Menu Close
Iruvanti-Sreenivas
నిన్నటి వెన్నెల (కథ)
-- యిరువంటి శ్రీనివాస రావు --

ఆ ప్రదేశమంతా కోలాహలంగా వున్నది. అందరు అటూ ఇటూ అక్కడున్న ఒక చిన్న సైజు ఆడిటోరియం లేదా హాల్ బయటికి లోపలికి తిరుగుతున్నారు. అక్కడికి ఆ హడావుడికి కొంచెం దూరంలో అక్కడికి వచ్చేపోయే వాళ్లకి కనపడీ కనపడనట్లుగా ఒక చెట్టు కింద ఉన్న చిన్న బెంచ్ మీద ఒక జంట. అప్పటికే ఒక 30 నిమిషాలనుంచి వున్నట్లుగా తెలుస్తుంది. తమ కాళ్ళ కింద ఉన్న ఎండిపోయిన ఆకుల శబ్దం ఎక్కడ తమ ఏకాంతానికి భగ్నం కలిగిస్తాయోనని వాటిని కాళ్లతో అటు ఇటు నెట్టివేసి చదును చేసినట్లుగా తెలుస్తుంది. ఎక్కడ తాను వీస్తే ఆకులు రాలి వాళ్ళ కాళ్ళ కింద పడతాయోనని ఆ చెట్టు చెవులు రిక్కించి వింటున్నట్లు, గాలితో నువ్వు మౌనంగా వుండు అని చెపుతున్నట్లు, ఆ జంటను చూసి మీరు కానివ్వడన్నట్లు ఉంది.

అప్పటిదాకా కూర్చున్న రాజ్ చిన్నగా లేచి టక్ చేసిన షర్ట్ ని సవరించుకుని, చేతికి ఉన్న వాచ్ లో ఒకసారి టైం చూసుకుని, తన ఎదురుగా కూర్చున్న సుధ వైపు చూసాడు.

ఏమిటన్నట్లు తలెత్తి రాజ్ వైపు చూసి కళ్ళెగరేసింది సుధ.

సుధ బెంచి ఆ చివర ఉంటే, తాను ఈ చివర సుధ వైపు తిరిగి కూర్చుంటూ అడిగాడు రాజ్.

అవునూ ఆరోజు మిగిలిన వాళ్ళని కొట్టకుండా నన్నే ఎందుకు చెంపదెబ్బలు కొట్టావ్?

సుధ చిన్నగా తనలో నవ్వుకుంది. ఏ రోజు? అని అడగలేదు. తనకి అన్నీ గుర్తున్నాయ్.

తాము టెన్త్ క్లాస్ చదువుతున్న రోజులు. ఆ రోజుల్లో అమ్మాయిలవైపు చూడాలంటేనే భయపడి పోయేవాళ్లు అబ్బాయిలు. వాళ్ళతో ఏదన్న మాట్లాడాలంటే వణికిపోయేవాళ్లు. అమ్మాయిలు కూడా అంతే, కన్నెత్తి అబ్బాయిలవైపు చూసేవాళ్ళు కాదు. రాజ్ బాగానే చదువుతాడు. కానీ ఆ క్లాస్ టెస్ట్ లో ఎందుకో తక్కువ మార్కులొచ్చాయి. ఆలా తక్కువ మార్కులొచ్చిన అబ్బాయిలకి అమ్మాయిలతో, అమ్మాయిలకి అబ్బాయిలతో చెంప దెబ్బలు వేయించేవాడు తమ ఇంగ్లీష్ మాష్టారు. అమ్మాయిలలో తనకి ఎక్కువ మార్కులు రావటం, తనని ముందుగా అబ్బాయిలలో రాజ్ కి చెంపదెబ్బలు కొట్టమన్నారు మాష్టారు. అప్పటిదాకా ఒకే క్లాస్ అవ్వటం వల్ల ఒకరికొకరు తెలుసు కానీ మాట్లాడేంత పరిచయం లేదు. ఆ చెంప దెబ్బతో ఇద్దరిమధ్య చనువుతో పాటు మాటలు పెరిగాయి. దాంతో నోట్స్ మిస్ అయితే బుక్స్ మార్చుకోవడం, కలిసి లంచ్ చెయ్యడం లాంటివి, క్లాస్ లు లేనపుడు ఇద్దరు కలిసి బాతాఖానీ వేసుకోవడం, వాళ్ళ ఇద్దరి మధ్య అభిమానం ఏర్పడింది.

సుధ మళ్ళీ చిన్నగా నవ్వి అన్నది, ఆ చెంప దెబ్బేగా మన జీవితాల్ని మార్చింది.

నిజమే సుధ, అంతకుముందు నువ్వు బాగా చదువుతావని తెలుసు, కానీ ఆ తర్వాతే నేను నీతో పోటీ పడి చదివేవాడిని. క్లాస్ లో ఎప్పుడు ఇద్దరం ఫస్ట్, అందరు మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు.

అవును రాజ్ ఆతర్వాత కూడా ఇంటర్లో ఇద్దరి గ్రూప్స్ వేరైనా, ఏ రోజు కలవకుండా వుండలేదు మనం.

అది జూనియర్ కాలేజీ అంటే ఆరు నుండి పది వరకు హైస్కూల్ ఆ తర్వాత జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ వుండే కాలేజీ అవ్వటం వల్ల, టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ లో అక్కడే జాయిన్ అయ్యారు ఇద్దరు. రాజ్ ఎమ్.పీ.సి, సుధ సి.ఈ.సి గ్రూప్ లు తీసుకున్నారు. ఒకరకంగా ఇంటర్ వాళ్ళిద్దరి జీవితాల్ని మార్చిందని చెప్పాలి.

అప్పుడప్పుడే పరిణితి చెందుతున్న వయసు. ఆరోజుల్లో, ఆ వయసు అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటే అదొక గొప్ప. మగ పిల్లలైతే హీరోలా ఫీల్ అయ్యే వాళ్ళు. చదువుతో పాటు, ఇద్దరిలో చెప్పుకోలేని ఎన్నో భావాలూ, ఆలోచనలు మనసులో. ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మంచిదికాదో కూడా తెలియని పసి మనసులు.

మంచి స్నేహితులే అయినా ఏదో తెలియని అభిమానం ఒకరిమీద ఒకరికి. వాళ్లు ఏమి మాట్లాడుకున్నా వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంది వాళ్ళకి ఒకరి మీద మరొకరికున్న ఇష్టం. ఆ ఇష్టం పేరు అనురాగమో, ఆకర్షణో, వాత్చల్యమో తెలియదు ఆ ఇద్దరికీ.

రాజ్, నీకు గుర్తుందా! ఆ రోజు మన ఫేర్వెల్ డే రోజు మనమెంత హడావుడి చేసామో. కానీ నువ్వెందుకో అదోలా వున్నావు ఆరోజు. బహుశా మనం విడిపోతున్నామని, ఇంక ఎప్పటికి కలవమని అనుకున్నావా?

నా సంగతి సరే, నువ్వు మాత్రం, నీకు ఏడుపొక్కటే తక్కువ. నువ్వు ఏడిస్తే చూద్దామని అనుకున్నా ఆ రోజు. కానీ నువ్వు ఆటు ఇటూ వెళ్లి కళ్ళు తుడుచుకొచ్చి, నాతో నవ్వుతూ మాట్లాడావులే. నాకు తెలుసు.

రాజ్ కి ఆరోజు ఒక్కసారిగా కళ్ళముందు కనిపించింది. తాను ఆ రోజు ఎలాగయినా సుధ కి చెప్పాలనుకున్నాడు తనంటే ఇష్టమని. సుధ పూర్తి పేరు సుధారాణి, తనేమో రాజు. బాగుంది రాజు రాణి, ఇంకేం పేర్లు కలిసాయి, ఆ రెండు పేర్లని కలుపుతూ ఒక పెద్ద ప్రేమలేఖే రాసాడు తనకివ్వాలని ఆరోజు ఎలాగయినా. తన గ్రూప్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్ తనని ఎంకరేజ్ చేసాడు. ఒరేయ్ రాజు, ఈ రోజు కాకపోతే ఇంక కుదరదురా, సుధకి కూడా నువ్వంటే ఇష్టమేరా అందులో మీ ఇద్దరూ బాగా క్లోజ్ కదా. ఈరోజు ఎట్లాగయినా చెప్పరా ఇవాళ చెప్పలేకపోతే ఇంక నీ జన్మలో చెప్పలేవు రా నాయన అని. తను మాటల్తో చెప్పలేడు, ఫేర్ వెల్ పార్టీ కి ముందు ఏకాంతంగా కలిసాడు సుధని. ఎలాగయినా సరే లెటర్ ఇవ్వాలనుకున్నాడు తను. గుండెలు దడ దడ కొట్టుకుంటున్నాయి. తనవల్ల కాలేదు. ఆ తర్వాత పార్టీ అయ్యేంతవరకు తనచుట్టూ తిరిగాడు ఎలాగయినా ఇవ్వాలని. ఇస్తే ఏమౌతుందో? తనకిష్టం లేకపోతే ఇంక అస్సలు మాట్లాడదు. తనతో. ఇన్ని రోజుల నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ పోతుంది. తను నా మొహం అస్సలు చూడదు. అది తను భరించలేడు. ఒకవేళ ప్రసాద్ గాడు చెప్పినట్లు నేనిష్టమేనేమో. కానీ, ఇష్టం లేకపోతే, ఫ్రెండ్షిప్ ని ఇలా అర్ధంచేసుకున్నావా రాజ్ అంటే, ఆ ఊహే భరించలేడు తను. ఒకవేళ ఇష్టం ఉంటే సరి, లేకపోతే మనం ఫ్రెండ్స్ గానే ఉందాం అని అడిగితే ఎలావుంటుంది? అలా తను పాజిటివ్ గా తీసుకుందో లేదో.

అవును ఆ రోజు నువ్వేదో నాతో చెప్పాలనుకున్నావని, నాకేదో ఇస్తావని నీ ఫ్రెండ్ ప్రసాద్ చెప్పాడు. కాని నువ్వేమి చెప్పలేదు, ఏమీ ఇవ్వలేదు.

ఓహో ఆ వెధవ నీతో ఏం చెప్పాడో కానీ, ఆరోజు నీతో ఎన్నో మాట్లాడాలనుకున్నాను. కానీ ఇక ఆ రోజే లాస్ట్ డే, మళ్ళీ ఆ తర్వాత ఎక్కడో...ఇంక కలుస్తామోలేదోన్న బాధలో ఏం మాట్లాడలేక పోయాను. అసలు విషయం చెప్పలేదు రాజ్. ఆ ప్రేమలేఖని అపురూపంగా, పదిలంగా దాచుకున్నాడు ఆతర్వాత.

ఆ తర్వాత నువ్వు ఇంజనీరింగ్ కి ఎక్కడికో వెళ్లిపోయావు. కానీ మనం మళ్ళీ ఒక్కసారి కలిసాం రాజ్. నువ్వు నన్ను వెతుక్కుంటూ నేను మా మామయ్య వాళ్ళ టౌన్ లో చదువుతున్న డిగ్రీ కాలేజీ కి వచ్చావ్ కదా! నేనక్కడ చదువుతున్నానని నీకెవరు చెప్పారు?

అవును సుధ, నేను అప్పటికీ చాల సార్లు ట్రై చేసాను నువ్వెక్కడ చదువుతున్నావో తెలుసుకుందామని. కానీ కుదరలేదు. నేను ఇంజనీరింగ్ third ఇయర్ లో ఒకసారి ఇంటికి వచ్చినప్పడు, నీ ఫ్రెండ్ రమాదేవి అనుకోకుండా కలిసింది. అప్పుడు తెలిసింది నువ్వెక్కడున్నావో.

అవును ఆరోజు కూడా నువ్వొచ్చావని నేనెంతో సంతోషపడ్డా. కానీ నువ్వేమో ముభావంగా వున్నావు. ఎక్కువ మాట్లాడలేదు. ప్రతి దానికి పొడిపొడిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయావు. ఎందుకొచ్చావో ఎందుకెళ్ళావో నాకర్ధం కాలేదు.

రాజ్ చాలారోజుల తర్వాత కలుస్తున్నానన్న సంతోషంలో సుధని చూడటానికి తన కాలేజీ దగ్గర మాటు వేసాడు. తను మూడు సంవత్సరాల క్రితం రాసిన పదిలంగా దాచుకున్న ప్రేమలేఖ ఆ రోజు ఏమైనా సరే ఇవ్వాలి. తనంటే ఎంత ఇష్టమో చెప్పాలి. ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ఆరోజు సుధ ముగ్గురు ఫ్రెండ్స్ తో బయటికి వచ్చింది. దూరం నుంచి చూసాడు సుధని. ఎంత మారిపోయింది సుధ. చిన్న పిల్లలా ఉండేది అప్పుడు. ఎప్పుడు ఎంత పెద్దరికంగా కనపడుతోంది. లంగా వోణీలో బుట్టబొమ్మలా ఎంత బాగుంది. ఆ ముగ్గురూ వెళ్ళిందాకా ఉండి, తన దగ్గరికి వెళ్ళాడు.

రాజ్ ని చూసి సుధ నోరువెళ్ళబెట్టింది. రాజ్! నువ్వేనా! అప్పుడు ఎంత క్యూట్ గా ఉండేవాడు. నూనూగు మీసాలతో, రఫ్ అండ్ టఫ్ గా ఎంత బాగున్నాడు ఇప్పుడు. ఏ రోజుఅయినా తనని వెతుక్కుంటూ వస్తాడని తెలుసు. కానీ ఈరోజు తనని నిజంగా surprise చేసాడు.

ఏవేవో మాట్లాడుకున్నారు ఇద్దరు. మధ్యమధ్యలో కాసేపు మౌన రాగం. ఎదో చెప్పాలని తాపత్రయం. వాళ్ళిద్దరి హృదయ స్పందన ఒకటే. వాళ్ళిద్దరి మనసు దాటని మాట ఒకటే. వాళ్ళ మౌనబాష చెపుతుంది ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో. వాళ్ళిద్దరి కళ్ళల్లో మెరుపు చెపుతోంది ఆ ఆప్యాయత గురించి. ఆ కళ్ళే మాట్లాడుకుంటున్నాయి నీకింకా అర్ధం కాలేదా అని. ఆ కళ్ళల్లో కోరిక, కాంక్ష, ఆకర్షణ లేదు. వాళ్ళ గుండె లోతుల్లోని ప్రేమ బయటకి రానంటోంది. ఆ ప్రేమ నేనిక్కడే గుండెలోనే నిండుగా ఉంటానంటుంది. పరిణితి చెందిన మనసులు, అంతే పరిపక్వతతో ఆలోచిస్తున్నాయి. వాళ్ళ అనురాగం అనంతం, వాళ్ళ ప్రేమ అమోఘం. ఎందుకిలా అవుతోంది తమకి. ఎప్పుడు మొదలైయింది తమ మధ్య ఇలాగా. ఆరు సంవత్సరాల క్రితం చెంప దెబ్బ నుంచేనా. ఒక్క చెంప దెబ్బకు ఇంత శక్తి ఉందా! ఎంత పని చేసింది ఆ ఒక్క చెంప దెబ్బ?

రాజ్ ఎప్పుడూ అనేవాడు. తను బి.టెక్ తర్వాత మాస్టర్స్ కి స్టేట్స్ వెళ్లాలని. ఆ తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలని కోరిక. మరొక సంవత్సరం తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తానెవరో, నేనెవరో. అయినా తనేమన్న అంత తేలికగా మరిచిపోయే మనిషా. జీవితాంతం గుర్తిండిపోతాడు. రాజ్ కి తెలుసు సుధ ఎప్పుడూ అంటుండేది తను ఛార్టర్డ్ అకౌంటెంట్ చెయ్యాలని. ఆ తర్వాత CA కంపెనీ ఒకటి పెట్టి ఓనర్ గా దాన్ని వ్యాప్తి చెయ్యాలని తన అభిలాష. తన కెరీర్ మీద తనకి పూర్తి క్లారిటీ వుంది. ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. కానీ తమ ప్రేమ ప్రేమనే కోరుతుంది. కానీ అది తమ హృదయాంతరాలలో నిక్షిప్తమై ఉంది.

ఇక వెళ్ళొస్తానన్నట్లు లేచాడు రాజ్. తన ప్యాంటు జేబులో ప్రేమలేఖ నా సంగతే మరిచిపోయావ్ అన్నట్లుంది. ఇద్దరి కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీరు కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఎవరో వస్తున్న అలికిడికి రాజ్, సుధ ఈలోకంలోకి వచ్చారు.

రాజ్ ఫ్రెండ్ ప్రసాద్, సుధ స్నేహితురాలు రమాదేవి మాట్లాడుకుంటూ హడావుడిగా ఇద్దరి దగ్గరికొచ్చారు.

ఏమేవ్ సుధ, అయినాయా మీ ముచ్చట్లు. ఇంకా బయలుదేరదామా రమాదేవి అంటుంది సుధతో.

ఇదిగో సుధా! ఇప్పటికన్నా ఆ లెటర్ ని ఇచ్చాడా లేదా వీడు? రాజ్ వైపు చూస్తూ సుధని అడిగాడు ప్రసాద్.

ఇద్దరూ చిన్నగా నిట్టూరుస్తూ లేచి నించున్నారు.

ఏదీ ఆ లెటర్ అన్నట్లు రాజ్ వైపు చూసింది సుధ ...

దాదాపు 36 సంవత్సరాల క్రితం రాసిన ప్రేమలేఖ, ఇదిగో ఇక్కడే భద్రంగా వుంది, తన ప్యాంటు కుడి జేబు తడుముకున్నాడు రాజ్ సుధ కి సైగ చేస్తూ.

అయినా మీలాంటి వాళ్ళు సినిమాలల్లో తప్ప నిజ జీవితంలో ఎవర్నీ చూడలేదు మిమ్మల్ని తప్ప, వెటకారంగా అన్నాడు ప్రసాద్, నిజమే అన్నట్లు తలవూపింది రమాదేవి.

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే .. ఎక్కడనుంచో శ్రీ శ్రీ పాట వినపడుతోంది.

సుధ, రాజ్ ఇద్దరి మనసులో ఒకటే మాట, అయినా మీకేంతెలుస్తుందిలే, ఆ రోజుల్లో మేము అనుభవించిన క్షోభ, మా మనోవేదన. తొలిప్రేమ ఎప్పటికీ గొప్పదే. ఇద్దరూ ఇంకా తమ ప్రేమ స్మృతుల దొంతరలో నిన్నటి వెన్నెల హాయి నుంచి బయటకి రాలేకపోతున్నారు.

రాజ్ వైపు మళ్ళీ ఒకసారి చూసింది సుధ. అనుకున్నది సాధించాడు. ఎంఎస్ చేసి స్టేట్స్ లో సెటిల్ అయ్యాడు. ఎంత మారిపోయాడు. కొంచెం ముందుకొచ్చిన పొట్ట, అంతగా బట్టతల రాలేదు కాని ఎక్కువ జుట్టు మాత్రం లేదు. వయసు మీద పడటం తెలుస్తుంది. కళ్ళజోడు సవరించుకుంటూ సుధ పక్కనే నడుస్తున్నాడు రాజ్.

రాజ్ అనుకున్నాడు ఎన్ని సంవత్సరాలు అయింది సుధని చూసి. మొత్తానికి తన అంబిషన్ నెరవేర్చుకుంది. SR & అసోసియేట్స్ అనే కంపెనీ పెట్టి, ఆ తర్వాత కొంతకాలానికి ఆస్ట్రేలియా లో సెటిల్ అయ్యింది. వయసు వల్ల వచ్చిన ఒళ్ళు, జుట్టుకి రంగేసినట్లు తెలుస్తుంది. కంచి పట్టు చీర పమిటను భుజం చుట్టూ కప్పుకుంటూ రమాదేవి వెనకే అడుగేసింది సుధ.

ఆ ఆడిటోరియం ఎంట్రన్స్ దగ్గర ఒక పెద్ద బ్యానర్ "స్వాగతం-సుస్వాగతం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం (1983 -1985 ఇంటర్ బ్యాచ్)". నలుగురు చుట్టూరా కలియచూసారు ఒక్కసారి. తాము ఆరు నుంచి ఇంటర్ వరకు చదువుకున్న జూనియర్ కాలేజీ. ప్రతి సంవత్సరం కాకపోయినా ఏ రెండు మూడు సంవత్సరాల కో ఇలా తమ బ్యాచ్ అంతా కలుసుకోవటం పరిపాటి. రాజ్ కి, సుధ కి ఇన్ని సంవత్సరాలకి కుదిరింది రావటానికి.

ఇదిగో సుధ, ఒకసారి మీ ఫామిలీ తో అమెరికా వచ్చేయ్..అందరం సరదాగా ఉండొచ్చు.

అలాగేలే రాజ్, నువ్వు మీ ఆవిడ, పిల్లలతో ఆస్ట్రేలియా రా తప్పకుండా.

అంతేలే అంతేలే .. మీరు మీరు పిలుచుకోవటమేనా, మమ్మలేమన్న అమెరికా ఆస్ట్రేలియా రమ్మంటారా!

ప్రసాద్ మాటకు అందరు నవ్వుతూ ఆడిటోరియం లోపలికి అడుగులేశారు.

********

Posted in October 2025, కథలు

5 Comments

  1. Nagesh

    అద్భుతః ఇరువంటి వారు…కథ కథ కి కలం లో ని సిరా ఎరుపెక్కుతోంది

  2. Pradeep

    You took me back to my past days and reminded me of those sweet memories. I got completely immersed in the story, and it brought back my youthful days. It was really wonderful. Thank you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *