జీవన సంద్రము

మా ఊరి కడలిలో ఎంత ప్రశాంతత!
చిరునవ్వుల అలలు పెదవులపై చిందిస్తూ
ఆ అలల జల్లులలతో మదిని చల్లబరుస్తూ
నిరంతర చైతన్యంలో కూడా ఓ పరిమితి
గీత గీసుకుని ఇక్కడే ప్రతిరోజూ ఇలాగే ఉంటుంది.
భావవికారాలని బడబాగ్నులని
నిరాశా నిస్పృహ లోయలని
ఊహాసౌధాల కొండలని..
గుండెలని బెదిరించే భూకంపాలని
సలపరించే సుడిగుండాలు …అలసిపోయిన ఆలోచనలని
తన కన్నీటిని సైతం తనలోనే కలుపుకుని
అన్నిటినీ… అనంతమైన తన హృదయంలో దాచేసి
ఎంత హుందాగా ఎంత గంభీరంగా నడుస్తుంది!
నిండుగా నవ్వి నా ఎదని నిమురుతుంది!
నా లాగే ఉంది! నా జీవితం లాగే ఉంది!
ఎవరామె??

తమ పరిమళానికి తామే మత్తులో సోలిన
మల్లెపూల మూటని ఆమె నింపాదిగా విప్పింది
సున్నితంగా వాటిని తాకి లేవండంది
తెల్లని పట్టు దారంతో తేలికగా
చిక్కని దండ కట్టడమారంభించగనే
అమ్మో! నడుముదగ్గరంత బిగించకని
అవి సరసమాడబోయాయి
హుష్! రవ్వంత నొప్పి లేక రమ్యమైన మాలవుదురని
చిరుదరహాసంతో తన నాజూకు హస్తాలతో
తమని చక చకా చుడుతున్నామెని
తన్మయత్వంతో తిలకిస్తున్నాయి.
ఆమె మంగళస్నానాదులాచరించి
అగరు సాంబ్రాణి పొగలు పట్టి కురుల తడియార్చి
నడినెత్తిన చుట్టిన ముడిపై మల్లెల మాలని ముడవగా
అవి… కురుల సౌరభానికి ఇసుమంత ఈర్ష చెందాయి
జానువు వద్దే ఆగిపోయిన తన చిలకాకుపచ్చ కోకని
అరటి దూటలవలే ఉన్న క్రింది కాళ్ళ వరకు సద్దుకుంది
కెందామరను సవాలు జేయు ఎర్రటి చీరంచుని సవరించి
చిలుకలు కుట్టిన రవికని అవి బెదురునేమో
అన్నట్లు మృదువుగా మడత విప్పింది
తహ తహలాడుతున్న కళ్ళకి కాటికద్ది
కనుల పైనుంచి తొంగి చూస్తున్న
కనుబొమ్మలకి కస్తూరి తైలం రాచి
నిగ నిగ మెరుస్తున్న నుదుటి మీద
కెంపువలె ధగ ధగలాడుతున్న కల్యాణ
బొట్టు పెట్టి… పాపిట్లో పాకుతున్న పాపిడి బిళ్ళ
మెడ కప్పేసిన అడ్డిగ, బరువుగా మెడదిగిన
మెడనూలు.. మిరియాల పేరు…
ముచ్చటలొలికే మరకతపు లోలకుల మెరుపులు
ఆమె చెక్కిళ్ళతో దోబూచులాడుతున్నాయి.
నకుటపు నత్తు పెదవులని సోకినప్పుడల్ల
ఆ గిలిగింతలకామె పెదవులు విచ్చుకుని
పలువరస మెరుపులని వెదజల్లుతున్నాయి
చేతుల వంకీలు చిలకలని హత్తుక్కూర్చున్నాయి
చేతుల గలగలమంటున్న పచ్చల.. కెంపుల గాజులు
నడుమునదిమిపెట్టిన ముత్యాల మేఖల..
బుగ్గమీద దిష్టి చుక్క భయమేల
కావలి తాను ఉన్నానంటోంది...కాళ్ళకి
పసుపు లత్తిక రంగరించిన పారాయణం
గారంగా గజ్జెలు గట్టి గలగల మ్రోగించింది
ఠీవిగా లేచి నుంచుని అద్దంలోని ప్రతిబింబాని
తన అధరాలతో తాకింది
నువ్వెవరు? …అంది అద్దం
దాసిని! స్వామి వారి చరణదాసిని! దేవదాసిని! అంది ఆమె
బంధుమిత్ర సపరివారంగా మంగళవాయిద్యాలతో
అందంగా హుందాగా ఆనందాతిశయాలతో
వెడలింది దేవళానికి….. స్వామి సన్నిధికి.....
*****
ముందుమాట
నాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.
మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.
ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.
శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.
డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.
నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.
నమస్కారములతో – పారనంది అరవిందారావు