అరచేతిలో స్వర్గం – లనానీయం (ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ)
ఒకప్పుడు బ్రహ్మాండాన్ని
నా తలలో బంధించుకున్నాను
ఇప్పుడు నా తలనే తీసి
సెల్ఫోన్లో భద్రపరచుకున్నాను
ఇవ్వాళ నా కళ్ళూ చెవులూ బుర్రా అన్నీ నా సెల్లే.. క్షణం తను లేకుంటే
నా బ్రతుకంతా డొల్లే..
సామాన్య శకారంభంలో ఆగిపోయిన అయ్యవార్లూ!
సాంకేతిక శకంలోకి వచ్చాం..
కాస్త కళ్ళు తెరవండి!!
మీ ఉద్యోగ వేతనాల కోసం
మమ్మల్నెందుకు పట్టుకొచ్చి చావ గొడతారు?
మా బాల్యాన్ని మా నుంచి ఎందుకు దూరం చేస్తారు?
మీ పాఠాలైనా అప్పచెప్పేవేగా!
అన్నీ మా గూగులమ్మ తెలివితేటలేగా!
కొత్తగా మీకేమైనా తెలిస్తే
మా కరవాణికి చెప్పండి
పరీక్షల్లో ఏ మీటలు నొక్కాలో
మా సిరి చెవిలో వేయండి
ఊరికే మమ్మల్నెందుకు చావగొడతారు
దేశంబడ్జెట్టు సగం దాకా మీరెందుకు దిగమింగుతారు..
మేష్టార్లూ! ఇది దృశ్యవాణి యుగం
మా స్టార్ల అందాల పాలనా కాలం
పడుచుదనం రైలు బండి పయనం
చేతిలో సెల్లుంటే చాలు, అరచేతిలోనే ఉంటుంది స్వర్గం!
భయమా నీ పుట్టుక ఎక్కడ? -- ఆచార్య రాణి సదాశివ మూర్తి
చీకట్లో వీధిలో ఒంటరిగా
నడుస్తూ వస్తుంటే
కాలికింద పొడవుగా
మెత్తగా తగిలింది.
ఒక్క గెంతు గంతాను.
వళ్ళు ఝల్లుమంది.
గుండె గుభేల్ మంది.
నెమ్మదిగా తేరుకుని
జేబులో ఉన్న చలదూరవాణి
యంత్రం లో ఉన్న
కరదీపిక కాంతిలో తాడని తెలిశాక
మనసు తేలిక పడింది.
అయితే నాలో ఈ భయం
*ఎప్పుడు పుట్టింది?* అన్న ప్రశ్న పుట్టింది
అమ్మ పొత్తిళ్ళలోనుంచి తొలిసారి ఊయలలోకి
చేరగానే నాలో భయం పుట్టిందనిపించింది.
తండ్రితో పరిచయం అయ్యాకా
ఆయనలోని లాలన కన్నా పాలన దృష్టిని చూసి
ప్రియంతో కూడిన భయం
బడిలో పాఠం చెప్పే గురువులు ఇచ్చిన
ఇంటి పని చేయకపోతే తగిలే బెత్తపు దెబ్బలకు
వినయంతో కూడిన భయం
అపథ్యజీవనం వల్ల వచ్చిన రోగం వల్ల
వైద్యుల సూదిమందంటే భయం
ఏం ఇచ్చిందో తెలియకపోయినా
నా నడవడికలో తేడా వస్తే
ఏమంటుందోనని సమాజం అంటే
అయోమయం తో కూడిన భయం
నాదనుకున్న పదవి
ఎక్కడ పోతుందోనని
నయంతో కూడిన భయం
నా కీర్తి ప్రక్కవాడు
ఎక్కడ అధిగమిస్తాడోనని
కయ్యంతో భయం
తోటి వాడిని భయపడొద్దంటూనే ఉంటాను
నేను మాత్రం ఎప్పుడూ భయపడుతూనే ఉన్నాను
బల్లిపడినా
పిల్లి ఎదురొచ్చినా
తల్లడిల్లినా
కల్లలాడినా
భయమే భయమే
*ఆ తరువాత నాలో ఎక్కడ పుట్టింది? అన్న ప్రశ్న*
ఒకసారి ఎదలో, ఒకసారి బుర్రలో,
ఒకసారి కడుపులో,
ఒకసారి మూలాధారం లో,
ఒక్కోసారి శరీరంలోని ప్రతిరోమకూపంలోనూ
*ఎందుకు పుట్టింది? అన్న ప్రశ్న*
నాదన్నది పోతుంది అనే తలంపు వల్ల
చీకట్లో తాడు లాంటి
నేనుండనేమో అనే
ఆలోచన వల్ల భయం
గురుస్పర్శ -- విశ్వర్షి వాసిలి
గెలవటానికైనా ఓడిపోటానికైనా
ఒక్క అవకాశం చాలు
జారిపోటానికైనా జాగ్రత్తపడటానికైనా
ఒక్క క్షణం చాలు
అనుక్షణం చస్తూ బ్రతుకుతున్నాననుకునేవాడికి
అవకాశమూ రాదు, క్షణమూ మిగలదు
అసలు, మరణమే గురువు కదూ
నిజానికి, మృత్యుస్పర్శ ఒక్కటి చాలదూ
గురువు ఎవరో, ఏమిటో తెలిసేటట్టు చేయటానికి
అయినా, గురువుకు కూడా గురువు మృత్యువే కదా
గురువుకు కూడా మృత్యుస్పర్శ తప్పదు కదా
మృత్యుస్పర్శతో ఆరంభమైన గురుయానం ఆత్మకు చేరువ
మృత్యుస్పర్శ తెలీని గురుత్వం అహానికి శాశ్వత చిరునామా
***
మృత్యువంటే
ప్రాణం దేహానికి గుడ్బై చెప్పటమా
జీవం భౌతికం నుండి తప్పుకోవటమా
ఆత్మ పాంచభౌతికం నుండి మరుగవ్వటమా
అగ్నిసంస్కారంతో అరూపం కావటమా
మృత్యువుతో దూరం కానిదెవరు
పేగుబంధమూ పడకబంధమూ చెల్లుచీటీ చింపేస్తాయి
చంపేయటం అంటే అదే కదా
చావటం అంటే అంతే కదా
చివరికి మృత్యువుకు తేలిసొచ్చేది ఇంతే కదా
***
అది దూరంగా ఉన్నంతకాలమే మోజు
అది మనకు దగ్గరవుతుంటే
మనం అందరికీ దూరమవుతుంటాం
కాదు కాదు, అందరూ దూరమవుతుంటారు
ఇంతకీ ఈ దూరతీరం ఎక్కడుంది
ఎంత దూరం ఎంత కాలం నడిస్తే అక్కడికి చేరుకుంటాం
నన్నడిగితే, మనల్ని మనం చేదుకుంటూపోతుంటే
మృత్యువును తవ్విపోయటమే అవుతుంది
లోనుండి విసిరేస్తుంటే తేలికవుతూనే వుంటుంది
శూన్య మవుతూనే వుంటుంది
పూర్ణ మవుతూనే వుంటుంది
మృత్యుముహూర్తం సదా అమృతమే అవుతుంది.
కంటిపాపలో రూపమై కనిపించే..!! -- కొప్పుల ప్రసాద్
విరాగి మనసు గాయమై పాటలా సాగుతూ
ఎండిన ఎడారిలో తనువు క్రుంగి పోతూ
హృదయంలో విరహం వికటించింది
ప్రతిదీ తీపు చేదై విషంలా తోచింది..!!
మౌనమే సింగారమై ఒంపులు తిరిగితే
జల్లుల వర్షమే జడివానై కలప కలవర పరిచే,
హృదయాల్లో యుద్ధమే జరిగితే
తనువంతా తడిసి తన్మయత్వమే కలిగే..!!
మోహమే సన్మోహనమై ఆకర్షించే
ఏదో జన్మ సంబంధమైన నిలిచేందుకు
రెండు హృదయాలు ఒకటే గీతికై
జీవితంలో రాగాలాపన ఎన్నో సృష్టించే..!!
సాగిపో కాలంలో దృశ్యమై నిలిచి
పెదవుల నవ్వుల్లో మురిపెమై కనిపించే
గంధపు వనంలో సుగంధమై వ్యాపించి
బ్రతుకు నిండా పరిమళాలను వెదజల్లే...!!
కళ్లనిండా వెలుగుల కాంతులే ప్రసరిస్తే
మరణంలో కూడా నీడలా సాగుతుంది
అనుక్షణం కంటిపాపలో రూపమై కనిపిస్తే
కాటి వరకు ప్రేమ నిర్మలమై వికసిస్తుంది..!!
సంసార యోగం -- రాజేశ్వరి దివాకర్ల
మనుమ రాలి పుట్టిన రోజుకు
మమతలూరిన బామ్మ గారు
తన వద్ద చేర్చిన పింఛను డబ్బును
ఒద్దికగా మడచుకుని
పెద్ద మేడల నగల అంగడికి
బయలు దేరి వెళ్ళింది.
అనేక శరత్తుల పరిచయ మున్నట్టు
మామ్మగారికి
షరబత్తు నిచ్చి మర్యాదలు చేసిన
దుకాణ దారుడు
మన్నికగా ఆమె ఎన్నిక చేసిన
కంఠ హారాన్ని
మఖమల్ మెత్తని అట్ట పెట్టెలో
ఒత్తుగ అమర్చి,
మరింత సఖ్యానికి తగిలి
పెద్దమనిషిని
కదిలే మెట్ల ఎస్కిలేటరు పై
జాగరత్తగ మొదటి అడుగును
వేయించి సాగనంపాడు.
ధర గల హారాల ను
ధరించిన
సోయగాల తారల రూపాలను
ముఖ పుటాన ప్రకటిస్తూ,
ఆభరణాల మోజును పెంచుతున్న
దట్టమైన కాగితం సంచీ,
తన లోపల దాచుకున్న బంగారం
వెలలకు మించిన
తల పండిన అవ్వ గారి
ఊరింపుల లాలనల ,
నిగారింపు ప్రేమను
ఆమె చేత బట్టిన వైఖరిలో
అట్టహాసంగా తెలిపింది .
సంసార యోగ వైరాగ్యం
కాలూనిన నేల మీద నిలకడగా నిలిచింది.
వేంకట రమణా -- వజ్జల రంగాచార్య
పాల్వంచ వేంకటేశుం
డల్వేలు సతికి పెనిమిటి
యానందముగా
చెల్వారు రథము నెక్కుచు
వెల్వడె పురవీధిజూడ వేంకట రమణా.
కులగోత్రమ్ములు లేవిట
చెలువార మనూరి పంట
చేపట్టె సిరిన్
వలపూర ఊరికల్లుడు
కులుకుచు వేంకటరమణుడు కుటికేతెంచెన్.
అనుచును సంబురపడి దా
చిన బెల్లము జామపండ్లు
చిరునగవులతో
కొనుమను అమాయక మనము
లనఘా, వేంకటరమణుడ
లాలింపగదే.
జాతరలో సర్కసులట
జాతర లోపాములాట
జాదూ వేషాల్
జాతులభేదము లేవకిట
జాతర వేంకటరమణుడ
జరిపింతువటే!
నటుడు కోటశ్రీనివాసరావు మరణించినవేళ -- రాయప్రోలు సీతారామశర్మ
వర్గయుక్కులెయపవర్గమ్ము చేరక గుట్టెర్గిపల్కెడున్ కోటకోట, హాస్యరసము నపహాస్యమ్ము గానీక నీటగున్నటనంపు కోటకోట, ప్రతిపక్షనాయకపాత్రకున్న్యాయంబు గుణధునిసల్పుటన్ కోటకోట, తెలుగునటీనటదీప్తికైనిజశక్తి కొలదిశ్రమించుటన్ కోటకోట,చలనచిత్రరంగోజ్జ్వలస్థాని యయ్యుమాన్యుసామాన్యుసమమన్నమతినిచూచుగుండెను కదలుఘనమైన కోటకోటకుతలి చిరయశోభ్రాజమౌకోట కోట.
ఇంకా సందేహమే -- స్వాతి శ్రీపాద
ఇంత దూరం నడిచి వచ్చాకా
ఇప్పుడు సందేహంగా ఉంది
దారిపొడుగునా ఏమేం జారవిడుచుకున్నానో ,
ఏం పోగేసుకున్నానో
ఎన్ని జీవితాల్లోకి వలసవెళ్లి
మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చానో
అసలు నాకోసం నేను వేసుకున్న కొత్తదారి నాదేనా? మరెందరికోసమోనా?
ఏరి పారేసిన రాళ్ళూ రప్పల్లో
ఎన్ని వజ్రాలు దాగిఉన్నాయో !
పొదవి పట్టుకున్న లేత వసంతాల వెనక
ఎన్ని పడగలు విప్పిన విషసర్పాలో.
సుందరమైన పూబాలలని హత్తుకున్న
మెత్తని రెక్కల వెనక
లోలోని సౌకుమార్యాని గుచ్చి వెక్కిరించే
పదునైన మాటల ముళ్ళు.
ఎన్ని సముద్రాలు
ఇటు నుండి అటూ అటు నుండి ఇటూ ఈది ఈది
సైకతతీరాన సొమ్మసిల్లిన క్షణాలో.
సందేహాలను దేహం చేసుకు, దివా రాత్రాల ఎగశ్వాస దిగశ్వాసల్లో
వెన్నెల చల్లదనం వెచ్చని లావాలూ వడబోసుకుంటూ
ఇప్పుడీ సందేహాల సుడిగాలిలో
ఎగిరే దూది పింజగా
వాలు వెంట పడిపోతూ
ఇంకా సందేహమే