మోహన్ దాస్ ఇంగ్లండ్ జీవితం, పరివర్తన
హెన్రీ సాల్ట్ వ్రాసిన ‘Plea for Vegetarianism’ పుస్తకం చదివిన తరువాత మోహన్ దాస్ కు శాఖాహారం మీద విశ్వాసం దినదిన ప్రవర్ధమానం చెంది వెంటవెంటనే శాఖాహారం మీద వ్రాయబడిన పుస్తకాలను చదివాడు. ‘హోవర్డ్ విల్లియమ్స్’ (Howard Williams) వ్రాసిన పుస్తకంలో ‘పైథోగరస్’ (Pythagoras: 570 –495 BCE), వేదాంతులు ‘జీసస్’, రోమన్ కవి ‘ఓవిడ్’ (Ovid: 43 BCE–18 CE), గ్రీకు చరిత్రకారుడు ‘ప్లుటార్చ్’ (Plutarch: 46-120 CE), రోమన్ వేదాంతి ‘పోర్ఫిరి’ (Porphyry: 234–305 CE) మొదలగు వారు శాఖాహారులే అని తెలుసుకున్నాడు. Dr. యానా కింగ్స్ ఫోర్డ్ (Anna Kingford), Dr. ఆలిన్సన్ (Tho-mas Richard Allinson) రచించిన కొన్ని పుస్తకాలు మానవ ఆరోగ్యానికి, పరిశుభ్రతకు శాఖాహారం అతి ముఖ్యమైనదని పేర్కొన్నాయి. అస్వస్థతనుంచి విముక్తి పొందటానికి శాకాహార పథ్యం చాలా ఉపయోగమని ఈ పుస్తకాలు సూచించాయి. వీటితో పాటు మరికొన్ని శాఖాహార పుస్తకాలు చదవటంవల్ల మోహన్ దాస్ భవిష్యత్ జీవితంలో శాఖాహారం, ప్రముఖ పాత్ర వహించింది. దీని తరువాత ‘మతం’ (religion) ఆయన జీవితంలో ఒక ప్రధాన ఘట్టమయింది.
ఈ మార్పులు చోటు చేసుకున్న రోజులలో ఒక ఆంగ్ల స్నేహితుడు మోహన్ దాస్ ను మాంసాహారి గా మారమని అనేక ప్రయత్నాలు చేశాడు. కాని కరంచంద్ ఏనాడూ తన పట్టు వీడలేదు. కానీ తనను గురించి ఇంతగా శ్రమపడుతున్న స్నేహితుడి యెడల గౌరవం మరింత పెరిగింది. ఒక రోజు ఈ మిత్రుడు ఇతనిని ఒక ఖరీదైన ‘Holborn Restaurant’ కు తీసుకెళ్లగా అచ్చట మోహన్ దాస్ అనాగరిక, మోటు ప్రవర్తన చూసి గట్టిగా మందలించి ఇతనిని ఇంగ్లండ్ లో ఉన్నంత కాలం నాగరికంగా ప్రవర్తించటం నేర్చుకోవాలని, ఇచ్చటి వేష, భాషలు తప్పనిసరి అని పట్టుబట్టాడు.
వెంటనే మోహన్ దాస్ ఒక ‘Army and Navy Stores’ కు వెళ్లి 19 షిల్లింగ్ లకు ఒక ‘chimney-pot hat’ కొని, లండన్ లో విలాసవంతమైన ‘Bond Street’ లో ఉన్న ఒక షాపులో 10 పౌండ్లకు ఒక సూట్ (suit) కూడా కొన్నాడు. తరువాత ఒక ‘tie’ కొని, దానిని కట్టుకోవటం నేర్చుకున్నాడు. వీటితోపాటు తల దువ్వుకోటానికి ఒక అద్దం కూడా. ఒక బంగారపు గొలుసుతో ఉన్న గడియారం తనకు పంపమని భారత దేశంలో ఉన్న తన అన్నకు సందేశం పంపించాడు.
ఒక ఆంగ్లేయుడి తరహాలో ప్రవర్తించటానికి ఇవన్నీ సరిపోవని ఫ్రెంచ్ భాష, డాన్స్, వాగ్ధాటి (elocution) శిక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. యూరోప్ లో ఫ్రెంచ్ వ్యావహారిక భాష, డాన్స్ నేర్చుకోటానికి 3 పౌండ్లు ఖర్చయింది. మోహన్ దాస్ కు Piano నేర్చుకోవాలని ఉన్నా అది తనకు అసాధ్యమని భావించి వయోలీన్ (violin) నేర్చుకోటానికి 3 వారాలలో 6 పాఠాలకు 6 పౌండ్లు చెల్లించాడు. ఉపన్యాస పటిమ, వాగ్ధాటిని పెంచుకోటానికి ఆంగ్ల రచయిత Alexander Melville Bell (టెలిఫోన్ కనిపెట్టిన Alexander Graham Bell తండ్రి) వ్రాసిన ‘Standard Elecutionist’ ను చదవమని ఒక ఉపాధ్యాయుడు చెప్పగా దానిని క్షుణ్ణంగా చదివితే కొన్ని విషయాలు మోహన్ దాస్ ను మేల్కొలిపాయి. వీటిని గురించి గాంధీజీ మాటల్లోనే తెలుసుకుందాము.
“నా జీవితమంతా ఇంగ్లండ్ లో గడపనప్పుడు, ఈ ఉపన్యాస శిక్షణ ఉపయోగమేముంది. ఈ డాన్స్ నన్ను ఇంగ్లీష్ మనిషిగా (English Gentleman) ఎలా మార్చగలదు? ఈ వయోలీన్ నేను భారత్ లో కూడా నేర్చుకోగలను. నేను చదువుకోటానికి వచ్చాను కాబట్టి నా దృష్టి చదువు మీదే కేంద్రీకరించాలి. ‘Inns of Court’ లో ప్రవేశానికి అర్హత పొందటం నా ఏకైక కర్తవ్యం. నా వ్యక్తిత్వం, నడత నన్ను పెద్దమనిషిని చేస్తాయి. ఈ నా ఆలోచనలను నా ఉపన్యాస-ఉపాధ్యాయుడికి, డాన్స్ మాస్టర్ కు తెలియజేసి నన్ను క్షమించమని కోరాను. ఈ సంగతి వయోలీన్ నేర్పే గురువుతో చెప్పగా ఆమె చాలా మెచ్చుకుని నన్ను న్యాయవాదిని అవటానికి కృషి చేయమని ప్రోత్సహించింది. వీటిమీద వ్యామోహం కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది. కాని ఆహార్యం (dress) విషయంలో, ఇది చాలా ఏళ్లే నిలబడింది. అప్పటి నుంచి నా ఇంగ్లండ్ జీవితం కేవలం విద్యార్ధిగానే ఉంది.”
న్యాయవాదిగా మారిన మోహన్ దాస్ గాంధి
డాన్స్, సంగీతం, వగైరా విషయాలమీద వ్యామోహం తగ్గిన తరువాత మోహన్ దాస్ తన ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాడు. ప్రతి రాత్రిపూట దైనందిన ఖర్చుల వివరాలు ఒక పుస్తకంలో విపులంగా వ్రాసేవారు. తాను ఒక కుటుంబంతో ఉండటం అధిక ఖర్చుతో కూడుకున్నదని ఆలోచించి రెండు గదులను అద్దెకు తీసుకుని అచ్చటికి మారాడు. ఇక్కడనుంచి తన విద్యాసంస్థకు అరగంట నడక. బస్సు ఖర్చు ఉండదు. ఇంకా ఇతర ఖర్చులు కూడా చాలా తగ్గాయి.
కొందరి సలహా మేరకు ముందు ‘London Matriculation’ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన తరువాత ‘Bar Examination’ పరీక్ష వ్రాయమని సలహా ఇస్తే, వెంటనే Matriculation చదవటానికి సిద్ధమయ్యారు. దీనికి లాటిన్, ఫ్రెంచ్, కెమిస్ట్రీ అంశాలను ఎన్నుకున్నారు. ‘Roman Law’ అంతా లాటిన్ లో ఉంటుంది కాబట్టి అది తప్పని సరిగా నేర్చుకోవాలి. అదీ గాక, లాటిన్ నేర్చుకుంటే ఆంగ్ల భాష మీద పట్టు పెరుగుతుంది. ఈ పరీక్ష 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ పరీక్ష ఉత్తీర్ణుడయిన తరువాత Bar Examination కు చదవటం ప్రారంభించాడు మోహన్ దాస్.
బార్ పరీక్ష ఉత్తీర్ణుడవటానికి ప్రతి విద్యార్థి మూడు సంవత్సరాలు సాధన చేయాలి. ఒక్కొక్క ‘term’ 3 నెలల చొప్పున, 3 ఏళ్ళల్లో 12 terms పూర్తి చేయాలి. ఒక term లో 24 డిన్నర్లు ఉంటాయి. వీటిల్లో కనీసం 6 డిన్నర్లలో పాల్గొనాలి. అంటే 12 terms లో 72 dinners లో పాల్గొనాలి. ఒక డిన్నర్ కు 2-3 రూపాయలు ఖర్చు అవుతుంది. వీటిని గురించి గాంధీజీ ఇలా వివరించారు.
“డిన్నర్ అంటే కేవలం భోజనం కోసం వెళ్ళటమే కాదు. ఈ సమయంలో కొందరు న్యాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు కూడా వచ్చేవారు. కాని చాలామంది భోజనం కూడా చేసేవారు. నేను మినహా అందరు మాంసాహారులే. నేను మాత్రం బ్రెడ్డు, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, కాబేజీ మాత్రమే తినేవాడిని. కొన్నాళ్ల తరువాత శాఖాహారి అయిన ఒక 'పార్శి' (Parsee) విద్యార్థి కలిసిన తరువాత పండ్లు, ఇతర తినుబండారాలు కూడా లభించేవి. ప్రతి నలుగురికి ఒక Wine బాటిల్ ఇచ్చేవారు. కాని నేను దానిని ముట్టే వాడిని కాదు. నేను ఇది త్రాగను కాబట్టి, నా వాటా మిగతా ముగ్గురు పంచుకోవచ్చని, అందరూ నన్ను తమ table దగ్గరికి వచ్చి కూర్చోవచ్చని బలవంతం చేసేవారు.”
“నాకు అప్పుడు, ఇప్పుడు ఈ డిన్నర్లు న్యాయపరీక్షలో ఉత్తీర్ణత సాధించుకోటానికి ఎలా దోహదం చేస్తాయో తెలియదు. కాని కొంతమంది న్యాయశాస్త్ర చట్టాలు, ఇతరత్ర న్యాయ సంబంధిత విషయాల మీద ఉపన్యసించేవారు, చర్చించేవారు. ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఉపన్యాసం ఇచ్చే ధైర్యం కలుగనారంభించింది.”
“బోధనాంశాలు తేలికపాటివి అయినా, బారిష్టర్లను ఆ రోజులలో ‘Dinner Barristers’ అని వ్యంగంగా పిలిచేవారు. ఈ dinners వల్ల ఉపయోగం లేదని అందరికీ తెలుసు. నేను చదివినప్పుడు రెండు న్యాయ శాస్త్రాలున్నాయి. ఒకటి ‘రోమన్ లా’ (Roman Law), రెండవది ‘కామన్ లా’ (Common Law). పుస్తకాలు చదివి ఈ పరీక్షలు వ్రాయవచ్చు. కాని ఎవరూ చదివేవారు కాదు. చాలా మంది రెండు వారాలు చదివి Roman Law, 2-3 నెలలు చదివి Comman Law ఉత్తీర్ణులవుతారు. ఈ పరీక్షలకు అనర్హులవటం సామాన్యంగా జరగదు. ఈ పరీక్షలు ఏడాదికి నాలుగు సార్లు జరుగుతాయి. ఇవి అంత కష్టతరమైనవి కావు.”
“ఈ పరీక్షలకు అన్ని పుస్తకాలూ చదవాలనుకున్నాను. వీటిని కొనటానికి చాలా డబ్బు ఖర్చు చేయాలి. Roman Law లాటిన్ లో చదవాలి. నేను మెట్రిక్యులేషన్ కు చదివిన లాటిన్ దీనికి చాలా ఉపయోగపడింది. ఈ Roman Law నేను దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కూడా చాలా ఉపయోగపడింది. అక్కడ ‘Roman Dutch’ న్యాయశాస్త్ర సూత్రాలను పాటిస్తారు.”
“నేను Common Law పాఠ్యాంశం 9 నెలలు కష్టపడి క్షుణ్ణంగా చదివాను. దీనికి ‘Herbert Bro-om` రచించిన ‘Common Law’; ‘Edward Snell’ వ్రాసిన ‘Equity’; ‘Frederick Thomas White’ మరియు ‘Owen Davies Tudor’ రచించిన ‘Leading Cases’ పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి. వీటితో పాటు ‘William Blackwood’ మరియు ‘Edward Burtenshaw Snugden’ వ్రాసిన పుస్తకం ‘Real Property’; ‘Louis Arthur Goodeve’ గ్రంధం ‘Personal Property’ కూడా చదివాను. నేను భారత్ తిరిగి వచ్చిన తరువాత బాగా చదవాలనిపించేది ‘John Mayne’ వ్రాసిన ‘Hindu Law’ పుస్తకం.”
“చివరకు నేను అన్ని పరీక్షలు ఉత్తీర్ణుడనయ్యాను నేను ‘Bar’ కు (న్యాయవాది వృత్తిలో ప్రవేశం) 1891 లో జూన్ 10 వ తేదీన పిలువబడ్డాను. ఉన్నత న్యాయస్థానం (High Court) నా పేరును మరుసటి రోజు, 11 వ తేదీన, న్యాయవాదుల జాబితాలో చేర్చబడింది. తరువాత రోజు, అంటే 1891 లో జూన్ 12, లండన్ వదలి భారతదేశం పయనమయ్యాను.”
“నేను ఇంత చదివి ‘Barrister-at-law’ అయి, న్యాయవాది అయినా నాలో ఎదో జంకు, భయం అంతర్లీనంగా ఉన్నాయి. నిజానికి నేను న్యాయవాది అవటానికి తగిన అర్హత పొందలేదని భావించాను.”
ఆహార నియంత్రణలో మోహన్ దాస్ పరిశోధన
ఇంగ్లండ్ లో శాఖాహారం తీసుకోవటం అంత కష్టతరమైన పని కాదని తెలుసుకున్న మోహన్ దాస్ తన ఆహారంలో చాలా మార్పులు చేశాడు. ఆ రోజులలో యూరోప్ లో మానవులు, ఉన్నత, స్వతంత్ర ప్రాణులయి నందువల్ల తమకంటే తక్కువ ప్రాణులను చంపి తినే అధికారం ఉందని భావించేవారు. కాని కొంతమంది ఉన్నత ప్రాణులయిన తాము నోరులేని జీవాలను సర్వదా కాపాడాలనేవారు. మోహన్ దాస్ రెండవ రకపు వారితో ఏకీభవించి ఇంగ్లండ్ లో ‘Vegetarian Society’ వారు ప్రచురించే వార్తాపత్రికలను చదివి అమిత సంతోషంతో ఈ సమాజం సభ్యుడిగా చేరాడు.
శాఖాహారంలో మూలస్థంభాల్లాంటివారు చాలామంది ఈ సమాజ సభ్యులు. వీరి సాంగత్యంతో మోహన్ దాస్ శాఖాహార విధానంలో అనేక పరిశోధనలు చేశాడు. ఇంటినుంచి తీపి పదార్ధాలు, మసాలా దినుసులు తెప్పించుకోటానికి స్వస్తి పలికాడు. ఒకప్పుడు ఉడికించిన కూరలు రుచిగా లేవని తిరస్కరించిన మోహన్ దాస్ వీటిని ఎంతో ఇష్టంగా తినటం అలవరచుకున్నాడు. కేవలం శరీరాన్ని పోషించే పదార్ధాలనే తినాలనే నమ్మకం కలిగి కాఫీ, టీ మానివేశాడు. వీటివల్ల ఖర్చులు కూడా తగ్గాయి.
ఆ రోజులలో రెస్టారెంట్లలో రెండు విభాగాలుండేవి. ఒకటి సంపన్నులకు. వారు డిన్నర్లకు 1-2 షిల్లింగులు చెల్లించేవారు. రెండవది సామాన్యులకు. ఇందులో భోజనం ఖరీదు 6 పెన్నీలు. ఇందులో కేవలం బ్రెడ్ మాత్రం పెట్టేవారు. మోహన్ దాస్ ఈ రెండవ విభాగంలోనే భోజనం చేసేవాడు. తన ఆహారంలో మోహన్ దాస్ మరికొన్ని మార్పులు చేశాడు. కొంతమంది కోడిగ్రుడ్లు మాంసాహారం కాదని చెప్పినందువల్ల అది నమ్మి వాటిని తినటం ప్రారంభించాడు. కాని తన తల్లికి ఇచ్చిన శపధం గుర్తుకొచ్చి వారి అభిప్రాయం తప్పు అని తెలిసుకొని వాటికి స్వస్తి పలికాడు.
అంతే కాదు. హోటళ్లలో అనేక పదార్ధాలు కోడిగ్రుడ్లతో తయారయ్యేవి. వీటికి కూడా మోహన్ దాస్ దూరంగా జరిగాడు. తల్లికి ఇచ్చిన శపధం అతనిలో మార్పులు తీసుకొచ్చాయి. ఇవన్నీ ఆయన శాఖా హారాన్ని పూర్తిగా మార్చివేశాయి. కొన్నాళ్ల తరువాత మోహన్ దాస్ నివసిస్తున్న ‘Bayswater’ లో (పశ్చిమ లండన్) శ్వేతజాతి శాఖాహారులతో కలిసి ఒక శాఖాహార ‘క్లబ్’ ప్రారంభించాడు. దీనికి ‘The Vegetarian’ పత్రిక సంపాదకుడు Dr. Oldfield, ఇంగ్లీష్ కవి, పాత్రికేయుడు ‘Sir Edwin Arnold’ ని ఆహ్వానించి, వారిని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడుగా ఉండమని కోరాడు. తాను కార్యదర్శి పదవీ బాధ్యతను స్వీకరించాడు. ఈ క్లబ్ కొన్నాళ్ళు బాగానే నడిచినా 5, 6 నెలల తరువాత మూతపడింది. కాని ఈ పదవిలో సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం కరంచంద్ కు భవిష్యత్తులో చాలా ఉపయోగపడింది.