11
ఆహ్వానాలని అవకాశాలుగా అందిపుచ్చుకుని కచేరీలు చేయడంలో నిమగ్నమయినా చదువుతో పాటుగా కర్ణాటక సంగీతంలో డిగ్రీ పొందేందుకు ఆన్-లైన్ విద్యాబోధనకి శ్రీకారం చుట్టింది పారూ.
మరోవైపు, కిరణ్ తో చిగురించిన స్నేహం ఆమెలో మంచి మార్పునే తెచ్చింది. బెరుకు, పిరికితనం తొలగి ఆత్మవిశ్వాశం పెరిగింది. కిరణ్ తో ఎన్నో విషయాలు చర్చిస్తుంది, వాదిస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోని విషయాలని ఆకళింపు చేసుకుంటుంది.
అప్పుడప్పుడు తాను రాసిన లిరిక్స్ ని పారూ చేత ప్రాక్టీస్ చేయిస్తుంటాడు కిరణ్. వారి నడుమ చనువు పెరిగి కిరణ్ ని పారూ ‘బావా’ అని పిలవడం శాంతా, సీతమ్మలకి నచ్చింది.
**
పరమేశ్వరి సంగీత జీవన ప్రస్థానంలో మరో రెండేళ్ళ సమయం ఆశించిన దానికన్నా మిన్నగా, శరవేగంగా గడిచింది. వృత్తిపరంగా పందొమ్మిదేళ్ళ వయసుకే మనమరాలు సాధించిన పురోగతికి గర్వపడ్డారు సీతమ్మ.
కూతురి భవిష్యత్తుని సంప్రదాయబద్ధంగా, ఆశించిన విధంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు రామ్. పారూ గౌరవనీయమైన గాయనిగా, కళ ద్వారా సమాజానికి సేవలందించే వ్యక్తిగా ఎదగాలనేది అతని ఉద్దేశం.
**
ఈలోగా తాము నివసిస్తున్న అద్దింటి నుండి కూతవేటు దూరంలో, పారూ పేరిట ఓ అధునాతన ఫ్లాట్ కొనుగోలు చేసాడు రామ్. నిర్మాణం పూర్తవగానే గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని అనుకున్నారు రామ్ దంపతులు.
ఇక, పునీత్ స్కూల్ మారాడు. బాలల ప్రత్యేక పాఠశాలలో అత్యధికంగా పురుషలే ఉపాధ్యాయులుగా ఆంగ్లం, గణితం, సాంఘికంతో పాటు ప్రతామ్నాయ విద్యాబోధనలో చదువు సాగుతుంది. పర్యవేక్షణ, క్రమశిక్షణలు అధికంగానే ఉంటాయి. వడ్రంగి, పెన్సిల్ ఆర్ట్ క్లాసులు అటెండ్ అవుతున్నాడు పునీత్. వారంతంలో చర్చిలోని వాలంటీర్ ఉద్యోగం కొనసాగిస్తున్నా, అప్పుడప్పుడు డబ్బు కావాలని పారూ వద్దకి వస్తుంటాడు.
పునీత్ సిగరెట్లు తాగుతున్నాడని కనిపెట్టిన పారూ కంగారు పడింది. చర్చిలో ఓ అబ్బాయితో గొడవపడి, అతని సైకిల్ మాయం చేసాడని మాలిని ద్వారా తెలుసుకున్నప్పుడు కూడా పునీత్ విషయంలో ఆవేదనకు గురయ్యింది పారూ.
సీతమ్మ కూడా మనమల విషయంగా ఆలోచన చేయసాగారు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న కిరణ్, పారూల స్నేహం ప్రేమగా మారి పెళ్ళికి దారి తీయాలన్న ఆశ ఆమె మనసులో మెదులుతూనే ఉంటుంది. పునీత్ నడవడి బాగుపడి, జననీ కూడా మంచి మార్గాన ఎదిగే వరకు శాంతా, రామ్ లకి తాను అండగా ఉండాలి అన్న తలంపుతో బాసర కొలువు నుండి విశ్రాంతి తీసుకొనే ఆలోచనలో ఉన్నారామె.
**
‘భారతీయ కర్ణాటక సంగీత పరిషత్’వారు తమ శతవార్షికోత్సవానికి పరమేశ్వరి 'కచేరీ'కి ఆహ్వానం పలికినప్పుడు సీతమ్మ గారి ఆనందం అంబరానంటింది. రెండు వారాల్లో హైద్రాబాదులో జరగనున్న ఆ కార్యక్రమానికి ఆమె పునీత్, జననీలని కూడా బయలుదేరదీసారు.
మంచి ప్రచారంతో కచేరీకి రంగం సిద్దమయింది. కార్యక్రమానికి రామనాధం గారి కుటుంబం ముందు వరసలో ఆసీనులయ్యారు.
గంటన్నర పాటు తన గాన మాధుర్య ఝరిలో సంగీత ప్రియులని ఓలలాడించింది యువగాయని పరమేశ్వరి. సహజసిద్ధంగా ప్రాప్తించిన నైపుణ్యంతో పంచరత్న కీర్తన, త్యాగరాయ కృతి, వర్ణం, జావళి, మువ్వగోపాల పదం, అన్నమయ్య కీర్తన, తిల్లానా తన్మయత్వంతో అలవోకగా ఆలపించి శ్రోతలని అలరించింది. ఆమె లోని సంగీత పటిమకు అచ్చరువొందారు ప్రేక్షకులు.
కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ‘గాన సరస్వతి’ అన్న బిరుదుతోపాటు స్వర్ణకంకణాన్ని బహూకరించి, పరమేశ్వరికి వైభవంగా సన్మాన సత్కారాలు నిర్వహించారు.
ఆ దృశ్యాన్ని కన్నుల పండువుగా వీక్షించిన సీతమ్మ గారి కళ్ళవెంట ఆనందభాష్పాలే రాలితే, తల్లితండ్రులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వారు ముగ్గురిని కూడా వేదికపైకి ఆహ్వానించి సత్కరించారు నిర్వాహకులు.
కచేరీకి విచ్చేసిన ప్రముఖులు, సంగీత విద్వాంసులు పరమేశ్వరికి తమ ఆశీస్సులు అందించారు.
‘తనదైన బాణీలో పాడి సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పందొమ్మిదేళ్ళ పరమేశ్వరి రామ్‌కుమార్’ అని పత్రికలు, మీడియా కొనియాడాయి.
**
ముందు రోజు హయత్ హోటల్లో బసచేసినా ప్రోగ్రాం తరువాత గానసభ నుండి నేరుగా రామనాధం గారింటికి వెళ్ళింది రామ్ కుటుంబం.
ఇల్లు చేరి పారూకి దిష్టి తిప్పేసాక అందరూ కలిసి లోనికి నడిచారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుండగా రామ్ కి పరిషత్ కార్యదర్శి ఫోన్ చేసాడు.
'సంస్కృతి టీవీ ఛానల్' మరియు 'అతివ' మ్యాగజిన్ వారి ఇంటర్వ్యూలకి సమయం కేటాయించాలని, పరమేశ్వరి కుటుంబ సభ్యులు కూడా ఇంటర్వ్యూలో పాల్గొనాలని కోరారు.
అది విన్న పునీత్ "బాబోయ్! ఉన్న ఈ ఒక్క రోజు పారు ఇంటర్వ్యూ, పాటలు, మాటలు అంటే మాత్రం మమ్మల్ని బైటికి తీసుకుని వెళ్ళు కిరణ్ బావా. మేము సిటీ చూస్తాము." అన్నాడు అసహనంగా.
"నో నో ... నీవు కూడా ఉండాలి కదా!" .. అన్నాడు కిరణ్.
"నాకు, జననీకి కూడా మ్యూజిక్ అంటే అంతగా ఆసక్తి లేదు బావా! అందుకే" అంటూ జవాబిచ్చాడు పునీత్.
రామనాధం గారు కలగజేసుకున్నారు. "అయినా ఇంటర్వ్యూలకి పారూ, తల్లితండ్రులు, అమ్మమ్మ గారు ముఖ్యం. చిన్నవాళ్ళని బయటకు తీసుకువెళ్లే ఏర్పాటు చేద్దాములే కిరణ్!" అంటూ సర్దేసారు.
"అర్ధమయింది. రేపు పొద్దుటే మామయ్యావాళ్ళు వస్తున్నారుగా. వీళ్ళని బయటకి తీసుకువెళ్ళమని మీనాని అడుగుదాములే." అన్నాడు.
భోజనం ముగించి అర్ధరాత్రి వరకు హోమ్-థియేటర్ లో 'ఘోస్ట్' ఇంగ్లీష్ సినిమా చూసారు.
**
మరునాడు పొద్దుటే, టీవీ వాళ్ళ ఇంటర్వ్యూ కోసం ఇంటిని సవరించసాగాడు కిరణ్. అందరినీ తొమ్మిదింటికల్లా తయారయి హాల్లోకి రావాల్సిందిగా పురమాయించాడు. అందరూ వచ్చేప్పటికి బ్రేక్-ఫాస్ట్ సమయానికి వకుళ గారి అన్నా, వదినా, వాళ్ళమ్మాయి మీనాక్షి కూడా వచ్చారు.
అందరి పరిచయాలు అయ్యాక పారూ వద్దకి వచ్చిన మీనాక్షి "నీవా పరమేశ్వరి అంటే? కిరణ్ బావ చాలా చెప్పాడు నీ గురించి, నీ పాట గురించి. నన్ను నీ ప్రోగ్రాంకి రమ్మని కూడా చెప్పాడు. కర్ణాటక సంగీతం.. అంతగా ఇష్టం లేదు. అందుకే రాలేదు." అంది మీనాక్షి.
ఆ సంభాషణ వింటున్న కిరణ్, "ఇలాగేనా మాట్లాడేది మీనా? ఆమె పాడే మ్యూజిక్ ఇష్టం లేదని ఆమెకే చెబితే... నీ తెలివి దొబ్బిందనుకుంటారు. సిల్లీ గర్ల్. బ్రేక్-ఫాస్ట్ అయింది కదా! పునీత్, జననీ నీ ఫాన్స్ అయిపోయారట. వాళ్ళని నీకిష్టమైన మాల్ కి, లంచ్ స్పాట్ కి, ఐస్-క్రీం పార్లర్ కి తీసుకునెళ్ళి ఎంజాయ్ చేసి రండి. అలాగే నీకిష్టమైన కారు రోజంతా నీదే ... డ్రైవర్ తో సహా. ఈ డీల్ ఓకేనా?” మీనాక్షిని అడిగాడు కిరణ్.
కాసేపు ఆలోచించింది మీనా. "ఓకే, కానైతే నా పుట్టినరోజుకి నీవేమి గిఫ్ట్ ఇస్తావో ముందే చెప్పాలి బావా! పార్టీ కూడా నీవే ఏర్పాటు చెయ్యాలి" అంది గోముగా.
గేట్ లో నుండి వెహికల్స్ లోనికి రావడం వినిపించింది. వాచ్-మాన్ వచ్చి టీవీ స్టేషన్ వాళ్ళొచ్చారని చెప్పి వెళ్ళాడు.
**
మూడు గంటల పాటు 'గానమే మార్గం, సేవే ధ్యేయం' అన్న మకుటంతో 'యువ గాయని పరమేశ్వరి రామ్‌కుమార్' ఇంటర్వ్యూ కొనసాగింది. సంగీతమే ఊపిరిగా... ఆలయాల అభివృద్ధికి స్వచ్చంద కాచేరీలు చేస్తూ అతి కొద్దికాలంలోనే ఉన్నత స్థాయి గాయనిగా ఖ్యాతి పొందుతున్న పరమేశ్వరి' అంటూ ఆమెతో మాట్లాడించారు.
తరువాత ఆమె గురువు, అమ్మమ్మగారు అయిన ప్రసిద్ధ గాయని 'కళాప్రపూర్ణ' వేదాంతం సీతామహాలక్ష్మిని, కన్నతల్లి గాయని శాంతని, తండ్రి రామ్‌కుమార్ లని కూడా ప్రవేశ పెట్టి... ప్రేక్షకులకి ఆసక్తిగా ఉండేలా ఇంటర్వ్యూని చక్కగా నిర్వహించారు సంస్కృతి టీవీ వారు.
'పారూకి ఐదేళ్ల వయసు వరకు మాట రాకపోయినా, ఆ అమ్మాయి సంగీత వారసత్వం పైనా, ఆ పిల్లలో పొడసూపిన సంగీత జ్ఞానం పైనా నమ్మకముంచి సీతామహాలక్ష్మిగారు సాగించిన సంగీత శిక్షణ గురించి' శాంత చెప్పగా విన్న రామనాధం వాళ్లకి పారూ పట్ల, ఆమె కుటుంబం పట్ల ఎనలేని అభిమానం, సద్భావన కలిగాయి.
మీనాక్షి తల్లితండ్రులు ప్రత్యేకంగా పారూని అభినందించారు. "ఇంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభా నైపుణ్యాలని పుణికి పుచ్చుకున్న నిన్ను ఇలా కలవడం మాకెంతో ఆనందం." అంటూ తన చేతికున్న బంగారు కడియాన్ని తీసి పారూ చేతికి తొడిగారు విమల గారు.
ఊహించని వారి అభిమానానికి, బహుమానానికి మొహమాట పడుతున్న పరమేశ్వరిని గమనిస్తున్న సీతమ్మ గారు "పర్వాలేదమ్మా, పెద్దవాళ్ళు అభిమానంగా ఇచ్చినదాన్ని స్వీకరించి పాదనమస్కారం చేయి. అలాగే నీ కచేరీలు విజయవంతమైనందుకు తాతగారికి, అత్తయ్యా, మామయ్యకి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకో." అన్నారు.
**
మరునాడు బ్రేక్ఫాస్ట్ వద్ద పారూ చేతినున్న బంగారు కడియాన్ని గుర్తించిన మీనాక్షి నివ్వెరపోయింది. వంటింట్లో ఉన్న తల్లి వద్దకి వెళ్లి, గొడవ పెట్టుకుంది. "నీకంతగా గిఫ్ట్ ఇవ్వాలనుంటే, కొత్తది కొనివ్వచ్చు కదా! నాకివ్వాల్సిన వస్తువుని వేరొకరికి ఎలా ఇచ్చావు అమ్మా!" అంటూ నిలదీసింది. గొంతు తగ్గించినా చుట్టూ ఉన్న వారికి విషయం తెలిసింది.
"మీనా, ఇలా రా. నీవొచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి. పరమేశ్వరి కుటుంబం మన అతిధులు. వారు వెళ్ళేలోగా మరో చిన్న కార్యక్రమం ఉంది." అంటూ కూతురిని పిలిచారు శ్రీనివాస్ గారు.
**
బ్రేక్ఫాస్ట్ ముగిశాక పరమేశ్వరిని, కుటుంబాన్ని దేవుని మందిరం లోనికి ఆహ్వానించి, పరమేశ్వరికి పట్టు వస్త్రాలు, కానుకలు ఇచ్చి సత్కరించారు. పారూని ప్రేమగా దగ్గరికి తీసుకుని, మెడలో బంగారు గొలుసు వేశారు వకుళ గారు.
"మా అన్నగారి మనమరాలు పరమేశ్వరి ఓ గొప్ప కళాకారిణి. కళామతల్లి ముద్దుబిడ్డని ఇలా ఆదరించి సన్మానించుకోడం మన సంప్రదాయం. మన అదృష్టం." అంటూ తమ సంతోషాన్ని వెలిబుచ్చారు రామనాధం గారు.
ఫ్లైట్ టైం అవుతుందని కిరణ్ హెచ్చరించాక….
"త్వరలో కొత్త ఫ్లాట్ లో వ్రతం చేయాలనుకుంటున్నాము. తేదీ, సమయం తెలియజేస్తాము. వీలు చేసుకుని మీరందరూ రాగలిగితే మాకు ఆనందంగా ఉంటుంది." అంటూ అందరి వద్దా సెలవు తీసుకున్నారు శాంతా, రామ్‌కుమార్ లు.
**
ప్రయాణాలతో సీతమ్మగారు బాగా అలిసిపోయారు. విశ్రాంతి తీసుకోమంటూ ఇంటిల్లిపాదీ ఆమెకి వారం రోజులుగా సపర్యలు చేస్తున్నారు.
పరీక్షలు దగ్గర పడుతుండడం వల్ల, పిల్లలందరూ ఆరింటికల్లా తినేసి ఎవరి గదుల్లో వారు చదువుకుంటున్నారు.
ఇంటికి వస్తూ ... ఆ రోజు అతిథులని వెంట తీసుకు వచ్చాడు రామ్. వారిని 'గుడ్-విల్ ఫిలిమ్స్' సినీ నిర్మాత జనార్దన్ రావు, దర్శకురాలు కుమిలిని దేవిగా శాంతకి, సీతమ్మ గారికి పరిచయం చేసాడు.
పరమేశ్వరి గురించి కొద్ధి కాలంగా తెలుసునని, జోసెఫ్ గారిని సంప్రదించాక ఇలా వచ్చామని తెలిపారు అతిధులు. తాము నిర్మించబోయే ఓ సందేశాత్మక చిత్రానికి మూడు పాటలు పరమేశ్వరి చేత పాడించాలని అనుకుంటున్నామని, ఒక పాటని మాత్రం గాయని పరమేశ్వరి గానే లైవ్ లో వేదిక పై పాడుతున్నట్టుగా చిత్రీకరిస్తామని వివరించారు.
తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే, అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఊహించని ఈ అవకాశం పెద్దవాళ్ళని ఆశ్చర్యపరచింది. పారూని పిలచి, ఆమెక జనార్దన్ రావు, కుమిలిని దేవిని పరిచయం చేసాడు రామ్.
"మేము పరమేశ్వరి తోనూ మాట్లాడి, మీకు రెండురోజుల్లో జవాబిస్తాము. ఆమె కళాజీవితం మరో చక్కని మలుపు తిరిగే అవకాశమని జోసెఫ్ భావించారు కనుకనే మీరు మమ్మల్ని కలిశారు. మీకు మిక్కిలి ధన్యవాదాలు." అన్నాడు రామ్.
"తప్పకుండా ...మీకు సమ్మతమైతే వచ్చే గురువారం ఒప్పందం కుదుర్చుకుందాము.." అంటూ సెలవు తీసుకున్నారు అతిధులు.
**
సినిమాకి పాడి, అందులో నటించే అవకాశానికి ఇంటిల్లిపాదీ ఆనందించారు. మరో వారానికి 'ఆనందోబ్రహ్మ' సినిమాకు ఒప్పందం కుదిరి, అడ్వాన్స్ కూడా అందుకున్నాక కిరణ్ కి ఫోన్ చేసింది పారూ.
"హలో కిరణ్ బావ, ఒక ఊహంచని గొప్ప అవకాశం వచ్చిందోచ్! గెస్ చేస్తావా?" అడిగింది.
"అవకాశం అంటూ చాలా ఉత్సాహంగా ఉన్నావని తెలుస్తుంది. ఏమిటి విషయం?" అడిగాడు..
కాసేపు ఆ కబురు, ఈ కబురు చెప్పి మొత్తానికి విషయం వెల్లడించింది.
"వావ్ పారూ.. కాంగ్రాట్యులేషన్స్. పెద్ద స్టార్ అయిపోతావన్నమాట. మెల్లగా మమ్మల్ని మర్చిపోయే లోగా వచ్చి కలుస్తాములే." అన్నాడు నవ్వుతూ.. కిరణ్.
"అదేమి అలా అంటావు? నీతో మాట్లాడని రోజే ఉండదు కదా! నిన్ను మరిచిపోవడమంటే... సాధ్యం కాదులే బావగారు!” అంటూ నవ్వింది పారూ.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్