Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
కృష్ణాష్టమి
శా. “శ్రీకృష్ణా!” యని చేతు లెత్తి(1) కొలువన్ బ్రేమస్వరూపుండవై(2)
     యాకర్షించుచు(3) సర్వ మీ జగతి నీ యందే విలీనంబుగా
     నో కారుణ్యసముద్ర! నీ మురళి మ మ్మూఱ్ఱూఁత లూగింపఁగా
     లోకానన్యత్రిభంగిరూపమున(4) నాలోకింపఁ గన్పింపవే
           (1) పరిపూర్ణభక్తితో నమస్కరించి (2) గోలోకములో రాధాదేవితో
               నుండు రూపమును దాల్చి (3) కర్షణత్వాత్ కృష్ణః 
           (4) నాట్యలోలత్వమునకు తలమీది నెమలి పింఛము, గాన
               లోలత్వమునకు చేతులలోని వేణువు, జ్ఞాపికలుగా మూడు
               వంపుసొంపులతో విరాజిల్లే ముగ్ధమనోహరరూపముతో 220
“శ్రీ రా మ” అక్షరదర్శనము
కం. అక్షరరూపాఽసదృశ
      త్ర్యక్షరప్రత్యక్ష మయ్యె నంబావరల
      బ్ధాక్షరమైత్రీఫలముగ
      మా క్షేమము గూర్చు నవియె క్ష్మాత్రిదివములన్
భావము-
    శాశ్వతుడైన భగవంతుని రూపములైన, సాటిలేని, మూడు
     అక్షరములు [శ్రీ, రా, మ] మా అమ్మ సరస్వతీదేవి వరము
     వలన లభించిన అక్షరములతోడి స్నేహఫలితముగా కనిపించేయి. 
     (కవిని కాబట్టి అక్షరమైత్రి అలవాటైనదే) ఆ మూడు అక్షరములే 
     భువిలో, దివిలో మాకు క్షేమమును చేకూర్చుగాక! 221

వేంకటేశ్వరుఁడు
ఉ. కంటిఁ గిరీటనామములఁ గంటిని నాసికఁ గంటి వక్త్రమున్(1)
     గంటిని గడ్డమున్ బిదపఁ గంటి గళంబును బద్ధహస్తముల్
     గంటిని నీదు నూరువులఁ గంటిఁ బదద్వయి, నిద్ర వోవఁగాఁ
     గంటిని మంగళాకృతి నగంబుల శ్రేణిగ వేంకటేశ్వరా! 222 
          (1) రెండు పెదవులు స్పష్టముగా కనిపించు నోటిని

చం. ‌మఱచితి నన్ని మీ చరణమంజులదర్శనవేళ నన్ను నే
      మఱచితి నయ్య సర్వసురమానవమానితమాధరాపతీ!
      మఱచితి దుఃఖసంచయము మా యెద నిండిన నిన్ గనంగ, మై
      మఱపులఁ గూర్చు నీ మలయమారుతమై మలయప్ప! నీ కృపే 223


ఉ. మోహనరూపదర్శనము ముంగిటఁ గల్గఁగఁ గల్గు భాగ్య మే
     యూహకు నందు నయ్య? పురుషోత్తమ! నిన్ గనఁ బుట్టినట్టి యు
     త్సాహము దెల్ప నా వశమె? జన్మల జన్మలఁ దీరనట్టి మ
     ద్దాహము త్వత్సుదర్శనసుధాఝరి దీర్చెఁ ద్రుటిన్ దయాంబుధీ! 224

సీ. నిద్రించు నీ రూపు ముద్రవేయు నగాల
          నెద నిల్పితిమి వేంకటేశ! మమ్ము
     భద్రంబుగాఁ జూచు బాధ్యత నీ దయ్య
          భక్తజనావన! పరమపురుష!
     కలియుగదైవమై కలకాలమును గాచు
          రమ్యసజీవవిగ్రహము నీది
     దరహాస మొలికించి దాసకోటులఁ గావ
          నలు పెఱుఁగక నిల్చు(1) నయ్య వీవు
తే.గీ. తల్లి పద్మావతీదేవి తనవిధాన
       వత్సలత చూపి మమ్మేలు వర్ధిలంగ
       మీ కృపాపాత్రులను జేయ మాకు మీరె
       సర్వ, మన్యంబుఁ గోరము, శరణు శరణు 
            (1) వేంకటేశ్వరస్వామి ప్రతిరోజు 24 గంటలకాలములో
                 20 గంటలకు పైగా అలసట గుఱించి ఆలోచింపక
                 నిలబడే ఉండి, తన దర్శనము చేసికొనడానికి వచ్చిన
                 లక్షల భక్తుల మొఱ లాలకించి, దీవిస్తూనే ఉంటాడు.
                 స్వామి మూలవిరాట్టు శిలావిగ్రహము కాదు సజీవ
                 నారాయణుని మూర్తి అన్నది పరమసత్యము. 225

ఉ. నీ గిరి నున్న తీర్థముల నిత్యముఁ బాఱు జలాల రీతిగా
    సాగి భవత్పదద్వయినిఁ జక్కఁగఁ జేరు కవిత్వధారలే
    లాగు మనంబు నీ దరికి లాలన సేయఁగ మీరు మువ్వురున్
    త్రాగఁగ నిమ్మయా చరణతామరసోద్భవగంగ సుంతయేన్ 226

చం. ఇది యొక వాక్ప్రవాహ మిట నెన్నఁడు నుండదు లోటు నీదయన్
      సదమలభక్తిసంకలితశబ్దతరంగము లిందుఁ గన్పడున్
      హృది గలవారి కందఱికి హృద్యమృదంగనినాద మందునన్
      బదపదమందు విన్పడు ననారత మో జగదేకనాయకా! 227
Posted in August 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *