“హలో ఆ బావగారు. వచ్చి చాలా సేపు అయింది అండి. పాస్ కావాలి అని అడుగుతున్నారు లోపలికి పంపించడం లేదు.
ఆ… ఆ… సరే సరే…. అలాగే,” అంటూ ఫోన్ కి ఆన్సర్ చేశాడు మూర్తి.
ఎవరు చేశారా? అని ఆత్రంగా చూస్తున్న ప్రణవి తో… “మీ బావగారు ఫోన్ చేసారు. ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండి వినబడలేదంట. ఇప్పుడే చూసుకొని ఫోన్ చేసారు. మనల్ని గేటు దగ్గరికి రమ్మన్నాడు. తాను అక్కడకు వస్తాడంట,” అని చెప్పాడు.
ఓ గంట క్రితం ఫోన్ చేసినప్పుడు బిజీ అని వచ్చింది. అంటే అప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నట్లేగా… కావాలని ఫోన్ ఎత్తకుండా వెయిట్ చేయించాడు,’ అని అనుకున్నాడు మూర్తి.
పిల్లల్ని తీసుకుని ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాడు.
ఓ గంట పోయాక, వచ్చి వీళ్ళను కలిసాడు రాజన్. ఎంట్రన్స్ దగ్గర ఏదో చెప్పి, అందరిని లోపలికి తీసుకెళ్లాడు.
“సెకండ్ ఫ్లోర్ 204 లో ఉంటాడు. పేరు చెప్పండి లోపలికి పంపిస్తారు. నాకు అర్జెంటు పని ఉంది బయటకి వెళ్తున్నాను,” అని చెప్పి వెళ్లిపోయాడు రాజన్.
సెకండ్ ఫ్లోర్ కి వెళ్లి, రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళారు. వెంటనే….. ఒక అతను పరిగెట్టుకుంటూ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు? మా పర్మిషన్ లేకుండా అట్లా వెళ్ళకూడదు రండి అని పిలిచాడు. మూర్తి పేషంట్ పేరు చెప్పి, అతన్ని చూడాలి అని చెప్పాడు.
“విజిటింగ్ అవర్ అయిపోయింది. మిమ్మల్ని పంపడం కుదరదు,” అని గట్టిగా చెప్పాడు.
“చాలా దూరం నుంచి వచ్చాం. కనీసం ఆ తల్లి, పిల్లలను అయినా పంపించండి,” అంటూ మూర్తి వారిని రిక్వెస్ట్ చేశాడు.
“కుదరదండి” అని చెప్పాడు.
ప్రణవి అందుకుని, “నేను వారి భార్యను, కనీసం నన్నన్నా పంపించండి. ఒక్కసారి లోపలికెళ్ళి దూరంనుంచి చూసి వస్తాను,” అంది.
“పెళ్ళాన్ని, అని చెబుతున్నావు! మొగుడుకి ఏక్సిడెంట్ అయి ఇన్నాళ్ళుఅయితే! ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? తగుదునమ్మా అని ఇప్పుడొచ్చి, పెళ్ళాన్ని అంటున్నావు. పాపం ఆ చేయి విరిగి అతను ఒక్కడూ తన పనులు చేసుకోలేక, ఎంత అవస్థ పడుతున్నాడో,” అన్నాడు.
అతని మాటలకు ప్రణవి కి ఏడుపు తన్నుకొచ్చింది. తాను ఇంత కాలం ఎందుకు రాలేదో, అతనికి చెప్పాలి అన్నంత ఆవేశం వచ్చింది ప్రణవికి. మూర్తి సైగ చేయడంతో ఆగింది.
వాళ్ళు అతనిని ఎంత బ్రతిమాలి నా అతను పంపించడు, అనే విషయం మూర్తి కి అర్థమైంది. అతను కావాలని ఇక్కడ సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలా మాట్లాడుతున్నాడంటే… ఇతను రాజన్ వాళ్ళుఏర్పాటు చేసిన మనిషి యై ఉండాలి. అసలు ఇతను హాస్పిటల్ స్టాఫ్ కూడా కాదేమో’ అనుకున్నాడు మూర్తి.
కాసేపటికి రాజన్ వచ్చాడు. “ఏంటి బయటే ఉన్నారు? లోపలికి వెళ్ళలేదే?” అంటూ అడిగాడు.
మనస్సులో అతన్ని తిట్టుకొని, “లేదు బావగారు విజిటింగ్ అవర్ అయిపోయింది, పంపించము అంటున్నారు,” అంటూ చెప్పాడు మూర్తి.
“ఉండండి, నేను మాట్లాడుతాను,” అని చెప్పి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాసేపు ఏదో మాట్లాడొచ్చి, “వాళ్ళ రూల్స్ వాళ్ళకి ఉంటాయి. నేను రిక్వెస్ట్ చేశాను. ఒకొక్కళ్ళనీ పంపుతాను అని చెప్పాడు. ముందు నువ్వు వెళ్ళుమూర్తి. తరువాత అదీ పిల్లలు వెళతారు,” అంటూ చెప్పాడు రాజన్.
మూర్తి వెళ్ళి జంబేష్ ను చూసి, పలకరించి, వచ్చాడు.
జంబేష్ అందరి యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నాడు. బానే మాట్లాడాడు.
జంబేష్ మామూలుగా మాట్లాడటంతో…ఇప్పటి దాకా మూర్తి లో పేరుకున్న అనుమానాలు మొత్తం పటాపంచలై పోయాయి. మూర్తి బయటకు వచ్చాక, ప్రణవి పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళింది.
ప్రణవి తో కూడా జంబేష్ చాలా బాగా మాట్లాడాడు. అసలు వీళ్ళు ఇద్దరూ ఇన్ని సంవత్సరాలు విడిపోయి, ఇప్పుడే కలిసినట్టుగా లేరు. ఎప్పుడూ ఇంట్లో ఉండి మాట్లాడుకునేట్టు, మామూలుగా మాట్లాడాడు. ప్రణవి ఉబ్బి తబ్బిబ్బు అయి, ఎంత ప్రేమతో మాట్లాడుతూ… అతని కాళ్ళు పిసికింది.
జంబేష్ లారీ అడ్డం రావడంతో… సడెన్ బ్రేక్ వేస్తే… వాన నీళ్ళుఉండటంతో బండి జారి పడినట్లు, అతని జబ్బ దగ్గర ఫ్రాక్చర్ అయితే రాడ్ వేసినట్లు చెప్పాడు.
ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్‌ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.