తిరిగి వంట చేసి, పిల్లలకు పెట్టి, తాము తింటూ, పిల్లలను చదివించుకుంటూ కాలం గడుపుతారు. అంత కష్టపడుతూ బ్రతికే వాళ్లకి, తల్లిదండ్రులను చూసుకోవాలంటే కష్టమే. మనం ఎవరి దగ్గరకు వెళ్లవద్దు. సెలవు రోజుల్లో వీలు చూసుకుని, వాళ్ళే వచ్చి  మనల్ని చూసి వెళుతుంటారు” అన్నాడు శివ.

అలాగే! అంది సుమతి.

సుమతికి పతియే సర్వస్వం. అనుక్షణం ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ...ఆయనకు నచ్చిన వంటలు చేసిపెడుతుంది. శివ అవి తిని బాగున్నాయి అంటే సంతోష పడుతుంది.

శివ కూడా సుమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, అనుక్షణం ఆమెకు కావలసిన మందులు తెచ్చి పెడుతూ, వేళకు మందులు వేసుకోమని సుమతికి ఇస్తాడు.

సుమతి,శివల మనుమల, మనుమరాళ్ల  పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. సుమతి శివల ఆనందానికి అవధులే లేవు. శివకు ఇప్పుడు 85 సంవత్సరాలు నిండాయి. సుమతికి 81 సంవత్సరాలు.

సుమతి శివలకు ఒకటే ఆలోచన. తమ బిడ్డలు కూడా పదవి విరమణ చేశారు. వాళ్లకి అరవై సంవత్సరాల వయసు వచ్చింది. వాళ్లకు కూడా చిన్న చిన్న అనారోగ్యాలు. ఈ రోజుల్లో అందరికి షుగర్ వ్యాధి. ఆ వ్యాధి వస్తే ఎప్పుడూ నీరసంగా ఉంటారు మనుష్యులు.

షుగర్ వ్యాధితో బాధపడుతున్న కొడుకులను చూస్తూ...భగవంతుడా మాకు ఎందుకు ఇంత ఆయుర్దాయం ఇచ్చావు? మా కళ్ళ ముందు మా బిడ్డలకు ఏమైనా జరిగితే మేము భరించలేము. మమ్మల్ని దయతో త్వరగా నీ దగ్గరకు తీసుకు వెళ్ళు తండ్రీ అంటూ రాత్రింబవళ్ళు సుమతి, శివలు దైవాన్ని ప్రార్థిస్తుంటారు.

ఒక రోజున శివ..."సుమతీ! మనం దాదాపు 65 సంవత్సరాలుగా కలిసి బ్రతుకుతున్నాము. నాకన్నా ముందు నీవు ఈ లోకం వదిలి వెళ్ళిపోతే, నేను తట్టుకోలేను. దేవుడు నా నుదుట ఏమి వ్రాశాడో?" అన్నాడు.

"మీరు లేని జీవితం నేనూ ఊహించుకోలేను. మా అమ్మ లాగా సుమంగళిగా వెళ్లిపోవాలనుకుంటాను. కాని దైవ నిర్ణయం ఎలా ఉందో? కాలమే చెప్పాలి అంది సుమతి.

***

“సుమతీ! మా ఊరిలో రామాలయం బాగా పాతబడి పోయింది. అది పడగొట్టి కొత్తది కడతారంట. విరాళాలు పంపించమని మా ఊరివాళ్ళు అడుగుతున్నారు. మన కుటుంబం తరపున రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇద్దామనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెప్పు” అన్నాడు శివ.

“దేవుడి గుడికట్టడానికి విరాళం ఇస్తే మనకు పుణ్యం వస్తుంది. వెంటనే డబ్బు పంపించండి" అంది సుమతి శివతో. శివ రామాలయం కట్టించడానికి డబ్బు పంపించాడు.

“రామాలయం కట్టడం పూర్తి అయ్యింది. శ్రీ రామ నవమి నాడు విగ్రహ ప్రతిష్ఠకు మీరు తప్పకుండా రండి" అంటూ దొండపాడు గ్రామస్తులు శివకు ఫోను చేశారు. శివ, సుమతి తో...

"మా ఊరి గుడిలో విగ్రహ ప్రతిష్ఠకు రమ్మని ఫోను చేశారు. మనం వెళదాం” అన్నాడు.

బదులుగా సుమతి, శివతో ...

"విగ్రహ ప్రతిష్ఠకు వచ్చిన మన ఊరి ఆడపడుచులకు, చీర సారెలిచ్చి పంపాలన్న సంప్రదాయం ఉంది. మన బంధువులందరూ వస్తారు. వచ్చిన మీ తోబుట్టువులకు వారి పిల్లలందరికీ మనం చీరలు పెట్టాలి. నాకు డబ్బు ఇవ్వండి" అంది సుమతి. అలాగే! అంటూ శివ డబ్బు ఇచ్చాడు.

సుమతి, శివలు పల్లెటూరికి వెళ్లారు. బంధువులందరూ వచ్చారు. సుమతి వచ్చిన ఇరవై మంది ఆడపిల్లలందరికీ చీరలు కొనుక్కోమని తలా రెండు వేల రూపాయలు ఇచ్చింది. అందరూ సంతోషించారు.

విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత, సీతారాములను దర్శించుకుని, బంధువులందరికీ వీడ్కోలు పలికి సుమతి శివలు తాము ఉంటున్న ఊరికి తిరిగి వచ్చారు.

వారం రోజులు గడిచాయి. ఒక రోజు ఉదయం స్నానం, పూజ ముగించుకుని సుమతి శివలు టిఫిన్ చేశారు. ఆ తర్వాత భర్తతో ఆనందంగా కబుర్లు చెపుతూ, సుమతి ఒక పక్కకు తల వాల్చింది.

"సుమతి ఏమైంది నీకు అంటే, సుమతి పలుక లేదు. పక్క పోర్షన్ లో ఉన్న డాక్టర్ వచ్చి, చూసి ఆమె హార్ట్ ఎటాక్ తో చనిపోయింది అని చెప్పాడు. శివ నిర్ఘాంత పోయి సుమతి వంకే చూస్తూ కూర్చున్నాడు.

ఆ ఊరిలోనే తాను ఉద్యోగంచేసే ఆఫీసుకు దగ్గరలో ఉన్న చిన్న కొడుకు సాయికి విషయం తెలిసి, కుటుంబంతో సహా వచ్చాడు.

సాయి అమెరికాలో ఉన్న అన్నకు ఫోను చేశాడు. వెంటనే అందరం బయలుదేరి వస్తున్నాం అని కృష్ణ సమాధానం చెప్పాడు.

తల్లి అంతిమ కార్యక్రమానికి సాయి ఏర్పాట్లు చేస్తున్నాడు. బంధువులు అందరూ వచ్చారు.

అమెరికా నుండి పెద్ద కొడుకు కృష్ణ కుటుంబం కూడా వచ్చింది. కొడుకు నాన్నగారూ అంటూ, కోడలు మామయ్యగారూ అంటూ, మనుమడు, మనుమరాలు తాతగారూ! అంటూ ఏడుస్తూ వచ్చారు. అందరినీ శివ కళ్లారా చూశాడు.

కృష్ణ వచ్చి తండ్రి పక్కన కూర్చుని, తండ్రి చేయి పట్టుకున్నాడు. శివ, కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ, ‘మీ అమ్మ మనల్ని వదలి వెళ్ళిపోయింది’ అంటూ... కృష్ణ భుజంపై తల వాల్చాడు.

భార్య పోయిన పెను దుఃఖంతో పెద్ద కొడుకును చూసిన ఆనందంతో, తట్టుకోలేని శివ గుండె ఆగిపోయింది.

********

Posted in February 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *