"అజ్ఞాని" కవితకు రెండు పరిచయ వాక్యాలు
“అజ్ఞాని" అనే చిన్న కవిత ద్వారా జీవితం, మనోభావాలు, మరియు మనిషి అపార్థ దృష్టిపై కథనాన్ని ఆవిష్కరించటానికి ప్రయత్నం చేసాను. ఈ కవితలో మనిషి తన చిన్న ప్రపంచాన్ని మాత్రమే నిజంగా భావించి, విశాల ప్రపంచంలో జరిగే ఘటనలను చూసే దృష్టిని కోల్పోయినప్పుడు ఎలా అపరిజ్ఞానంగా మారుతాడో వ్యక్తీకరించబడింది. ఇక కవిత లోకి వెళ్దాం.
ఓ మానవుడా... ఓ మానవుడా... బయటికి రా నీ లోకపు గోడల నుంచి
అక్కడ చూడు... నీ ప్రపంచం బయట వున్న మరో ప్రపంచాన్ని
అదొక విశాల వింతయిన విశ్వం... అదొక కొత్త లోకం
అక్కడ చూడు... యుద్ధోన్మాదంలో మునిగివున్న అధిపతులు
వారి మధ్య నలుగుతున్న ప్రజలు... ఆ వలస జీవుల వ్యధలు
ఆకలితో అలమటిస్తూ పొట్ట చేత పట్టుకుని ఏమి చెయ్యాలో తెలియని బ్రతుకులు
ఓ మానవుడా... ఓ మానవుడా... కూపస్థ మండూకం లా జీవించకు
ఒక్కసారి ఇటువైపు ఆలకించు...
ఉన్మాద ఉగ్రవాదుల నీడలో బిక్కుబిక్కుమని చావలేక బ్రతుకుతున్న కన్నీటి గాథలు
ఏ మూల అలికిడైనా అదొక తుపాకుల గర్జనే... అదొక మరణ ఘోష తలపే
రేపుంటామో లేదో తెలియని ఛిద్రమైన జీవితాలు
ఏ చోట ఏమి దాడి జరుగుతుందో తెలియక ఆర్తనాదాలతో రోజులు గడిపేస్తున్న జనఘోష
ఓ మనిషీ, ఓ మనిషీ... గూటికే పరిమితమైన పక్షిలా బ్రతుకకు
ఓ మనిషీ అర్ధం చేసుకో ఆ దేశపు అంతర్యుద్దపు మౌన రోదనను
ఎక్కడ చూసినా శవాల గుట్టలు
ఆ ఆకాశం పొగతో నిండిపోయింది
ఆ గాలిలో రక్తపు వాసన పొంగుతోంది
ఆ నేలపై బాంబుల బూడిద కప్పేసింది
ఓ మనిషీ తిరిగి చూడు .. అక్కడుందొక మ(హా)రో ప్రపంచం
ఆ చోట చదువంటే ఎరుగని బిడ్డలు ఈ చోట చదువొత్తిడిలో ఆత్మహత్యలు
ఆ పక్క ఆప్యాయతలె లేని బంధాలు ఈ పక్క ప్రేమోన్మాద మత్తులో దాడులు
ఓ మనిషీ... ఓ మనిషీ... మరిచిపోకు... ఇలాంటివి ఇంకా ఎన్నో, ఎన్నెన్నో
నీకు తెలియని ఆ ప్రపంచంలో
నువ్వు ఇవన్నీ చూస్తే .. నువ్వు ఇవన్నీ చూస్తే .. నీ కన్నీళ్లు నీకే చిన్నవి అనిపిస్తాయి
ఓ మనిషీ విర్రవీగకు .. ఈ మహా విశ్వం లో నువ్వొక సముద్రంలో నీటి బిందువువి
నువ్వెంత ... ఎడారి లో ఇసుక రేణువంత .. మహారణ్యంలో ఆకు లాంటి వాడివి
నీకేనా కష్టాలు నీవేనా బాధలు ... నీకేనా కన్నీళ్లు ... నీవేనా వ్యధలు
నీకేనా మనస్తాపం ... నీదేనా క్షోభ .. నీకేనా వేదన ... నీదేనా యాతన
నాకే ఎందుకు ఇలా అవుతుంది..నా జీవితమే ఎందుకు ఇలా అయ్యిందనుకోకు
ఓ మనిషీ, ఓ మనిషీ తిరిగి చూడు ... నీలాగా ఎందరో నీలాగా ఎందరెందరో
అందుకే ఒక్కసారి బయటకు రా నీ లోకపు గోడల నుంచి
అక్కడ చూడు... నీ ప్రపంచం బయట వున్న మరో ప్రపంచాన్ని
ఆ మరో ప్రపంచపు ఆవేదన లో పాలు పంచుకో,
కనీసం ఒక్క కన్నీటి చుక్కయైనా
నీ నైజం మార్చుకో ... నీ నైజం మార్చుకో.. లేకపోతే
ఈ విశ్వచరిత్ర పుట లో నువ్వొక అజ్ఞాని గానే మిగిలిపోతావ్