మోహన్ దాస్ ఇంగ్లండ్ జీవితం, పరివర్తన
మతంతో సాన్నిహిత్యం
మోహన్ దాస్ ఇంగ్లండ్ లో ఉన్నప్పుడు రెండవ సంవత్సరాంతంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులను కలవటం జరిగింది. అన్నదమ్ములు, బ్రహ్మచారులు అయిన వీరు ‘థియొసోఫిస్టులు’ (Theosophists: దివ్యజ్ఞానులు). ‘భగవద్గీత’ గురించి తెలుసుకోవాలని వారు ‘ఎడ్విన్ ఆర్నాల్డ్’ (Edwin Arnold; కవి, పాత్రికే యుడు) 1885 లో వ్రాసిన ఆంగ్ల అనువాద పుస్తకం ‘The Song of Celestial’ చదివారు. వీరు మోహన్ దాస్ ను ‘గీత’ మూల గ్రంధాన్ని వివరించమని కోరారు. అంతకు ముందు ఏనాడూ సంస్కృతంలోనూ, గుజరాతీలోనూ వ్రాయబడిన ‘గీత’ గ్రంధం చదవని మోహన్ దాస్ వారి అభ్యర్థనకు సిగ్గుపడుతూ తాను చదవలేదని అంగీకరించి, అయినా ఇప్పుడు తాను చదివి వినిపిస్తానని చెప్పారు. అలా వారితో కలిసి గీతాపఠనం చేస్తున్నప్పుడు రెండవ అధ్యాయంలోని 62 వ, 63 వ శ్లోకాలు మోహన్ దాస్ ను విశే షంగా ఆకర్షించి అతని మనస్సులో జీవితాంతం చెరగని ముద్రవేశాయి.
ఈ శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన ఉపదేశం ఇలా ఉంది:
“ఒక వ్యక్తి ఇంద్రియాల గురించి ఆలోచిస్తున్నప్పుడు వాటికి ఆకర్షుడవుతాడు;
ఆకర్షణ నుంచి ఇచ్ఛ (కోరిక) కలుగుతుంది;
ఇచ్ఛ మొహాన్ని జ్వలింప జేస్తుంది;
మొహం క్రోధానికి హేతువు అవుతుంది;
క్రోధం విభ్రమకు దారి చూపుతుంది
విభ్రమ వల్ల బుద్ధి నశిస్తుంది;
బుద్ధి వినాశనం వల్ల జ్ఞాపక శక్తి కోల్పతాడు;
దీని వల్ల అజ్ఞానం పెరిగి జీవితాంతం ఒక జడ పదార్ధంగానే మిగిలిపోతాడు.”
వీటిని గురించి గాంధీజీ ఇలా వివరించారు.
“ఈ భగవద్గీత ఒక అమూల్యమైన గ్రంధం. ఇది నా మనస్సుమీద వేసిన ముద్ర రోజురోజుకూ పెరుగుతూ ఉంది. నా సత్యాన్వేషణకు ‘గీత’ ఒక సాటి లేని మేటి గ్రంథ రాజం. మనోవ్యాకులతో ఉన్న ప్రతిసారీ ఈ దైవ గ్రంధం వెలకట్టలేనంత సహాయం చేసింది. ఆంగ్లంలో అనువదించబడిన ‘గీత’ పుస్తకాలను కొన్ని చదివాను. కాని వీటిల్లో ‘ఎడ్విన్ ఆర్నాల్డ్’ అనువాదమే మేలయినది. ఈయన అనువాదం మూల సంస్కృత గ్రంధానికి అతి దగ్గరగా ఉంది. విద్యార్థి దశలో చదవకపోయినా కొన్నాళ్ల తరువాత మొదలయిన ఈ గీతా పారాయణం నా జీవితంలోఒక దిన చర్య అయింది.”
"ఈ థియోసాఫిస్ట్ సోదరులు ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన మరో పుస్తకం `The Light of Asia` చదవమని నాకు సూచించారు. దీనిని నేను ‘భగవద్గీత’ మూల గ్రంధం కంటే ఎంతో ఆసక్తి, ఉత్సాహంతో చివర వరకు చదివాను. వీరు ఒక సారి నన్ను ‘Blavatsky Lodge’ కి తీసుకువెళ్లి ‘Madam Helena Blavatsky’, మరియు Mrs. Anne Besant కు పరిచయం చేశారు. Anne Besant అంతకుముందే థియొ సోఫికల్ సొసైటీ లో చేరింది. ఆమె థియోసాఫిస్ట్ గా మారటం ఆ రోజులలో వివాదాస్పదమైంది. నామిత్రులు నన్ను ఈ సొసైటీ లో చేరమని సూచించినా నేను సున్నితంగా తిరస్కరించి, ‘నా మతం గురించి నాకున్న అల్ప విజ్ఞానంతో వేరొక మత సంబంధిత సమాజంలో చేరలేను’ అని అన్నాను.”
“స్నేహితుల ప్రోద్బలం మీద Helena Blavatsky వ్రాసిన ‘The Key to Theosophy’ ను చదివాను. ఇది నన్ను హిందూమతం మీద వ్రాయబడిన కొన్ని పుస్తకాలను చదవటం ప్రేరేపించింది, చదివిన తరువాత వీటిని ఆధారంగా చేసుకుని క్రెస్తవ మిషినరీలు హిందూమతం కేవలం మూఢనమ్మకాల పుట్ట అని చేసిన ప్రచారం ఎంత సత్యదూరమో పూర్తిగా అర్ధమయింది.”
“ఈ దశలోనే ఒక క్రైస్తవ వ్యక్తిని మాంచెస్టర్ లోని ఒక శాఖాహార రెస్టారెంట్ లో కలిశాను. అతను నాతో తన క్రైస్తవ మతం గురించి మాట్లాడితే నేను అతనికి నా ‘రాజకోట’ జ్ఞాపకాల గురించి వివరించాను. అతను విని ‘నేను శాఖాహారిని, మద్యం త్రాగను. కాని చాలా మంది క్రైస్తవులు శాఖాహారులు, మద్యం త్రాగుతారు. కాని మా గ్రంధాలు మాంసాహారం, మద్యం తీసుకోమని ఆదేశించలేదు. నీవు ఒక్కసారి ‘బైబిల్ చదువు’ అని సలహా ఇచ్చాడు.”
“నేను ‘Book of Genesis’ పుస్తకం, ఇతర పుస్తకాలను చదవనారంభించాను. కాని ఇది తలా తోక లేని విషయాలతో నిండి ఉంది. అందువల్ల వీటిని సంపూర్తిగా చదవలేకపోయాను. కాని ‘New Testament’ లో జీసస్ ఇచ్చిన ‘Sermons’ నా గుండెను సూటిగా తాకాయి. నైతిక ప్రవర్తన గురించిన ఆదేశాలు శ్రీకృష్ణుని ‘గీతోపదేశాలతో’ పోల్చి చూశాను.”
“అవి: పాపిని నిరోధించకు; ఎవరైనా నీ కుడి చెంపమీద దెబ్బ వేస్తే, నీ ఎడమ చెంప చూపించు; ఎవరైనా నీ చొక్కా (కోటు)ను తీసుకుంటే వారికి నీ పైపంచె (ఉత్తరీయం) కూడా ఇవ్వు అనే ఇతర ఉప దేశాలు నన్ను ఆకట్టుకున్నాయి. నా మెదడు ‘భగవద్గీత’, Edwin Arnold వ్రాసిన ‘The Light of Asia’, Emmet Fox పుస్తకం ‘Sermon on the Mount’ లోని బోధనలను ఏకీకృతం చేయటానికి ప్రయత్నించింది. ఈ ఏకీకృతం నాకు ఎంతో నచ్చింది. అదే సమయంలో నాస్తికత్వం గురించి ఒక పుస్తకం చదివినా, అది నా మీద ఇసుమంత ప్రభావం కూడా చూపలేదు. దీని తరువాత ఒకప్పటి నాస్తికురాలు ‘Annie Besant’ వ్రాసిన ‘Key to Theosophy’ పుస్తకాన్నీ చదివాను. ఇది కూడా నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.”
ఫ్రాన్స్ పర్యటన, ఐఫిల్ టవర్
1889 మార్చి నుంచి అక్టోబర్ చివరి వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒక పెద్ద ఎగ్జిబిషన్ (Exposition Universelle) జరిగింది. దీనితో పాటు పారిస్ కూడా చూడాలని మోహన్ దాస్ అచ్చటికి వెళ్ళాడు. ఈ ప్రదర్శనలో ‘Eiffel Tower’ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకు ముందే ఈ ‘ఐఫిల్ టవర్’ కట్టడం పూర్తి అయింది. 1,083 అడుగులు ఎత్తు ఉన్న ఈ ఇనుప కట్టడం గురించి గాంధీజీ చాలా కాలం తరు వాత ఇలా వ్యాఖ్యానించారు.
“ఈ ఐఫిల్ టవర్ ఉపయోగమేమిటో నాకు అర్ధం కాలేదు. దీనిని గురించి చాలామంది ఇది ఒక మహత్తర కట్టడమని పొగిడారు. కాని దీనిని చులకన చేసినవారే అధికులు. దీనిని చూసి రష్యన్ నవలాకారుడు ‘లియో టాల్స్టాయ్’ (Leo Tolstoy) తన అభిప్రాయం ఇలా వెల్లడించారు.”
‘ఈ ఐఫిల్ టవర్ మానవుని తెలివి కంటే అజ్ఞానానికి ఒక గొప్ప మచ్చుతునక. పొగాకు అన్నిటి కంటే ఒక హీనమైన మాదక పదార్ధం. దీనికి లోనయినవారు, మద్యపానం కూడా చేసినవారు కూడా చేయ సాహసించని నేరాలు కూడా చేయగలరు. పొగాకు మానవ మేధస్సును ఒక మేఘం లాగా కప్పివేస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తి ఆకాశంలో హర్మ్యాలను నిర్మిస్తాడు. ఇలా నిర్మించబడినదే ఈ ‘ఐఫిల్ టవర్.’
దీనిలో కళాత్మిక పనితనం లేదు. ఇది కేవలం ఒక నూతన కట్టడమని భావించి ఈ ఎగ్జిబిషన్ కు వెళ్లిన వాళ్ళు దీనిని ఎక్కి దిగుతారు. ఈ ఎగ్జిబిషన్ కేవలం ఒక ఆట వస్తువు మాత్రమే. పిల్లలు ఆట వస్తువు లకు ఎలా ఆకర్షులవుతారో అలాగే పెద్దవాళ్ళు దీని వైపు ఆకర్షుతులవుతున్నారు.’
“అందరి లాగానే నేను కూడా 7 షిల్లింగ్ లు ఖర్చు పెట్టి ఈ ఐఫిల్ టవర్ ను మూడు సార్లు పైకి ఎక్కి క్రిందకు దిగాను.”
డోలాయమానంలో పడిన యువ బారిష్టర్
1891 జూన్ 10 వ తేదీన High Court ‘బారిష్టర్’ గా పేరు నమోదుచేసుకున్న మోహన్ దాస్ కు తాను పేరుకు న్యాయవాది అయినా తాను నేర్చుకున్న న్యాయసూత్రాలు, విజ్ఞానం తన వృత్తిలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. తన కక్షిదారు (client) నికి ఏవిధంగా సహాయపడగలనో అవగతమవలేదు, బోధపడలేదు. దీని గురించి ఎన్ని పుస్తకాలు చదివినా సంతృప్తి కలగలేదు.
ఇండియన్ ‘Law’ గురించి ఏమీ నేర్చుకోలేదు. హిందూ Law, ఇస్లాం Law గురించి కొంచెం కూడా తెలియదు. అర్జీదారు (client) తరఫున ముసాయిదా (draft) వ్రాయటం రాదు. అంతా అగమ్యగోచరంగా ఉంది. తన డోలాయమాన స్థితిని గురించి గాంధీజీ ఇలా వ్రాసుకున్నారు.
“ఇవన్నీ నేను ఇంగ్లాండ్ లో ఎలా నేర్చుకోగలను? డాక్టర్ ఫిరోజ్ షా మెహతా న్యాయస్థానంలో ఒక సింహంలాగా గర్జించగలరు. నేను అటువంటి నైపుణ్యం సంపాదించగలననే నమ్మకం లేదు. నేను జీవించటానికి ఈ న్యాయవాది వృత్తి ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయంలో నాలో సందేహం మొదలయింది. ఈ నా సందేహాన్ని నా మిత్రునితో వెల్లడిస్తే అతను లండన్ లో ఉన్న ‘దాదాబాయి నౌరోజీ’ (Dadabhai Naoroji) సలహా తీసుకోమని సూచించాడు. కాని ఆయనను కలవటానికి ధైర్యం చాలలేదు. అంతకు ముందు ఒకసారి కలిసినప్పుడు ‘నీకు ఏ సహాయం కావలెనన్నా నావద్దకు రా’ అని సలహా ఇచ్చారు.
చివరకు ధైర్యం చేసి ఆయనను కలిసి నా అనుమానాలు, సందేహాలు, భయం ఆయనకు వెల్లడించాను. ఎంతో ఆప్యాయతతో, సంతోషంతో ఆయన నన్ను దగ్గరకు తీసుకుని ‘నీ సంకట స్థితి నాకు అవగతంమైంది. నీవు చదివింది చాలా తక్కువ. ఒక వకీలుకు కావలసిన పరిజ్ఞానం లేదు. నీకు మన దేశ పరిజ్ఞానం గురించి తెలిసింది చాలా తక్కువ. న్యాయవాదికి ఒక వ్యక్తి ముఖాన్ని చూసి అతని వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని చెప్పగలిగే నైపుణ్యం ఉండాలి. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు గురించి John Kaye మరియు George Malleson లు వ్రాసిన (Indian Mutiny 1857-58) పుస్తకం చదవలేదు. దానిని నీవు వెంటనే సంపాదించి చదువు. మానసక ప్రవృత్తి మీద వ్రాయబడిన మరో రెండు పుస్తకాలను కూడా చదువు. అలాగే ముఖ సాముద్రికం మీద (physiognomy) Johann Kaspar Lavater మరియు Rutger Schimmelpenninck వ్రాసిన పుస్తకాలను కూడా చదువు’ అని సలహా ఇచ్చారు.
ఈ సలహాలు నాకు ఎంతో నచ్చాయి. ఆయన వద్ద ఉన్న సమయంలో నాలో ఉన్న భయం, విచారం పోయి ధైర్యం ఆవహించింది. కాని బయటకు వచ్చిన వెంటనే నాలో భయం ప్రవేశించింది. మరుసటి రోజు ‘Lavater’ వ్రాసిన పుస్తకం చదవటం మొదలు పెట్టాను. కాని చదవటం కష్టతరమైంది. ఆసక్తిని రేపేలా లేదు. Rutger Shemmelpennick వ్రాసిన పుస్తకం లభించలేదు. William Shakespeare వ్రాసిన ఈ ముఖసాముద్రికం (Physiognomy) పుస్తకం చదివాను.
Lavater పుస్తకం చదివినందువల్ల నా పుస్తక సాముద్రిక పరిజ్ఞానం ఏమీ పెరగలేదు. కాని ఒక మిత్రుడు మాత్రం ప్రతివ్యక్తి న్యాయవాదిగా రాణించటానికి ఫిరోజ్ షా మెహతా కు ఉన్న కుశాగ్ర బుద్ధి, పరిజ్ఞానం, జ్ఞాపక శక్తి, సామర్ధ్యం ఉండనవసరం లేదు. నిజాయితి, కష్టపడే తత్వం ఉంటే చాలు’ అని సలహా ఇచ్చారు.
సిపాయిల తిరుగుబాటు ఉద్యమం గురించి ‘Kaye’ మరియు ‘Malleson’ వ్రాసిన పుస్తకాలు అప్పుడు చదవలేదు గాని ఆ తరువాత దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడు చదివాను. చివరకు కొంత ధైర్యం, ఆశ, మరి కొంత ధైర్యం, నిరాశలో కూడిన మానసిక స్థితిలో నేను లండన్ లో ‘S.S. Assam’ ఓడలో 1891 జూన్ 12 వ తేదీన బొంబాయికి బయలుదేరాను. మూడు వారాల తరువాత బొంబాయి రేవు చేరాను.”
రాయ్ చాంద్ భాయ్
సముద్ర ప్రయాణంలో మోహన్ దాస్ పగలు ఎక్కువ సేపు ఓడపై భాగం (deck) లోనే గడిపాడు. ఉధృతమైన తరంగాలమధ్య ఓడ ప్రయాణిస్తుంటే, భవిష్యత్తు గురించి అనేక ఆలోచనలతో సతమతమవుతూ అల్లకల్లోలమైన మానస స్థితిలో మోహన్ దాస్ తిరిగి వస్తున్నాడు. ఇంగ్లండ్ వెళ్లే ముందు తనను సంఘ బహిష్కరణకు గురిచేసిన విషయం కూడా తన మస్తిష్కంలో తేలియాడుతూ ఉంది. తన వృత్తిలో ఎలా రాణించాలి, తాను మొదలుపెట్టిన సంస్కరణలు, మొదలగు వాటి గురించి అధికంగా ఆలోచించేవాడు ఈ యువ న్యాయవాది.
ఓడ బొంబాయి చేరినప్పుడు పెద్దన్న స్వాగతం పలికాడు. అప్పటికే పెద్దన్న డా. ఫిరోజ్ షా మెహతా, ఆయన అన్నతోనూ మోహన్ దాస్ భవిష్యత్తు గురించి సంప్రదించాడు. వారు అన్నదమ్ములిరువురిని బొంబాయిలో ఉండమని కోరారు. ఇంగ్లండ్ లో మోహన్ దాస్ కు డా. మెహతా ఏర్పడిన పరిచయం భారతదేశంలో బలపడి, చివరకు రెండు కుటుంబాల మధ్య శాశ్వత బంధం ఏర్పరచింది.
మోహన్ దాస్ కు తన తల్లి ‘పుత్లీబాయి’ ని చూడాలని చాలా ఆతృతగా ఉంది. కొడుకుని దగ్గరకు తీసుకుని స్వాగతించటానికి ఆమె ఈ భూమి మీద లేదనే సంగతి అతనికి తెలియదు. అన్న ద్వారా వార్త తెలుసుకున్నప్పుడు మోహన్ దాస్ అమితంగా దుఃఖించాడు. చివరకు శుద్ధి స్నానం జరిగింది. ఇంగ్లండ్ లో ఉన్నప్పుడే అమ్మ చనిపోయిందనే విషయం పెద్దన్న మోహన్ దాస్ కు తెలియనీయలేదు.
ఆమె ఈ లోకంలో లేదనే విషయం మోహన్ దాస్ కు మింగుడు పడలేదు. తండ్రి మరణం సమయంలో కంటే ఎక్కువ బాధకు లోనయ్యాడు.
Dr. మెహతా మోహన్ దాస్ ను కొంతమంది స్నేహితులకు పరిచయం చేశారు. వీరిలో ఒకరు ఆయన తమ్ముడు ‘రవిశంకర్ జగ్జీవన్’. ఈయనతో పరిచయం పెరిగి స్నేహంగా నిలబడి, అది జీవితాంతం నిలబడింది. మోహన్ దాస్ కు పరిచయం కాబడిన వ్యక్తి ‘రాయ్ చంద్’ (రాజ్ చంద్). ఇతను రవి శంకర్ జగ్జీవన్ పేరు మీద నడపబడే నగల వ్యాపారంలో ఒక భాగస్తుడు. 25 ఏళ్ల వయస్సు ఉన్న రాజ్ చంద్ చాలా పాండిత్యం, ఉన్నత గుణాలున్న వ్యక్తి. ఈయన శతావధాని కూడా. ఈయనకు నేరాలమీద చాలా పట్టు ఉంది. దేవునిలో ఐక్యమవ్వాలనే కాంక్ష చాలా ఉండేది. ‘ముక్తానందం’ గురించిన కీర్తన ఆయన హృదయంలో చెక్కబడి, పెదవులమీద నాట్యం చేస్తూ ఉండేది.
ఇతను నగల వ్యాపారంలో కూడా దిట్టయే. వ్యాపారంలో ఎన్ని సమస్యలు ఉత్పన్నమయినా సమర్ధవంతంగా పరిష్కరించేవాడు. విశిష్టమైన ఈ వ్యక్తిని మోహన్ దాస్ గురువుగా స్వీకరించక పోయినా, ఒక మార్గదర్శి, ఉపకారిగా భావించాడు. రాత్రి వ్యాపారం ముగించిన తదుపరి అతను దైవచింతన, ఆరాధనతోనే గడిపేవాడు. ఇతను అనేక దైవసంబంధిత విషయాలను మోహన్ దాస్ కు బోధించేవాడు. మోహన్ దాస్ మీద జీవితాంతం చెరగని ముద్ర వేసిన ముఖ్యులలో రాజ్ చంద్ ఒకరు.
మిగతా ఇద్దరిలో ఒక వ్యక్తి 1894 లో ‘The Kingdom of God is Within You’ గ్రంథకర్త రష్యన్ నవలాకారుడు ‘లియో టాల్స్టాయ్’ (Leo Tolstoy). రెండవ వ్యక్తి 1860 లో ‘Unto This Last’ (ఆర్ధిక శాస్త్రం మీద) వ్రాసిన బ్రిటిష్ రచయిత ‘జాన్ రస్కిన్’ (John Ruskin).
బారిష్టర్-న్యాయవాదిగా గాంధీజీ ప్రహసనం గురించి తదుపరి (అక్టోబర్ 2025) సంచికలో తెలుసుకుందాము.