ఒక తెలుగు చిత్రం ప్రేక్షకుల మన్ననలను అందుకుని, అత్యంత ఆదరణతో మరలా మరలా చూడాలనిపించే విధంగా, కలకాలం అందరికీ గుర్తుండేటట్లు నిర్మించాలంటే అది అంత చిన్న విషయం కాదు. నిబద్దతతో, నిర్విరామ సృజనాత్మక కృషితో ఎంతోమంది శ్రమిస్తేనే అది సాధ్యపడుతుంది. ముఖ్యంగా దర్శకుడు తన సంకల్ప బలానికి నిత్య నూతన ఆలోచనలతో సదా శక్తిని ఇస్తుండాలి. అలాగే సంగీత దర్శకుడు, గేయ రచయిత, నటీనటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు, ఛాయాగ్రహకులు, నృత్య దర్శకులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది శ్రామికులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. అయితే ఇన్ని ఉన్నా, ఒక చిన్న పొరపాటు లేదా కథను నడిపించిన విధానంలో తేడా వస్తే ఇక ఆ సినిమా ధమాల్మని పడిపోతుంది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే మన పాత సామెతకు సినిమా తీసి చూడు అని కూడా చేర్చవచ్చు.
అంతటి యజ్ఞాన్ని అవలీలగా జరిపించి ఎన్నో super hit చిత్రాలను అందించిన మన కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి చిత్రాలలోని అన్ని పాటలు అద్భుతాలే. సిరివెన్నెల చిత్రంతో తనకంటూ ఒక గుర్తింపును పొంది ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొన్న ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి’ గారి కలం నుండి జాలువారిన ఒక ఆణిముత్యం వంటి పాటను మన సిరిమల్లె పదవ వార్షికోత్సవం సందర్భంగా మీకు అందిస్తున్నాము.
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది (అది భిక్షువు)
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
తీపి రాగాల ఆ కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది(2)
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది(2)
బండ రాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసి జేసినాడు
వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖ ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది(2)