Menu Close
Kadambam Page Title
కొండెక్కే దాకా.....
-- చందలూరి నారాయణరావు --

వయసైనోళ్ళ ముఖంలో
చాకిరి చారలను
చదవని ఊహకు చులకనేమిటి?

పెద్దయ్యాక కూడా
జీవితాలను చదవలేని
నిర్లక్ష్య, గుడ్డి గర్వానికి
ఇంకా ప్రేమను సర్ది సవరించే
ఆ చేతులు దేవుడిని మించిన బలమని
గుర్తించక పోవడమేమిటి?

మన కంటికెదురుగా
ఇంకా బతికుండటం వారికి అదృష్టం కాదు.
వారి బతుకు బాధల పాఠశాలలో
పాఠాలను వినడం ఈ తరానికి ఓ వరం.

వృద్దాప్యం బాధిస్తున్నా
బిడ్డలకు కష్టం రాకూడదని
బోధించే బోసినోరు ఆతృతకు
ఏమి చేసినా రుణం తీరదు.

కండలు కరిగి చర్మం ఎముకంటినా
ఎముకలరిగి నొప్పులు రాజుకుంటున్నా
కొన ఊపిరి సైతం
దీవిస్తూనే ఉంటుంది కొండెక్కేదాకా..

Posted in August 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *