ముందుమాట
మానవుడి అభివృద్ధి అంతా పనిని తగ్గించడంలోనే ఉంది. విజ్ఞాన శాస్త్రాలన్నీ మానవుడి పనిని, శ్రమను తగ్గించడానికే పుట్టుకొచ్చాయి. అద్వైత వేదాంత విజ్ఞానశాస్త్రం కూడా కర్మకాండను తగ్గించి ‘సూక్ష్మంలో మోక్షం’ ఇస్తుంది. రెండు ఉంటే అది ‘ద్వైతం’. ఆ రెండింటినీ కలుపుకుపోయేది ఏదో అది ‘అద్వైతం’. పదార్ధమూ, శక్తీ, వేరు, వేరు కాదని, పదార్ధం శక్తిగానూ, శక్తి పదార్ధం గానూ మారగలవని ఐనస్టీన్ నిరూపించాడు. పదార్ధమూ, శక్తీ ఆయన ‘జ్ఞానం’లో ‘అద్వైతసిద్ధి’ పొంది ఏకమయ్యాయి. అలాగే నరుడు-నారాయణుడు; జీవుడు-ఈశ్వరుడు బ్రహ్మజ్ఞానంలో అద్వైతసిద్ధి పొంది ఏకమౌతారు. పదార్ధమూ,శక్తి, వేరు వేరుగా లేనట్లే నరుడు-నారాయణుడు; జీవుడు-ఈశ్వరుడు వేరు, వేరుగా లేరు. అందువల్ల హిందూ దేవుళ్ళకు జీవుడికి ఉన్నట్టే family, సంసారం ఉంది. జీవుడికి మల్లే వాళ్ళూ కష్టసుఖాలు అనుభవించారు. హిందూ మతానికి అద్వైత దృష్టి ఉండడం వల్ల నరుడిలో నారాయుణ్ణి చూసి మానవసేవయే మాధవ సేవ అంది. ప్రకృతిలో, జీవుడిలో ఈశ్వరుణ్ణి చూస్తుంది. అద్వైత దృష్ఠి ఉండడం వల్లే కవులైన కొంతమంది మహర్షులు ఈశ్వరుడి లో తమలాంటి జీవుణ్ణి చూసి వారి కావ్యాల్లో దేవుళ్లతో చనువుగా హాస్య మాడారు. నిందాస్తుతి చేశారు. నరనారాయుణుల్ని ఒక్కటిచేశారు. రామాయణం, మహాభారతం వంటి కావ్యాల్లో నారాయణుణ్ణి నరుణ్ణి చేసి కష్టసుఖాల పరీక్ష పెట్టారు. అద్వైత దృష్టి కలవాడు ఎలా జీవిస్తాడో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి జీవితాల ద్వారా అందరికీ చూపించారు. శ్రీకృష్ణుడు తాను ఏ దృష్టితో జీవితాన్ని చూస్తున్నాడో ఆ అద్వైత దృష్టినే భగవద్గీతలో చెప్పాడు. శ్రీకృషుడి జీవితం art ఐతే, భగవద్గీత science. నరుడైన అర్జునుడు, నారాయణుడైన శ్రీకృష్ణుడితో వావివరసలు కలిగి ఉండడం కూడా నర నారాయణులు ఒక్కటే అనడానికి నిదర్శనం. ‘జీవుడైన నారద మహర్షి వైకుంఠానికి, కైలాసానికి వెళ్ళాడు, ముల్లోకాలూ తిరిగాడు’ అని పురాణాలలో చెప్పడం వెనకాల ఉన్న ఉద్దేశ్యం, నరనారాయణులు, జీవేశ్వరులు ఒకటే అని చెప్పడానికే. ఈ అద్వైత జ్ఞానాన్ని, సైన్స్ ను పురాణాల్లో artistic గా చెప్పారు. ఈ అద్వైతం (సైన్స్) తెలియకపోతే పురాణాలు (art) అర్ధం కావు. అర్ధంకాకే వాటిని విమర్శించడం జరుగుతుంది.
జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అంటుంది మతం. సాంప్రదాయకమైన మతవిశ్వాసాలకు విరుద్ధంగా అద్వైతం జీవేశ్వరులు ఒకటే అనడం సాహసమే. సంప్రదాయంలో ఉన్న భద్రత సాహసంలో లేదు. కానీ సాహసమే జీవలక్షణం. జీవేశ్వరులు ఒకటేనన్న అద్వైతదృష్టి ఉంటే ఈశ్వరుడి పేరిట జీవుల్ని బలి ఇవ్వడం ఉండదు. అద్వైతాన్ని అర్ధం చేసుకోవడానికి నా రచనలో హిందూదేవుళ్ల ను ఉదహరించడానికి కారణం వారికి అద్వైత దృష్టి ఉండడమే.
ధర్మార్ధకామమోక్షాలు నాలుగింటినీ కలుపుకుపోయే సూత్రాన్ని కనిపెట్టి, మనిషిని పరిపూర్ణుణ్ణి చేసిన సూపర్ సైంటిస్టులు, మరణ భయాన్ని పోగొట్టి మనిషిని మృత్యుంజయుణ్ణి చేసిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు భారతీయ మహర్షులు. ఏది తెలుసుకుంటే ఇంక ఏదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో, ఇంకా ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కడ అంతం అవుతుందో అది వేదాంతం. జీవితసమస్యకు, సమగ్రమైన, శాశ్వతమైన పరిష్కారం ఇచ్చేది వేదాంతం. బ్రహ్మవిద్య. మతము, సైన్సు, కళలు మూడింటి గమ్యం ఒకటే అని అర్ధం కావడానికి అద్వైత సిద్ధాంతం అవసరం. మతం(హిందూ మతం), సైన్సు (ఐనస్టీన్ సాపేక్ష సిద్ధాంతం), కళలు(సిరివెన్నల సీతారామ శాస్త్రి గారి ‘జగమంత కుటుంబం’, పోతన గారి ‘గజేంద్ర మోక్షం’, పెద్దన గారి ‘మనుచరిత్ర కావ్యం’) ఏవిధంగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాయో ఈ రచనలో వివరించడం జరిగింది.
అమృతం
“బ్రహ్మానుభవం (మోక్షం) పొందడమే మానవ జీవిత లక్ష్యం” అన్నారు శంకరభగవత్పాదులు. అమృతం లాంటి ఆ బ్రహ్మానుభవాన్ని రుచి చూపించడమే ఈ రచన ప్రయోజనం. ఈ రచనలో రెండు భాగాలు- ‘నేనెవరు?’; ‘మోక్షం’. రెండిట్లో పరిపూర్ణ జీవితాన్ని ఆశించే 'జీవుడు' కథానాయకుడు. అజ్ఞానమే అతని పాలిటి విలన్. మహర్షుల బోధ, అంతరాత్మ ప్రబోధం అందుకుని ఆత్మవిశ్వాసంతో అజ్ఞానాన్ని జయించి తాను ఆశించిన జీవితాన్ని జీవుడు సాధిస్తాడు. ఇది జీవుడి జీవితకథ. మానవుని ఆత్మకథ. ఈ రచనలో వాడిన పదాలు- జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బ్రహ్మం, మరియు వాక్యాలు-సర్వం ఖిల్విదం బ్రహ్మ ..మొదలైనవి ఉపనిషత్తుల నుండి స్వీకరించడం జరిగింది. బ్రహ్మం అంటే త్రిమూర్తులలో బ్రహ్మ కాదు. అలాగే ఈశ్వరుడు అంటే శివుడు కాదు. ఈశ్వరుడు, బ్రహ్మం జ్ఞానానికి ప్రతీకలు. మతానికి కాదు.
🙏🙏