ఈ ఆగస్టు 15న భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశానికి ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోడీ ఈ రోజు ఎర్రకోటపై వరుసగా 12వ సారి జాతీయ జెండాను ఎగురవేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15వ తేదీన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 200 ఏళ్ల పైచిలుకు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం చేశారు. భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది వీరులు బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు, వారి లాఠీల క్రూరత్వాన బారిన పడ్డారు. మరెంతో మంది నిరాహార దీక్షలు, పోరాటాలు చేశారు, జైలుకు వెళ్ళారు. చివరికి మన త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు తలవంచి మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా గర్వంతో రెపరెపలాడింది.
మన జాతీయ జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది. ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు ఘనంగా జరుపుతారు. దీనికి అదనంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుండి దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులను వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటారు. జాతీయోద్యమం వల్లనే స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు దేశమంతా వ్యాపించాయి.
నా చిన్నప్పుడు హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేవారు. స్కూలు బోర్డు గౌరవ చైర్మన్ జెండావందనం చేసినట్లు నాకు ఇప్పటికీ గుర్తు. జెండా కట్టడానికి దాదాపు 50 అడుగులు ఎత్తున్న ఇనుప గుంజను ఎక్కే పిల్లాడిని స్కూలులోనే వెతికి పట్టుకొని, వాడిని జాతీయ జెండా - తాడు ఇచ్చి స్థంభం పైనున్న కొక్కేనికి తగిలించమనేవారు. జెండా కట్టె క్రమంలో ఇప్పటి ఆధునిక స్పైడర్ మాన్ కు ఏమాత్రం తీసిపోని కళను సదరు జెండా స్తంభం ఎక్కినవారు అప్పుడు ప్రదర్శించినట్లు నాకు బాగా గుర్తు. జెండా వందనం పిదప, వందేమాతరం, జాతీయగీతం ఆలాపనతో పాటూ బిస్కెట్లు పంచేవారు. ఆలస్యం చెయ్యకుండా ఆవురావురు మంటూ అవి తినుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేవారం. 1985 అప్పటి మాట, టీవీ గట్రాలు అప్పుడు లేవు కావున, మరుసటిరోజు తెలుగు దిన పత్రికలో అటు ఢిల్లీ, ఇటు హైదరాబాదులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయో చదివి తెలుసుకునేవారం. దారి పోడుగునా సందులు రేడియోలో వినిపించే స్వాతంత్ర దినోత్సవ తెలుగుపాటలతో ప్రతిధ్వనించేవి.
ఇప్పుడు డిజిటల్ యుగంలో భారత్ లో స్వాతంత్ర దినోత్సవాన్ని ఎలాజరుపుకుంటున్నారో చర్చ భలేగా ఉంటుంది కదూ? కాలంతో పాటు కొత్త రీతుల్లో వేడుకలు అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహించుకోవడంలో తప్పులేదు కదా! ఉదాహరణకు స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతిబింబించే లేజర్ షో లేదా డ్రోన్ ఒకటి నిర్వహిస్తే అది పిల్లలను, పెద్దలను అందరినీ ఆకట్టుకుంటుంది కదా!
ఇకపోతే, బయట పాఠశాలల్లో, కార్యాలయాలలో, బహిరంగ ప్రదేశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడంతో పాటూ, ఆ వేడుకల వెలుగులను, జిలుగులను మనం ఇంటిలో కూడా తీసుకురావచ్చు. పెద్దగా ఖర్చులేని విధంగా కూడా! ఇందులో నాకు నచ్చినవి కొన్ని మీకు ఇప్పుదు ఈ నెల రచ్చబండ చర్చా వేదికగా అందిస్తున్నాను, మరి మీకు తోచినవి మీరు కూడా అందించి చర్చలో పాల్గొంటే మరింత బాగుంటుంది కదా!
ముందుగా, ఖర్చులేని, వేగవంతమైన పద్దతి - మీ గదిలో టెలివిజన్ ఉందా? లేదా మీ వర్క్ డెస్క్ వద్ద లాప్ టాప్ ఉందా? అవును అయితే, ఇక్కడ ఒక చక్కని ఆలోచన ఉంది. భారతీయ త్రివర్ణ పతాకం యొక్క స్క్రీన్‌సేవర్‌ను డౌన్‌లోడ్ చేసి, ఈ డిజిటల్ పరికరాలలో ప్లే చేయనివ్వండి. మీ దేశాన్ని గుర్తుచేసుకోవడానికి చేయడానికి ఇది సరైన సమయం.
భారతదేశంలోని పురాతన అలంకరణ రూపాలలో ముగ్గు/రంగోలి ఒకటి. ఎవరైనా స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతిబింబించే మువ్వన్నెల ముగ్గుని తయారు చేయవచ్చు, ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ రోడ్డుపై వేయాల్సిన అవసరం లేదు. ముగ్గులను బియ్యం పిండితో లేదా రంగు బియ్యం గింజలు లేదా పూల రేకులతో కూడా తయారు చేయవచ్చు. దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తుకుచేసుకునే విధంగా ఒక ముగ్గుని సృష్టించడం అనే ప్రయత్నంలో మొత్తం మీ కుటుంబాన్ని తీసుకువస్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నించండి!
వాల్ హ్యాంగింగ్‌లు ఇప్పుదు చాలా గృహాలలో కనిపిస్తున్నాయి. వీటిని దుకాణంలో కొనుగోలు చేయవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో ఆర్ట్ మరియు క్రాఫ్ట్‌లో నైపుణ్యం ఉన్నవారు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక వాల్ హ్యాంగింగ్ కోసం, మీకు నచ్చిన డిజైన్‌లో మీ చేతిని ప్రయత్నించవచ్చు. ఇది తయారు చేయడం సులభం - కొన్ని రంగుల చార్ట్ పేపర్లు, జిగురు మరియు కత్తెర మాత్రమే అవసరం.
మీ కోసం భారతీయ త్రివర్ణాల రంగులతో కొన్ని కొవ్వొత్తులను తయారు చేసుకోవచ్చు. సిద్ధమైన తర్వాత, మీరు వాటిని మీ ఇంటి చుట్టూ, మీ బాల్కనీ లేదా టెర్రస్‌పై లేదా మీ ఆఫీసు బేలో కూడా ఉంచవచ్చు, లేదా మీరు దీన్ని మీ డైనింగ్ టేబుల్ కోసం కూడా ఉపయోగించవచ్చు, ప్రత్యేకించి మీరు ఆగస్టు 15 రోజు రాత్రి భోజనం లేదా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చిన్న కలయిక కోసం అతిథులను మీ ఇంటికి పిలిచిఉంటే. మీ సరళమైన - ప్రభావవంతమైన సృజనాత్మకతను చూసి మీ అతిథులు ఆశ్చర్యపోవడం ఖాయం, నన్ను నమ్మండి.
ప్రతి తెలుగువారి వంటగదిలో, బియ్యం మరియు కొన్ని రకాల పప్పు వంటి ధాన్యాలు ఉంటాయి. మాట వరుసకు కేవలం బ్రెడ్, బటర్ మాత్రమే కలిగిఉండే ప్రవాసాంధ్రుడు ఎవరైనా ఉంటారా ఈరోజుల్లో? గోంగూర, ఆవకాయ పచ్చడితో కూడిన వంటగది, ఇంకా ఉప్పులు పప్పులు వగైరా విరివిగా ప్రతి ఇంట్లో ఉంటాయి కదా? స్వాతంత్ర దినోత్సవంతో మొదలుపెట్టి చర్చ గోంగూర, ఆవకాయ దగ్గరకు వచ్చిందేమిటని కంగారు పడొద్దు, అసలు విషయానికే వస్తున్నా. మీ లివింగ్ రూమ్‌కు ఆకర్షణీయమైన సెంటర్‌పీస్‌ని తయారు చేయడానికి మీరు ఉప్పులు, పప్పులను తెలివిగా ఉపయోగించవచ్చు. తెల్లని బియ్యం, పచ్చి పప్పు, ఎర్ర పప్పు (అన్నీ పచ్చివి - ఉడకనివి) తీసుకుని, భారత జెండాలా కనిపించేలా గుండ్రంగా లేదా చతురస్రాకారంలో ఉండే ప్లేట్‌పై మూడు పంక్తులు వేయండి, మధ్యలో అశోకుడి ధర్మ చక్రం ప్రతిబింబించే విధంగా లవంగాలు పేర్చవచ్చు. ఈ అలంకరణలో మీరు ఉపయోగించిన ఒక్క గింజ కూడా వృధాగా పోదు ఎందుకంటే తర్వాత మీరు దీన్ని మీరే భోజనం వండుకోవడానికి హాయిగా ఉపయోగించవచ్చు.
మీ ఇంటిలో త్రివర్ణ ఆకారంలో ఉన్న పక్షుల పేపర్ కటింగులను గోడకు అడ్డంగా త్రివర్ణ రంగులో అతికించండి. ఈ అలంకరణ చిట్కా మీ ఇంటి వద్ద ఉన్న ఖాళీ గోడను నిమిషాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వేచ్చను చాటే విధంగా చూపుతుంది.
బెలూన్‌లను ఉపయోగించడం అనేది సరళమైన మరియు అత్యంత ప్రభావవంతమైన స్వాతంత్ర్య దినోత్సవ అలంకరణ ఆలోచనలలో ఒకటి. మీరు ఒకే రంగులో 5 నుండి 8 బెలూన్‌ల బంచ్‌లను తయారు చేసి, ఆపై వాటిని కలిసి లేదా విరామాలలో వేలాడదీయవచ్చు. లేదంటే సింగిల్ బెలూన్‌లను ఉపయోగించండి మరియు వాటిని గది అంతటా ఉంచండి లేదా వాటిని స్ట్రింగ్‌లో వేలాడదీయండి. బెలూన్లు ఎల్లప్పుడూ మన ఇంద్రియాలను ఆహ్లాదపరుస్తాయి మరియు, పండుగ స్పూర్తిని కనులపండుగా గా మనకు అందిస్తాయి. కాకపోతే కొన్ని బెలూన్లు పగిలిపోయే అవకాశం ఉంది. ఈ పనులన్నీ మీరు ఒక్కరే చెయ్యకుండా సదరు అలంకరణలకు సంబంధించిన పనులలో ఇతరులను కలుపుకుంటే ఆ బంధం అనుభవంగా మార్చడంలో సహాయపడుతుంది, పైగా శాశ్వత జ్ఞాపకాలను మీకు మిగులుస్తుంది.
అయితే స్వాతంత్ర్య దినోత్సవ స్పూర్తిని కేవలం అలంకరణకు మాత్రమే పరిమితం చెయ్యవద్దు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఒకచోట చేర్చే జాతీయ వేడుకల సందర్భం. ఈ రోజున కార్యాలయాలు మరియు పాఠశాలలకు సెలవు ఉంటుంది, కాబట్టి, ఈ వేడుకను జరుపుకోవడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావిస్థాను.
ఆగస్టు 15న మీరు ఇంటిలో సాంప్రదాయ తెలుగు భోజనంతో విందు చేయండి లేదా మీ స్నేహితులతో కలిసి వన భోజనాలు వంటివి చేయండి. చెత్త క్లీన్-అప్ డ్రైవ్ లేదా చెట్లు నాటే డ్రైవ్ వంటి కార్యక్రమాలలో పాల్గొనండి. టీవీలో దేశభక్తి సినిమా చూడండి. మన దేశం గురించి తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. పాటలంటే ఆసక్తి ఉన్నవారు దేశభక్తి పాటలతో అంత్యాక్షరి ఆట ఆడుకోవచ్చు.
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వేడుకలు, అలంకరణలు తదితర కోలాహాలతో పాటూ, ఈ మధ్య కొన్ని మానవత్వం ప్రశ్నించే సంఘటనలు జరుగుతుండడం పరిపాటి అయ్యింది. మానవత్వాన్ని మంటగలిపే, అపహాస్యం చేసే విధంగా స్రీలపై అత్యాచార ఘటనలు, ఉనికి కోసం ఉగ్ర సంస్థలు ఆగస్టు 15ను ఎంచుకొని చేసే దాడులతో - అసలు మనం ఉన్న సమాజంలో ఇంత అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నామని నిగ్గదీసి ప్రశ్నించేవారు ఉన్నారు. ఇలా ప్రశ్నించే వారిని తప్పు పట్టలేము. వేడుకల్లో ఆదమరచిపోకుండా సదా అప్రమత్తంగా ఉండటం, చట్టాలకు పదును పెట్టే విధంగా వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరం.
కొన్ని హై ప్రొఫైల్ కేసుల్లో సుదీర్ఘ న్యాయ ప్రకియ పిదప చివరిని నిందితులు హాయిగా విడుదల అయ్యారని వచ్చే వార్తలతో సామన్యుడి కడుపు మండడం సహజం. ఉదాహరణకు ముంబయి రైలు పేలుళ్ల కేసు విచారణ 19 ఏళ్ల కాలం కొనసాగి తర్వాత బాంబే హైకోర్టు తాపీగా ఇలాంటి తీర్పు ఒకటి ఇచ్చింది. ఈ కేసు విషయంలో హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రాసిక్యూషన్‌ను మందలించి, సాక్ష్యం, గుర్తింపు పరేడ్ ప్రక్రియపై అనేక అనుమానాలు లేవనెత్తింది. అదే సమయంలో కోర్టు అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ.. రూ.25వేల వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. 2006 ముంబై రైలు పేలుళ్లలో 187 మంది మరణించారు. 800 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో దిగువ కోర్టు 12 మంది నిందితుల్లో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఒకరిని నిర్దోషిగా ప్రకటిస్తూ అప్పట్లో తీర్పును వెలువరించింది. నిందితులు కోర్టు నిర్ణయాన్ని హైకోర్టును సవాలు చేసారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. హైకోర్టు నిర్ణయం దిగ్భ్రాంతికరమని బహుశా సదరు నిందితులు వారి కుటుంబ సభ్యులు మినహా మిగతా దేశమంతా భావించి ఉంటుంది. గుడ్డిలో మెల్ల ఏమిటంటే సదరు హైకోర్టు జూలై నెలలో ఈ తీర్పు ప్రటించింది, ఇంకొంచెం ఆలస్యంగా అంటే ఆగస్టు 15 న ప్రకటించి ఉంటే - భారతీయ వార్తపత్రికలు "స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులకు స్వేచ్చ" అని పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించేవి. సదరు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను ఏమిచెయ్యాలనే విషయం సుప్రీం కోర్టుకు, పాలమెంటుకు వదిలివెయ్యడం ప్రస్తుత పద్దతి, కానీ ప్రజలలో ఇటువంటి తీర్పుల పట్ల అసహనం పెరుగుతున్నవేళ ప్రభుత్వం సత్వరం నిర్దిష్ట చర్యలు తీసుకోకపోతే - ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది. 1950లో మనం రూపొందించుకున్న రాజ్యంగా ఇప్పటి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉందా అనేది ఒక పెద్ద భేతాళ ప్రశ్న.
జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈ పేరు గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. న్యూఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైనట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మార్చి 14న ఆయన నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడే ఆయన ఇంట్లో నుంచి పెద్ద మొత్తంలో కాలిపోయిన నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్టోర్ రూమ్‌లో తాను గానీ, తన కుటుంబీకులు గానీ ఎప్పుడూ నగదు ఉంచలేదని, తనపై ఏదో కుట్ర జరుగుతోందని జస్టిస్ యశ్వంత్ వర్మ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మకు కొంతకాలం పాటు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలను అప్పగించకూడదని కూడా నిర్ణయించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ జస్టిస్ వర్మను దిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. ఈ నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయం అటుంచితే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు లోక్ సభ, రాజ్యసభలో ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఈయనను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది. కానీ ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా ఉండాలనేది ప్రజల అభిమతం. పాత రోజుల్లోలాగా నిందితులను ఏండ్ల తరబడి జైలులో ఉంచి బిర్యానీలు, పరుపులు, దిండ్లు, ఏసీలు అందించే విధానానికి ఇప్పటి తరం వ్యతిరేకంగా ఉన్నారు.
ఏదిఏమైనా ఇటువంటి పంటికింద రాయిలాంటి వార్తలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే సంధి కాలంలో ఉన్నాము మనం. అయినప్పటికీ ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని మనం వైభవంగా జరుపుకోవడం అవసరం. ఎందుకంటే భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులను, వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడాననికి సరైన రోజు ఆగస్టు 15. అందరికీ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ అభినందనలు.
ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలతో పాటూ సిరిమల్లె పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జరిగిన రచ్చబండ చర్చపై మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చ కు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం