Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

కష్టతరమైన వ్యక్తులు

చాలా ఏళ్ళ క్రితం నేను ఒక కథ రాసాను. దాని పేరు 'అలవాటు'. దానిలో ఒకే ఒక్క పాత్ర వుంటుంది. ఆయన పేరు లింగధారి. కాలికి వేస్తే మెడకి, మెడకి వేస్తే తలకి, ఇలా మనుషులను మాటలతో మెలికలు పెట్టి వేధించటం ఆయనకొక అలవాటు. ఈ అలవాటు వలన ఆయనను అందరూ లిటిగెంటు లింగధారి అని పిలుస్తూ వుంటారు. ఇలాంటి లేక ఇంతకంటే వింతైన అలవాట్లు వుంటాయి కొందరికి. కేవలం అలవాట్లు మాత్రమే అయితే ఫరవాలేదు. వాళ్ళ ప్రవర్తన కూడా కొంచెం అసాధారణంగానే వుంటుంది. దానితోపాటు వారి మాట, తీరు కూడాను. చాలా దూకుడుగా ప్రవర్తించటం, చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చేసుకోవటం, ప్రతి చిన్న విషయంలోనూ తమ ఆధిక్యతని చూపించుకోవటం, ఎదుటివారికి ఏమీ తెలీదని వారిని చవటలుగా పరిగణించటం, అవసరమున్నా లేకపోయినా అరిచి, కేకలు పెట్టి ఎదుటివారిని జడిపించటం లాంటివన్నీ చేస్తూవుంటారు. వీటన్నిటి వలన వారితో కలిసి పని చేయటం, లేదా అసలు వారితో ప్రతిస్పందించటం ఎదుటివారికి చాలా కష్టంగా వుంటుంది. వారితో ఏది మాట్లాడినా తప్పే! అలా అని ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుంటే అది అన్నిటికన్నా పెద్ద తప్పు. అందుకే ఇలాంటివారిని కష్టతరమైన మనుషులు, అంటే ‘difficult to deal with’ type మనుషులు అంటాము.

అయితే మనుషులు ఇలా ఎందుకుంటారు? సూటిగా, సులభంగా ఎందుకుండరు? ప్రేమగా, మర్యాదగా ఎందుకు మాట్లాడరు? చక్కగా సింపుల్ గా వుంటూ, తియ్యగా మాట్లాడుతూవుంటే అందరికి ఎంత హాయిగా వుంటుంది? ఇలా కష్టతరమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తే తాము గొప్పవారు అని నిరూపణ అవుతుందనా? లేక తాము ఎక్కువ తెలివితేటలు కలవారని అందరూ అనుకోవాలన్న తాపత్రయమా? లేక వారు ఏం మాట్లాడినా, ఏం చేసినా అసలు దాంట్లో తప్పు అన్నదే వుండదు, అందుకే అందరూ వారి మాటనే వినితీరాలి అన్న అహంభావమా? లేక ఎదుటివారిని తెలివితక్కువగా ఋజువు చెయ్యాలన్న అనవసర కుబుద్ధా? ఒకవేళ అసలు వారి స్వభావమే అంత కాబోలు. మరి అదే కనక నిజమే అయితే అసలు వారి స్వభావం అంత complex గా, అంటే అంత కష్టతరంగా ఎందుకుంది? లేక వారే కావాలని తమ స్వభావాన్ని అలా మార్చుకున్నారా? ఎందుకు? దానివలన ఏం లాభం? లేక ఇవేమీ కాకుండా ఇంకేదైనా వేరే కారణమా?

ఈ ప్రశ్నలన్నింటికీ చాలా సమాధానాలు వుండచ్చు. ఇప్పుడు పైన చెప్పినవాటిల్లో ఏదన్నా ఒక కారణం అయి వుండచ్చు. లేక అన్ని నిజమే అయుండచ్చు. లేదా మనకి తెలీని వేరే ఇంకేదైనా కారణం కూడా అయి వుండచ్చు. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే మనిషి లోపల, ఎక్కడో అట్టడుగున దాగివున్న పొగరు, గర్వం, అహంకారం అలా బయటికి తొంగిచూసి ఆ మనిషి రూపాన్ని పూర్తిగా మార్చేస్తాయనుకుంటాను. లేక ఎదుటివారు తమని ఎక్కడ తక్కువగా చూస్తారేమో అన్న భయమేమో! ఆ భయాన్ని, అభద్రతను, అంటే insecurity ని దాచుకోవటానికి బయటకు కప్పుకున్న ఒక ముసుగేమో! లేక భూతకాలంలో తమకు తగిలిన గాయాల నొప్పి ఇలా ఇతరులమీద విరుచుకు పడటానికి ప్రోత్సహిస్తోందేమో! లేక తమ శరీరం మీద, లేక మనసు మీద, లేక రెండిటి మీద ఏదన్నా ఒత్తిడిని అనుభవిస్తూ దాన్ని ఇలా బహిర్గతం చేస్తున్నారేమో! లేక ఏదన్నా జటిల సమస్యలలో వుండి, వాటిల్లోంచి బయటకు రాలేక తల్లడిల్లుతూ ఆ నిస్సహాయతను ఇలా ఇతరుల మీద ఒలకపోస్తున్నారేమో! లేక అందరూ తమ నియంత్రణలోనే వుండాలి అన్న నియంత్రణ పిచ్చి, వీరినే మనం control freaks అంటాం, ఏమన్నా వుందేమో! ఎదుటివారితో వారికున్న సంకర్షణలో, అంటే interactions లో వారి భావాలను సరిగ్గా వెలిబుచ్చటం చేతకాక ఆ నిరాశను అలా తీర్చుకుంటున్నారేమో! ఏమో! ఏదన్నా కావచ్చు. ఏదైనా సరే, వీరితో వేగటం మాత్రం చాలా కష్టం. అందుకే ఇలాంటివారిని ఎవ్వరూ ఇష్టపడరు. వారితో కాలం గడపటానికి ఎవ్వరూ ఉత్సాహపడరు. ఆఖరికి వారి రక్తసంబంధీకులు కూడా బాంధవ్యం వలన వారిని ప్రేమిస్తారేమో కానీ, వారిని ఇష్టపడరు. ఎవ్వరూ మనస్ఫూర్తిగా ఎక్కువ సమయం వారితో గడపటానికి సిద్ధపడరు. తప్పనిసరి అయితే తప్ప వారితో కబుర్లు, సంప్రదింపులను నివారించటానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం వారికి కూడా తెలుసు. అసలు అందుకే వారి నిరాశ, నిస్పృహ, నిస్సహాయతలను అలా ఎదుటివారి మీద తీర్చుకుంటారు కాబోలు.

సరే, జీవితంలో మనకున్న అనేక సంబంధబాంధవ్యాలలో కొన్ని తప్పనిసరి అయినవి వుంటాయి. అంటే, కొంతమందితో, వారెంత కష్టతరంగా వున్నా సరే, వారితో సంబంధాలు తప్పవు. భార్యాభర్తలు, సంతానం, తల్లితండ్రులు, అత్తమామలు, తోబుట్టువులు, మనం కట్టుకున్నవారి తోబుట్టువులు, ఇలాంటివారన్నమాట. వీరితో మన సంబంధాలు శాశ్వతాలు. అయితే ఈ తరంవారు ఈ వాదనని ఒప్పుకోవకపోవచ్చు. మాకు నచ్చకపోతే ఎవరైనా సరే, ఆఖరికి కట్టుకున్నవారైనా సరే, సహించి పడి ఉండాల్సిన అవసరం మాకేమి లేదు అని అనచ్చు. నేను కొంచెం పాత తరం వారి ఆలోచనావిధానం ప్రకారం మాట్లాడుతున్నాను. దాని ప్రకారం నేను చెప్పినవారితో బంధాలు శాశ్వతమైనవే! మరి అలాంటివారితో కొంచెం కష్టపడుతూ అయినా సరే, సంబంధాలను కొనసాగించటం తప్ప ఇంక వేరే ఇతర ఎంపిక ఏదీ లేదు.

ఆ తర్వాత మన extended family వారు, దూరపుబంధువులు, మన ఆఫీసులో మనతో పాటుగా పని చేసేవారు లెక్కలోకి వస్తారు. మనకి నచ్చకపోతే వీరితో మనం కేవలం అవసరమున్నంతవరకు మాత్రమే సంబంధాలని కొనసాగించవచ్చు. ఆతర్వాత బయటివారు, అంటే దూరపుస్నేహితులు, పరిచయస్థులు, మిగిలినవారు అన్నమాట. వీరి స్వభావం మనకి నచ్చకపోతే మనం పూర్తిగా వీరిని నివారించవచ్చు. వారితో సంబంధబాంధవ్యాలు పూర్తిగా తెంచుకోవచ్చు. నేను ముందుగా చెప్పినట్లు ఈ categorization లో, అంటే విభజనలో కొంతమందికి అభిప్రాయబేధాలు వుండచ్చు. నాతొ ఏకీభవించకపోవచ్చు. ఏమీ ఫరవాలేదు. ఎవరి అభిప్రాయాలు వారికి సరైనవిగా అనిపించటం సహజం కదా! కానీ ఇక్కడ నా వుద్దేశం ఏమిటంటే, జీవితంలో కొంతమందిని ఎంత వద్దు అని అనుకున్నా, మరికొంతమందితో మాత్రం శాశ్వతసంబంధాలు తప్పవు. మరి అటువంటప్పుడు ఒకవేళ వారిలో ఎవరైనా కొంచెం కష్టమైన స్వభావం కలిగివుంటే మరి వారితో మనం ఎలా ప్రవర్తించాలి?

Brianna Markley అనే ఒక మానసిక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, ఇలాంటి మనుషుల దగ్గర మొట్టమొదటగా మనం అవలంబించాల్సినది శాంతం. శాంతము లేక సౌఖ్యము లేదు అని ఆనాడు త్యాగరాజుగారు అన్నారు కానీ ఆమాట అప్పుడే కాదు, ఇప్పుడూ, ఆమాటకొస్తే ఎప్పుడూ నిజంగా పనికి వచ్చే మాటే! ఎందుకంటే ఎదుటివారు ఎంత కోపంలో వుండి తాడుని ఎంత గట్టిగా లాగినా మనం శాంతంగా మౌనంగా నిలబడితే ఆ తాడు తెగదు సరికదా, అది వారి దగ్గరే వుండిపోతుంది, అవునా? ఆతర్వాత ఇంక సమాధానం చెప్పక తప్పదు అన్న సందర్భంలో జాగ్రత్తగా మాటల్ని, ఏరి, కూర్చి, సాధ్యమైనంత మెత్తటి గొంతుతో, వీలైతే కాస్త ప్రేమని కూడా జోడించి మెల్లగా అనునయిస్తే అప్పుడు ఎదుటివారి కోపం తప్పకుండా తగ్గుతుంది. సరే, ఇది చెప్పటానికి బాగానే వుంది, కానీ ఆచరణలో చేసి చూపించడం ఎంత కష్టమో కాస్త ఆలోచించాల్సిన విషయం. ఒక్కసారి కాస్త గట్టిగా వూపిరి తీసుకుని ఆతర్వాత మాటల్ని చాలా పొదుపుగా, జాగ్రత్తగా వాడితే మంచి ఫలితం వుంటుంది.

అసలు ఇదంతా చేసేముందు ఎదుటివారి కోపానికి నిజమైన కారణం తెలిస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు వారి సమస్య వైపు నుండి దృష్టిని ఆ సమస్య పరిష్కారం వైపు మళ్ళించవచ్చు. అందుకే ఆ సమస్య ఏమిటో బాగా అర్థం కావాలంటే ముందు వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. మధ్య మధ్యలో 'అలాగా! నిజంగా అలా అయిందా?' అనో, లేక 'మీ మాటలన్నీ నేను వింటూనేవున్నాను. అలా అయిందంటే నమ్మలేకుండా వున్నాను' అనో, లేక 'మీరు చెప్పేదాన్నిబట్టి నాకు ఇలా అనిపిస్తోంది. నేను కరెక్టేనా?' అనో మనం అడిగితే వారు అనే మాటలన్నీ ఎదుటివారి వింటున్నారన్న నమ్మకం వారికి కలుగుతుంది. ఆ నమ్మకం కూడా వారి కోపాన్ని కాస్త తగ్గించవచ్చు. అంతేకాదు, వారి మాటలకి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామని, వారితో మనం ఏకీభవిస్తున్నామని, మనం వారిపట్ల పరానుభూతాన్ని, అంటే empathy ని చూపిస్తున్నామని వారికి నమ్మకం కలిగే అవకాశం కూడా వుంది. కాకపొతే ఒకవేళ నా కధలోని లిటిగెంటు లింగధారిలాగా వాళ్ళు కూడా తమ మాటల గారడితో మనల్ని ముంచేసే ప్రయత్నం చేస్తే మాత్రం దాంట్లో మనం మునకలు వేయకుండా వుండే ప్రయత్నంలో భాగంగా మనం ముందే ఆ మర్యాదల హద్దుల్ని చెప్పేయాలి. గీసిన గీతల పరిధి దాటకపోతే ఎవ్వరికీ తంటా వుండదు. అవునా?

అలాగే అసలు ఆ మనిషి అంత కష్టతరంగా ఎందుకు వున్నారు, వారి స్వభావం అంత పెడసరంగా ఎందుకు, ఎలా తయారయింది అని కొంచెం లోతుగా ఆలోచిస్తే కూడా వారి వ్యక్తిత్వాన్నికి సంబంధించిన కొన్ని రహస్యాలు మనకి అవగతమయ్యే అవకాశం వుంది. అప్పుడు మనం మన దృష్టిని వారి మీద నుండి పక్కకు మళ్ళించి, వారేం చేస్తున్నారు, ఏమంటున్నారు అన్న విషయాల గురించి ఆలోచించటం మొదలుపెడతాం. అప్పుడు ఎంత జటిలమైన పరిస్థితి అయినా కొంచెం సునాయాసమయ్యే అవకాశం వుంది.

ఒకొక్కసారి పరిస్థితి అదుపు తప్పినప్పుడు ఇద్దరికీ తెలిసిన మధ్యవర్తుల సహాయ సంప్రదింపులు తీసుకోవచ్చు. కానీ సహాయానికి ఎవర్ని పిలుస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే కష్టంగా వున్న పరిస్థితి మరీ విషమించకూడదు. పెనంలోంచి మనం పొయ్యిలోకి పడకూడదు కదా! ఇంకో విషయం ఏమిటంటే అసలే మనం ఎదుర్కొంటున్నది తేలికైన వ్యక్తిత్వం వున్న మనుషులని కాదు, కొంచెం కష్టతరమైన వ్యక్తిత్వం వున్నవాళ్ళనే! మరి వాళ్ళతో మనం అదనపు జాగ్రత్త వహించకపోతే మనకి ఇంక ఓటమి తప్పదు. ఎందుకంటే పరిస్థితి మానసికంగా ఇద్దరికీ క్షేమదాయకంగా వుండటానికి అదనపు జాగ్రత్తలు అవసరం కదా!

ఇంకో విషయం. ఎప్పటి నుండో సమాజంలో లేక కుటుంబాలలో పాతుకుపోయిన సంప్రదాయాలకు విరుద్ధంగా ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారిని కష్టతరమైనవారుగా ముద్ర వేసే అపాయం మన సమాజంలో వుంది. ఎందుకంటే పాతని భేదించి కొత్తని ఆహ్వానించటం అంత తేలిక కాదు. అసలు అలవాటుకి భిన్నంగా ఏదో కొత్త అంటే చాలామందికి నచ్చదు కూడా. కానీ ఒక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. అలాంటి వ్యక్తులు అందరిలోనూ ప్రత్యేకంగా, వేరుగా వుంటారు, కానీ వారి వ్యక్తిత్వం కష్టతరమైనది కాదు. తేడాగా వుండటం, కష్టతరంగా వుండటం రెండు పూర్తిగా భిన్నమైన విషయాలు కదా! ఈ రెండిటికి వున్న తేడాని మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి.

కష్టతరమైన స్వభావం వున్న మనుషులతో ఎటువంటి లావాదేవీలు, వ్యవహారాలూ నడపాలన్నా కష్టమే! నిత్యజీవితంలో వారితో పరస్పర ప్రతిస్పందనలు అనుక్షణం మన సహనానికి పరీక్షలలాంటివి. ఇలాంటి మనుషులు ప్రతిచోటా వుంటారు. ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట స్నేహితుల సమూహంలో కావచ్చు, పరిచయస్తులలో కావచ్చు. ఎక్కడైనా, ఎవరైనా కావచ్చు. నావరకు చెప్పాలంటే నా వ్యక్తిగతమైన జీవితంలోగానీ, ఆఫీసులోగాని ఇలాంటి వ్యక్తులు నాకు చాలామంది తారసపడ్డారు. కొన్ని కొన్ని సందర్భాలలో నాకు చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది. కొంతమంది అయితే అహంభావంతో, వారి హోదా, వయసు వంకతో చాలా అవమానాలకు కూడా గురి చేసారు. అయితే అప్పుడు నేను ముందు చెప్పిన విభజన సూత్రాన్ని పాటించాను. తప్పనిసరి అయిన బాంధవ్యాన్ని మాత్రం గౌరవించాను. వారితో సాధ్యమైనంత తక్కువగా interaction పెట్టుకున్నాను. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు కదా! అయినా రక్షణ కొంతవరకు మాత్రమే లభించింది. అయితే నేను ఇంతవరకు చెప్పిన వుపాయాలన్నిటినీ పాటించి, విఫలమయిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నాను. తక్కినవారి సాంగత్యాన్ని సాధ్యమైనంతవరకు నివారించాను.

చిత్రం ఏమిటంటే ఇలాంటి స్వభావం కలవారికి సరిగ్గా అలాంటి స్వభావం కలవాళ్ళే తటస్థపడితే మళ్ళీ వాళ్ళు నచ్చరు. అబ్బా, వీళ్ళతో వేగటం చాలా కష్టం బాబూ అంటూ త్వరగా వారి మీద ఒక ముద్రని వేసేస్తారు. మరి తమని మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదు. ఎందుకంటే అసలు తమది కష్టతరమైన స్వభావం కానేకాదు. ఇదీ వారి అభిప్రాయం, నమ్మకమూను. అందుకే ఇలాంటి మనుషులందరూ వారి వ్యక్తిత్వం అంత కష్టతరంగా వుందని, వారితో deal చేయటం ఎదుటివారికి అంత తికమకగా, ప్రాణాంతకంగా వుందని ఎవరైనా అంటే వారు అంగీకరించరు సరికదా, వారు మనల్నే తప్పుపడతారు. అందుకే ఇలాంటివారితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయం మనకి తెలిసివుండటం చాలా అవసరం. ఎందుకంటే నిత్యజీవితంలో మనకి తారసపడే రకరకాల మనుషులలో ఎవరు ఎలా వుంటారో, ఎవరి స్వభావం ఎలా వుంటుందో మనకు ముందే తెలియదు కదా! ఇంకో విషయం ఏమిటంటే one size fits all లాంటి సూత్రం ఏదీ ఇక్కడ పనికిరాదు. వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి, సమయానుకూలంగా మన ప్రవర్తన కూడా మారాలి. లేకపోతే నష్టపోయేది మనమే! అవమానాల పాలయి, మనశ్శాంతిని కోల్పేయేది మనమే! వారు కాదు. చాలా లిటిగెంటు మనుషులు, వీరితో వేగటం చాలా కష్టం లాంటి చెడ్డపేరు తప్ప వారేమీ నష్టపోరు. అసలు అలాంటి చెడ్డపేరు గురించి వారేమి పట్టించుకోరు కూడా.

అందుకే మరి మీరందరూ ఇలాంటి మనుషులతో అవసరమైన లోకజ్ఞానంతో ప్రవర్తిస్తారు కదూ!

మరి ఈ నెలకి ఇంక సెలవ తీసుకోనా? వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటబెట్టుకుని వస్తాను. అంతవరకూ సెలవు.

********

Posted in February 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *