Menu Close
మహోన్నత మహిళాశక్తి 01
-- ఆదూరి హైమావతి --

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్..

బమ్మెర పోతనామాత్యులు దుర్గాదేవిని ఇలా ప్రార్థించుకుని భాగవతమును తెనుగించాడు. అంటే అమ్మకృప ఉంటే అంతటా విజయమే నన్నమాట.

నారి అనే పదానికి అంగన, అంబుజాక్షి, అతివ, అబల, ఇందుముఖి, చంద్రవదన, మహిళ, మగువ, స్త్రీ ఇలా చాలా పదాలున్నాయి. ప్రతి పదానికీ ప్రత్యేక అర్థం ఉంది.

స్త్రీ అంటే త్రిగుణముల కలయిక సత్వ, రజస్జ్, తమో గుణాలు. అలాగే కరుణ, జాలి, దయ కలిగిన ప్రేమమూర్తులు మహిళలు.

ముందుగా మహిళ అనగానే మనకు గుర్తు వచ్చేవారు అమ్మ, అక్క, చెల్లి, అమ్మమ్మ, బామ్మలు. తర్వాత పురుషులకైతే అర్థాంగి. అందరి హితవు కోరే ప్రేమ స్వరూపిణి మహిళ.

నారి అంటే న+అరి= ఎవ్వరితో విరోధం లేనిదీ, ఎవ్వరికీ విరోధి కానిదీ – అని అర్థం చెప్పుకోవచ్చు.

స్త్రీలు భారతీయ సంస్కృతికి కోటలవంటి వారు. ఆధ్యాత్మిక సంపదకు రక్షకులు. పిల్లలకు ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకు తల్లులే సంరక్షణ బాధ్యత వహిస్తారు. తల్లియే తొలి ఉపాధ్యాయురాలు. తల్లి ఒడి ప్రధమబడి, గుడి.

పంచమాతలలో మొట్టమొదటిమాత దేహమాత. దేహమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత అని ఐదుగురు తల్లులు ఉన్నా దేహమాత శరీరాన్ని ఇచ్చేది, రక్షించేదీ, గోమాత క్షీరాన్ని అందిస్తుంది. భూమాత పంట పొలాలను పండించి అందరి ఆకలితీరుస్తుంది, దేశమాత రక్షణ భద్రత ప్రేమ పౌరసత్వం అందిస్తుంది. వేదమాత ఆధ్యాత్మిక విద్య ద్వారా మానవ జీవిత లక్ష్యాన్ని తెలియ జేస్తుంది.

దేహమాత తక్కిన మాతల ఘనతను తెలుప గలిగినది. కనుకనే తల్లి బాధ్యత క్లిష్టమైనది, ఘనమైనది. మాతృత్వం భగవంతుని వరం, దేశంలో అదృష్ట, దురదృష్టములను నిర్మించేది తల్లులే.

ఆహరహంబును బ్రోచెడి అమ్మకంటే
ఆదరంబగు  వ్యక్తులు అవని కలరె
అమ్మ ప్రధమాక్షరంబె ఆధ్యక్షరంబు
ప్రాణికోటికి  అమ్మయె ప్రాణసమము.

తల్లులు తమ బిడ్డలకు పాప భీతి, పుణ్యప్రీతి అనే రెండు పాఠాలు బోధిస్తారు. భగవంతునిపై విశ్వాసం ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అదే దైవప్రీతి.

ఒక దేశపు ఔన్నత్యం ఆ దేశం యొక్క తల్లులను చూసినట్లయితే అర్థమవుతుంది. దయ, సౌశీల్యము, సద్గుణాలు బిడ్డలకు అందించే వారు తల్లులే. పిల్లలను ఊయల ఊపుతూ ఆడిస్తూ, పోషిస్తూ - మంచిని బోధించే ప్రేమమూర్తులు మహిళలు.

పురాణాలు శాస్త్రాలు స్త్రీని మాతృమూర్తిగా వర్ణించి స్తుతిస్తున్నాయి. విద్యావంతులైన స్త్రీలు జనకమహారాజు ఆస్థానంలో ఉన్నత స్థానాల్లో ఉండేవారు. మైత్రేయీ, గార్గి, సులభ. పౌరాణిక యుగపు స్త్రీ మూర్తులైన సావిత్రి, చంధ్రమతి, అనసూయ, దమయంతి మొదలైన వారు. విద్వాంసులలో ఆనాడు జనకుని సభలో గార్గి ‘ఆత్మాన్వేషణ మార్గాన్ని అతి క్లిష్టమైన జటిలమైన సమస్యలను పరిష్కరించి, అందరినీ జయించి గౌరవ స్థానం పొందింది.

చారిత్రక యుగంలో శివాజీ తల్లి జిజియా బాయి, అతనికి బాల్యం నుండే పురాణ ఇతిహాసాలను బోధించి. హృదయంలో దేశభక్తిని నింపి పవిత్ర మైన హైందవ సంస్కృతిని బోధించింది.

భారతీయ ధర్మాన్ని ఊపిరిగా పిల్లలకు అందించే ఆదర్శం. మాతృ మూర్తులైన సంస్కారవంతులు, విద్యావంతులు, కరుణా మూర్తులు, ప్రేమ స్వరూపిణలు నిస్వార్ధపరులైన భారతీయ మహిళలు ఎందరో ఉన్నారు.

మహిళ- దేశ అభివృద్ధికి పాటుపడుతుంది. దైవభక్తి ఆత్మవిశ్వాసము తో కూడిన ఉత్తమ వీరులను తయారు చేయగలవారు మాతృమూర్తులే. ఉత్తమ మాతృమూర్తుల వలన భారతీయ సంస్కృతి ఉన్నత స్థితిలో ఉంది.

శ్రీరాముని పెంచిన తల్లి కౌసల్య, లవకుశలను పెంచిన సీతమ్మ, వీర గాథలతో శివాజీ హృదయాన్ని నింపిన జిజియాబాయ్, గాంధీజీని తీర్చిదిద్దిన పుతలీ బాయి, సమాజసేవకు బిడ్డను అంకితం చేసిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ తల్లి భగవతీ దేవి, వివేకానందుని తల్లి భువనేశ్వరీదేవి ఉత్తమ మాతృమూర్తులు.

వీరు బిడ్డలను ఒడిలో లాలిస్తూ జోల పాటలు పాడుతూ, ఉపనిషత్తుల్లోని వేదాంత కథలను చెప్తూ, చిన్నప్పటి నుంచే బిడ్డలకు పాలు త్రాగిస్తూ హృదయాలను అమృతంతో నింపిన మాతృమూర్తులు .. వారిలో శక్తిని మేల్కొల్పి, శాశ్వత ఆనందాన్ని, శాంతిని చూపారు. ఆత్మ విశ్వాసాన్ని, ధైర్య సహసాలనూ, దేశభక్తినీ ఉత్తమ ప్రవర్తననూ, మానవతా విలువలనూ నేర్పారు. బిడ్డలో దాగి ఉన్నశక్తిని తల్లే బయల్పరుస్తుంది .

ఒకమారు ఒక అడవిలో ఒక మేకల మందలో అప్పుడే పుట్టిన ఒక సింహపు పిల్ల దారి తప్పి వచ్చి ఆ మందలో కలిసి, వాటి వలె గడ్డి మేస్తూ ఉంటుంది. ఆ మేకల కాపరి అది మేకలను ఏమీ చేయకపోవటాన దాన్ని మందలో ఉంచుతాడు. అది మేకవలె 'మేహ్ మేహ్’ అని అరుస్తూ వాటితోపాటుగా, గడ్డితింటూ, మేకపాలు త్రాగుతూ   ఉంటుంది. ఇలాకొంతకాలం జరుగుతుండగా ఒక రోజున ఒక సింహం మేకల మంద లోకి వచ్చి మేకలను పట్టుకోను ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ సింహం పిల్ల మేకలన్నీ మే మే అని అరుస్తూ పరుగెడుతుండగా అదీ మే మే ఆని అరుస్తూ పరుగెడు తుండటం చూసిన సింహం దాన్ని పట్టుకోను వెంబడిస్తుంది. అది ’నన్నేమీచేయకు చంపకు నేను చిన్న మేకను’ అని అరుస్తుంటుంది.

ఆ సింహం దాన్ని పట్టుకుని అడవిలోని ఒక మడుగు వద్దకు తీసుకెళ్ళి 'చూడు నీవూ నేనూ ఒకేలాగా ఉన్నాం. నీవు మేకవు కావు. సింహానివి’ అని  నీడ చూపి చెప్పి దాని అసలు స్వరూపన్నీ స్వభావాన్నీ తెలియపరుస్తుంది.

అలాగా తల్లి బిడ్డలోని భగవత్ శక్తీనీ, స్వరూపాన్నీ తెలియపరచి మెరుగు పెట్టి సత్సీలంతో, సత్ ప్రవర్తనతో జీవించే మార్గం చెప్తుంది. ఆ తర్వాతే ఉపాధ్యాయుల బోధ.

అమ్మ అనే పవిత్రమైన రెండు అక్షరాలు మానవుడు ఉచ్చరించే మొట్ట మొదటి మాట. తల్లుల వలన దేశంలో ధర్మోధ్ధరణ జరగవలసి ఉంది. మాతృమూర్తులు దేశానికి పట్టు కొమ్మలు. మానవులు సద్గుణములతో, సౌశీల్యంతో త్యాగనిరతితో, సహనం పాటిస్తూ సరైన మార్గంలో మానవత్వాన్ని పెంపొందించుకునే విధంగా ఉండటానికి తగినటువంటి శిక్షణ ఇచ్చేవారు స్త్రీలే. వారు సమాజ పరిరక్షకులు.

మహిళలకు తమ బిడ్డలపై ఉన్న మమతను తెలియపరచే స్వామి చెప్పిన హాస్య కథ.

ఒకసారి ఒక మహిళా సమావేశం జరుగుతుండగా అక్కడికి శ్రీరామచంద్రుని తల్లి కౌసల్య, హనుమంతుని తల్లి అంజనాదేవి, అగస్త్యుని తల్లి హవిర్భూ వచ్చి చేరారుట. కొంతసేపయ్యాక ఆమాటా ఈ మాటా అంతా మాట్లాడు కున్నాక, హనుమంతుని తల్లి 'నాకుమారుడు ఎంత గొప్పవాడో తెలుసా! ఒక్క అంగలో సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకుని మరల ఒక్కంగలో ఇటు దాటి వచ్చి శ్రీరామునికి సీతమ్మ జాడ తెలియ జేశాడు." అంటుంది గొప్పగా.

అగస్త్యుని తల్లి వెంటనే “నీ కుమారుడు సముద్రాన్ని దాటాడు అంటున్నావ్! నా కుమారుడు ఎంత గొప్పవాడంటే నీ కొడుకు దాటిన సముద్రాన్ని, ఆ సముద్రంలో దాగి ఉన్న రాక్షసుడ్ని పట్టుకోను చేత కాక దేవతలు బాధ పడుతుంటే ఒక్క గుక్కలో సముద్రాన్నంత త్రాగి ఖాళీచేసి వారిని పట్టించాడు. తెలుసా!” అని గర్వంగా చెప్పిందట.

అప్పుడు కౌసల్య “మీ ఇద్దరి కుమారులు ఎలా సముద్రం దాటడం సముద్రాన్ని తాగడం చేశారు? నా కుమారుడి  నామస్మరణతో కదా! కనుక ఎవరు గొప్పవారో తెలుసుకోండి” అందిట.

అమ్మలు  ఎప్పుడూ తమ బిడ్డల గురించి గొప్పగా చెప్పుకోను ఇష్టపడతారు అంటే తల్లి మనసు అంత గొప్పది. స్త్రీ శక్తి ఎంత గొప్పదంటే భగవంతుడిని కూడా భయపెట్టేంత గొప్పది.

లోకమునకు ఆధారము స్త్రీలే. మహిళలే లోకమునకు, సమాజానికీ వివేకవంతులైన యువతను అందించేవారు.   మన భారతదేశంలో స్త్రీలను శక్తి స్వరూపిణులుగా భావిస్తారు. దేశాభివృద్ధికి స్త్రీలు ప్రతక్ష్యంగా, పరోక్షంగా తమవంతు కృషి చేస్తూనే వున్నారు. యువతను సక్రమ మార్గంలో నడిపించనూ, విద్యాబుద్ధులు నేర్పనూ స్త్రీలు చూపే చొరవ, బాధ్యత చాలా ఎక్కువ. నేటి సమాజ౦లో ప్రతి రంగంలో స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. చదువుల్లో ఉత్తీర్ణత శాతంలో స్త్రీలదే పై చేయి. విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు చూపుతున్నారు.

అంగన్వాడీ నుంచి అంతరిక్షం వరకూ అన్నిచోట్లా ఎంతో సహనంతో పనిలో నాణ్యత, చాకచక్యం, శ్రధ్ధ, పట్టుదల కనబరుస్తున్నారు. దేశవిదేశాల్లో ఉన్నత చదువులు చదివి, అక్కడ ఉద్యోగాలు చేస్తూ, కొందరు వారి చదువును, సంపాదననూ మన దేశానికి, వారు పుట్టిన ప్రాంతాల అభివృధ్ధికీ వెచ్చిస్తూ మాతృభూమి ఋణం తీర్చుకుంటు న్నారు. కొందరు స్వదేశంవచ్చి స్థిరపడుతున్నారు.

స్త్రీలు తమ శక్తిని తెలుసుకుని, తమ శక్తితో దేశాన్ని, కుటుంబాన్ని, సంస్థలను ఉత్తమ స్థాయిలో నిలబెట్టవచ్చు. ఆధునిక యుగానికి వస్తే స్వాతంత్యం తర్వాత మన దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ, గవర్నర్ గా చేసిన సరోజినీ నాయుడు ఇంకా దేశ విదేశీ మహిళలు ఎలా తమశక్తి నిరూపించుకున్నారో మనకు తెలుసు.

వివిధ రంగాల్లో స్త్రీ ప్రాతినిధ్యం గురించిచూస్తే,మహిళ అన్ని రంగాల్లో ఎంతో పెరిగింది.  ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ -అన్నారు అంటే అవకాశం వస్తే, ఇస్తే ఎంత కష్టతరమైన పనైనా అభ్యసించి విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగా వుంటుంది.

పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులుమాత్రమే చేసుకొనే వారు. వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త, పిల్లల యొక్క బాగోగులు చూసుకొనేవారు. ఆ విధంగా స్త్రీ గృహిణి పాత్ర నూరు శాతం వహించేది.

పురాణ గాధల్లో యుద్ధానికి వెళ్ళే పురుషులను ఆశీర్వదించే వారు. గర్భిణిగా ఉన్న ఉత్తర తన భర్త అభిమన్యుడు తప్పనిసరై యుధ్ధానికి వెళ్ళవలసి వచ్చినపుడు వీరతిలకం దిద్ది పంపుతుంది. పల్నాటి యుధ్ధమునకు  వీరతిలకము దిద్ది పంపిన బాలచంద్రుని భార్య మాంచాల, తల్లి ఐతాంబ స్త్రీజాతికే మాణిక్యాలు.

నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ, తమ ప్రజ్ఞను నిరూపించుకుంటూ పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నా కూడా గృహలక్ష్మిగా తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఆధునిక కాలంలో స్త్రీ అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. అయితే ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కుంటున్నా స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర నిర్వహించడం కష్టరతమైపోయి, పిల్లలకు తల్లి శిక్షణ కొంత కొరవడిందని చెప్పవచ్చు.

ప్రతి సంవత్సరం అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా బాలికలకు  ధైర్య సాహసాలనూ, ఉత్సాహాన్నీ, ప్రోత్సాహాన్ని అందివ్వడం జరుగుతున్నది.

పురుషులతో పోలిస్తే మహిళలు ఆచితూచి అడుగువేస్తారు. విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాల పైనే ఎక్కువగా దృష్టిసారిస్తారు. ఏకాభిప్రాయసాధకులుగా, అందరినీ సమాధాన పరచగలిగే వారథులుగా మహిళలది ప్రత్యేక శైలి. అది వారికి జన్మతః వచ్చిన లక్షణం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న నిర్వ హించుకుంటాం. ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజును ఎందుకు కేటాయించారు అంటే ఎంతో పోరాటం చేసి సాధించిన హక్కులను ఒకరోజున తమ శ్రమకు గుర్తింపుగా జరుపుకోడం కోసం..

ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. ఎంతోమంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబితాను బీబీసీ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఇతరుల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

ఐతే స్త్రీ శక్తిని ప్రతి ఇంటా అత్తాకోడళ్ళ రూపంలో మనం కూల్ యుధ్ధ దృశ్యాలను చూస్తూనే ఉంటాం. అది వేరే విషయం అనుకోండి. లక్ష్మీ సరస్వతులకే పడదుకదా! ఒకరున్న చోట మరొకరు ఉండను అంతగా ఇచ్చగించరు. తగాదాలకు ఝడిసి, శివుడు దేహం సగభాగంలో భార్య పార్వతిని ఉంచుకుంటే, విష్ణువు హృదయం లోనూ, బ్రహ్మ నాలుకపైనా దాచుకున్నారు మరి. స్త్రీ శక్తికి ఇంతకంటే నిదర్శనం అక్కరలేదనుకుంటా.

“ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.” అనే మాటలను స్త్రీలు నిజం చేస్తున్నారు.

గృహిణులుగా ఉండే స్త్రీలు ఖాళీ సమయాల్లో చేతి వృత్తులు, కుట్టులు నేర్చుకుంటే, ఉపాధి కోసం కాకపోయినా, ఆపద వస్తే అవే ఆధారం అవుతాయి. ఇంటిలో స్త్రీ బాధ్యతగా వుంటే, ఆ ఇల్లు ధాన్యాగారము, ధనాగారమే. అందుకే మన సత్యసాయి సంస్థల్లో పేదలైన గృహిణులకు చేతి వృత్తులను నేర్పే ఒక సేవను చేపట్టడం జరిగింది.

ఉద్యోగం, వ్యాపారం చేసే గృహిణి  వారి వృత్తుల్లో అపరకాళీలుగా, ధైర్యంతో, సాహసంతో, సహనంతో, ఏ పరిస్థితులైనా ఎదుర్కునే శక్తిని గుండెల్లో నింపుకుని, సమాజం ముందు దృఢంగా నిలబడుతున్నారు. విలువలతో కూడిన నడవడిక సంస్థకు, కుటుంబానికి, దేశానికి గౌరవం తెస్తాయి.

స్త్రీకి అమ్మ పాత్రచాలా గొప్పది. అమ్మ కుటుంబంలో అత్యుత్తమ పాత్ర. అందరినీ ఒక బంధంగా కలిపి వుంచుతుంది. పిల్లలు అందరి కన్నా ఎక్కువ దగ్గరగా, తనదిగా అనుకునేది అమ్మనే. చిన్నప్పటి నుంచి అమ్మగా పిల్లలను పెంచే విధానమే, పిల్లలు పెరిగి ఒక వ్యక్తి త్వాన్ని అలవరుచు కుంటారు. పిల్లలు పెంపకంలో అమ్మ పాత్ర స్త్రీ జీవితంలో అత్యుత్తమైనది, అమూల్యమైనది.

ఆడపిల్లల పెంపకంలో బయట ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలి. ధైర్యంగా, ఆత్మాభిమానంతో, సఖ్యతగా వుండటం నేర్పాలి. మగపిల్లలకు ఇంటిలో, బయట స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, ఎంత మర్యాదగా వ్యవహరించాలి, స్త్రీని వేరే దృష్టితో చూడకూడదు అనే ఆలోచనలు నింపాలి. సమాజంలో పౌరులుగా, సమాజ అభివృద్ధిలో భాగంగా వుండాలి అనే ఆలోచనలతో పెంచాలి. రేపటి పౌరుల్లాగా పెంచాలి.

స్త్రీ అయినా అమ్మ కుటుంబంలో ఒక పవర్ గ్రిడ్ లాగా వుండాలి. అందరిలో ఉత్సాహాన్ని, వెలుగులను పెంచే విధంగా వుండాలి.

“నేను ఒకరిని పుట్టించ గలను. ఒకరిని తీర్చిదిద్దగలను. నాలో శక్తిని ఎందరికైనా పంచగలను. అందరికీ నేనే దిక్సూచీ, మార్గదర్శిగా నిలబడ గలను.” అని ప్రతి స్త్రీమూర్తీ భావించాలి.

మిగిలిన భాగం వచ్చే సంచికలో అందిస్తాను...

****సశేషం****

Posted in October 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *