Menu Close
అనూహ్యం (కథ)
- పి.రాజేంద్రప్రసాద్ -

"నమస్కారం గురువు గారూ" అంటూ శంకరశాస్త్రి గారి పాదాలకు నమస్కారం చేశాడు ప్రద్యోత్. శంకరశాస్త్రి గారు అప్పుడే వారి ఇంటి అరుగు మీద వాలుకుర్చీలో కూర్చుని విశ్రమిస్తున్నారు.

"సుఖీభవ! చిరంజీవ!" అంటూ ఆశీర్వదించారు తొంభై ఐదేళ్ల గురువుగారు. ప్రద్యోత్ భక్తిగా ఆ అరుగు మీద ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.

అంతవయస్సు వచ్చినా శంకరశాస్త్రిగారి ముఖంలో గాని, శరీరంలోగాని ఆయన వయస్సు కనబడనే కనబడదు. ముగ్గుబుట్ట అయిన ఆయన తల తప్ప ఆయనను చూస్తే అందరూ ఏభై ఏళ్లకు మించి ఉండవని అనుకుంటారు. శంకరశాస్త్రి గారు గొప్ప జ్యోతిష్య పండితులు. అయితే ఆయనకు జ్యోతిష్యంతో పాటు ఆధునిక శాస్త్ర విజ్ఞానం మీద పూర్తి అవగాహన ఉన్నది. ఆయన చెప్పిన జ్యోతిష్య ఫలితాలు తప్పవడం ఎక్కడో చాలా అరుదైన మాట. ఎంతటి ప్రతిభ ఉన్నా తెలుగువారవ్వడం చేత కాబోలు ఆయన ఖ్యాతి ఎక్కువ దూరం వ్యాపించలేదు. ఏ సత్కారాలూ, సన్మానాలూ కూడా ఆయనను వరించలేదు. ఆయన గొప్పదనం తెలుసుకొని క్రమం తప్పకుండా ఆయనను దర్శించుకుంటూ ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటున్న కొంతమందిలో ప్రద్యోత్ కూడా ఒకడు. "చెప్పు నాయనా! నా దగ్గరకు వచ్చిన పని ఏమిటి?" వాత్సల్యంగా అడిగారు గురువు గారు.

"ఏమీ లేదు గురువు గారూ. మా అబ్బాయికి ఐదవ ఏడు వస్తున్నది. ఇక రెండవ సంతానం గురించి మా దంపతులిద్దరూ ఆశిస్తున్నాం." ఆగాడు ప్రద్యోత్.

"మంచిది నాయనా శుభం." అన్నారు శాస్త్రి గారు.

"గురువు గారూ...." అర్థోక్తిలో ఆగిపోయాడు ప్రద్యోత్. చెప్పమన్నట్టు వాత్సల్యంగా చూశారు గురువు గారు.

"భార్యాభర్తల సంధాన ముహూర్తాన్ని బట్టి బిడ్డల జాతకం నిర్ణయింపబడుతుందని విన్నాను. నిజమా గురువు గారూ!" ప్రద్యోత్ తన సందేహాన్ని బయటపెట్టాడు. శాస్త్రి గారు ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచి మందహాసంతో..

"నువ్వు విన్నది నిజమే నాయనా! కానీ చాలామందికి ఈ విషయం గురించి పూర్తి అవగాహన లేదు. బీజాండముల కలయిక ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో ఉన్న రాశి చక్రమే జన్మించిన శిశువుకు కూడా రాశి చక్రమవుతుంది." ఇక చెప్పాలా వద్దా అన్నట్టు ఆయన ఒక్క నిమిషం ఆగారు. ప్రద్యోత్ ఆనందానికి అంతు లేకపోయింది. సంతోషంగా అన్నాడు."అయితే గురువు గారూ..మన బిడ్డ జాతకం ఎలాగ ఉండాలో మనమే నిర్ణయించుకోవచ్చు కదండీ."

శాస్త్రి గారు చిరునవ్వు నవ్వారు. "అది అన్ని వేళలా సాధ్యం కాదు నాయనా! మనం పెట్టుకున్న ముహూర్తానికి బీజాండముల కలయిక జరుగుతుందని చెప్పలేము. మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా భగవత్సంకల్పం లేకపోతే ఆ సమయంలో మన ప్రయత్నం వృథా అవుతుంది. అప్పుడు విధి లిఖితం అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది." అతనికి అర్థమయ్యేలా చెప్పాలని చూశారు. ప్రద్యోత్ కి ఆయన చెప్పబోయేది చాదస్తంగానే తోచింది.

"అలాకాదు గురువుగారూ. ఇప్పుడు మనకున్న పరిజ్ఞానంతో స్త్రీ లోని అండం విడుదల సమయాన్ని సునిశితమైన ఖచ్చితత్వంతో నిర్ణయించవచ్చు. దానిలో మనకు అనుకూలమైన సమయం నిర్ణయించుకుంటే మంచి జాతకం ఉన్న బిడ్డను కనవచ్చు కదా!" తన సందేహం కంటే నమ్మకాన్ని ప్రస్పుటంగా ప్రకటించాడు ప్రద్యోత్.

గురువుగారు నిట్టూర్చారు. "ప్రద్యోత్! నేను చెప్పతగినది చెప్పాను. నువ్వు ముందుకు వెళతానని అంటున్నావు. కానీయ్ నాయనా. నీదీ, నీభార్యదీ జాతకాలు తెచ్చావా?"

"తెచ్చాను గురువుగారూ!" అంటూ ప్రద్యోత్ ఇచ్చాడు. ఆయన ఇంతకు ముందే ప్రద్యోత్ జాతకాన్ని చూసి ఉన్నారు. ఇప్పుడు శోభన జాతకాన్ని చాలాసేపు పరిశీలించి "ప్రద్యోత్! నేను నీకు ఇంతకుముందే చెప్పాను. ఈ ప్రయత్నం అంతగా ఉపకరించకపోవచ్చని. ఇప్పుడు మరలా చెపుతున్నాను. నీవు ఈ ప్రయత్నంలో విజయం పొందడం కష్టం. నీవు కోరిన జాతకం కలిగిన బిడ్డ పుట్టడం అనేది సగం సగమే అవకాశాలు ఉన్న ప్రయత్నం అవుతుంది." అన్నారు.

"ఏం గురువు గారూ? నా భార్య జాతకంలో ఏదైనా లోపం ఉందా?" ఆత్రంగా అడిగాడు ప్రద్యోత్. శోభన జాతకంలో ఆయనకు కనిపించిన ఒక విషయాన్ని గురించి ఆయన ప్రద్యోత్ కి చెప్పదలచుకోలేదు.

"ఏమో! జ్యోతిష్యఫలితాలకు సరస్వతీ దేవి శాపం ఉన్నది కదా! నేను చూసినది నిజం కాకపోవచ్చు. ఇప్పుడు ఆ విషయం చెప్పడం అంత సరియైనది కాదేమో!" అనుకున్న ఆయన జాగ్రత్తగా మాటలు పేరుస్తూ "లేదు బాబూ! ఆ విషయం కాదు. మన లెక్కలు తప్పవచ్చని నా ఆలోచన." అన్నారు.

"తప్పవు గురువుగారూ! మీ లెక్క ఎన్నడూ తప్పదు. నేను కూడా శాస్త్రీయంగానే చూస్తాను. ఇక సందేహానికి తావేలేదు." స్థిరంగా అన్నాడు ప్రద్యోత్.

శాస్త్రి గారు నిట్టూర్చారు. "సరే ప్రద్యోత్! నీ భార్య ఈ నెలలో నెలసరి అయిన తేదీ చెప్పు." ప్రశ్నించారు. ఇది అడుగుతారని తెలిసిన ప్రద్యోత్ ముందుగానే కనుక్కొని ఉన్నాడేమో వెంటనే చెప్పాడు.

"ఆమెకు నెలసరి సరిగా ఇరవై ఎనిమిది రోజులకే అవుతుందా?"

"అందులో సందేహం లేదండి. ఆమె సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలు." వినయంగా చెప్పాడు.

శాస్త్రి గారు లెక్కలు వేశారు. పంచాంగం తీసి చాలాసేపు చూస్తూ ఉండిపోయారు. అంతసేపూ ప్రద్యోత్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. చివరకు శాస్త్రి గారు నిర్ణయించుకున్నారు. "చూడు ప్రద్యోత్! ఈ రోజు తేదీ నవంబర్ ఇరవై ఆరు. నెలసరి అయ్యి ఈ రోజుకి ఆరవరోజు అన్నావు. ఇప్పటి నుండి మూడవనెల అంటే ఫిబ్రవరి ఐదవతారీకు, మాఘ శుద్ధ సప్తమి రాత్రి 1030 నుండి 1100 గంటలవరకు మంచిఘడియలు ఉన్నాయి నాయనా. ఆ సమయంలో మీరిరువురూ కలియడం శుభదాయకం. పుట్టే బిడ్డ మంచి జాతకుడవుతాడు. సరిగ్గా అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన పండంటి మగబిడ్డ పుడతాడు. మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. శుభం జరగాలి నాయనా!"

ప్రద్యోత్ పొంగిపోయాడు. "మీరు చెప్పాక శుభం కాక మరేం జరుగుతుంది గురువుగారూ! మీ సహకారంతో, దేవుని ఆశీస్సులతో అంతా సవ్యంగానే జరుగుతుంది. సంతోషం గురువుగారూ! వెళ్ళొస్తాను." అంటూ ఇంటికి బయలుదేరాడు

***

కారును ఆఘమేఘాలమీద పోనిస్తున్నాడు ప్రద్యోత్. జేబులోని సెల్ ఫోన్ అదేపనిగా మోగుతున్నది. అది ఆఫీసు నంబరవడంతో కారు ఒక ప్రక్కకు ఆపాడు. అవతల వైపు హెచ్ ఆర్ మేనేజర్ నుండి వచ్చింది. ప్రద్యోత్ ఫోనెత్తి "చెప్పండి అభిజిత్! గుడ్ ఈవెనింగ్! ఏమిటి ఆఫీసు నుంచి వచ్చేసిన తరువాత ఫోన్ చేశారు?"

"ఏం లేదు ప్రద్యోత్! ఒక అత్యవసర విషయం! మన యూ ఎస్ ఆఫీసులో ఏదో సమస్య వచ్చిందట. మీరు ఎల్లుండి ఫ్లైట్ కి టెక్సాస్ వెళ్ళమని మెయిల్ వచ్చింది. మీనుండి సమాధానం లేకపోయేసరికి సందేహించి ఫోన్ చేశాను. రెండునెలలు మాత్రం అక్కడ పనిచెయ్యాలి. సరేనా ప్రద్యోత్?" గడగడా పాఠం అప్పచెపుతున్నట్టు చెప్పేశాడు మేనేజర్.

ప్రద్యోత్ కి ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు! ఇదేమిటి ఉన్నట్టుండి? ఇప్పటికిప్పుడు వెళ్ళాలా? చిరాకు వేసింది. కోపంగా అన్నాడు. "ఇదేమిటి అభిజిత్ గారూ? ఇప్పటికిప్పుడు అంటే ఎలా? నాకు కావలసినంత కనీస సమయం కూడా ఇవ్వరా?"

"తప్పదు ప్రద్యోత్. నా చేతుల్లో ఏమీ లేదు.ఇది పై వాళ్ళ నిర్ణయం. ముందునుంచే వాళ్ళకి ఆలోచన ఉందనుకుంటాను. మీకు వీసా ఉందని వాళ్ళకి ముందే తెలుసు. మీ టికెట్ కూడా తీసుకుని ఆ తరువాతే మీకు మెయిల్ పెట్టారు. ఏది ఏమైనా మీకు డెప్యుటేషన్ క్రింద ఇక్కడి జీతమే కాక యు ఎస్ లో అదనంగా నెలకు 6000 అమెరికన్ డాలర్లు ఇస్తారు. అంటే దాదాపు ఐదున్నరలక్షలు. మిమ్మల్ని చూసి మేము అసూయపడుతున్నాము తెలుసా?" మేనేజర్ సమాధానమిచ్చాడు.

"సరే అయితే. మెయిల్ చూసుకొని నా సమాధానం పెడతాను." అంటూ నీరసంగా కారు పోనిచ్చాడు ప్రద్యోత్.

***

ప్రద్యోత్ యూ.ఎస్. వెళుతున్నాడంటే శోభన చాలా బాధపడింది. "నువ్వేం బాధపడకు! రెండు నెలలంటే ఎంతసేపు! కంపెనీ వాళ్ళు వెనక్కి రావడానికి టికెట్ ఫిబ్రవరి మూడుకి తీసుకుని ఉంచారు. నాలుగవ తేదీ సాయంత్రం మన ఇంట్లో ఉంటాను. మనకు జీతం కాక పదిలక్షలన్నా మిగులుతుంది. మాటలు కాదు. కొద్దిగా సమయం తక్కువగా ఇచ్చారేమో గాని మనకు మంచిదే కదా." అంటూ సర్దిచెప్పాడు. తరువాతి రోజూ, బయలుదేరే రోజూ సామాన్లు సర్దుకోవడం, వాటి బరువు ఫ్లైట్ నియమాలకు అనుగుణంగా సరిచూసుకోవడమే సరిపోయింది. సర్దుకుంటూనే శోభన కు ఆమె నెలసరి అయ్యే తేదీలు వెంటనే తనకు తెలియచేయమనీ, మనం రెండవ సంతానాన్ని కావాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సరిచూసుకోవడం చాలా ముఖ్యమనీ చెప్పాడు. గురువు గారిని కలిసిన విషయమూ, తను ఇలా అనుకున్న విషయమూ ఆమెకు చెప్పలేదు. ఆమె సరేనని తల ఊపింది. ప్రద్యోత్ టెక్సాస్ నగరం చేరుకుని తన ఆఫీసు పనిలో మునిగిపోయాడు.

రెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి. ప్రద్యోత్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఫిబ్రవరి మూడు రానే వచ్చింది. ప్రద్యోత్ ఆనందంగా తను పెట్టుకున్న ముహూర్తానికి ఇంటికి చేరుకుంటున్నానన్న ఆశతో ఆఫీసు వారిచ్చిన ఫ్లైట్ టికెట్ తీసుకొన్నాడు. తీరా అది ముంబయి వరకే ఉన్నది.  ముంబయి నుండి హైదరాబాదుకు తనే టికెట్ తీసుకోవాలనీ, ప్రయాణఖర్చులు మాత్రం తాము ఇస్తామనీ కంపెనీనుండి మెయిల్ వచ్చింది. ముంబయి నుంచి హైదరాబాద్ కి ఆ తేదీ లో ఖాళీలు దొరకలేదు. వెంటనే హైదరాబాద్ లో తనకు తెలిసిన సంస్థకు ఫోన్ చేసి ఆ రోజు రాత్రి హైదరాబాద్ కు ట్రైన్ కు గాని బస్ కి గాని టికెట్ చేయమని చెప్పాడు. ట్రైన్ లో దొరికింది. ప్రద్యోత్ ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాడు.

తన ఇంటికి రెండు నెలల తరువాత చేరిన ప్రద్యోత్ కు ఆనందంతో ఒళ్ళు తెలియడం లేదు. యూ ఎస్ నుండి శ్రీమతికి, బాబుకీ విలువైన బహుమతులు తీసుకొచ్చి ఇచ్చాడు. మర్యాదపూర్వకంగా గురువుగారిని కలిశాడు. భార్య నెలసరి తేదీల గురించి మరోసారి ఆమెను అడిగి అవే తేదీలు అని నిర్ధారించుకున్నాడు. అయిదవతారీఖున రాత్రి తననుకున్నట్టే భార్యతో సంతోషంగా గడిపాడు. ఫిబ్రవరి నెలాఖరులోనే శోభన, తను నెల తప్పాననే విషయం భర్తకు తెలియచేసింది. ప్రద్యోత్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. వెంటనే వెళ్ళి గురువుగారిని కలిసి కృతజ్ఞతలు తెలియచేసి పాదాభివందనం చేసి వచ్చాడు.

***

రోజులు వేగంగా గడిచిపోయాయి. భార్యను ఏడవనెలలో పురిటికి పంపించాక మాత్రం ప్రద్యోత్ కి అవే రోజులు అత్యంత భారంగా గడవసాగాయి. పిల్లవాడి చదువు పోయినా ఫరవాలేదనుకోవడంతో వాడిని కూడా చూడకుండా ఒంటరిగా ఉండవలసి వచ్చింది. వారానికో పదిరోజులకో ఒకసారి గురువు గారిని మాత్రం తప్పకుండా దర్శించుకుంటూ ఉన్నాడు.

అది సెప్టెంబర్ నెలలో చివరి శనివారం సాయంత్రం. ఆ రోజంతా ఖాళీ కావడంతో తీరిగ్గా టీ వీ చూసుకుంటూ ఉన్న ప్రద్యోత్ కు మామగారి నుండి ఫోన్ వచ్చింది.

"మామయ్యగారూ! చెప్పండి ఎలా ఉన్నారు? మీ అమ్మాయి ఎలా ఉంది?" అంటూ తీరిగ్గా పలకరించబోయాడు.

ఆయన కంగారు పడుతూ "మేం బాగానే ఉన్నాం గాని అల్లుడు గారూ, మీ ఆవిడకు ఈ రోజు హఠాత్తుగా నొప్పులు ప్రారంభమయ్యాయి. డాక్టర్ దగ్గరికి తీసుకు వెళితే హాస్పిటల్ లో చేర్చెయ్యమంది. రేపు ఉదయం లోపున మామూలుగానే కానుపు అవుతుందని చెప్పింది." హడావుడిగా చెప్పాడు.

ప్రద్యోత్ కి అర్థం కాలేదు. "డాక్టర్ గారు ఇచ్చిన తేదీ, గురువుగారు చెప్పిన తేదీ రెండూ కూడా అక్టోబర్ చివరి వారం కదా! ఇదేమిటి ఈయన ఇలా చెప్తున్నారు? ముందుగానే కానుపు అవుతున్నదేమిటి? ఇలాగ అయితే ఫలితం ఎలాగుంటుందనే  విషయం గురువుగారు చెప్పలేదే!" తికమక అయిపోయాడు. కానీ మామగారితో "మామయ్యగారూ! కంగారు పడకండి. నేను వెంటనే ట్రైనో, బస్సో ఏదుంటే దానికి బయలుదేరి వస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అన్నట్టే బయలుదేరి మర్నాటి ఉదయం ఏడింటికల్లా మామగారి ఊరు చేరుకున్నాడు. చేరేటప్పటికి వార్త సిద్ధంగా ఉంది. ఆరోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు శోభన పండంటి మగపిల్ల వాణ్ణి ప్రసవించింది. పిల్లవాడు ముమ్మూర్తులా తల్లిపోలిక.

శోభనకు ఒకనెల ముందుగానే కానుపు అయినా పిల్లవాడు పూర్తి ఆరోగ్యంతో చక్కటి బరువుతో పుట్టినందుకు డాక్టర్ గారితో బాటు ఆమె తల్లిదండ్రులూ ఎంతో సంతోషించారు. ప్రద్యోత్ కూడా ఆనందించాడు కానీ మనస్సులో సందేహం ఉండిపోయింది. "గురువు గారి మాట ఇలా ఎలా తప్పయిందా" అని. ఆలోచిస్తూ ఉండిపోయాడు. రెండు రోజులాగి హైదరాబాద్ చేరిన ప్రద్యోత్, ఆ రోజు ఆఫీసు నుంచి తిరిగివస్తూ మొదట చేసిన పని, గురువు గారింటికి వెళ్ళడం. కారు ఆ వీధి మలుపు తిరగగానే వైకుంఠ రథం ఎదురయ్యింది. వెనకాల పెద్ద ఊరేగింపు. ఇంతటి ప్రముఖుడెవరా అని ఆశ్చర్యపోతూ కారు విండో లోంచి తల బయటకు పెట్టి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయి, కారును అక్కడే వీలైన ఒక ఇంటి ముందు పార్క్ చేసి మౌనంగా తనూ ఆ గుంపులో కలిసిపోయాడు.

గురువుగారి అంత్యక్రియల్లో పాల్గొని వచ్చిన ప్రద్యోత్ కి సందేహం తీర్చేవారెవరూ కనిపించలేదు. మనస్సును సమాధానపరచుకుని తన శ్రీమతికి ఫోన్ చేసి ఇలాగ గురువుగారు పరమపదించిన విషయాన్ని భారమైన హృదయంతో తెలియచేశాడు. ఫోన్ లోనే చాలా బాధ పడ్డ శోభన "పోనీలెండి! ఏం చేస్తాం! మన పిల్లాడి జాతకం వేరొకళ్ళతో రాయిద్దాంలెండి."అన్నది. అంతలో ఉన్నట్టుండి ఏడ్చిన పిల్లాణ్ణి అపురూపంగా ఎత్తుకుంటూ "ఇక ఫరవాలేదు. ప్రద్యోత్ యూ.ఎస్. లో ఉండగానే జనవరి నెలలోనే తనకు నెల తప్పిన విషయం ఇక భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు." అనుకుంది ఆనందంగా.

********

Posted in February 2026, కథలు

3 Comments

  1. krishnamacharyulu Chilakamarri

    మన తల రాతలు మనమే రాసుకోవాలన్న కోరిక బహు చెడ్డది. ఎందరో పురాణ పురుషులు ప్రయత్నించి విఫలమయ్యారు. మన హీరో కూడా అంతే. కథ, కథనం చక్కగా, ఆహ్లాదకరంగా వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *