Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు - 21
పారనంది అరవిందారావు

చలి ..కాని ..చలి

chali-kaani-chali

చలి చలి
ఇల్లంతా చలి
ఒళ్ళంతా చలి
ఒదిగి కూర్చున్నా ఆగలేని చలి
ఇల్లంతా కాల్చినా ఆపలేని చలి

వద్దు వద్దన్నా తరువులు
గాలి విసిరి కొడుతున్నాయి
హద్దులేక మబ్బులు నింగినుండి
కుండపోతగ కురుస్తున్నాయి
చలి చలి
ఇల్లంతా చలి
ఒళ్ళంతా చలి

ఎముకల్ని చీల్చుకుని
ఎదని ఆక్రమించుకుని
గణాచారులను సైతం
గజ గజ లాడించే చలి

నా ఆంక్షలు ఆశయాల్ని
పిక్కలుగా గుమ్మరించి
ఓ రకం చదరంగం ఆడుతున్నా!
ఆశలు నిరాశల్ని
ఒకదానిపై ఒకటిపేర్చి చలిబొంత
నేర్పుగా కుట్టుకుంటున్నా!

ఏది ఎలాఉన్నా ఎవరేమన్నా
ఎండరోజు నా కెదురాడి
గంతులేసే అవయవాలు
చలి చూచి ఒక్కటై
నా చుట్టూ కూర్చున్నాయి!
చలికి చెమ్మెక్కిన గుండె
సెగకై ఎదురు చూస్తున్నాయి!

ఎవరు వీళ్ళు?

evaru-veellu

ఎవరు వీళ్ళు?
నా వెనక నీడల్లా వస్తున్నారు.
నా గమ్యం నాకే తెలియక
ఏ దారిన వెళ్ళాలో నాకే తెలియక
మొద్దుబారిన మెదడుతో
మసకబారిన చూపుతో
తడబడిన అడుగులతో
గుండె చిక్క బట్టుకుని
గురి లేని జీవితంలో
సాగిపోతున్నాను.

ఎదలో సుత్తులు వినిపించకుండా
ఏదో మత్తులో ఊగుతో ....
చేయాలని అనుకున్నవీ
చెప్పాలనుకున్నావీ
చేయలేకపోయానని చెబుతున్న
మనస్సు నోరు నొక్కేసి
గతంలో తప్పు దారి తొక్కిన
కాళ్ళవంక కన్నెర్రజేసి
మరుగుతున్న ఆలోచనలకి
మర తిప్పేసి పోతుంటే....
ఎవరు వీళ్ళు?

నా వెనక నీడల్లా వస్తున్నారు.
మరో ప్రాణి లేనిచోట మారుమూల దాగి
క్రీనీడల చాటున గట్టిగ
కట్టి తెచ్చిన పశ్చాత్తాపాల మూటని
పారేసి పరిగెత్తిపోవాలి…..
మరి వీళ్ళెవ్వరు? నా వెనుక
నీడల్లా వస్తున్నారు.
గుర్తులొదలక జాగరూకతో
మోసుకొచ్చాను ఈ మూటని....కాని
మూటలోంచి కారుతున్న కన్నీటి బొట్లు
దీపాల్లా మెరిసి త్రోవ చూపిస్తున్నాయని
తెలుసుకోలేకపోయాను…..
పిచ్చి జనం… నాదే రాచ మార్గమని
నా వెనక నడుస్తున్నారు…

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in October 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *