పూజ ముగించుకుని వచ్చి హాల్లో కూర్చున్నాను. ఫోను మోగింది.
“హలో! ఎవరు?” అంటూ ఫోను తీశాను.
"శంకరన్నా! నేను రామును. నాకు నీ సలహా, సహాయం కావాలి అన్నాడు. మనం ఎం.ఏ. చదివినప్పటి మన సహాధ్యాయులందరినీ ఒక వేదిక మీద సమావేశ పరచాలని నా కోరిక.
దానికి అనుకూలంగా మన సహాధ్యాయులందరి చిరునామాలు సంపాదించాను. అందరితో మాట్లాడాను. మన అందరి కలయిక ఒక తీపి జ్ఞాపకంలాగా మిగిలిపోవాలని నా కోరిక” అన్నాడు రాము.
“మనమందరం పదవి విరమణ చేశాం. అందరూ వచ్చి మా ఊరిలో రెండు రోజులు ఉండాలి. మా ఊరి టౌన్ హాల్లో మన పూర్వ విద్యార్థుల కలయిక ఏర్పాటు చేస్తాను.
ఆ సభలో ముఖ్యంగా నీవు మరి కొంత మంది రామాయణం మీద మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. మనకు నిర్వచనోత్తర రామాయణం, రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, మొదలైనవి ఉన్నాయి గదా! వాటిల్లో నీకు నచ్చిన దానిమీద నీవు మాట్లాడితే, ఇంకా మనలో కొంతమంది మాట్లాడితే బాగుంటుంది. ఆ సభకు మనమే కాకుండా నెల్లూరు పురప్రముఖులు వస్తారు. నీవేమంటావు?" అన్నాడు రాము.
"నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది గదా! రామూ!” అన్నాను.
"డబ్బుదేముందన్నా! ఆ ప్రోగ్రామ్ కు అయ్యే మొత్తం ఖర్చు నేనే భరిస్తాను. నీకు తెలుసు కదా! మా పిల్లలకు మనలాగా ఉద్యోగాలు దొరకలేదు. వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించారు” అన్నాడు రాము.
"నీది పెద్ద మనసు రామూ! నీ సంపాదనతో మన మిత్ర బృందం అంతా మీ ఊరిలో కలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. నీ పుట్టిన రోజున మన సహాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నేను భాస్కర రామాయణం మీద మాట్లాడతాను” అని చెప్పి ఫోను పెట్టేసాను.
మేము ఎం.ఏ. చదివేటప్పుడు మా క్లాసులో ఆడ మగ అందరం కలిసి 22 మంది ఉన్నాము. రాము స్వగ్రామం నెల్లూరు జిల్లాలో ఓ పల్లెటూరు.
రాము తండ్రి స్కూలు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసేవారు. ఆయన ఆర్థికంగా ధనవంతుడు కాకపోయినా, గొప్ప మనసున్న మంచి మనిషి. ఆయన తన బిడ్డలతోపాటు ఒక పేద విద్యార్థిని తన ఇంటిలోనే భోజన సదుపాయం అమర్చి, చదివించాడు. అతనే మా క్లాస్ మేట్ వెంకటస్వామి.
రాము ఎం.ఏ. పాసైన తర్వాత, ఐ.ఎ.ఎస్. పరీక్షకు కోచింగ్ మద్రాసులో తీసుకునేవాడు. నేను ఒకసారి వేరే వ్యక్తిని కలుసుకోవడానికి మద్రాసు వెళ్లి, రాముతో ఒక రోజు గడిపి వచ్చాను.
రాము ఐ.ఎ.ఎస్. చదివేటప్పుడే, ఒక ధనవంతుడు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు. రాము జీవితం మారిపోయింది.
రాము ఐ.ఎ.ఎస్. పరీక్ష పాసవలేకపోయాడు. రాము నెల్లూరు కాలేజిలో లెక్చరర్ గా ఉద్యోగంలో చేరాడు. రాము మామ గారు మద్రాసులో వ్యాపారం చేసేవాడు.
నేను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తుంటే... రాము వాళ్ళ మామ గారి ఇంటికి మద్రాసు వచ్చినప్పుడు...మా ఇంటికి వచ్చి, నన్ను కలిసి వెళ్లేవాడు.
ఒకసారి రాము నాతో, "శంకరన్నా! మా ఉరి బయట నాలుగు ఎకరాల పొలం అమ్మకానికి వచ్చింది. మనం ఇద్దరం కలిసి ఆ పొలం కొందాం. భవిష్యత్తులో బాగా ధర పెరుగుతుంది” అన్నాడు.
"మా నాన్న చనిపోతే కర్మ కాండలకు నా దగ్గరున్న డబ్బు ఖర్చయింది. నేను పొలం కొనలేను” అన్నాను.
అన్నా! నీవు పొలం కొనకపోతే, నాకు డబ్బు అప్పుగా ఇవ్వమన్నాడు. నా దగ్గర డబ్బులేదు రామూ అన్నాను.
సరే అన్నా! ఎక్కడో ఒక చోట డబ్బు అప్పుగా తెచ్చి ఆ పొలం కొంటానన్నాడు. కొన్నాడు. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో దాని ధర బాగా పెరిగింది.
*********
కొంత కాలం తర్వాత రాము మా ఇంటికి వచ్చినప్పుడు ...
"శంకరన్నా! నేను ఉద్యోగం మాని, వ్యాపారం చేద్దామనుకుంటున్నాను” అన్నాడు.
"రామూ ఉద్యోగం మానవద్దు. ఉద్యోగం పాడికుండ లాంటిది. ప్రతి నెల ఒకటవ తారీఖుకి జీతం వస్తుంది...
వ్యాపారం అంటే లాభ నష్టాలు ఉంటాయి” అన్నాను.
"అలాగే అన్నా! నీవు చెప్పినట్లే చేస్తాను” అన్నాడు రాము.
కొంత కాలం తరువాత రాము పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు అవుతుంటే, ఖర్చులు పెరిగి, రాము తండ్రితో కలిసి వ్యాపారం ప్రారంభించాడు.
మొదట కోళ్ల ఫారాలు వేశాడు. పని వాళ్ళ సాయంతో, తన కోళ్ల ఫారాలలోని కోడి గుడ్లు మాత్రమే కాకుండా, ఇతరుల దగ్గర కూడా కొని, తమిళనాడుకు పంపించేవాడు. లాభాలు బాగా వచ్చేవి.
వచ్చిన లాభాలతో కోళ్ల ఆహారం అమ్మే షాపు పెట్టాడు. రాము పెద్ద కొడుకు ఇంటర్ తో చదువు మానేశాడు. రాము తండ్రి, రాము కొడుకు కలిసి షాపు నడిపేవారు. రాము భార్య పని వాళ్ళతో, కోళ్ల ఫారాలలో పని చేయించేది.
రాము జాతకం చాలా బాగుంది. పట్టిందల్లా బంగారం అయ్యేది. వచ్చిన లాభాలతో ఇళ్ల స్థలాలు కొనేవాడు. రాము కూతురు సరోజ మా కాలేజీలో ఎం.ఏ. చదివింది. నాదగ్గరే ఎం.ఫిల్. చేసింది. అందువల్ల రాముకు నా పట్ల అభిమానం.
రాము తాను సంపాదించిన ధనంతో, పేద విద్యార్ధులను చదివించే వాడు.
రామును గురించిన ఆలోచనల నుండి తేరుకున్నాను...
నా శ్రీమతి వంట గది నుండి వచ్చి, “ఎవరు ఫోను చేశారు?” అంది. అన్నీ వివరంగా చెప్పాను.
"మీ స్నేహితుడు రాము ఉదార స్వభావంతో, కలిసి చదువుకున్న సహాధ్యాయులకు సన్మానం చేస్తున్నాడు” అని మెచ్చుకుంది.
**********
నెల్లూరు టౌన్ హాల్లో మా సహాధ్యాయుల సమావేశం జరిగింది.రాము అంతకు ముందు వ్రాసిన ‘శివ గామిని’ పద్య కావ్యం, పుస్తకాలను మా అందరికీ ఇచ్చాడు. కొందరు తమకు నచ్చిన రామాయణం మీద మాట్లాడారు.
మిసమిస లాడే నవ యవ్వనంలో కలిసి చదువుకున్న మేము దాదాపు నలభై సంవత్సరాల తర్వాత వార్ధక్యంలోకి అడుగు పెట్టబోతూ కలుసుకున్నాం.
ఆ ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని మాకు కలిగించిన రాముకు ధన్యవాదాలు తెలుపుతూ, అందరం సెలవు తీసుకున్నాం.
రాము నెల్లూరులో "పద్య కళా పరిషత్తు"ను స్థాపించాడు. వేదిక మీద అప్పుడప్పుడూ ఉపన్యాసాలు ఇప్పిస్తుండేవాడు. నేను కూడా కొన్ని సార్లు మాట్లాడాను.
రాము చిన్న కొడుకులు ఇద్దరూ పి.జి. చదువుకున్నా తగిన ఉద్యోగాలు దొరకలేదు. వారు కూడా తండ్రి వ్యాపారంలో భాగస్వాములయ్యారు.
రాము పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. మనుమలు, మనుమరాళ్లతో, రాము ఇల్లు కళకళలాడుతుంది. ఆ ఇంటికి నేను ఎప్పుడూ వెళ్ళినా అందరు ఆప్యాయంగా మాట్లాడుతారు.
మా పిల్లలు, బాగా చదువుకుని ఇంజనీర్లు అయ్యారు. పెద్ద కొడుకు అమెరికాలో, చిన్న కొడుకు ఇండియాలో స్థిరపడ్డారు.
పోయిన నెలలో ఒక రోజు రాము ఫోను చేసి, "శంకరన్నా! నిన్ను చూడాలని ఉంది. నీవు ఒకసారి మా ఊరు రావాలి” అన్నాడు.
"రామూ! నాకు ఇప్పుడు 85వ సంవత్సరం నడుస్తోంది. నేను ఇదివరకులాగా ఉత్సాహంగా ప్రయాణం చేయలేకపోతున్నాను” అన్నాను.
"సరే అన్నా! నేనే ఒక వారం రోజుల్లో వీలు చూసుకుని, మద్రాసు వస్తాను” అన్నాడు రాము.
రాము నాకన్నా రెండు సంవత్సరాలు చిన్నవాడు. అతనికి 82 సంవత్సరాలు నిండాయి. మనం ఈ వయసులో ఏ పని చేయాలనుకున్నా వెంటనే చేయాలి. తాత్సారం చేయకూడదు.
మనం మానవులం. మనం అనుకున్నవి అన్నీ చేయలేము. పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి.
వారం తర్వాత నా ఫోనులో మెసేజ్ వచ్చింది. చూస్తే...రాము హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అని ఉంది.
అది చదివి దీర్ఘంగా నిట్టూర్చాను. మనసు బాధతో నిండిపోయింది. "ఆలస్యం అమృతం విషం" అన్నారు. ఇది ఎంతో అనుభవంతో పెద్దలు చెప్పిన మాట.
నన్ను చూడాలని వస్తానన్న రాము, పనుల వత్తిడి వల్ల రాలేకపోయాడు. అంతలోనే మృత్యువు ముంచుకు వచ్చింది. ఇక ఈ జన్మలో రాము, నేను ఒకరిని ఒకరు చూస్తూ ఆనందంగా గడపలేము. ఇంతకన్నా విషాదం ఏముంటుంది?