వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 161 వ ప్రపంచ సాహితీ సమ్మేళనం జనవరి16, 2026 నాడు రసవత్తరంగా జరిగింది. షోడశోత్తరశత మాసాలుగా నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరుగుతున్న కవిసమ్మేళనాల కీర్తి బహుశా ప్రపంచంలో ఒక్క వీక్షణంకే దక్కుతుందనుకుంటాను.
గత 160వ సమావేశం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రత్యక్షంగా జరగడం సంక్రాంతికన్నా ముందుగా వచ్చిన సాహిత్య పండుగ. ఆ తియ్యదనం ఆరకముందే ఈ నెల ఆన్లైన్ సమావేశం జరగడం కవులందరికీ ముదావహం. వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.గీతామాధవి గారి స్వాగతవచనాలతో ఈ నాటి సభ ప్రారంభమైనది. ఈనాటి ముఖ్య అతిథి డా.రాధశ్రీ గారిని వేదికపైకి ఆహ్వానించి సభకు పరిచయం చేశారు.
రాధశ్రీ గారి పూర్తి పేరు డి ఎ వి ఆర్ ప్రసాద్ గారు. వీరు బ్యాంక్ ముఖ్య మేనేజర్ గా పనిచేశారు. రసవాహిని అధ్యక్షులు. 1971 నుండి సాహిత్య సేవ చేస్తున్నారు. సుమారు 40కి పైగా పుస్తకాలు వ్రాశారు. ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తారు. 12 గంటల పాటు ఏకబిగిన పద్యపఠనం చేసి రికార్డు సృష్టించారు.
డా. రాధశ్రీ గారు సభకు వందనం కూడా పద్యరూపకంగానే చెప్పడంతో సభ కరతాళధ్వనులతో మార్మ్రోగి పోయింది.
ఆ పద్యాలు ఇవి:
వీక్షణమును రసికత గల
ప్రేక్షకులను కవివరులను ప్రేమాస్పదమౌ
లాక్షణిక పద్యమందున
నీక్షణము నుతించుచుంటి నీప్సితమొప్పన్
జాతికి నీతికి రూపుగ
ప్రీతిగ వెలుగొందుచున్న విదుషీమణి-కే
గీతామాధవి గారికి
జోతల నందించుచుంటి సుమనస్కుడనై
తాజా కవితలనల్లుచు
రాజీనెరుగని విధమున వ్రాయంగల జీ
రాజేంద్రుని కందించెద
భ్రాజిత పద్యమ్మునందు వందన శతమున్
వివిధ భావాలను పద్యరూపకంగా వారు ఆశువుగా చెబుతుంటే సభ నిశ్చేష్టులైనారు. సుమారు గంటసేపు సాగిన వారి ప్రసంగం శ్రవణానందం. అద్భుతం!
వారి ప్రసంగంపై గీతామాధవి గారు, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ వెంకట్ కొత్తూరు గారు వారి స్పందనను తెలియజేశారు.
తరువాత శ్రీ రాజేంద్ర ప్రసాద్, శ్రీమతి రాధాకుసుమగార్ల ద్వంద్వ సారథ్యంలో కవిసమ్మేళనం ప్రారంభమైనది.
తొలిగా గీతగారు “కొండవాలు వానతీగ” అనే శీర్షికతో అద్భుతమైన భావకవిత్వం వినిపించారు. శ్రీ కొత్తూరు వెంకట్ గారు సంక్రాంతిని వర్ణిస్తూ ఒక కంద పద్యాన్ని మరొక ఉత్పలమాలను చదివి సభను రంజింప చేశారు. శ్రీ నాళేశ్వరం శంకరం గారు యుద్ధోన్మాదం పై చదివిన కవిత చాలా బావుంది. శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడుగారు. “హేమంత హేల” అనే కవిత కూడా అందరినీ ఆకట్టుకుంది. శ్రీ ఘంటా మనోహర రెడ్డిగారు అవరోధాలను అధిగమించినవారు అంటూ కవిత చదివారు. శ్రీ ఎర్రనగారు ప్రకృతిపై పాడిన పాట శ్రావ్యంగా ఉండినది.
అరుణా కీర్తి ప్రతాకరెడ్డిగారు సావిత్రీబాయి ఫూలే పై పాడినపాట కర్ణపేయంగా ఉంది. ప్రసాదరావు రామాయణం అనే నేను “వధ్యశిల” అనే కవితలో దేవతల పేరుతో జంతువులను బలి ఇవ్వడం ఏమిటీ అంటూ కవిత చదివాను. ఉండవల్లి సుజాతమూర్తిగారు పద్య గానం చేశారు.
కోదాటి అరుణగారు ప్రాతః స్మరణీయం అంటూ త్యాగయ్య నిగురించి చెప్పారు. శ్రీ మల్లికార్జునరావుగారు చిగురాకులలో చిలిపి రాగాలు పలికే కోయిలా అంటూ చదివారు.
అరవా రవీంద్రబాబుగారు జేసుదాసు గారు పాడిన ఒక పాటను వినిపించారు. మిత్రులు జే వీ కుమార్ గారు రాయాలని నాకోరిక అంటూ చదివిన ఓ సరదా కవిత అందరినీ నవ్వించింది.
కవిసమ్మేళన సామ్రాజ్ఞి శ్రీమతి రాధా కుసుమగారు చదివిన వీధి బాల్యం అనే కవిత ప్రభోదాత్మకం, అమృతాస్వాదనం కూడా!
శ్రీమతి లలితా చండి గారు “అనుకున్నవన్నీ జరుగవు” అంటూ చదివారు. శ్రీమతి శ్యామలాదేవి గారు హేమంతపు అందాలను అందంగా వర్ణించారు.
శ్రీమన్నారాయణగారు “మనసు ఒక సుగంధ పరిమళం” అనే కవిత గుబాళించింది.
అవధానం అమృతవల్లిగారు ఓ మత్తకోకిల పద్యాన్ని చదివారు. శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారు తన అనుకోలేదు అనే కవితలో పిల్లల ఎదుగుదల గురించి వ్రాసిన తీరు బావుంది. బలుసాని వనజగారు సంక్రాంతి గురించి కవిత చదివారు. జోరు పవిత్ర కృష్ణ గారు “మౌనానికి మాటొస్తే” కవిత అద్భుతం. చాలా చాలా ప్రశంసనీయం. బుక్కపట్నం రమాదేవిగారి పరామర్శ అనే కవితను చదివారు.
చివరిగా వీక్షణం భారతీయ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు లేవరా తల్లిభాషకు తిలకం దిద్దరా అంటూ తన గంభీరమైన స్వరంతో చదివిన అద్భుత కవిత అందరినీ ఆకట్టుకుంది.
పిదప ఈనెల స్వర్గస్తులైన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, చిత్రకారిణి, మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి సతీమణి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ గురించి గీత గారు వివరించారు. సంతాప సూచకంగా సభ ఒక నిమిషంపాటు మౌనం వహించింది.
చివరగా గీతగారి వందనసమర్పణతో ఈ నాటి సభ దిగ్విజయంగా ముగిసింది.
ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.