కొన్నాళ్లకి బాలాజీకి కొత్త సంగతులు తెలిసాయి తనని చేరదీసిన సర్దార్ గురించి.
సర్దార్ జీకి పదిహేనేళ్ళపుడు ఆయన కుటుంబం తల్లీ, తండ్రీ, తమ్ముడూ చచ్చిపోయారు పంజాబ్ వెళ్తూ రైల్వే ప్రమాదంలో. కుటుంబం పోయాక రైల్వే వారిచ్చిన డబ్బుల్లో కొట్టినవాళ్ళు కొట్టేసినంత పోతే మిగతావి బేంక్ లో దాచి పెట్టి కొన్నాళ్ళు టెంపో డ్రైవర్ దగ్గిర పనిచేసాక ఆ డబ్బులు, గురుద్వారా రెకమెండేషన్ తో ఓ బేంక్ లోనూ సంపాదించి స్వంతంగా టెంపో నడపడం మొదలుపెట్టాడు సర్దార్. అప్పటికి ఇల్లూ అదీ పోయి ఉండడానికి ఒక రూమ్ లాంటిది చూసుకోవాల్సొచ్చింది.
అటు బాలాజీ సంగతి చూస్తే, అతణ్ణి నెల్లూర్ పంపడానికి రైల్వే టికెట్ అంత చవక కాదు ప్రస్తుతం తనకొచ్చే ఆదాయంతో. రెండోది కుర్రాడు తనకి సహాయం చేస్తున్నాడు ఉచితంగా. వీడి బదులు మరొకణ్ణి తీసుకుంటే వాడికి జీతం డబ్బులివ్వాలి. అసలే టెంపోకి తీసుకున్న అప్పుకి వడ్డీ, డీసెల్, బండి రిపేర్లూ అన్నీ కట్టుకున్నాక జీవితం కటాకటిగా ఉంది. అలా అని కుర్రాణ్ణి పోలీస్ స్టేషన్ లో అప్పగిద్దామా అంటే కుర్రాడు ఇంటికి వెళ్లనని మారాం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో పెట్టాక వీణ్ణి పోలీసులు ఏం చేస్తారో? ఏదో విధంగా కుర్రాణ్ణి ఇంటికి పంపేద్దాం అంటే తండ్రి కొడతాడనీ, వెళ్లననీ చెప్తున్నాడు కదా? ఏమీ తేల్చుకోలేని పరిస్థితి. సరే తర్వాత ఆలోచిద్దాం అని ఎప్పటికప్పుడు వాయిదా వేయడం.
టెంపో బాగా నడిచి డబ్బులొచ్చిన నాడు కొంత వెసులుబాటు. లేనినాడు ఉచితంగా తిండికి గురుద్వారాలో లంగార్ ఉండనే ఉంది. అదృష్టం ఏమిటంటే ఇద్దరికీ ఏ రోగం రొచ్చూ అంటుకోలేదు. టెంపో డ్రైవర్ సర్దార్ ఓ మద్రాసీని చేరదీసాడనే కబురు గురుద్వారాలో అందరికీ తెల్సినా బాలాజీ కధ వాళ్ళకి చెప్పాక వాళ్ళు సానుభూతి చూపించారు.
పదిహేనేళ్ళు గిర్రున తిరిగి ఇప్పుడు బాలాజీ హిందీ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. సర్దార్జీ బదులు టెంపో నడపగలడు కూడా. ఇద్దరి చేతుల్లోకీ సెల్ ఫోన్లు వచ్చాయి. ఇంటర్నెట్, కంప్యూటర్లు ఊపందుకుంటున్నాయి. టెంపో మాత్రం ఎప్పట్లాగానే అప్పుడప్పుడూ మొరాయిస్తోంది. పెట్రోల్, డీసెల్ రేట్లూ, రోజువారీ సరుకుల రేట్లూ ప్రయాణించేది ఎప్పుడూ ఉత్తరంగానే కదా? ఓ రోజు ఆదివారం సర్దార్, బాలాజీలు ఇద్దరూ లంగార్ లో భోజనం చేసి బయటకి వెళ్ళబోతూంటే జగదీష్ సింగ్ అనే పెద్దాయన, లోపల వేరే గదిలోకి పిల్చాడు వీళ్ళిద్దర్నీ; ఏదో మాట్లాడే పని ఉందిట. లోపలకి వెళ్ళాక ఇద్దర్నీ కూర్చోబెట్టి చెప్పాడు.
“మీ ఇద్దర్నీ చాలా ఏళ్ల బట్టి చూస్తున్నా. నాకు ఊళ్ళో కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. మీ గురించి విని మిగతా విషయాలు కనుక్కున్నాను. మీ ఇద్దరికీ పిల్లా జెల్లా లేరు, నిజాయితీగా పనిచేస్తున్నారు. మీరిద్దరూ టెంపోలో మహిళా పాసెంజర్స్ కి ఇచ్చే గౌరవం గురించి తెల్సింది. టెంపోలో ఎక్కిన పాసెంజర్లని మోసం చేయడం లేదని కూడా చెప్పారు. మీలాంటి నీజాయితీ గా పనిచేసే వారి కోసం చూస్తున్నాను. ఎంత కాలం మీ టెంపో బిజినెస్ ముందుకెళ్తుందో తెలియదు; నాతో పనిచేయడానికి ఇష్టం ఉందా?”
“ఏం పని చేయాలండి?” సర్దార్, బాలాజీ ఒకేసారి అడిగారు.
“నాకు ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ ఉంది. ట్రక్కుల్లో సరుకులు చేరవేయడం వగైరా. అది చూసుకోవాలి.”
“దేశం అంతా తిరగాలా?”
“నహీ నహీ. మీ ఇద్దరూ ఆఫీసులో కూర్చుని ఏ ట్రక్ ఎక్కడ ఉంది, ఎన్నింటికి బయల్దేరింది, ఎప్పుడు చేరుతుంది, డ్రైవర్ సరుకులు ఇచ్చాడా లేదా అనేవి కంప్యూటర్ మీద చూస్తూ, ఫోన్ మీద డ్రైవర్లతో మాట్లాడుతూ చూస్తూ ఉండాలి. లోకల్ గా మనం ఇంకేం బిజినెస్ చేస్తే బాగుంటుందనేది చూసి చెప్తూ ఉండాలి.”
“కంప్యూటర్ అంటే మాకేం తెలియదు సార్,” సర్దార్ చెప్పాడు వెర్రిమొహం వేసి.
“నాకూ పెద్దగా తెలియదు కానీ అది వాడడానికి ఒకర్ని పెడదాం ఆఫీసులో. ఆ కంప్యూటర్లో కొత్త ప్రోగ్రాం ఉందిట, దాని ప్రకారం ఏ ట్రక్ ఎక్కడ ఉందీ అనేది తెలుస్తుంది ఎప్పటికప్పుడు. అది ఈ మధ్యనే నేను ఢిల్లీలో చూసి వచ్చాను. ఆఫీసులో కుర్రాడు కంప్యూటర్ మీద అవన్నీ చూసి మీకు చెప్తూ ఉంటాడు. మీరిద్దరూ ఫోను మీద ఆ డ్రైవర్లతో మాట్లాడుతూ బిజినెస్ బాగా జరిగేలా చూసిపెట్టాలి. నీజాయితీ ముఖ్యం అని చెప్పాను కదా? ప్రస్తుతం ఉన్న వాళ్ళు సరిగ్గా చేయడం లేదు. మధ్యవర్తిగా పనిచేసేవారు డబ్బులు కొట్టేస్తున్నారు.”
“ఎన్ని ట్రక్కులండి?” బాలాజీ అడిగేడు.
“ఇరవై మూడు. మరో విషయం, ట్రక్ ఏదైనా ట్రబుల్ ఇస్తే దాన్ని మెకానిక్ దగ్గిరకి తీసుకెళ్ళి జాగ్రత్తగా పని పూర్తి చేయించి బండి దార్లో పెట్టాలి. డ్రైవర్లు మోసం చేయకుండా చూడ్డం మొదటి పని. సమయం ప్రకారం సరుకులు చేరవేయడం, కస్టమర్లతో గౌరవంగా మాట్లాడ్డం అవీ మీ పనులు. ఆఫీసులోకి ఎవరైనా వస్తే వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పి ఆర్డర్లు బుక్ చేసే పని కూడా మీదే. మిగతా దారిలో బిజినెస్ పెట్టుబడి పెట్టవచ్చో కూడా మీకు తెలిస్తే చెప్పండి.”
“నాకు తెల్సినంతలో రెస్టారెంట్లకి పొద్దున్నే కావాల్సిన దాల్, సబ్జీ అవీ సరఫరా చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు టెంపోలలో తెప్పించుకుంటున్నారు తప్ప ఒక మంచి సప్లైర్ అనేవాడు ఉన్నట్టు లేదు.” బాలాజీ చెప్పేడు.
“అఛ్ఛా, మంచి ఆలోచన. దాని గురించి నేను కనుక్కుంటా. ఇంతకీ నాతో పనిచేస్తారా లేదా?”
“మా టెంపో అమ్మేయాలా?” సర్దార్ అడిగాడు, తనకున్న ఏకైక ఆధారం పోతుందేమో కదా అనుకుంటూ.
“బేటా నువ్వు మంచి బిజినెస్ లో పైకి వెళ్ళాలంటే ఈ టెంపో ఎలా ఉపయోగపడుతుంది? మహా అయితే నీ పాత టెంపో లక్ష రూపాయలు చేస్తుందా? అది అమ్మడం ఇష్టం లేకపోతే బాలాజీ చెప్పినట్టూ పొద్దున్నే దాల్, సబ్జీ సరఫరాకి వాడి చూడు. మీరిద్దరూ నిజాయితీగా పనిచేస్తారనీ, రాబోయే పదేళ్ళలో ఇద్దరూ బాగుపడతారని చెప్పాను. ఇష్టం లేకపోతే చెప్పండి. దూసరా ఆద్మీ కో బాత్ కరూంగా.”
“ఆలోచించుకుని రేపు పొద్దున్నే వచ్చి చెప్పొచ్చా?” సర్దార్ అడిగాడు.
“ఠీక్, ఠీక్,” జగదీష్ సింగ్ లేచాడు.
***
ఇంటికొచ్చి భోజనం కానిచ్చాక రాత్రి పడుకోబోయే ముందు బాలాజీ సర్దార్ ని అడిగేడు సరదాగా, “మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు భాయ్?”
“నహీ, పరివార్ అంటే ఒక ఔరత్ ని సంపాదించాలి; ఆవిడ చెప్పినట్టూ జీ హుజూర్ అనాలి. దునియా మే కిస్కో మాలూమ్ హై ఔరత్ కా దిమాగ్? రాత్రి దాకా టెంపో నడపడం కుదరదు. వేరే ఇల్లూ, ఇంటికి అద్దె, అవన్నీ కట్టడానికి డబ్బులేవీ? బేటా, బేటీ పుట్టుకొస్తే మరిన్ని ఖర్చులు. తల్లీ తండ్రీ కుటుంబం అంతా పోయాక నాకు జీవితం అంటే విరక్తి ఒకటనుకో. అబ్బే మనకి లాభం లేదు. ”
“ఎంతకాలం ఇలా ఉంటారు?”
“జరిగినంత కాలం. క్యా ఔర్ కర్ సక్తా?”
“టెంపో పాతది అయి మొరాయిస్తోంది, దాని రిపేర్లు తడిసి మోపెడౌతున్నాయి; దాల్ సబ్జీ, డీసెల్, అన్నింటికీ రేట్లు పెరుగుతున్నాయి. ఖర్చులకి ముందు ముందు ఏం చేస్తాం?”
“జగదీష్ సింగ్ గారి ఉద్యోగంలో చేరదాం అంటావ్ అంతేనా? ఆయన బిజినెస్ కానీ మునిగి పోతే టెంపో అమ్మేసిన నువ్వూ నేనూ రోడ్డుమీద పడతాం. నీకైతే నెల్లూర్ లో తల్లీ తండ్రీ ఉన్నారు. నాకంటూ ఎవరూ లేరు.”
“భయ్యా నేను నెల్లూర్ వెళ్ళిపోదామనుకుంటే ఇన్నాళ్ళూ నీ చేతుల కష్టం మీద బతికేవాణ్ణా?” కన్నీళ్ళ పర్యంతమైపోతూ అన్నాడు బాలాజీ.
“ఠీక్, ఠీక్, సబ్ మాఫ్ కరో”
“అదికాదు భాయ్, ఓ సారి ఆలోచించు. మనం టెంపో అమ్మఖ్ఖర్లేదు. దాన్ని పొద్దున్నే ఒక దాల్ సబ్జీ డెలివరీకి వాడొచ్చు. జగదీష్ సింగ్ గారు మన నిజాయితీ చూసి ఇస్తానంటున్నాడు ఉద్యోగం. పొద్దున్న నుంచి రాత్రి పొద్దు పోయేదాకా దుమ్మీ ధూళీ తట్టుకుంటూ రోడ్లమీద తిరగక్కర్లేదు. వచ్చినవాళ్ళకి బిజినెస్ లో ఆర్డర్లు బుక్ చేయడం, ట్రక్ లు పాడైతే రిపేర్ చేయించడం, ఫోన్ మీదా, కంప్యూటర్ మీదా సరుకులు ఎక్కడున్నాయో చూడ్డం. ఇది సులభం కదా? ఆలోచించు. ఆ మాత్రం నీకు తెల్సిందే కదా?”
“నష్టాలు వచ్చి మనం పీకలోతు దిగబడితే?”
“అరే భాయ్, లాభం నష్టం లేకుండా ఏ బిజినెస్ పుంజుకుంటుంది కనక? ఇప్పుడు మనం కాదనుకుంటే మళ్ళీ ఇటువంటి అవకాశం మనకి రాకపోవచ్చు జీవితంలో. ”
కాసేపు ఆలోచించిన సర్దార్ నిజం వప్పుకుంటున్నట్టూ చెప్పాడు, “పొద్దున్నే జగదీష్ గారితో చెప్దాం అయితే.”
రైల్వే ప్రమాదంలో.??? (OR) రైలు ప్రమాదంలో.???