Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

సహనం

కోరికలే దుఃఖానికి మూలకారణం అన్నాడు బుద్ధుడు. అయినా మన కోరికలకి అంతు అన్నది వుండదు. అంతేకాదు, అవి వెంటనే తీరేదాకా మనసుకి శాంతి కూడా వుండదు. మరి జీవితంలో అన్నీ అలా కోరుకున్న వెంటనే తీరిపోతే అది ఇంక జీవితం ఎలా అవుతుంది? అందుకనే అప్పుడప్పుడు, ఆమాటకొస్తే, చాలాసార్లు కోరికలు తీరాలంటే చాలా ఓపికతో ఎదురుచూడాల్సి వుంటుంది. దాన్నే సహనం అంటారు. అంటే సహనంతో ఎదురుచూస్తే  తప్ప ఏ పని కాదన్నమాట. మంచి విషయాలన్నీ అసలు ఎంతో సహనంతో ఎదురుచూస్తే తప్ప దొరకవని పెద్దవాళ్ళు అన్నారు. అంటే ఏదన్నా పొందాలంటే పరిశ్రమ, పట్టుదలలతో పాటు సహనం కూడా చాలా అవసరం అన్నమాట. మరి ప్రత్యేకమైనవి, ఎంతో విలువైనవి అంత సులభంగా ఎలా లభిస్తాయి? అవునా?

అంటే ఇప్పుడు మనకి అర్ధం అవుతున్నదేమిటంటే మనకి ఏదన్నా కావాలంటే విసుక్కోకుండా, కసుక్కోకుండా, కోపం తెచ్చుకోకుండా, క్రమశిక్షణ, పరిశ్రమలతో పాటుగా ఓపికగా సంయమనంతో, స్వీయ నియంత్రణలతో ఎదురుచూడటమే సహనం అంటే. కానీ అవసరానికి తగ్గట్లుగా సహనానికి పరిశ్రమ కూడా తోడవ్వాలి. మన కృషి మనం మానకూడదు. ఉదాహరణకి సినిమా నటుల్ని చూసి మనం ఎప్పుడూ కాకపోయినా కనీసం అప్పుడప్పుడన్నా అనుకుంటాం, వీళ్ళకి easy money వస్తోందని అనుకుంటాం కదూ? కానీ ఆ విజయం వెనకాల వాళ్ళు ఎన్ని ఏళ్ళు అపజయాలను, ఆశాభంగాలను పొందారో, ఎన్ని రాత్రుళ్ళు నిద్రాహారాలు లేకుండా గడిపారో, అడుగడుగునా అపజయాలు ఎదురవుతున్నా ఆశను వదలకుండా పట్టుదలతో ఎంత ఎక్కువగా పరిశ్రమ చేసారో మనకు ఆ నిముషంలో గుర్తు రాదు. అవునా? చివరికి వారి సహనానికి, కృషికి తగిన ఫలం లభించినప్పుడు కూడా మనకు అది వారి అదృష్టంలాగా అనిపిస్తుంది కానీ వారి సహనానికి లభించిన బహుమతి అని అనిపించదు. అలా అనుకోవడం అన్యాయం ఏమో! వారి సహనానికి, చిత్తశుద్ధికి లభించిన ఫలితాన్ని కళ్ళు తెరచి చూడటం మన కనీస ధర్మం. ఒక్కసారి ఆలోచించండి, వారు అలా సహనంగా తమ ప్రయత్నాల్ని కొనసాగించకుండా అప్పుడే వెనుకకు తిరిగి వెళ్ళిపోతే ఇప్పుడున్న అత్యద్భుతమైన నటులలో మనకు చాలామంది మిగిలేవారే కాదేమో! అవునా? అలా ఎదురుచూపులు చూడకుండా మొదటి చిత్రంతోనే అమోఘమైన  విజయాన్ని పొంది రాత్రికి రాత్రే తిరుగులేని నటులని పేరు, దానితో పాటు పుష్కలంగా ధనరాశులను కూడా సంపాదించుకున్నవారు కూడా లేకపోలేదు. కానీ ఆ కోవలోకి వచ్చే వారు చాలా తక్కువమంది. అలాంటివారు కూడా తమ నటజీవితంలో సహనాన్ని అలవరచుకోకపోతే ముందు ముందు భవిష్యత్తులో అపాయాలు తప్పవు. ఎందుకంటే ప్రారంభం దివ్యంగా మొదలైనా ఆతర్వాత ఆ విజయం శాశ్వతంగా కొనసాగాలంటే సహనం అన్నది తప్పనిసరిగా వారికి కావాలి. దీన్నిబట్టి సహనం విజయానికి చాలా అవసరమైన లక్షణం అని మనకి తెలిసిపోతోంది.

నాకు తెలుసు, మనం ఎంతో గాఢంగా కావాలని కోరుకున్నవి వెంటనే అందకపోతే చాలా బాధగా వుంటుంది. బెంగగా కూడా వుంటుంది. వ్యక్తిగతంగా చెప్పాలంటే నా జీవితంలో నేను ఎన్నో, ఎన్నెన్నో, చాలా చిన్నవి, అతి సాధారణమైనవి, చాలావరకు అందరి దగ్గరా వున్నవి కూడా, పొందడానికి భూమ్యాకాశాలని ఏకం చేసినంత కష్టపడాల్సి వచ్చింది. అంతులేని ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. అసలు ఈ పని అవుతుందా లేదా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడాల్సి వచ్చింది. అయినా పట్టు వదలని ఆడ విక్రమార్కుడిలాగా పదేపదే ప్రయత్నాలు కొనసాగించాను. ఒక్కొక్కసారి ఆ ప్రయత్నాలలో అలిసిపోయి ఒకవేళ వాటి ఫలితం లభించినా కూడా వాటిని అందుకుని, ఆనందించలేనేమో అని అనుమానపడేదాన్ని. అయినా సహనంతో కృషిని కొనసాగించాను కాబట్టే ఆలస్యంగానైనా సరే, చాలావరకు వాటిని సాధించగలిగాను. ఆశించినది అందనపుడు నిరాశను పొందటం మానవ సహజం. కానీ అలాంటప్పుడే మన సహనం మనకు అక్కరకు వస్తుంది. మనలో ఓర్పుని  నింపి, ఒక కొత్త వూపిరిని అందిస్తుంది. కోరుకున్నది సాధించే వరకు నిద్ర పోకండి అని మనల్ని ముందుకు తోస్తుంది.

అసలు మనం కోరుకున్నది మనకి అందనప్పుడు, లేదా మనకి అనుకోకుండా అపజయం ఎదురైనప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తాము అన్నదే మన సహనానికి ఒక పెద్ద కొలబద్ద.  అరిచి, గోలచేస్తామా? ఏడ్చి రాగాలు పెడతామా? మన ఉక్రోషం, ఆశాభంగాలన్నింటినీ ఎదుటివారి మీద కుమ్మరిస్తామా? ఎదురైనవారందరి మీద మన చికాకులనంతా ఒలకబోస్తామా? ఇంకెన్నడూ ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకూడదు, మనకి అవి ఎటూ దొరకవు అనుకుంటూ నిరాశతో ముడుచుకుపోతామా? లేక ఎలాగైనా సరే, వీటిని సాధించి తీరాలి అని తీర్మానించుకుంటామా? ఏం చేస్తాం? ఎలా ప్రతిస్పందిస్తాం?

పోనీ, సకారాత్మకమైన ఆలోచనలతో, సహనంతో ఎదురుచూడాలి అని అనుకున్నా కూడా మళ్ళీ దాంట్లో కూడా ఒక తంటా వుంది. మన సహనం మంచి పంధాలో నడుస్తోందా? లేక చెడు పద్ధతిని అవలంబిస్తోందా? ఈ ప్రశ్న ఎదురవుతుంది. ఇదేమిటి? సహనంలో కూడా మంచి, చెడు అన్న తేడాలు వుంటాయా అని ప్రశ్నించుకుంటే వుంటాయి అనే చెప్పుకోవాలేమో! చెడు సహనం అని అంటుంటే వినడానికి కొంచెం కటువుగా వుందేమో! పోనీ, కొంచెం ఎక్కువ మంచి, కొంచెం తక్కున మంచి అని చెప్పుకుందాం. మనకు  కావాల్సినదాని కోసం ఎదురుచూస్తూనే అది అందేలోపు వుత్తగా చేతులు ముడుచుకొని కూర్చోకుండా మన చేతిలో వున్నంతవకు ప్రయత్నాలు కొనసాగిస్తూ, ఇంకా వేరే ఇతర పద్ధతులు ఏవన్నా వున్నాయేమో అని వాకబు చేస్తూ, అలాగే ఇతరేతర వనరులు, అవకాశాల గురించి కూడా ఆలోచిస్తూవుంటే క్రియాశీల సహనం, అంటే active patience అవుతుంది. దీనికి విరుద్ధంగా మనకి ప్రాప్తం వున్నప్పుడు అది దొరుకుతుంది, అంతవరకూ మనం చేసేదేమీ లేదు అని చేతులు ముడుచుకుని కూర్చుంటే అది నిష్క్రియాశీల సహనం, అంటే passive patience అవుతుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ మంచిదో మీరే తేలికగా చెప్పేస్తారు.  మొదటి పద్ధతిలో సకారాత్మకత వుంది, స్వీయ నియంత్రణ, అంటే self-control వుంది, స్వావలంబన, అంటే self-dependency వుంది, ఆత్మాభిమానం వుంది, క్రమశిక్షణ వుంది, పట్టుదల వుంది, పరిశ్రమ వుంది. రెండో పద్ధతిలో బద్ధకం వుంది, కొంచెం మోటు భాషలో చెప్పాలంటే ఏమాత్రం ప్రేరణ లేని సోమరితనం వుంది, ఓటమి వుంది, ఆలస్యం వుంది, అలసట వుంది. అందుకనే సహనంతో మనం ఎదురుచూస్తూనే మన ప్రయత్నాలు కూడా మనం కొనసాగిస్తూనే వుండాలి. అప్పుడే ఆ సహనం ఫలవంతంగా, అంటే productive గా వుంటుంది.

అందుకే Leo Tolstoy అనే ఒక ప్రముఖ రష్యా రచయిత సహనం అంటే ఎదురుచూడటం అన్నది నిజమే అయినా ఏమీ పని పాటా లేకుండా కేవలం ఎదురుచూడటంలోనే సమయం గడపకుండా సరైన దారిలో మన ప్రయత్నాలు కొనసాగిస్తూ పయనం సాగిస్తూ వుండడమే అసలైన సహనం అని అన్నాడు. కానీ మానవ సహజంగా చాలామంది ఆ దారిని ఎన్నుకోరు. ఎందుకంటే దానికి కనీసం కొంచెం అన్నా కష్టపడాలి కదా! మరి కష్టపడటం ఎవరికిష్టం వుంటుంది?

వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ, సాంకేతికంగా కానీ, కళారంగంలో కానీ, ఎక్కడైనా సరే, సహనం లేకపోతే ఏమీ సాధించలేము. మనలో పుట్టుకతోనే సహజ ప్రతిభలు వున్నా సహనం తో కూడిన సాధన వాటికి సాన పెట్టి వజ్రంలాగా మెరిసేలా చేస్తుంది. హిందీ చిత్రరంగంలోని ప్రస్తుత ప్రముఖ యువతార టైగర్ ష్రాఫ్ వాళ్ళ నాన్న, ఆయన కూడా నటుడే, జాకీ ష్రాఫ్, వాళ్ళ అబ్బాయిని గురించి, మా అబ్బాయికి వచ్చిన పేరుప్రతిష్ఠలకి వాడు నిత్యం చేసే సాధన, సహనం తో కూడిన అభ్యాసం మాత్రమే కారణం అన్నాడు. అతని ప్రతిభ గురించి ఆయన అసలు ప్రస్తావించనే లేదు. ఎందుకంటే సాధన వలన ప్రతిభ పెరుగుతుంది. మరి సాధన చెయ్యాలంటే దానికి సహనం కావాలి కదా! అసలు కళారంగంలో పేరుప్రతిష్ఠలు సంపాదించాలంటేనే చాలా సహనం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈర్ష్యాసూయలు, పోటీలు, కుతంత్రాలు ఆ రంగాల్లో కొంచెం ఎక్కువగా వుంటాయి. అలాంటప్పుడు ఎంత సహనంగా వుంటే అంత ఎక్కువ మంచిది.

వృత్తిపరంగా కూడా ఈ సహనం ఎన్నోసార్లు మనల్ని ఆదుకుంటుంది. మనం ఆశించిన ప్రమోషను మనకు అందకపోవచ్చు. మనం అనుకున్నట్లుగా మన ప్రోగ్రాము ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఎదురుగా వున్న తప్పులను  కూడా ఒక్కొక్కసారి మన కళ్ళు చూడలేకపోవచ్చు. లేక వేరే ఇంకేవో సాంకేతిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఆఫీసులో వీటన్నిటిని నేను ప్రతిరోజూ చూస్తూనే వుంటాను. కానీ కొంచెం సహనాన్ని చూపించి మన ప్రయత్నాన్ని మళ్ళీ మళ్ళీ కొనసాగిస్తే తప్పులను గుర్తించగలం, ఈ సమస్యలనన్నింటిని పరిష్కరించగలం. అలాగే కొత్త కొత్త ట్రైనింగు ప్రోగ్రాములకి వెళ్ళాలన్నా, మనకి తెలియని విషయాలను నేర్చుకోవాలన్నా,  అసలు ఏ కొత్త పని చెయ్యాలన్నా సహనం అన్నది తప్పనిసరిగా కావాలి.

అందుకే వ్యక్తిగా కానీ, వృత్తి లో కానీ, ఇంక వేరే ఏ ఇతర విషయంలో కానీ ఒక మనిషి ఎదగాలంటే ఈ సహనమన్నది చాలా అవసరం. సరే, ఇంక కుటుంబ సభ్యులు, మనకి నిత్యం అన్ని రంగాలలో తారసపడే వ్యక్తులతో మన పరస్పర వ్యవహారాలు, అంటే interactions అన్నమాట, వాటిని సవ్యంగా నిర్వర్తించాలంటే సహనం తప్పనిసరిగా వుండి తీరాలి. లేకపోతే అతి నాజూకైన ఆ బంధాలు తెగిపోతాయి.  తెగిపోయిన, లేక బీటలువారిన బంధాలను తిరిగి సమకూర్చుకోవాలంటే కూడా మళ్ళీ రెట్టింపు సహనం కావాలి. వృత్తిలో కూడా అంతే. ఉదాహరణకి నేను పాటలు పాడేటప్పుడు కొంతమంది composers కొన్ని విషయాలలో చాలా ఖండితంగా వుండేవారు. వారు చెప్పిన దానికి కొంచెం కూడా ఎక్కువ, తక్కువగా పాడితే వారికి నచ్చేది కాదు. నూటికి నూరు పాళ్ళు  అచ్చంగా వారు చెప్పినట్లే పాడాలని పట్టుపట్టేవారు. అందులో కొంతమంది కొంచెం కోపిష్టులు కూడాను.  అయినా ఒక్కరోజు కూడా నాకు ఎవ్వరితోను ఎటువంటి సమస్యా రాలేదు. దానికి వారు చెప్పింది చెప్పినట్లుగా పాడగల సూక్ష్మగ్రహణశక్తి తో పాటు నా సహనశక్తి కూడా కారణమని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఎదుటివారి మీద మనకి నియంత్రణ వుండదు. కానీ మన మీద మనకి వుంటుంది కదా! కొంచెం కటువు స్వభావం వున్నవాళ్ళతో పరస్పర వ్యవహారం ఇంక తప్పదు అనే పరిస్థితులలో ఇంకొంచెం ఎక్కువ సహనాన్ని మనమే చూపిస్తే సరిపోతుంది కదా! ఇంకో విషయం. శిష్యులకే కాదు, గురువు స్థానంలో వున్నవారికి కూడా సహనం చాలా అవసరం. ఎందుకంటే శిష్యులందరి గ్రహణశక్తి ఒకే స్థాయిలో వుండదు. తక్కువ స్థాయిలో వున్నవారిమీద విసుక్కుని చికాకు పడితే ఏమీ లాభం వుండదు. వారి అభ్యాసప్రక్రియ, అంటే learning process, ఇంకా వెనుకపడుతుంది. అలాంటివారితో సహనం అత్యవసరం.

అలాగే ఆఫీసులలో తమ జట్టువారందరి దగ్గరి నుండి మంచి పని రాబట్టుకుని విజయవంతంగా అనుకున్న సమయంలో తమ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలనుకుంటే ఆ జట్టు నాయకునికి లేక నాయకురాలికి అమితమైన సహనం వుండటం అత్యంత అవసరం. లేకపోతే మొత్తం వారి జట్టు అంతా ఆ అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంక కళారంగాల్లో అయినా కూడా అంతే! సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, నృత్య దర్శకులు, వీరి విషయంలో కూడా అంతే! అలాగే, మీరు నమ్మరేమో కానీ, గురువులతో పాటు వారి దగ్గర వివిధ పదవులలో పని చేసే సహాయకులకి కూడా సహనం చాలా అవసరం. ఉదాహరణకి రికార్డింగ్ స్టూడియోలలో వుండే సౌండ్ ఇంజనీర్లకి కూడా సహనం చాలా చాలా అవసరం. ఒక పాటను రికార్డు చేస్తున్నపుడు అప్పుడప్పుడు అనుకోకుండా ఎక్కువసార్లు ప్రయత్నాలు చెయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకొక్కసారి చాలా తేలిక అనుకున్న పాట కూడా అనుకున్న రూపంలోకి రావటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా రీటేక్ లు తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే composer తో సరిసమానమైన సహనం ఆ పాటను రికార్డు చేసేవారికి కూడా వుండాలని అంటాను నేను.

ఇద్దరు మనుషుల మధ్య సామరస్యం ఏర్పడాలంటే ఒకరిని ఒకరు ఓపికగా వినాలి.  ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవాలి. ఇద్దరి మధ్యా పరస్పర అవగాహన కావాలి. దీనంతటికి రెండు వైపుల నుండి  సహనం కావాలి. సహనమన్నది రెండు మనసులను కలిపే ఒక వారధిలాంటిది. అది మనసులలోంచి అనుమానాలను, అనిశ్చితి, అంటే uncertainty ని దూరం చేస్తుంది. నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పుతుంది. అంతేకాదు, తప్పు నిర్ణయాలను తీసుకోకుండా సహనం మనల్ని రక్షిస్తుంది. మన వ్యక్తిత్వాన్ని అలంకరించి అందరి కళ్ళతో పాటు వారి మనసులకి కూడా ఇంపుగా కనిపించేట్లు, అనిపించేట్లు చేస్తుంది. ఎవరినైనా సరే, వారిని వారుగా స్వీకరించేలా చేస్తుంది. వారి పట్ల మన empathy ని పెంచుతుంది. మనలో శ్రద్ధని, పట్టుదలని, వినయాన్ని పెంచుతుంది.

ఇంకో విషయం. ఆర్ధికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఈ సహనమే మన అక్కరకు వస్తుంది. అప్పుడప్పుడు మనకి లభించే చిన్న చిన్న విజయాలు మనకి చాలా నష్టాన్ని తీసుకొస్తాయి. ఆ తాత్కాలిక విజయాల మత్తులో పూర్తిగా మునిగిన మనం వాటి ఆయువు చాలా కొంచెమే అని ఆ క్షణంలో గ్రహించం. ఆ కొద్దిపాటి విజయానికే సంతోషంలో తలమునకలైపోయి  మనం జీవితంలో అసలైన గమ్యాలని మర్చిపోతాం. ఎందుకంటే విజయం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువై అహంభావంగా మారినప్పుడు వినయం దూరంగా పారిపోతుంది. అప్పుడే మనిషి పతనం  ప్రారంభమవుతుంది. అంటే వినయం, సహనం లేకపోతే పతనం తప్పదన్నమాట. అందుకే తాత్కాలిక విజయాల మత్తులో శాశ్వతమైన సహనంలాంటి అసలైన మణులను, సుగుణాలను మనం మరువకూడదు.

సహనం అప్పుడప్పుడు మొండితనంలాగా లేకపోతే గర్వంలాగా  అనిపించవచ్చు, కనిపించవచ్చు. కానీ ఆ రెంటికీ చాలా తేడా వుంది. సహనంలో విశ్వాసం వుంటుంది, మరి గర్వంలో పొగరు తప్ప ఇంకేదీ వుండదుగా! సహనంలో ఓపికతో పాటు దయ, వినయం కూడా వుంటాయి. సహనం అనుకోని అవాంతరాలని తట్టుకునే శక్తినిస్తుంది. చాలామందికి ఆ శక్తి లేకపోవటం వలన వారు కష్టాలు ఇచ్చే మానసిక ఒత్తిడికి దాసోహం అంటారు. కానీ సహనం తన శక్తితో అన్ని దుష్ట శక్తులను ఓడిస్తుంది. కష్టాలలో ఓర్పు, వివేకంతో ప్రవర్తిస్తూ భావోద్వేగంతో కాకుండా హేతువాదంతో నిర్ణయాలు తీసుకునేట్లుగా చేస్తుంది. అందుకే సహనం లేనివారు తమ తొందరపాటుతో తరచుగా తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. తప్పు మాటలు అనేసి, తప్పు వాగ్దానాలు ఇచ్చేసి, తప్పు పనులు చేసేసి చిక్కుల్లో ఇరుక్కుంటారు. చక్కగా విజయంతో సంపూర్ణమయ్యే పనులను కూడా తమ అసహనంతో, తొందరపాటుతో అసంపూర్తిగా ఆగిపోయేలాగా చేసుకుంటారు. అపజయాన్ని చేజేతులా ఆహ్వానిస్తారు. మనస్తాపాన్ని ఆర్జించుకుంటారు. కానీ సహనవంతులు తమపై అసలు ఎటువంటి ఒత్తిడిని రానివ్వరు. ఒకవేళ వచ్చినా, దాన్ని తమ ఓర్పు, వినయాలతో దూరంగా తరిమేస్తారు. ఎప్పుడూ తమ శాంత స్వభావంతో సరైన నిర్ణయాలు తీసుకుంటూ తమ చుట్టూ వున్న వారిని కూడా ఎప్పుడూ ఆనందంలో ముంచుతారు. అందుకే సహనవంతులకి  రక్తపుపోటు, గుండెజబ్బులలాంటివి వచ్చే అవకాశం చాలా తక్కువ.  సహనవంతులకి స్నేహితులు కూడా చాలా ఎక్కువమంది వుంటారు. ఎందుకంటే ఎదుటివారిలో వారు పరిపూర్ణత, అంటే perfection ని ఆశించరు. వారి లోపాలను కూడా స్నేహంలో  స్వీకరిస్తారు. వీలైతే వారిని మంచి వైపు మరలించటానికి, వారిని సంపూర్ణం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. అయినా మనిషన్న తర్వాత perfect గా ఎవరుంటారు? ఒకరి లోపాలను ఇంకొకరు సహనంతో భరించటం, వీలైతే వాటిని భర్తీ చెయ్యటమే మనందరి బాధ్యత. అవునా?

సహనం మనిషి నాకు కావాలి అని ఎంచుకునే ఒక ఎంపిక. దీన్ని ఎంతో చిత్తశుద్ధితో,  నిజాయితితో దీర్ఘకాలనిబద్ధత లాగా, అంటే long-term commitment లాగా తీసుకోవాలి. సహనం అందరూ పొగిడే ఒక సుగుణం, కానీ చాలా కొద్దిమంది మాత్రమే అలవరచుకొనే కష్టతరమైన గుణం. ఏదన్నా అనుకున్న వెంటనే ఫలితం దొరకాలి అని దురాశ పడే ఈ వేగం యుగంలో సహనంగా దేనికోసమన్నా వేచివుండాలని కోరుకోవటం నిజంగా ఒక సవాలు  లాంటిది. దానివలన చివరకు మనకు విజయం లభిస్తుందని తెలిసినా కూడా ఆలస్యం ఓటమిలాగా అనిపిస్తుంది చాలామందికి. మనం కోరుకున్నది వెంటనే లభించాలి అని కోరుకోవటం మానవ సహజం. దానికోసం మనం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడం.  అలాగే ఏదన్నా నష్టం కలిగితే దాన్ని అతి త్వరగా భర్తీ చేసుకోవటానికి కూడా మనం ఏమాత్రం ఆలస్యాన్ని భరించలేము. ఇవన్నీ కూడా మనకి సహనం లేకపోవడం వల్లనే జరుగుతున్నాయి.

మనం గమనిస్తూ వుంటాము, చిన్న చిన్న విషయాలకే కొంతమందికి విసుగు వచ్చేస్తూ వుంటుంది, కోపంతో తలమునకలైపోతూ వుంటారు, చీటికిమాటికి ఒకటే చికాకుపడిపోతూ వుంటారు. ఇలాంటి రోజుల్లో సహనాన్ని తెచ్చుకోండి అని చెప్పడం కూడా ఏటికి ఎదురీదండి అని చెప్పటంలాంటిది. కానీ తప్పదు. సహనం ఇంత మంచిదని, దాని వలన ఇంత మంచి జరుగుతుందని తెలిసి కూడా దాన్ని అలవరచుకోవాలని చెప్పకుండా ఎలా వుంటాం? అవునా? అందుకే, రండి, మనందరం కలిసి ఈ సహనం సంగతి అందరికి చెప్పేద్దాం. అసలు ముందు మనందరం ఇదివరకు లేకపోతే ఇప్పుడు సహనం అలవాటు చేసుకుందాం. సరేనా? మనుషులందరూ ఒకేలాగా వుండరు. ఎవరితోనూ ఎటువంటి సమస్యలు రాకూడదు అంటే అది కొంచెం కష్టమేమో కానీ సాధ్యమైనంత వరకు అందరితోనూ మనం సామరస్యమైన  సంబంధాలను, అంటే cordial relations ను కొనసాగించటం మాత్రం సహనం ద్వారా మనం సాధించగలం.

ఇంతదాకా సహనంతో నా ఈ మాటలన్నీ విన్నందుకు (చదివినందుకు) మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇంక ఇప్పుడు నాకు సెలవు ఇవ్వండి. మళ్ళీ వచ్చే నెల ఇంకొన్ని కొత్త కబుర్లతో మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు.

********

Posted in October 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *