Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
కన్నయ్య చెలిమి
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
కన్నయ్య చెలిమి
సీ. ఇందీ(1)వరుం డైన యిందీవరాసిత
           సమవిభక్తాంగసౌష్ఠవము వాని
     అలక లల్లలనాఁడ లలితలతా(2)తిల
           కమ్ము భాసిలు లలాటమ్ము వాని
     వేణువాదనలోలబింబోష్ఠములు, మణి
           కుండలద్యుతిలసద్గండయుగము,
     ఆకర్ణదీర్ఘాంబుజాభనేత్రమ్ములు,
           దరహాసకలితసుందరముఖమ్ము,
     శిఖిపింఛమౌళియు, శ్రీనికేతనకౌస్తు
           భాంచితవక్షమ్ము, నబ్ధిసార(3)
     సారంగ(4)హారకేయూరకంకణదృఢాం
           గోర్మికా(5)వనమాల లొలయ, మంజు 
     శింజినీ(6) రవములు చేతమ్ముల హరింప,
           నాసాగ్రశశిప్రభ(7) భాసిలంగ, 
     కౌశేయ(8)మందారగంధచందనలేప
           నాంచితగాత్రుఁడై, యఖిలభువన
     సమ్మోహనాకర్ష(9)సచ్చిదానందమూ
           ర్తిగ, షోడశసహస్రమృగ(10)విలోచ
     నాంగనామారుఁడై, హరిపూర్ణరూపంపు
           తత్వవేదిక గాఁగఁ దనరఁ, బూరు
     షోత్తమువాసం బనుత్తమరమ్యహ
           ర్మ్యాంతరమణివేదికాసనములు,
     మృదుతల్పములు, నిత్యమృష్టాన్నపానీయ
           భక్ష్యభోజ్యంబులు, ఫలరసములు,
     శ్రవణాక్షిపర్వమౌ(11) సంగీతనృత్యాలు, 
           లీలావినోదాల మేళవింపు
     లలరారు మందిర, మందు శ్రీకృష్ణలీ
           లామానుషాకార(12) మాముకొనఁగ(13)
తే.గీ. కాంచి తన్మయుఁడై పులకించి మఱచె
       ఆ కుచేలుఁడు సర్వ, మిల్లాలు కోరు
       సహ్యమర్థింప నేరఁడు సఖునిఁ జేరి,
       అంత తల్పంబు దిగి కడు సంతసించి
            (1) లక్ష్మి (2) లతా=కస్తూరి (3) మణి (4) బంగారు (5) వజ్రపుటుంగరము
            (6) కాలి అందెల (7) ముత్యము (8) పట్టువస్త్రము (9) ఆకర్షించుట కృష్ణధర్మము 
            (10) లేడి (11) పండుగ (12) మనుష్యరూపములో కనబడు దేవుని ఆకృతి 
            (13) ఆముకొనగ=అతిశయింపగా

సీ. భోగభాగ్యంబుల మురియు కృష్ణుఁడు బాల్య
          మిత్రున కెదు రేఁగి మిన్నుఁ దాఁకు
     ప్రీతిఁ గౌఁగిలిఁ జేర్చి ప్రియభాషణములాడి
          మెత్తని తల్పానఁ జిత్త మలర
     ఆసీనుఁ జేసి తదంఘ్రులఁ గడిగి యా
          జలము శిరంబునఁ జల్లుకొనియె
     వివిధసపర్యల వేడుకగా రుక్మి
          ణీయుతుండై చేసి నెమ్మిఁ(1) గొంగు
తే.గీ. ముడిని విప్పి గ్రహించి ప్రేముడిని(2) నటుకు
       లారగింపఁగఁ గొన్ని యనన్యహర్మ్య(3)
       భృత్యభాగ్యమ్ములు కుచేలు నింట వెలసె,
       ఎఱుక లేకయె ముద మొంది యరిగె సఖుఁడు
            (1) స్నేహముతో (2) అనురాగముతో (3) ధనికుని గృహము

తే.గీ. అచ్చమౌ చెల్మి కొక పత్ర(1)మైనఁ జాలు
       తృప్తి నొందింపఁ బరమాత్ము, నెంత ధనము
       కూడబెట్టిన నది(2)లేక కొఱ(3)కు రాదు,
       శ్యామసుందరు చెలిమి భాగ్యప్రదంబు
            (1) ఆకు (2) చెల్మి (3) ప్రయోజనము
Posted in August 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *