Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
పద్యరచన
కం. పొడిపొడి నుడువులు వెడలవు
      నుడువులపడతుకయె నిలిచి నుడువుల నడలన్(1)
      దడబడక చూడ నడుగులె
      యొడబడి(2) వడివడిగఁ బడుచు నొడియు(3) నెడలనే(4) 234
           (1) నడక (2) అనుకూలించి (3) ఆకర్షించు (4) హృదయాలనే

శివుఁడు
కం. హర! విషధరధర! విషధర!
      ధరధరసఖ! సురశిఫ(1)శిఖ! ధరణీధరరా
      డ్వరతనయావర! కరుణా
      కర! కరధృతహరిణ! శరణు ఖలహరచరణా! 235
           (1) నది

సరస్వతి
ఉ. ధన్యము చేసి నా భవము ధారుణిపైఁ, బలికింతు వమ్మ సా
     మాన్యుని మాన్యుఁజేసి పదమాధురితోఁ గవిదివ్యహవ్య!(1) నే
     నన్య మెఱుంగ నేర భవదబ్జపదార్చన తప్ప విశ్వచై
     తన్యకరీ! ఋతంభరనిధానవచోఽద్భుతశక్తిరూపిణీ!(2) 236
          (1) కవులకు దివిజసురభి (కామధేనువు)
          (2) పరమాత్మనిధి అయిన వేదవాక్కుల అద్భుత శక్తియే రూపముగా కలది

శ్రీహరి
కం. నారాయణనామంబే(1)
      పారాయణ సేయఁ, గాంచ, భవహర మగుఁగా
      నారాయణనామం బే
      పారిన(2) భక్తుఁడను స్వామి! పాలింపుమయా! 237
           (1) పేరు/తిలకము (2) నా పేరు సూర్యనారాయణమూర్తి

కం. గోవిందనామనాదం
      బే విం(1)దగు శ్రవణములకు నెల్లెడల గిరిన్(2)
      మా విందువు(3) నీవే కద
      రా విందువు(4) హృదయగహ్వరాలన్ భజనల్ 238
           (1) బంధుభోజనము (2) వేంకటాచలముపై
           (3) బంధువు/దాత (4) వినెదవు

చం. కరములె కానుపించు నెటఁ గాంచిన మ్రొక్కుచుఁ బైకి లేచి త
      చ్ఛిరముల నావలన్(1) నిలిచి సేవకసింధుతరంగడోలికా
      స్ఫురితములై, కరాగ్రములె శోభిలు చందురువంకలో యనన్,
      కరము ముదంబు గూర్చి, కను కన్నులె కన్నులు వేంకటేశ్వరా! 239
           (1) పడవలపై
భావము – 
తిరుమల తిరువీధుల ప్రాంగణములో ఎక్కడ చూచినా శిరస్సులపై జోడించిన చేతులే పైకి లేచి కనిపిస్తున్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే, స్వామిని సేవించడానికి వచ్చిన భక్తులనెడు సముద్రపుటలలపై తేలియాడే
పడవలో అనిపించేలా తన్మయత్వంతో పంకించే తలలపై నిలిచి ఉన్నాయి. ఇక ఆ చేతులగోళ్ళు చంద్రవంకలేమో అనిపిస్తూ వేంకటేశ్వరస్వామి ధగధగలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ దృశ్యము ఎంతో ఆనందానికి 
నిలయమై, బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, తిలకించిన వారి కళ్ళే కళ్ళు అవుతున్నాయి.

మూలానక్షత్రము
కం. మూలానక్షత్రమె వా
      ఙ్మూలమ్మగు వాక్సతీభవంబునకును ని
      ర్మూలము సేసి యనృతమును
      మూల మ్మగు జ్ఞానవృక్షమునకును సృష్టిన్ 240
Posted in October 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *