Menu Close

డల్లాస్ నగరం (టెక్సాస్)లో పాలడుగు శ్రీచరణ్ గారి సంస్కృతాంధ్రావధానం

-- నివేదిక: సాహితీకిశోర్ --

Sanskrithavadhanam

డల్లాస్ లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారి 18 వ వార్షికోత్సవం, ఈ జులై 19 వతేదీన వైభవోపేతంగా జరిగింది...

ఆ సందర్భంగా క్యాలిఫోర్నియా శానోజె వాస్తవ్యులు, సంస్కృతాంధ్ర ఉభయ భాషా ద్విశతావధాని శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారి సంస్కృతాంధ్ర ఏకాదశాంశిక అవధానం జరిగింది. ఇది అవధానిగారికి 37 వ అవధానం. తెలుగులో ఎనమండుగురు పృచ్ఛకులు, సంస్కృతంలో ముగ్గురు, వెరశి పదకొండు మంది పృచ్ఛకులిచ్చిన అంశాలతో కూడిన అవధానం కనుక ఇది 'ఏకాదశావధానమ'ని పిలువబడింది..

టాంటెక్స్ వారి 'నెలనెలా వెన్నెల' సాహిత్య వేదిక సంచాలకులు శ్రీ మాడా దయాకర్ గారి స్వాగతోపన్యాసంతో మొదలైన అవధాన సభకు, డల్లాస్ పుర వాసి, అమెరికాలో మొట్టమొదటి అవధాని ఆచార్య పుదూరి జగదీశ్వరన్ గారు సంచాలకత్వం వహించారు..

సభాకార్యక్రమం మొదటగా అవధాని వేద గురువు బ్రహ్మశ్రీ మారేమండ నాగవేంకటశాస్త్రి గారు ఫోన్ పై చేసిన వేదాశీర్వచనంతో శుభప్రదంగా ప్రారంభమైంది. మొదటగా దైవప్రార్థన, గురువందనం అయ్యాక, సభాసంచాలకులు ఆచార్య పుదూరు జగదీశ్వరన్ గారిని ఒక కంద పద్యంలో అవధాని గారు ప్రస్తుతించారు. అది:
కం|| చెదరని దరహాస వదను
హృదయ సుమ స్నిగ్ధ సురభి హేమంత కవిన్
బుధునిన్ షడ్రి'పు దూరు' జ
గ దీశ్వరు వధాన చాలకమణి బొగడెదన్ ||

1. ఆపిమ్మట, నిషిద్ధాక్షరి మొదటి ఆవృత్తం మొదలైంది. పృచ్ఛకులు డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారు చాలా చక్కటి అంశం ఇచ్చారు.. అంతే చక్కగా అక్షరమక్షరంలోనూ నిషేధం చెప్పారు. అంశమూ, నాలుగు ఆవృత్తాలతో మొత్తంగా వెలువడిన పద్యమూ, దాని భావమూ ఇవి:
అంశం: యశోదా దేవి బాల రామ కృష్ణులకు రెండు గిన్నెలలో పాలిడగా, రామునకు పెద్ద గిన్నెలో ఇవ్వడము చూచి కోపించిన కృష్ణుడు పాలను నేల పాలు జేసి, తాండవమాడుట సందర్భము.
ఆ పాల అడుగున ఉన్న శ్రీచరణాల వర్ణన, అంశము.
కం|| అబ్రాష్ట్రోన్నీయ దశ క
కుబ్రోచీ రమ్య వేది గుంఠ క్షిప్త
త్రిబ్రుచి ధుధమత్ సాక్షిన్
సుబ్రహ్మణ్య ప్రణిగద సూక్ష్మమరయుమా ||
{అబ్రా[ఏ]ష్ట్రో[క]న్నీ[ల]య[మ] ద[మ]శ[ల]క
కుబ్రో[వ]చీ[మ] ర[స]మ్య[ప]వే[గ]ది గుం[మ]ఠ[న]క్షి[క]ప్త
త్రిబ్రు[వ]చి[ర]ధు[క]ధ[న]మ[క]త్సా[ర]క్షిన్
సుబ్రహ్మణ్య ప్రణిగదసూక్ష్మ నరయుమా!}
[భావార్థ వివరణ : అప్ రాష్ట్రము - ఆకాశము. త్రిప్ రుచి - మూడుగా ఉన్నవి ఒక్కటై భాసించుట, ఏకాక్షరమైన ప్రణవమునందలి అ-ఉ-మ లు.
అటు దిగంతాలకు, ఇటు భువికి, క్రింది లోకాలకు విస్తరించిన త్రివిక్రముని ఏకత్వము మళ్ళీ బాల కృష్ణుడు ప్రదర్శిస్తున్నాడు.
ధు-ధ వంటి ధింధిమి నాదము ప్రణవ నాద బిందువులో నుండి పుట్టి మరల అందులోనే లయమైనట్లు.
ఇది ప్రతి సాయం సంధ్యలో తన తాండవమున దర్షింపజేయు తండ్రి లీల వలె, తన మామ కూడా దర్షింపజేయుచున్నాడన్న అద్వైతమును సుబ్రహ్మణ్యుడు తల్లికి చెబుతున్నాడని భావన.
`ప్రచండ తాండవాటోపే
ప్రక్షిప్తా యేన దిగ్గజాః
భవంతు విఘ్న నాశాయ
భవస్య చరణంబుజాః' || అను మత్స్యపురాణ ప్రారంభ శ్లోకము ప్రేరణగా వెలువడ్డ పద్యం]

2. పిమ్మట డా.ఉపద్రష్ట సత్యం గారు "కృత్స్న జ్యోత్స్నల వీడి చెప్పగలవే హృత్స్నేహమేపారగన్" అనే దుష్కర ప్రాసతో కూడిన సమస్య నిచ్చారు. ఇందులో వస్తుగత సమస్య ఏమీ లేదు. ఆ దుష్కర ప్రాసే సమస్య.. అయినా అవలీలగా అవధాని గారిలా పూరించారు:
శా|| మత్స్నానంబున గంధమేలనరయన్ మాణిక్య రత్నాకరా
పత్స్నావాంగుళి కుహ్వపూర్వ లలిత ప్రాకార పర్వప్రభో
దిత్స్నావాగ్ర శమంతకంబున పతిందీపార వ్యర్థ క్రియల్
కృత్స్న జ్యోత్స్నల వీడి చెప్పగలవే హృత్స్నేహమేపారగన్ ||
[భావం: వస్తు సంబంధ జగత్తునకు ఇతరము, పారలౌకికమైన పరంధాముని తత్త్వమును, అలంకార భూయిష్ఠమైన శమంతముతో సరిపెట్టే సత్యభామ అజ్ఞానపూరిత క్రియలు నిష్ఫలములు!]

3. తదుపరి దత్తపది: పృఛ్చకులు శ్రీ మద్దుకూరి చంద్రహాస్ గారు. అగరు, తొగరు, పొగరు, వగరు అనే పదాలను నాలుగు పాదాలలో వాడుతూ, తెలుగువారి ముద్దుల పడుచు 'ఎంకి' ని వర్ణించమని కోరారు..
పూరణ : మ|| అగ రుక్మ ప్రతిభా మయూఖ లతికా న్యస్త క్వణానందమై
తొగ రువ్వన్ నవ నీలకాంతి వసన (స్థాన) స్థూలక్రియా భ్రంశమై (యతి భంగము)
పొగ రుహ్యంబగు కాంతి పంక కణముల్ పుణ్య క్రియా ధ్వంసముల్
వగ రుద్దంగ విచారమేల మదిలో వాగాకృతిన్ వేదిలోన్ ||
[భావం: ఎంకిది ప్రకృతి సహజమైన సౌందర్యము. ఎట్టి కృత్రిమాలంకారాలు కోరని, తన ఉనికిని కోల్పోని స్వచ్ఛ మనోహరమైన మేనిసౌరు. ఆ బావ కూడా దానినే అభిమానించాడు, ఆరాధించాడు. అగ్నిలో పోసే ఆజ్యము అను ఇంధనము, నీటితో మలినమైతే, పొగ రేగుతుంది. అలా కాక స్వచ్ఛమైన ఇంధనమైతే, నిగారిస్తుంది. ఉత్ప్రేక్షాన్వితమైన అనూహ్య సౌందర్యము, వేదికలలో వినిపించుటకు మాత్రమే పరిమితమగు వాగాటోపము.]

4. తర్వాతి అంశం వర్ణన .. పృచ్ఛకులు డా. గుర్రం మైథిలిగారు, ఈశ్వరుని శిరస్సుపైనున్న చంద్రునిపై మానవుడు అడుగు పెట్టగా చంద్రుని, అలాగే ఆయనను శిరస్సు పై దాల్చిన శివుని భావాలను తోచిన వృత్తంలో వర్ణించమన్నారు... అవధాని గారి పద్యం:
శా|| సాంద్ర స్ఫూర్తి విశాల శారద నవ స్వర్వాహినీ యుక్తమై
ఇంద్ర బ్రహ్మ జనార్దనాది వరమై హ్రీధ్వంస భద్రోగ్రతన్
మంద్రంబైన శశాంక పూర్ణిమ కళల్ మంత్రాభిషేకమ్ములన్
చంద్రాదిత్య కృశాను నేత్ర నిగమాజాతార్భక క్రీడలౌ ||
[భావం: వినయంతో, భక్తితో మ్రొక్కితే, శివుడు నెత్తిన పెట్టుకుంటాడు. అహంకరిస్తే, అదే చంద్రుణ్ణి వీరభద్ర రూపంలో దండిస్తాడు. మంత్రపూరితమైన పరమామ్నాయ కళా బాలకులు, అమాయకంగా ఆయనను అభిషేకించుటకు తలపైకి ఎక్కు విధానాన్ని బాల క్రీడగా తీసుకుని ఆనందిస్తాడు.

5. ఆ పై 'న్యస్తాక్షరి' ని నిర్వహిస్తూ శ్రీ సిద్ధా శ్రీధర్ గారు, చంపకమాలలో 1 వ పాదం 1 వ అక్షరంగా 'అ', 2 వ పాదంలో 12 వ అక్షరంగా 'న్న', 3 వపాదం 11 వ అక్షరంగా 'మ', 4 వ పాదం 2 వ అక్షరంగా 'య' ను ప్రయోగిస్తూ, ఇటీవలే దివంగతులైన అన్నమయ్య గాన విశారదులు బాలకృష్ణ ప్రసాదు గారికి నివాళి గా పద్యం చెప్పమన్నారు. సాధారణంగా న్యస్తాక్షరి అంటే ఏ ఏ స్థానాల్లో ఏఏ అక్షరాలను ఉంచాలో చెబుతారు కానీ, ఇలా యతి ప్రాస స్థానాలతో కలిపి చెప్పరు.. సభాసంచాలకులేమీ ఆక్షేపణ చెప్పలేదు కనుక, అవధానిగారు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అవలీలగా ఇలా పూరించారు:
చం|| అయతి నిధాన పద్మభవ హల్లక నాట్య సుమాంఘ్రి యుగ్మమున్
పయ ఉపనీత మాధురులు పన్నము బల్కెడి వేదరాశులన్
మయసభ కల్పనంబునను మధ్యముడూనిన మాధవశ్రుతుల్
నయముగ శ్రీనివాసునకు వ్రాసి యొసంగెను తాళ్లపాకముల్ ||
[భావం: పరమాద్వైతమును రసరాజమైన శృంగార దీప్తితో మెరిపించి, పద్మావతీ శ్రీనివాసుల సచ్చిదానంద తన్మయత్వాన్ని, మాయా సంసారాన్ని దాటించే మాధవ (కృష్ణ - బాలకృష్ణ)పాయస ప్రసాదాన్ని పాకముగా చేసి అన్నమయ(య్య) ఒసంగెను.. తాళ్ల పాకముల్ అనేమాట ఉభయులకూ అన్వయించే శ్లేష.. ]

6. ఆశువునడిగిన శ్రీమతి పాలూరి సుజన గారు మొదటి ఆవృత్తంలో కొంగు ను వర్ణించమన్నారు. ద్వితీయ ఆవృత్తంలో 'కందకు లేని దురద కత్తి పీటకెందుకు?' అనే సామెతను వర్ణించమన్నారు. పూరణలు:
1) కొంగు :
శా|| రోచీరోయని మందబుద్ధి మతులన్ రోదించు దౌర్బల్యమున్
దాచీ దాయని కోపతాప తతులన్ వైరాగ్యతన్ కూల్చుటన్
చూచీ చూడని చేప కన్నుల కళల్ చిచ్చొల్కు శృంగారమున్
మేచీ మెచ్చని కొంగుచాటు మగడే మేల్కాంచు స్వప్నంబునన్
2) కందకు లేని దురద కత్తిపీటకెందుకు?
కం|| పీఠములందున పోటీ
కాఠక శాఖల నిలిచిన గంధనివహమౌ
ఖేఠక ఖడ్గ నివృత్తికి
శాఠీ కందళిత గుల్మ చపలత్వంబుల్!
(సమయాభావంతో ఆశు పృచ్ఛ రెండు వృత్తాలకే పరిమితమైంది..)

7. తదుపరి సంస్కృత సమస్యను, సంస్కృత విదుషి, శ్రీమతి పేరిభార్గవి ఇచ్చారు. 'రసాభాసో జాతః కవికులగురోః కావ్యనిచయే' ― కవికుల గురువు కాళిదాసు గారి కావ్య నిచయంలోనే రసాభాసం ఏర్పడిందట.. ఇదీ సమస్య!.. మంచి భావవిరోధం భాసించే సమస్య! దాన్ని అవగాహన గారు ఇలా పూరించారు:
శిఖరిణి|| విరించి జ్ఞాన ద్వీప మణి ఫణిని ప్రేమరసనే
ప్రపంచ ధ్యాన ధ్వంస నుతి జడతః కూప సలిలే
నితాంత భ్రాంతి వ్యాహృతి విదళిత క్రూరకవనే
రసాభాసో జాతః కవికులగురోః కావ్యనిచయే ||
[భావార్థ వివరణ : బ్రహ్మ ముఖావిష్కృతమైన శబ్ద ద్వీప మణులు, ఫణులకు కూడా శిరోధార్యములైనవి. అట్టి శబ్దార్ధ అనోన్యత రసమై చిలికినది కవికుల శిరోరత్న కావ్యచయమున...వాటిని ప్రేరణగా పొంది సృజింపబడెడి నేటి కల్పనలు,వ్యక్త్యారాధనకు, ప్రపంచ ప్రీతికి పరిమితం కావటంతో, భ్రాంతి విస్తృత క్రూర దంష్ట్రికలనే కలములతో ఆ అపూర్వ కథా వస్తువుల పునారచనలలో రసాభాస పొరలుచున్నది... కాళిదాసు కు ఇష్టమైన శిఖరిణి వృత్తంలో పూరించటం అదనంగా కలిసివచ్చిన ఔచిత్యం.]

8. సంస్కృత వర్ణననిచ్చిన వారు స్వయం అవధాని వరేణ్యులు: డా. రామడుగు నరసింహాచార్యులు గారు. తిక్కన గారి విరాటపర్వంలోని ప్రసిద్ధ పద్యం - " భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీల" మనే పద్య సందర్భాన్ని సంస్కృతంలో వర్ణించమన్నారు. దానికి అవధాని చేసిన సంస్కృత వర్ణన :
శా|| కర్ణాఖ్యానల గర్భ సూక్ష్మ రచనావ్యాపార పాండిత్యతః
పంచాస్యోద్భవ శబ్ద పాశుపత విస్ఫోటాన్వితాలాంకృతాన్
నిర్ధూమోద్భట నీరస ప్రకట మత్స్య గ్రామసింహాపమో
వ్యాచష్టే విపరీత యుద్ధ కుశలాన్ సంగ్రామ భీతౌ హతః ||
[ భావార్థ వివరణ : తిక్కన గారు, భీష్మద్రోణకృపాది ధన్వి అనే పద్యాన్ని ఉత్తరునిచే అనిపించునపుడు కర్ణుని ప్రస్తావన గర్భితముగా 'గ్రీష్మాదిత్య పటుప్రతాప'మని పరోక్షముగా చెప్పించారు. ఆ త్రోవలోనే ఇచ్చట ఉత్తరుని పేరు గర్భితముగా 'మత్య్స గ్రామసింహము' గా ఉటంకించడమైనది. పశుపతిని మెప్పించి పాశుపతమును సాధించిన వివ్వచ్చుని గుర్తించలేక, సంగ్రామ శౌర్య కౌశలములు కాక, సంగ్రామ భీతి కుశలతను వర్ణించు ఉత్తరుని తత్తరపాటు!]

9. తదుపరి అంశం: సంస్కృత దత్తపది; పృచ్ఛకులు శ్రీ నేమాని రాజశేఖరు గారు. "శ్రుతి, స్మృతి, యుక్తి, వృత్తి. అనే నాలుగు పదాలను నాలుగు పాదాలలో వినియోగిస్తూ, వేదము, వేదాంగమైన వ్యాకరణా లను వర్ణించమన్నారు. అవధాని గారి శ్లోకం:
అను|| అశ్రు తిగ్మ సుధాసారమ్
స్మర స్మృతి వినాశనమ్
ముక్తి యుక్తి మూలాధారమ్
వేదాంగం వినిర్వృత్తిదమ్ ||

10. తెలుగు పురాణ పఠనాన్ని శ్రీ వేముల లెనిన్ గారు నిర్వర్తించారు. మధురమైన స్వరంతో, పద్య భావాన్ని రసవత్తరంగా వారు ఆలపించిన తీరు, అంత వేసవి పగటిపూట వెన్నెలను చిలకరించినట్లయింది.

11. అవధానాన్ని జనప్రియంగా రక్తి కట్టించే అంశం అప్రస్తుత ప్రసంగం. దాన్ని నెలనెలా వెన్నెల సమావేశకర్త శ్రీ మాడా దయాకర్ గారే, సమయాభావాన్ని గుర్తెరిగి, సమయోచితంగా సరసంగా నిర్వహించారు...రమణ దొడ్ల, గౌతమ్ కస్తూరి గార్లు జాగ్రత్తగా అవధానాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అక్షరీకరించి స్క్రీన్ మీద ప్రదర్శించారు.

Sanskrithavadhanamరెండున్నర గంట పాటు, మరికొంత తక్కువ సమయంలోనే, సాగిన అవధానం చివర అవధానులకు అసలు పరీక్ష - ధారణ.. అంతదాకా అన్ని ఆవృత్తాలలోనూ చెప్పిన ఛందోబద్ధ పద్యాలను అక్షరం పొల్లుపోకుండా చెప్పాలి.. అది శ్రీచరణావధానికి నల్లేరు పై బండి నడక చందం.. అనాయాసంగా చెప్పి రసజ్ఞులైన సభ్యులను అలరించారు.. సహర్షంగా సంస్థ పక్షాన ప్రస్తుత అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు, పూర్వ అధ్యక్షులు, తెలుగు ప్రముఖులు శ్రీయుతులు తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఊరుమిండి నరసింహారెడ్డి ప్రభృతులతోపాటు, ఆత్మీయ అతిథులు డా. వంగూరి చిటెన్ రాజు, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుల సమక్షంలో అవధాని గారిని సత్కరించారు.. ఇదే సందర్భంలో, సిరికోన పక్షాన డా.కోడూరు ప్రభాకరరెడ్డి గారు తమ స్వర్గీయ ధర్మపత్ని స్మారకంగా వ్యవస్థీకరించిన "కోడూరు పార్వతి స్మారక విశిష్ఠ పండిత పురస్కారా"న్ని, ఆస్టిన్ వాస్తవ్యులైన వారి కుమార్తె శ్రీమతి హిమబిందు, అల్లుడు శ్రీ మురళీధరరెడ్డి అవధాని దంపతులకు అందచేసి పట్టువస్త్రాలతో సత్కరించారు.

పాండితీ ప్రభా శోభితంగా, రస స్ఫోరకంగా, వీనుల విందుగా జరిగింది టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ లో శ్రీ చరణ్ గారి సంస్కృతాంధ్ర ఏకాదశాంశిక అవధానం.

Posted in August 2025, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *