లనానీయం -- గంగిశెట్టి ల.నా.
మనిషి ఆలోచన ఎప్పుడూ మనిషి గూర్చే
సమగ్ర మైన మనిషి గూర్చే
యోచించి, యోచించి, శోధించి, శోధించి
తన్ను తాను చీల్చుకుంటున్నాడు
ముక్కలు ముక్కలుగా విజ్ఞానం కనుక్కొని
అవిజ్ఞానం రచించుకుంటున్నాడు
మూలాల్ని వెదుక్కునే క్రమంలో
విశ్వమోహనాన్ని ఆవిరి చేస్తున్నాడు
ఒకే భాష ఒకే జాతి ఒకే మతం
ఒకే దేవుడు ఒకే దేశం ఒకే ప్రజగా
"ఒక్కటే" భావ పతాక రెపరెపలాడే ప్రపంచమైతే ఎంత బాగుండు
అది అడివైనా ఎంత హాయిగానుండు
ఏం చేద్దాం?బహుళత్వం ప్రకృతి రూపం
బహుళత్వంలో ఏకత్వం సంస్కృతి పరిణామం
ఏకత్వంలో బహుళత్వం వికృతి విపర్యాసం
ఓయ్ లనా! మొదటిది సృష్టి
రెండవది పుష్టి ,మూడోది అతివృష్టి
భావాతివృష్టేగా మానవాళి శాపం!
నిశ్శబ్దగీతం -- వాణిశ్రీ నైనాల
బాహ్యంలో బలాఢ్యుడవైన మనిషీ!
చూసుకున్నావా నీలోనికి నీవు ఎప్పుడైనా!
నోచుకుందా అంతరాత్మ ఆ భాగ్యం ఎన్నడైనా!!
అంతా నీదని నొల్లుకున్నప్పుడు
స్వార్థం ముల్లు చిన్నగా గుచ్చడం తెలిసిందా!
అసహాయులకు చేయందించ నప్పుడు
చెళ్లుమనిపించింది గుర్తుందా!
నాకేమని చేతులు దులిపేసుకున్నప్పుడు
చేతకానివాడివని వెక్కిరించింది విన్నావా!
అందరి తప్పులూ ఎత్తిచూపుతున్నప్పుడు
గురివిందవు నీవంటూ
ఫక్కున నవ్వింది మరిచావా!
ప్రగతిబాటయని పైకెళ్తున్నప్పుడు తొక్కుతున్నావంటూ ముక్కుతుంది పట్టించుకో!
అవినీతికి అలవాటుపడినప్పుడు అణువణువూ నిన్ను ప్రశ్నిస్తుంది సమాధానమియ్!
ఆత్మీయులను ఆదరించనప్పుడు నోరునొక్కుతున్నావని నొచ్చుకుంది చూసావా!
బాధ్యత మరచి సోమరివైనప్పుడు
నీరసంగా నీలుగుతుంది...
నిమ్మళంగా నిద్రపోతుంది వినాలన్నా వినలేని
ఆ *నిశ్శబ్దగీతం*
ఎప్పుడో ఆగిపోతుంది...
అంతరాత్మని అంతంచేసినా
బ్రతికే ఉంటావు బాహ్యంలో
అన్ని జీవుల్లానే...
మనిషిగా మాత్రం నీవు నిహతుడివే!!
అలికిడి -- స్వాతి శ్రీపాద
శబ్దం లాగే నిశ్శబ్దమూ
సన్నని ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది.
మనకు బాగానే తెలుసు
చూపుల తీగల మీద సాగి
గుండె అలికిడిలోకి గమకమై జారి
అలలు అలలుగా విస్తరిస్తున్న హోరు మూగవోయి
గడ్డకట్టిన మంచుముక్కే ఈ నిశ్శబ్దం .
ఉషోదయాలు కనిపించని
చీకటి గుహలో తూలి సోలి
సుషుప్తిలోకి జారిపోయిన శబ్ద తంత్రులూ
నిశ్శబ్ద పదసమూహాలూ
ఇప్పుడిప్పుడే మేళుకువలోకి
ఓ చూపు విసురుతున్నట్టుగా ఉంది.
చిన్నప్పుడెప్పుడో తూనీగల తోకలకు దారాలు కట్టి
పరుగెత్తించిన పసితనం చేష్టలూ
మసక వెన్నెట్లో ఎవరికీ తెలియని రహస్యాలను
వడబోసి వడబోసి వస్తగాలం పట్టిన సన్నని ధూళిని
గుప్పేళ్ళతో బుక్కాగా చల్లుకున్న అల్లరితనం
ఎందుకలా దాచుకున్న మొగలిపూల పరిమళమై
అల్లుకుపోడం?
ఎండమావులను కప్పేస్తూ పరచిన
వెన్నెల పొరలను లాగి లాగి
చుక్కలను పిడికిట్లో నలిపి
చుక్కలు చుక్కలుగా స్రవిస్తున్న
వేదన రక్తంలో తడిసి
గాయాలకు చిరునవ్వులు అలదే
ఆమాటలెక్కడ?
ఇప్పుడిప్పుడే మళ్ళీ
శబ్దాలను దిద్దుకుంటున్న పెదవుల చిరు పలవరింత
దారి తప్పిన పాలపుంతల్లో
ఊపిరి ఏరుకుంటున్న క్షణం
మళ్ళీ ఒక అలికిడి పులకింత
ఏదో అనుభూతి -- లలితా భాస్కర దేవ్
సవ్వడి చేయని నీ అడుగులు
ధ్యానలోక ద్వారాలలో
నిచ్చెనలు ఎక్కుతుంటే
నీఉనికిని తెలుపుతోంది ఊపిరి
విస్తరించిన నిశ్శబ్ద నది తరంగాలు
మెల్లిమెల్లిగా అంతరంగ భావాలను తడిపేస్తూ
ఆలోచనలను భావరహితం చేస్తున్నాయి
నువ్వో నేనో ఎరుగని స్థితి
బహిర్ముఖమో అంతర్ముఖమో
తెలియని మరో స్థితి
కళ్ళు తెరిచి చూస్తే కనిపించనిది
కనులు మూస్తే మరో దృశ్యం మైమరిపిస్తోంది
భౌతికానికి అందనిది
పరికించి తెలిపే వీలుకానిది
స్వాగతించే స్వాంతన హృదయం
'నీ' 'నా'..లు తొలగుట కొరకు
చేసే ఆత్మ ప్రదక్షిణలు అన్నీ
అంతరంగం అంతా మాటలకు
అందని ఏదోఅనుభూతికి నిలయం
ఆశల గుళ్ళు సరి చేసుకుంటూ...!! -- కొప్పుల ప్రసాద్
ఏమని వర్ణించగలం ఈ కావ్యాన్ని
ఎప్పుడు లిఖించగలం మహోన్నత గీతాన్ని
నుదుటి ఆశలు శవాలుగా మారుతుంటే
భీతిని కొల్పే నిప్పురవ్వలు ఎగుస్తుంటే..
నెర్రెలు బారిన నేలలో దుక్కి దున్నిన అనుభవం
పిడికెడు మట్టిలో భగభగ పుట్టిన సింగారం
నిర్మానుష్యంగా మారిన జీవితములో
కాంతి రేఖలు చూపగల ఉజ్వలం ఉదయించిందా..
జవసత్వాలు కోల్పోయినా చదరంగములో
ముసురుకున్న కాలుష్యపు మరకలతో
అజ్ఞానమే అరాచకాలు సృష్టిస్తుంటే
విజ్ఞానపు వెలుగులెన్నో ప్రసరిస్తాయి సుమా..
పైశాచిక ప్రదర్శనలు సంఘములో సహజమే
దిగంబరంగా తిరుగుతుంటుంది ఎప్పటికీ
కానీ కాస్త ప్రాణవాయువు కుదురుకుంటే
ఊపిరి వదిలే మనిషికి మరో జీవితం ఇస్తుంది..
ఆశల గూళ్లను సరి చేసుకుంటూ
శరవేగంగా ముస్తాబు కావాలని ఆశిస్తూ
విషాదములో సంతోషాన్ని కళ్ళలో నిప్పుకుంటూ
కొత్త పెళ్లి కూతురులా సిద్ధం అవుతామా ..
మూఢత్వం చెట్టు నిండా కాయలు కాస్తుంటే
తీర్చే గాలిలొ నల్లటి మసి అంటుకుంటే
శుభ్రంగా ఉండాలంటే మనకు కుదురుతుందా
ఒక గీతము రాస్తే పవిత్రత కలుగుతుందా..
చిత్తు రాతల్లో -- డాక్టర్ రవూఫ్
ఆమె గురించి రాద్దామని .....
నక్షత్రాల్ని పలుకరించాను
కొన్ని అక్షరాల్ని అందించమని ;
సెలయేళ్ళని పలుకరించాను
ధారాప్రవాహమై నాలో ఉప్పొంగమని ;
నెమళ్ళని పలుకరించాను
వాటి పదవిన్యాస ''పద ' ముద్రల్తో
నా హృదయం లో నర్తించమని !
కోయిలల్ని పలుకరించాను
మధుర గీతికలై
నా మనోతంత్రుల్ని మీటమని!
ఉపమలూ వుత్ప్రేక్షలూ
అలంకారాలూ
వ్యాకరణ సూత్రాలన్నీ
తెల్లముఖం వేశాయి
వర్ణనల కందని
ఆమె ముగ్ధ సౌందర్యాన్ని
వివరించలేని అశక్తతలో!
చివరాఖరికి
ఆమె పై నేను రాసీ రాయని కవిత
అర్థరాహిత్యంతో అసంపూర్ణం గానే
వుండిపోయింది
చిత్తు కాగితాల దొంతరల్లో!
అర్థరాత్రి మాగన్ను నిద్రలోంచి
నన్ను తట్టి లేపారు.యెవరో
కవిత్వమై కురిసి!
ఇంకెవరూ తనే .....
నే రాయలేక వుండ చుట్టి పడేసిన
చిత్తు కాగితాల్లో రెపరెపలాడుతున్న
నా హృదయాన్ని పఠిస్తూ!
బాహ్యంలో బలాఢ్యుడవైన మనిషీ!…really heart touching…