కార్పొరేట్ రంగాలలో ఉన్న సంస్థలకు కూడా మనుష్యుల లాగ చావు, పుటకలు, వాటిని ఇట్టే గుర్తుపట్టేయగల ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటిలో పని చేసే వారిని స్వంత బిడ్డలుగా చూచుకునే సంస్థలు, గొప్ప నైతిక విలువలు ఉండే సంస్థలు అరుదుగా కనిపిస్తుంటాయి. భారత దేశంలో ఉన్న అలాంటి సంస్థలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముందు వరుసలో తప్పక ఉంటుంది.
చదువు ముగిసిన వెంటనే రిజర్వ్ బ్యాంక్ మేనేజ్మెంట్ లో చేరిన యువతి, యువకులపై ఆ బ్యాంక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలు అప్పచెప్పడం వల్ల మంచి ట్రైనింగ్, పై చదువులకు ఉచిత సదుపాయాలు లాంటివి మామూలే. కానీ ఫార్మల్ గా ఎక్కడా ప్రస్తావించని మార్గదర్శకత్వం (మెంటరింగ్), ఈ యువతీ, యువకులు గణనీయంగా పనిచేయడానికి ముఖ్యంగా దోహద పడుతుంది. రిజర్వ బ్యాంక్ మేనేజ్మెంట్ లో చేరి సీనియర్ అధికార్లుగా ఎదిగిన వారు, తమ తరువాత చేరిన వారిని ప్రత్యేకంగా చూడడమే కాక, వారికి పనిలోని మెలకువులు నేర్పించేవారు. క్రింద పని చేసే వారితో, ముఖ్యంగా వయస్సులో తమ కంటే పెద్దవారితో, ప్రపంచ పోకడలలో ఆరి, తేరిన వారితో, బ్యాంక్ లక్ష్యాలు నెరవేరేటట్లు పని చేయించే చిట్కాలు నేర్పించడం కూడా, అందులో ఒక భాగం.
ఈ కథ, రిజర్వ బ్యాంక్ మొదటి సారిగా నెలకొల్పిన చెక్ క్లియరింగ్ డేటా ప్రాసెసింగ్ సెంటర్ లో, నేను అధికారిగా పనిచేస్తున్నప్పుడు వ్రాసింది. అప్పట్లో మొత్తం దేశంలో ఐ.బి.ఎం మెయిన్ ఫ్రేం కంప్యూటర్లు ఉన్న ఏకైక సంస్థ రిజర్వ్ బ్యాంక్. చెక్ క్లియరింగ్ పని రాత్రుల్లో అవ్వడం వల్ల, రాత్రి షిఫ్టుల్లో కంప్యూటర్ల మీద పనిచేయడం, పని తర్వాత కార్లు, వాన్ ల ద్వారా ఇంటికి దిగ పెట్టబడడం కూడా మాతోనే మొదలై ఉండాలి.
రిజర్వ బ్యాంక్ లో పని చేయడం వల్ల గొప్ప అవకాశాలు కూడా దొరికేవి. విదేశాలలో ట్రైనింగ్, దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలు పరిచే ప్రాజెక్టులలో పని చేయగలగడం అలాంటి వాటిలో కొన్ని. అమెరికాలో అప్పటికే ప్రాచుర్యం లో ఉన్న ACH (వేతనాలు, పెన్షన్లు పంచే, యుటిలిటీ బిల్లులు బ్యాంక్ ద్వారా కట్టే సదుపాయం) ను భారతదేశంలో ECS ఎలెక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ అని పేరు పెట్టి, దానికి కావలసిన కోడ్ వ్రాసి, ఒక ప్రొడక్ట్ లాగ ముందు మద్రాసులోనూ, తరువాత మొత్తం దేశంలోనూ లాంచ్ చేసే అవకాశం నాకు దొరికింది. ఆ సర్వీస్ ఇప్పటికీ కొన్ని కోట్ల మందికి ఉపయోగ పడడం, గొప్ప సంతృప్తినిస్తుంది.
పై నేపథ్యంలో, కొంచెం హాస్యం జోడించి, వ్రాసినదే ’పంచింగ్ బ్యాగ్’ కథ. చదువుతున్నప్పుడు పి. జి. వోడ్‌హౌస్ ప్రభావం కనిపిస్తే తప్పు పట్టను. ఆయన ఛాయ నుండి బయట పడడానికి, చాలా సమయమే పట్టింది. మరో దేశమే వలస పోవాల్సి వచ్చింది.
పంచింగ్ బ్యాగ్
“మీకీ విషయం తెలుసా? సుబ్బును సెంట్రల్ ఆఫీసు నుంచి మన బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేశారట’’ అన్నాడు జేమ్సుబాండు.
“ఆ!” అంటూ నోర్లు తెరిచేశారు సగంమంది. మరి కొందరు ఆశ్చర్యంగా కనుబొమ్మలు ఎగరేశారు.
సమయం మధ్యాహ్నం రెండు గంటలు. స్థలం ఓ వందమంది పనిచేస్తున్న ఆఫీసుకున్న కేంటీన్. ఆ వందమందిలో ఇరవైమంది ఆఫీసర్లు. ఇప్పుడు కేంటీన్లో కూర్చుని భోంచేస్తున్న వాళ్ళంతా ఆఫీసర్లే.
జేమ్స్‌బాండ్ మొన్ననే కొత్తగా ఆఫీసర్‌గా ప్రమోట్ అయ్యాడు. అతను ఎక్కడెక్కడ నుంచో సమాచారం అందరికంటే ముందే సంపాదించి అందరికీ అందిస్తున్నందువల్ల అతనికి జేమ్స్‌బాండ్ అని నామకరణం చేశారు ఆ ఆఫీసు వాళ్ళు. అలా అని ఆ ఆఫీసులోచాలా మంచి స్నేహపూరితమైన వాతావరణం ఉందనుకుంటే మీరు పొరబడినట్లే. ఇలా పేర్లు పెట్టుకుని, తమాషాలు చేస్తూండటం పైపై నటనలే. అన్ని ఆఫీసుల్లో లాగానే, మా ఆఫీసులో కూడా ముందు చక్కగా పొగుడుతూ మాట్లాడుతూ వెనక్కి తిరగ్గానే వాడికంటే యూస్‌లెస్ ఫెలో, స్టుపిడ్ లేడని పక్కనున్న వాడితో చెప్పుకోవడం పరిపాటే. వీడి మీద, వాడి మీద లేనిపోనివి వీలున్నప్పుడల్లా బాస్ చెవిలో వేయడం కూడా మామూలే.
అగ్నిహోత్రావధానులకి వరుణ్‌కుమార్ అంటే పడదు. గరుడేశ్వర్కి నాగరాజంటే పడదు. లెనిన్ రెడ్డికి మన జేమ్సుబాండ్ అంటే పడదు. అంతెందుకు ఉన్న ఇరవైమందికీ ఒకరంటే ఒకరికి రోజులో ఎప్పుడో ఓసారి పడదు. అలా నవగ్రహాల్లా దిక్కుకొకరు చూస్తున్న ఆఫీసులో జేమ్సుబాండు తెచ్చిన వార్త అందరి గుండెల్లో ఒకే అలజడిని సృష్టించింది.
దానికి కారణం సుబ్బుకున్న పేరే. సుబ్బు లాంటి ‘చెంచా’ మా ఆఫీసులోనే ఎక్కడా లేడని ప్రతీతి. అతనెవరి కింద పనిచేస్తే ఆ బాస్‌కి కొద్ది రోజుల్లోనే కుడి భుజమై కూర్చుని, తనతో పనిచేస్తున్న మిగతా వారి కథలన్నిటినీ బాస్‌కి మోసేస్తుంటాడు. ఇంకాఫీసు బయట, మా ఊరి తోటలోవంటూ, బజార్లో నుంచి సొంతడబ్బుతో కొన్న పళ్ళు, కూరగాయలు బాస్ ఇంటికి రెగ్యులర్‌గా మోసేస్తుంటాడు. అలా మోసి మోసే సెంట్రల్ ఆఫీసులో జర్మనీకి వెళ్ళాల్సిన అవకాశం వస్తే, వాడు చాలా జూనియర్ అయినా బాస్ పుణ్యమా అని కొట్టేసాడు. వాడు కూరగాయలు పళ్ళకు పెట్టిన ఖర్చుకు వందరెట్లు ఈ జర్మనీ ట్రిప్పులో కొట్టేసాడు. బాస్‌కు చాలా దగ్గరవ్వటంతో ఆఫీస్‌లో పనిచేసే మిగతా వారికి పని నరకప్రాయమయ్యేది.
లెనిన్ రెడ్డి జేమ్స్‌బాండ్‌ను ఉండబట్టలేక అడిగేశాడు ‘‘ఏం? సుబ్బు బ్రాంచికి రావడం దేనికంటా?”
“వాడిదిదే ఊరట. ‘బొంబాయిలో ఉండి చాలా రోజులైంది. మా ఊరివైపు పని చేయడానికి అవకాశమివ్వ’మని అడిగాడట. కాని అసలు విషయం వాడు ఈ ఊళ్ళో ఒకటో, రెండో ప్లాట్లు కొన్నాడు. వాటిలో ఇళ్ళు లేపాలి. వాడి బామ్మర్ది పేరుతో ఓ ఫ్యాక్టరీ కూడా ఆరంభించబోతున్నట్లు విన్నాను’’ అన్నాడు జేమ్సుబాండు.
కాని అందరి ముఖాల్లో ఆందోళన. ఇన్ని రోజులు ఒకళ్ళతో ఒకళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకుని వాటిని బాస్‌కి చేరేస్తున్నా, ఆఫీసులో పనులు సరిగా పట్టించుకోక పోయినా, వాళ్ళలో ఎవరూ, మరొకరికి పెద్ద గొయ్యి తీసి భూస్థాపితం చేసేంత చెడ్డ వాళ్ళు లేరు. కాని సుబ్బు అలాంటి వాడు కాదే! వాడి వల్ల ఎంతమంది కెరీర్లు దెబ్బతిన్నాయో లెక్కలేదు. బాస్‌ను బుట్టలో వేసుకోవడం ఆలస్యం, అందరికీ న్యాయంగా వచ్చే అవకాశాలు రాకపోవడం పోగా, ఫారిన్ పోయే మంచి ఛాన్సుల్లాంటివి వీడే కూరలు మోసి కొట్టేస్తుంటాడు.
చెప్పొద్దూ, అలాంటి వాడొస్తున్నాడంటే నాకు కొంచెం గాభరాగానే ఉంది. మా మేనేజర్ మంచివాడే. కాని వీడికున్న ఖ్యాతి తెలిసిందే. సామ, భేద దండోపాయంతోనో, మందు, మగువ, డబ్బులతోనో పొజిషన్లో ఉన్నవారిని లొంగదీసుకుని పనులు చేయించుకునేవాడు.
ఓ వారం రోజుల తరువాత జేమ్స్‌బాండు తెచ్చిన వార్తను నిజం చేస్తూ సుబ్బును మా ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఆర్డర్ వచ్చేసింది. ఇక లాభం లేదనుకుని నేను మేనేజర్ దగ్గరికి వెళ్ళాను.
ఆఫీసుకి నేను అసిస్టెంటు మేనేజర్ని అవ్వడం వల్ల, మేనేజర్లాగే నేను కూడా డైరెక్టుగా ఆఫీసర్‌గా జాయిన్ అవడం వల్ల, నేనంటే మా మేనేజర్‌కి అభిమానమే. అతను లీవులో వెళ్ళాలంటే, నాకు ఛార్జి ఇచ్చి వెళ్లాల్సిందే. నాకూ మేనేజర్‌కూ ఓ పదేళ్ళు తేడా ఉందనుకుంటాను. ఆఫీసులో విషయాలు నాతో అప్పుడప్పుడు చర్చిస్తుంటాడు. నేను కూడా ఆఫీసు విషయాలు అతనితో చర్చించి అతని సూచనల ప్రకారం నడుచుకుంటాను.
మేనేజర్‌తో సుబ్బు విషయం ఏ ఉపోద్ఘాతాలూ లేకుండానే మొదలు పెట్టేశాను. ‘‘సార్! సుబ్బు వల్ల వాతావరణం కలుషితమౌతుంది. ఏదో చిన్న చిన్న పొరపొచ్ఛాలు తప్పితే మన బ్రాంచిలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సుబ్బుకున్న పేరు మీకు తెలియంది కాదు. అతను బ్రాంచికి రాకముందే మీరు సెంట్రల్ ఆఫీసుతో మాట్లాడి, అతన్ని వేరే బ్రాంచికి మార్పించండి’’ అన్నాను.
మా మేనేజర్ నర్మగర్భంగా నవ్వాడు. ‘‘నువ్వొక్కడే ఈ సలహా ఇవ్వలేదనుకున్నాను. ఉన్న ఇరవైమంది ఆఫీసర్లలో పంతొమ్మిది మంది అప్పుడే నన్ను ‘సుబ్బును రానీయకండి’ అంటూ ఏదో ఓవిధంగా తెలియచెప్పారు. ఈ విషయంలో నేను హెల్ప్‌లెస్. సెంట్రల్ ఆఫీసు ఆర్డరు పాస్ చేశాక, మార్చడానికి ప్రయత్నించడం మన మీద సదభిప్రాయం కలగజేయదు. ఏదో విధంగా మనమే సర్దుకుందాం. సుబ్బు మీ కెరీర్లని పాడుచేయకుండా నేను చూసుకుంటాను. మీరేం వర్రీ అవ్వకండి’’ అని చెప్పి ఆ సంభాషణ అంతటితో తుంచేశాడు మా మేనేజర్.
ఆ తరువాత సుబ్బు రావడం, జాయినవ్వడం జరిగిపోయాయి. కాని ఆశ్చర్యకరమైన విషయం నేను ఎంతో ఉన్నతుడుగా ఊహించుకున్న మా మేనేజర్ కూడా సుబ్బు ‘చార్మ్’లో ఓ నెలలోనే పడిపోయాడు. సుబ్బును దూరంగా ఉంచుతాడేమో అనుకున్న మేనేజర్ సుబ్బుతో బాగా మాట్లాడటం, సఖ్యంగా ఉండటం నాకు బాధగానే తోచింది. తప్పించాలన్న ప్రయత్నం విఫలం కావడంతో, నేను కూడా మేనేజర్‌తో ముందులా మాట్లాడటం మానేశాను. అప్పుడప్పుడు సుబ్బు చేస్తున్న ‘గోతులు తవ్వే కార్యక్రమాలను’ గురించి మేనేజర్‌ను హెచ్చరించడం మాత్రం నా కనీస కర్తవ్యంగా భావించేవాడిని. ఇలా మరో రెండేళ్ళు గడిచిపోయాయి.
రెండేళ్ళ తర్వాత మా మేనేజర్‌కి ప్రమోషన్‌తో పాటు ట్రాన్సఫర్ అయింది. నాక్కూడా ప్రమోషన్ వచ్చింది. మా బ్రాంచికే మేనేజర్‌గా పోస్టు చేశారు నన్ను. ఆ రోజు ‘సెండాఫ్’ పార్టీ తరువాత అందరికీ వీడ్కోలిచ్చి మేనేజర్ తన సీటు ఖాళీచేసి నన్ను దాంట్లో బలవంతంగా కూర్చోబెట్టి, నాకు ఎదురుగా టేబిల్‌కి అటు వైపున్న చెయిర్లో కూర్చున్నారు.
‘‘ఆదిత్యా! మనం కలిసి ఇన్ని రోజులు పని చేశాం. అన్ని విషయాలు నీకు నేర్పించాననే అనుకుంటున్నాను. నీకు అంతుపట్టని విషయమొకటుందని నాకు తెలుసు. సుబ్బుకు, తెలిసి తెలిసీ మీ అందరి సలహాలను పెడచెవిన పెట్టి, ఎందుకు చనువిచ్చానని మీరందరూ బాధపడుతుంటారు. కానీ ఈ విషయానికి నేను జవాబిచ్చే ముందు, నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను. దానికి జవాబులు చెప్పు. సుబ్బు మన ఆఫీసులో చేరక ముందు మన బ్రాంచి లాభాలెంత?’’ అనడిగాడు మేనేజర్.
‘‘లాభాలు ఎక్కడ సార్! నష్టం మీదనే కదా నడుస్తున్నదప్పుడు’’ అన్నాను నేను.
‘‘మరి సుబ్బు వచ్చింతరువాత పరిస్థితి ఏంటీ?’’
‘‘లాభాలు గత రెండు సంవత్సరాలు వచ్చాయనుకోండి. దానికీ, సుబ్బు రావడానికీ లంకె ఏంటండీ? ఈ లాభాలు వచ్చాయంటే దానికి కారణం బ్రాంచిలోని మిగతా ఆఫీసర్లు ఉద్యోగులు అంతా కష్టపడటమే’’ అన్నాను నేను.
‘‘నువ్వన్నది నిజమే! ఇప్పుడు నేను నీ కింకో రహస్యం చెప్తున్నాను. షాక్ అవ్వద్దు. అసలు సుబ్బును మన బ్రాంచికి పోస్టు చేయమని నేనే రిక్వెస్టు చేశాను. సుబ్బు ఈ ఊరికి వస్తున్నాడని తెలిసి ఈ ఊళ్ళో ఉన్న మిగతా బ్రాంచి మేనేజర్లు ‘మా బ్రాంచికి వద్దు’ అని బ్రతిమాలుకున్న సమయంలో నేను సుబ్బు పోస్టింగుకు అంగీకరించడం, సెంట్రల్ ఆఫీస్ వార్ని కూడా ఆశ్చర్యపరిచింది’’
‘‘అదేంటీ? అన్ని విషయాలూ తెలిసి సుబ్బు పోస్టింగుకు ఎలా అంగీకరించారు? నేను నమ్మలేకుండా ఉన్నాను’’ అన్నాను నేను.
‘‘దానికి కారణముంది. నేను ఈ బ్రాంచిలో చేరిన కొద్ది రోజుల్లోనే బ్రాంచిలో ఎవ్వరూ సరిగ్గా పనిచేయటం లేదని గమనించాను. నేనెంత ప్రయత్నించినా మిమ్మల్ని ‘మోటివేట్’ చేయలేకపోయాను. ప్రతి ఒకరికి మరొకరిపైన కంప్లయింట్. అప్పుడే నాకు జపాన్‌లో నేను ట్రయినింగ్ పొందిన ఆఫీసులో ఉన్న కల్చర్ గుర్తుకొచ్చింది. వాళ్ళందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు. అసలు పని తప్పితే మరో కార్యక్రమమే లేదు వాళ్ళకి. అలాంటి వాతావరణంలో కోపాలూ తాపాలూ రావడం కూడా సహజమే. కాని వాళ్ళకెవరికైనా కోపాలు వస్తే, వాటిని తీర్చుకోవడానికి మన పూర్వకాలం రాణులకున్న కోపసదనం లాగా ఓ రూము ఉండేది. ఆ రూమ్ మొత్తం ఖాళీయే. కాని రూము మధ్యలో బాక్సింగ్ ప్రాక్టీసు చేసేవాళ్ళు ఉపయోగించే ‘పంచింగ్ బ్యాగ్’ మాత్రం తగిలించి ఉంచేవాళ్ళు. కోపం తీరేవరకు తెగ బాదేవారు. అలా కోపం తగ్గాక చక్కా తమ సీటుకి తిరిగి వెళ్ళి తిరిగి పని బాగా చేసేవాళ్ళు.
‘‘నేనూ అలాంటి పంచింగ్ బ్యాగ్ కోసమే ప్రయత్నించాను. సుబ్బును ఇక్కడ ట్రాన్సఫర్ చేసిన వెంటనే మీలో మీకున్న అభిప్రాయ భేదాలు సమసిపోయాయి. మీ కంతా సుబ్బు ఓ కామన్ ఎనిమీగా మారాడు. దాంతో మీరంతా ఒకటయ్యారు. పనిలో కూడా మీ కందరికీ డైవర్షన్ ఒక సుబ్బునే. నాకు పని వల్ల ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి. నాకు మీ నుంచి సుబ్బు గురించి మాత్రం కంప్లయింట్సు వచ్చాయి. నాకున్న ఒక పెద్దపని సుబ్బును జాగర్తగా కంట్రోల్ చేయడం. ఆదొక్క పనే కాబట్టి నేను కూడా ఆ పనిని చక్కగా చేసి సుబ్బు లిమిట్ క్రాస్ చేయకుండా ఉంచగలిగాను. ఆ విధంగా ఆఫీసునే కంట్రోల్ చేయగలిగే స్థితికి రాగలిగాను.
మీరంతా ఆఫీసు పనిలోనే మునిగి ఏదైనా ఫ్రస్టేషన్ అనిపిస్తే నా దగ్గరి కొచ్చి సుబ్బును దుయ్యబట్టేవాళ్ళు. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - చెడును కూడా మన మంచికి, అఫీసు ప్రగతికి ఉపయోగించుకోవచ్చునని, చెడ్డవాళ్ళని, అందరూ వెలివేసిన వారిని నేర్పుతో ఉపయోగించుకోవచ్చని ఈ అనుభవం నాకు నేర్పింది. నీ వింకా కుర్రవాడివే. మంచి భవిష్యత్తు ఉన్నవాడివి. అందుకే నేను నీకీ విషయం చెప్తున్నాను’’ అని ముగించాడు మా మేనేజర్.
మరుసటిరోజు నేను సుబ్బుతో ఇంతకు ముందు మా మేనేజర్లాగానే బాగా మాట్లాడటం చూసి మా ఆఫీసు వారు ఆశ్చర్యపడి ఉంటారనుకుంటాను. నేను బ్రాంచి మేనేజర్ కాగానే సుబ్బును ట్రాన్సఫర్ చేయించడానికి ప్రయత్నిస్తాననుకున్న వాళ్ళకి ఆశ్చర్యమే కదా! నా గురించి వాళ్ళేమనుకున్నా నాతో ఆ విషయం చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. కాని సుబ్బు గురించి చెడుగా నాకు అందరి నోళ్ళ నుంచి తరచుగా వినాల్సి వస్తూనే ఉంది.
కాని మా బ్రాంచి లాభాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. త్వరలో మరో ప్రమోషన్ రాబోతుందేమో!
నాకు గురుతుల్యుడైన మేనేజర్గారూ, మీకు నా నమస్కారం!
‘పంచింగ్ బ్యాగ్ సుబ్బు’ జిందాబాద్!
.. ఆంధ్రప్రభ, 1990