దాదాపు 20 ఏళ్ల వరకు ఇంటి నీడన, బడుల నాలుగు గోడలకు పరిమితమైన జీవితం లోకి, ఒక్కసారి ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అన్న పరిణామాలు వెంట వెంటనే ఒక ఐదేళ్ల లోపే రావడంతో, బ్రతకడానికి కావలసిన మెళుకువలు ఇంట్లో, కాలేజీలలో నేర్పించరు అని కొద్దిగా ఆలస్యంగా తెలుస్తుంది.
జీవితం నిత్యం పోరాటమే. జీవితం ఆవిష్కరిస్తూ సమయం పరిగెడుతుంటే, జీవించడానికి పరిష్కారాలు వెదుక్కుంటూ సమయం వెంట పడడమే జీవితం అని పరుగెడుతున్న యువకుడి కథ ఇది.
మొహమాటం లేకుండా, ఎల్. కే.జి క్లాసులకే ఇంటర్వ్యూ లు పెట్టి డొనేషన్ అడిగే వ్యాపార పాఠశాలలు అప్పుడప్పుడే స్థాపింపబడి, పుంజుకున్న రోజులలో వ్రాసిన కథ.
సమాజంలో ఉన్న అసమానతలు ఎంత ఎదురుగా కనిపిస్తున్న, అవి మనకు వర్తించదు అన్న గట్టి నమ్మకంతో జీవితాలు బింకంగా సాగదీస్తున మధ్య తరగతి వారి అంతర్మధనమే ఈ కథ.
అలానే, సాంకేతిక రంగం, టీవీ వంటి పరికరాలతో గుట్టు చప్పుడు కాకుండా, బుల్లి రంగుల తెర, గొప్ప సౌండ్ సిస్టమ్ లతో ప్రజల జీవిత కాలాన్ని దొంగలించడం మొదలుబెట్టిన తొలి రోజులలో వ్రాసిన కథ.
రోజూ జరుగుతున్న విషయాలతోనే, కొంత సింబాలిజం జోడు చేసి, కథ వెనుక కథ పొరలుగా అల్లిన కథల యాత్రలో బహుశ మొదటి కథ. ఇక ఆలస్యం ఎందుకు, చదవండి.
ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్...
పేరు బాలు, వయస్సు ఆరేళ్లు, ఒకటవ తరగతి, ‘ఎ’ సెక్షన్ మంచి పేరున్న స్కూలే. ఇది ప్రస్తుతం మా అబ్బాయి బయోడేటా.
ఒక్కడే పిల్లవాడు కాబట్టి వాణ్ణి బాగా పెంచాలి, వాడికో ఇంప్రెస్సివ్ బయోడేటా కల్పించడానికి కృషి చేయాలి అన్న ఆశ అందరు మధ్యతరగతి తల్లి దండ్రులకు మల్లే నాకూ, మా ఆవిడకూ కూడా ఉండటం సహజమే అనుకుంటాను.
అలాంటి బాలుకు, అదే మా అబ్బాయికి, ప్రపంచమంటే సరియైన అవగాహన కల్గటం లేదేమోనని ఈమధ్య నన్నో సందేహం పీడించసాగింది. దానికి కారణం వాడిమీద దూరదర్శన్ కున్న ప్రభావం. మాటలు వచ్చీరాకముందే ‘రస్న’ ‘కాడ్బరీస్’ అని వాడు కలవరించడం నన్నంతగా ఇబ్బంది పెట్టకపోయినా, ‘శ’, ‘న’ పలకటంలో ‘ణ’, ‘న’ పలకటంలో వాడు పడే ఇబ్బంది చూసి నేను కలవరపడటం నిజమే. అలాగని వాణ్ణి టి.వి. చూడొద్దురా అని చెప్పలేంకదా. అస్సలు వాణ్ణి ఆ మాట అనడానికి నేను మా ఆవిడ టి.వి. చూడకుండ ఉండగలమా?
టి.వి.లో వచ్చే కార్యక్రమాలను చూసి, వాటి మీద వాడు వేసే ప్రశ్నలు విచిత్రంగా ఉంటాయి. నన్నాలోచింపచేస్తాయి. టి.వి.లో వాడికిష్టమైన ప్రోగ్రాములు కమర్షియల్ ఆడ్వర్టైజ్మెంట్స్. ఈ మధ్య యాక్షన్‌తో ఉండే ఇంగ్లీషు కార్యక్రమాలు కూడా ఇష్టంగా చూడటం మొదలెట్టాడు. వాటిల్లో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అంటే మరీ ఇష్టం. ఎప్పుడూ అన్నం తినటం దగ్గర వాళ్ళమ్మతో పేచీ పెట్టుకునే వాడు, ఆదివారం మాత్రం గప్‌చిప్‌గా తినేసి మాతోపాటు రాత్రి తొమ్మిది గంటలకల్లా టి.వి. ఎదురుగ సోఫాలో కూర్చుండేవాడు. ఓరోజురాత్రి ఏదో మినిష్ఠరో, ప్రెసిడెంటో మాట్లాడాలని ‘గిన్నిస్‌బుక్’ కార్యక్రమం రద్దుచేస్తే టి.వి. వాళ్లమీద తెగ చిరాకుపడ్డాడు. వాణ్ణి సముదాయించేసరికి మా తలప్రాణం తోకకొచ్చింది.
ఎవ్వరూ చేయని పని ఒకడు చేయడానికి పూనుకోవడం, దాన్ని ఓ అందమైన అమ్మాయి తెరపై పరిచయం చేయడం, విదేశాల్లోని దృశ్యాలు, కార్యక్రమాలు తీసిన తీరు, రంగులు వాడిని ఆకర్షించాయి అనుకుంటాను. ప్రపంచంలో అందరికంటే పొడవైన గోళ్లు, పొడవైన మీసాలు ఉన్నటువంటి వారిని పరిచయం చేయడం నాకు బాగా గుర్తు. దానికి కారణం ఆ వ్యక్తులు భారతీయులు కావడమే అనుకుంటాను, పనిలేకపోతే గోళ్లు గిల్లుకోవడం బదులు గోళ్లు పెంచుకుంటే ‘గిన్నీసు బుక్...’ ఎక్కొచ్చు అని నవ్వుకున్నాను కూడ...
ఓ ఆదివారం ఈ కార్యక్రమంలో, ఇటుకలు మోసేవాణ్ణి చూపెట్టారు. ఆ ఇటుకలు మోసే అతను చాలా బలిష్టంగా కండలుతిరిగి ఓ మల్లయోధునిలాగ ఉన్నాడు. అతను ఇటుకలను సులభంగా మోయడానికి ఓ ఇనుప పాత్ర దానికి ఓ కాడ ఉన్న పరికరాన్ని తయారుచేసుకున్నాడు. చాలా ఇటుకలను ఆ పాత్రలో అమర్చి ఆ పరికరాన్ని కాశీయాత్ర పోయే పెళ్ళికొడుకుమల్లే భుజానికి ‘‘హుప్ హూప్’’ అంటూ గావుకేకలు వేస్తూ ఎత్తుకున్నాడు. చుట్టూవున్న ప్రేక్షకులు చప్పట్లుకొట్టి ఉత్సాహపరుస్తూ ఉంటే, ముక్కుతూ, మూలుగుతూ అతను ఓ నిచ్చెనలోని పది మెట్లు ఎక్కాడు. అతడు ఆ పని పూర్తిచేసేసరికి ‘గిన్నిస్ బుక్’ సుందరాంగి అతనికో ముద్దు పెట్టేసి, ‘‘కంగ్రాచ్చులేషన్స్’ అని చెప్పేసింది. బాలును చూశాను వాడి ముఖంలో ఒకటే ఆనందం. వాడూ చప్పట్లు కొడ్తున్నాడు.
తరువాత రెండు ఎత్తైన కొండలమధ్య ఓ నైలాను త్రాడు వేసి కట్టారు. దానిమీద పాకుకుంటూ ఒకతను ఒక కొండపైనుంచి ఇంకో కొండపైకి చేరటంతో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆ రికార్డు సృష్టించినతను మంచి బలంగా ఉన్నాడు.
చివరగా, ఓహోటల్ స్విమ్మింగ్‌పూల్ పక్కనున్న రెస్టారెంటులో ఒకతను కూర్చుండటం చూపెట్టారు. చూట్టానికి బాగా ఉన్నవాడి లాగానే ఉన్నాడు. గిన్నీస్ భామామణి ఈసారి చిన్న నిక్కరు, బనీనుతో వచ్చి అతన్ని పరిచయం చేసింది. తరువాత అతని ముందు ఓ పాత్రలో కొన్ని మిరపకాయలు పెట్టారు. పరిచయం చేసినావిడ ‘స్టార్ట్’ అంటూ తన దగ్గరున్న స్టాప్‌వాచ్ నొక్కగానే అతను మిరపకాయలు ఒకదానితరువాత ఒకటి నోట్లో వేసుకొని నమిలి మింగసాగాడు. ఒక నిమిషం లోపలే ఆ పాత్రను ఖాళీచేసేడు. ‘మరో కొత్త గిన్నీస్ రికార్డు’ అంటూ ఆ కార్యక్రమం ముగిసింది.
అయ్యో అప్పుడే అయిపోయిందే అన్న బాధ బాలు ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ వుంది. మళ్లీ వచ్చే ఆదివారం వస్తుందిలేరా అని వాణ్ని సముదాయించాను నేను. వాడు ఉన్నట్టుండి ‘‘ఎందుకు డాడీ... మనవాళ్ళు అలా బరువులు ఎత్తరు? మనమంతా కూడా గిన్నీసు బుక్కులోకి పోవచ్చుగదా? గిన్నీసు ఆంటీ మనదగ్గరికెందుకు రాదు?’’ అని ప్రశ్న లేయడం మొదలెట్టాడు.
నేను వాడికేదో ఓ సమాధానమిచ్చి వాడి ప్రశ్నలను కొట్టి పడేసి ఉండొచ్చును. కాని, వాడు వేసే ప్రశ్నలను సీరియస్‌గా తీసుకోవటం వల్ల నా మెదడుకు మేత దొరుకుతుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. వాడు అంటే ఇన్ జనరల్, చిన్నపిల్లలు వేసే ప్రశ్నలు స్వచ్ఛమైనవి. కొంచెం లోకంపోకడ, ఇతర మనుష్యుల మనస్తత్వాలు తెలుసుకొన్న పెద్దవాళ్లు అలాంటి ప్రశ్నలని ఆలోచించలేరు. బతకటం కోసం తన ‘నిజతత్వానికి’ కవాటాలు దించేసిన తరువాత, అది సాధ్యం కాదుకూడా. అందుకే బాలు వేసే ప్రశ్నలంటే నాకిష్టం. అవి నా ఆలోచనల శరపరంపరకి ట్రిగ్గర్.
నేనాలోచించడం మొదలెట్టాను. అవును ఎందుకు మన దేశం వాళ్లు కూడా అలా బరువులెత్తడానికి ప్రయత్నించకూడదు. ఎందుకు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందగూడదు. ఎక్కడ లోపం? ఎంత ఆలోచించినా నాకు ఆ రోజు సమాధానం దొరకలేదు.
కొన్నిరోజుల తరువాత మా కంపెనీ కడ్తున్న ప్రాజెక్టు సైటుకు వెళుతూ మా ఆవిడని, బాలును జీపులో వెంట తీసుకెళ్ళాను. అడవిలో నదిమీద ఆనకట్ట కడ్తున్నారు. రెండు ఎత్తైన కొండలమధ్య ఎక్కడో పాతాళంలో ప్రవహిస్తున్నట్టున్న నది. దానికడ్డుకట్ట కట్టి విద్యుచ్ఛక్తి తయారుచేయడానికి ఈ ఏర్పాటు.
దారిపొడవునా సూర్యరశ్మి కూడా చొరరానంత గుబురుగా చెట్లు. ఎక్కువగా వెదురు, టేకు చెట్లు కనపడుతున్నాయి. ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడక్కడ జింకలు రోడ్డు పక్కన కనపడుతున్నాయి. ఉన్నట్టుండి రోడ్డుమీద అడ్డంగా ఏదో పడిఉన్నట్లు కనపడింది. వెంటనే బ్రేకు వేశాను. జీపు దగ్గర రాగానే, అదో కొండచిలువ అని తెలిసిపోయింది. ఏదో చిన్న జంతువును తిన్నట్టుంది. కడుపు లావుగా కనపడుతున్నది. మత్తుగ పడుకోనుంది.
నా చేయి బరువుగా అనిపించింది. తల తిప్పి చూశాను. బాలు నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. మా ఆవిడ నా భుజం తనకు తెలియకుండానే గట్టిగ పట్టుకుంది. ఆవిడ కళ్లలో కింద దిగొద్దని అభ్యర్ధన. వెంటనే జీపును రోడ్డుకు ఓ పక్కకు తిప్పి ఆ పాము పక్కనుంచి ముందుకెళ్లిపోయాం.
అవును, పామంటే మనుష్యుల కెందుకింత భయం? అది కాటువేస్తుందని భయమైతే కొండచిలువ వంటివి విషంలేనివికదా! అస్సలు తొంభైశాతంపైన పాములు విషంలేనివి అంటారు కదా. కాని ఎందుకీ భయం? మనవాళ్ళు పాము అంటేనే ఓ భయంకరమైన జీవిగా, చెడుకు ప్రతీకగా సృష్టించారు. ఎవడైనా చెడ్డవాడు కనిపిస్తే వాడు పాములాంటివాడు, దగ్గర చేరొద్దనటం, ‘పాముకు పాలుపోసి పెంచడం’ అన్నటువంటి మాటలు మనలో మనకు తెలీకుండానే పామంటే భయం ఏర్పడడానికి దోహదం చేసి ఉంటాయనుకుంటాను.
మేము సైటు చేరేసరికి 11 గంటలైంది. గెస్టుహౌస్‌లో సామాన్లు పెట్టేసి, మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు చేయమని చెప్పి మేం కడ్తున్న డాము చూపెట్టడానికి మావాళ్ళను తీసుకెళ్లాను. డాము గోడలకి నిచ్చెనలు, కిందపడకుండ ఉండడానికి, పట్టుకు, అడ్డదిడ్డంగానే అయినా అందులోను ఓ క్రమంగా వెదుళ్ళను అమర్చారు. కొన్ని వేలమంది అక్కడ పనిచేస్తున్నారు. ఆడవాళ్లు కూడా ఉన్నారు. మేం వున్నదగ్గర కూడా కొంతమంది ఆడకూలీలు పనిచేస్తున్నారు. అందరు సన్నగా, చినిగిన గుడ్డలతో ఉన్నారు. తలమీద చిన్న గుడ్డచుట్ట పెట్టుకొని వాటిమీద రెండు రెండుగా 8 జతలు అంటే 16 ఇటుకలను పేర్చి, కిందనుంచి ఓ పదడుగుల నిచ్చెన ఎక్కి పైనున్న మరో కూలికి అందజేస్తున్నారు. అందులో ఒకావిడ చంకలో ఓ చిన్న చంటి పాపనుకూడా మూటకట్టుకొని వుంది. నాకెందుకో అనుకోకుండా అంతకు ముందు చూసిన గిన్నీస్‌బుక్ కార్యక్రమం గుర్తుకువచ్చింది. ఇంత ఎండిన శరీరాలతో వీళ్లు ఇలా బరువులు మోయగలిగితే, బాగా తిండి పెడితే వీళ్లు ఆ ఇటుకలు మోసేవాడి రికార్డు బద్దలు కొట్టలేరా అని అనిపించింది. అలానే తలపైకెత్తి చూశాను. కళ్లుతిరిగేటంతటి ఎత్తులో కూడా వాళ్లు రాళ్లు మోస్తూ పనిచేస్తున్నారు. వీళ్లు గిన్నీస్ బుక్కులో ఎక్కేవారికంటే ఏవిధంగా తీసిపోయారు? అలాంటి ఆలోచనలతో మనస్సులో కుస్తీ పడుతూ బాలుకి, మా ఆవిడకి అవీ, ఇవీ చూపెడుతూ తిరిగి గెస్టుహౌసుకి చేరాం. చల్లగానే ఉన్నందువల్ల మాకు భోజనం అక్కడి గార్డెన్లో ఏర్పాటుచేశారు. మేం భోజనం చేస్తుంటే మాకు కొంచెందూరంలో కొంతమంది కూలీలు కూడా భోంచేస్తున్నారు. వాళ్లేం తింటారో, ఇంత కష్టపడడానికి, అని కొంచెం ఆసక్తిగానే వాళ్లను గమనించసాగాను. పాతగుడ్డల మూటల్లోనుంచి, సత్తు గిన్నెలనుండి దాదాపు అందరూ ఎండిన జొన్న రొట్టెలను తీశారు. ఓ ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిరపకాయలు నంజుకోవడానికి తెచ్చుకొన్నారు. అవి తెరిచి కొన్ని నిమిషాలలోనే ఆ పచ్చి మిరప కాయలు, ఉల్లిపాయ నమిలి జొన్నరొట్టెలతో సహా తమ భోజనం ముగించేశారు. మళ్లీ ముందురాత్రి గిన్నీసు కార్యక్రమంలో మిరపకాయలు తినడం గుర్తుచేసుకోకుండా ఉండలేకపోయను.
‘టెలీపతీ’ ఉందో లేదో నాకు తెలీదు కానీ, బాలు కూడా తిరిగి గిన్నిస్‌బుక్ కార్యక్రమాలను గురించి మాట్లాడడం మొదలెట్టాడు. వాడికి నేను గమనించిన కూలీలను, వాళ్లు చేసే పని గిన్నీస్ వాళ్ళకంటే ఎంత గొప్పదో, నాకు చేతనైనంతవరకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నించసాగాను. ఎదురుగా టేబుల్ మీద మేం వదిలేసిన ఓ చిన్న రొట్టెముక్కను ఓ చీమ లాక్కునిపోవడానికి ప్రయత్నించడం కనిపించింది. వెంటనే నేను బాలును ‘‘ప్రపంచంలో అందరికంటె గొప్ప వెయిట్ లిఫ్టర్ ఎవ్వరూ?’’ అని అడిగాను.
దానికి బాలు, మా ఆవిడ ఇస్తున్న సమాధానాలు సరికావని ఏడ్పించడం మొదలెట్టాను. కొంచెంసేపటికి వాళ్లు ‘పప్పుడికిందని’ ఒప్పుకున్న తరువాత వాళ్లకి రొట్టెముక్కతో కుస్తీ పడుతూ వదలకుండా మోసుకుపోతున్న చీమను చూపించాను. తన శరీర బరువుకు దాదాపు ఏభై ఇంతలు మోయగలిగిన చీమలు చిన్నవైనా, ఎంత గొప్ప వెయిట్ లిఫ్టర్లో అన్న వెంటనే బాలు ‘‘డాడీ- ఆకలివేస్తే ఎక్కువ బరువులు మోయొచ్చుకదా?’’ అని అడిగాడు.
వెంటనే నా ఆలోచనల చక్రం మళ్లీ తిరగటం మొదలెట్టింది. నిజమే ఆకలికంటే గొప్ప డ్రైవింగ్ఫోర్సు ఏదీ లేదు అనుకుంటాను. అది ఎన్ని పనులైనా చేయిస్తుంది. ఎంత బరువైనా మోయిస్తుంది. ఎంత ఎత్తునైనా ఎక్కనిస్తుంది. హిమాలయాలలోని ఎత్తుల్ని సులభంగా అధిరోహించే షర్పాలు పొట్టకూటికి ఎక్కుతున్నారా లేక రికార్డులకా అన్నది కూడా అంతుపట్టని విషయంగా తోచినా, నాకు మటుకు వారి ఆకలే సరియైన కారణంగా తోస్తుంది.
కూర్చున్న చోటినుంచి డామ్ కట్టటం కనిపిస్తున్నది. చీమల గురించి ఆలోచిస్తున్నందువల్లనేమో డామ్మీద పనిచేస్తున్న కూలీలంతా చీమల్లాగా చిన్నగా కనపడసాగారు. చీమల్లాంటివాళ్లు ఎంత పెద్ద కట్టడం కట్టగలుగుతున్నారు? అంటే ఆకలి ఇంత కట్టడాలు నిజమవ్వడానికి కూడా కారణమవుతుందా?
ఈసారి నా దృష్టిని నిజం చీమలే ఆకర్షించాయి. ఇంతకుముందు కూలీలు కూర్చున్న చోటవున్న చెట్టుకటువైపు కొన్ని వందల చీమలు కలిసి పామునొకదాన్ని లాక్కుపోతున్నాయి. బతికిన పామునే పట్టి చంపి మరీ తీసికెళ్తున్నట్లనిపించింది. చీమలీపనిని ఆకలి తీర్చుకోవడానికే చేశాయా?
ఉన్నట్టుండి నా ఆలోచనలు మళ్లీ గంతులేసి, మేం వస్తున్న జీపుకెదురుగా పడుకున్న పాము పైకి వెళ్లాయి. పాము చెడ్డవానికి, ఎక్స్ప్లాయిటర్కి చిహ్నంగా నిలిస్తే, మరి ఈ చీమలు ఆకలి ఎక్కువైతే ఆ చిహ్నాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడవని నాకనిపించింది. మరి అలాంటి ఉప్పెన వచ్చినప్పుడు, అటు పాము ఇటు చీమకాని నావంటి మధ్యతరగతివాడి సంగతేమిటి?
ఈ ప్రశ్నకు నాదగ్గర జవాబులేదు.
(విపుల, 1991)
Am glad you like Sreeni garu. Appreciate you taking time to read and leave a comment. Regards and best wishes.
excellent Nirmaladitya garu mee katha venuka katha …