ముఖ్యమంత్రి పదవికి సంజీవరెడ్డి రాజీనామా - ఫిబ్రవరి 26 1964న సంజీవరెడ్డిగారు తన రాజీనామాకు గల కారణాలను శాసనసభలో వివరిస్తూ ఐదువేల పదాలుగల ఒక ప్రకటన చేశారు. అందులోని ముఖ్యాంశాలు:
1. కర్నూలు జిల్లాలోని బస్సు సర్వీసులను జాతీయీకరణ కావించాలని తాను సూచించినపుడు సాంఘిక న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో పబ్లిక్ రంగాన్ని త్వరితగతిన అభివృద్ధి పరచాలనే ఆకాంక్ష తప్ప వేరొక భావం లేనేలేదని, తానెట్టి తప్పు చేయలేదని, ప్రజల ప్రయోజనాలను, క్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకుని మాత్రమే తన విద్యుక్త ధర్మాన్ని తాను నెరవేర్చానని సంజీవరెడ్డి గారు అన్నారు.
2. బస్సు సర్వీసులు జాతీయీకరణ చేయబడిన మూడు జిల్లాలతోను, జాతీయీకరణం కావింపబడనున్న నెల్లూరు జిల్లాతోను అనుసంధింపబడినందున, కర్నూలు జిల్లాలో బస్సు సర్వీసులను జాతీయం చేయడానికి నిర్ణయింపబడినదని ఆయన అన్నారు.
అంతేగాక, కర్నూలు జిల్లాలో జాతీయం చేయడానికి ధనం అట్టే అవసరం లేనందున, లాభాలు ఎక్కువగా రావడానికి అవకాశమున్నందున ఈ నిర్ణయం చేయబడిందని ఆయన వివరించారు. తన రాజకీయ ప్రత్యర్థులపై అక్కసు తీర్చుకోవడానికి తానీ చర్య తీసుకున్నట్లు చేయబడిన ఆరోపణ కేవలం నిరాధారమైనదని ఆయన ఖండించారు.
3. బస్సు సర్వీసుల జాతీయీకరణ విధానాన్ని వమ్ముచేయడానికి ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు శతధా ప్రయత్నించారని, నిరాధారమైన ఆరోపణలు కావించారని ఆయన పేర్కొన్నారు. శ్రీ పి.రంగారెడ్డి, అయన మైనర్ కుమారులిద్దరు స్వప్రయోజనంగల బస్సు ఆపరేటర్లనీ, తాము సంజీవయ్య అనుచరులమని చెప్పుకుంటారని, అయనప్పటికీ వారు కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి కొందరు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారని ఆయన తెలియజేశారు.
4. సుప్రీమ్ కోర్టులో తాను అఫిడవిట్ దాఖలు చేయడం న్యాయవాదులు అవసరం లేదనటంతో తాను దాఖలు చేయలేదని చెప్పారు.
5. కృష్ణా నదిపై వంతెన తెరిచినందువలన హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఉంటున్న దూరం 50 మైళ్ళు తగ్గింది. నెల్లూరును త్రోసివేసి కర్నూలుకే ప్రాధాన్యం ఇవ్వాలని నేనెన్నడూ సూచించలేదు. చిత్తూరుకు బదులు కర్నూలుకు ప్రాధాన్యం ఈయడం మంచిదని మాత్రమే నేను సూచించాను. జాతీయం చేయబడిన గుంటూరు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో కలిసేందుకు అలా జరిగితే వీలుగా ఉంటుందని అవన్నీ ఏక మండలంగా ఏర్పడి కేంద్రం నుంచి పరిపాలనా సౌలభ్యానికి అనుకూలంగా ఉండగలదని భావించాను అని అన్నారు.
6. హై కోర్టులో నాపై చేసిన ఆరోపణల సారాంశం ఈ విధంగా ఉంది: - గత జనరల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో రెండు వర్గాలున్నవి, ఒకటి నా నాయకత్వాన, మరొకటి శ్రీ సంజీవయ్య క్రింద ఉన్నవని, నా బంధువులు, అనుచరులైన అభ్యర్థుల ఓటమికి శ్రీ సంజీవయ్య గ్రూపుకు చెందిన బస్సు యజమానులు కారణమని, అందుచేత పగ తీర్చుకోవడానికి కర్నూలు బస్సుల జాతీయీకరణకు నేను పూనుకున్నానని ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నిర్వహించినపుడు ఆంధ్రప్రదేశ్ కు చాలా కొద్ది సార్లు నేను వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు.అందుచేత ఏ గ్రూపుకు నాయకత్వం వహించడానికి నాకు తీరికలేదు. ఏ పరిస్థితులలోను నేను ఒక ముఠాకు నాయకుడిగా వ్యవహరించలేదని ఘంటాపధంగా చెబుతున్నాను అని అన్నారు.
7. అనుక్షణం మారుతున్న సమాజంలో సాంఘిక, న్యాయ దృక్పథాలలో సమన్వయం చాలా అవసరం. బ్రిటిష్ న్యాయ శాస్త్రవేత్త డెన్నిస్ లాయిడ్ అన్న మాటలను సంజీవరెడ్డి గారు ఉటంకించారు :- "ఆర్ధిక రంగంలో వచ్చిన విప్లవాత్మక పరిణామాలను గుర్తించడానికి న్యాయస్థానాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? నూతన పరిస్థితికి అనుగుణంగా తమ విధానాన్ని న్యాయస్థానాలు ఎంతవరకు సవరించుకోగలిగాయి?
8. మానవజీవితంలో అనంతమైన సంఘటనల ఫలితాలు ఒకదాని వెంటఒకటి పరిగెడుతూ ఉంటాయని, సంఘటనల కార్యాకారణ సంబంధాన్ని కనుగొనడానికి మానవమేధ ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు భావాల సమ్మేళనంలో తార్కికమైన పద్ధతిని అనుసరిస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
9. కర్నూల్ జిల్లాలో బస్సు రూట్ల జాతీయీకరణ విషయంలో సాంఘిక న్యాయం సమకూర్చాలన్న, ప్రభుత్వ రంగం అభివృద్ధి కావాలన్న లక్ష్యం తప్ప మరొకటి లేదు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల పట్ల అభిమానంగల ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్ ఆధ్వర్యాన భారత న్యాయశాస్త్ర చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభంకాగలదని ఆశిస్తున్నానన్నారు
10. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం న్యాయస్థానాల స్వతంత్రాన్ని గౌరవించగలదని, న్యాయస్థానాలు ప్రకటించిన అభిప్రాయాలతో విభేదించినప్పటికీ, వాటిని గౌరవించడం వల్ల ప్రజాస్వామ్య పునాదులు గట్టిపడగలవని సంజీవరెడ్డిగారన్నారు.
****సశేషం****
అవతరణి – రచయిత మనో నేత్రం
నేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.
నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.
నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.
ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.
అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు