“హాయ్ ఎలా ఉన్నావ్?” అని ఫోన్‌లో నా ఫ్రెండు రవళి పలకరింపు.
“బాగున్నాను ఏంటి విశేషం, ఇలా?” అన్నాను నవ్వుతూ.
“ఎప్పుడూ గుర్తు ఉంటావు కానీ, నీకు తెలుసుగా,” అని “సరేకానీ, నువ్వు రేపు ఊర్లోనే ఉంటావా?” అంది ప్రశ్నార్థకంగా.
“ఇంట్లోనే ఉంటాను. ఈరోజు సాయంత్రం ‘వసీరా’ అని పెద్ద రచయిత సభ ఉంది ఆయన కవిత్వం చదువుతారు.” అన్నాను.
“అందుకే నీకు ఫోన్ చేశాను, ఆయన నా ఫేస్‌బుక్ ఫ్రెండ్. నువ్వు కలిసి రేపు ఉంటారా, ఎక్కడ ఉంటున్నారు కనుక్కో. నేను కలిసి ఆయన్ని సర్‌ప్రైజ్ చేయాలని నా కోరిక. నేను రేపు వస్తున్నాను. ఆయన అడిగితే నా పేరు చెప్పకు. ఎవరో మీ అభిమాని వచ్చి కలుస్తారు,” అని మాత్రం చెప్పు అంది.
“సరేలే, సర్‌ప్రైజ్ విలువ నాకు తెలుసు. నేను నీ పేరు చెప్పను, కంగారు పడకు, లంచ్‌కి వచ్చేయండి,” అన్నాను.
“లేదు లేదు, లంచ్ ఇంకో ఫ్రెండ్ ఇంట్లో!” అంది.
“అవునా? మరి నేను?” అన్నాను.
“అబ్బా నువ్వు నా బంగారానివి, అర్థం చేసుకుంటావు. ఆ ఫ్రెండ్ భర్త ఈ మధ్య కాలం చేశారు, అప్పటినుంచి ఆమెను కలవాలన్న ప్రయత్నం ఇప్పటికి కుదిరింది. నిన్ను కలవడం మధ్యాహ్నం అవుతుంది” అంది.
“అయితే రాత్రి తినండి,” అన్నాను.
“అయ్యో! పెళ్ళికి వెళ్ళాలి. దారిలో ఈ పనులు చూసుకుని రాత్రి పెళ్లికి వెళ్ళాలి. నేను, మావారు వస్తున్నాం.” అంది.
“సరే, నీ ఇష్టం!” అన్నాను.
“రేపు సభలో ఫోటోలు నువ్వు పెడతావ్‌గా?” అంది.
“ఫోటోలు పెడతాను, ఆయన ఎక్కడ ఉంటారనేది కూడా వివరంగా అడిగి, నీకు చెప్తా. నీ పేరు చెప్పకుండా, తెలుసుకుంటాను సరేనా,” అన్నాను నవ్వుతూ.
“సరే ఉంటాను, రేపు కలుద్దాం, నాతోపాటు నువ్వు కూడా రావాలి, ఆయనని కలవటానికి,” అంది.
“ఆ సర్‌ప్రైజ్ చూసి నేను కూడా థ్రిల్ ఫీల్ అవుతా!” అన్నాను.
ఫోన్ పెట్టేసి, మా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ పనులు చేసుకుంటున్నాను. మా పరిచయం గజల్స్ వర్క్‌షాప్‌లో జరిగింది తను పాటలు పాడుతుంది, గజల్ నేర్చుకుని పాడటానికి తను, రాయడానికి నేను వెళ్ళాము.
కానీ నా బుర్రకి ఆ నియమాలు ఎక్కలేదు, వచ్చిన ఆలోచనని స్వేచ్ఛగా కాగితం మీద పెట్టడం తప్ప అంత కసరత్తు చేయడం నావల్ల కాలేదు. కానీ రవళి చక్కగా నేర్చుకుని గజల్ గాయనిగా, గజల్ రచయితగా స్థిరపడింది కచేరీలు చేస్తూ. తను మల్టీ టాలెంటెడ్. బొమ్మలు కూడా చేస్తుంది, పెయింట్ చాలా బాగా వేస్తుంది, ఎంత బాగుంటాయో! తను తయారు చేసిన బొమ్మలతో, పెయింటింగ్‌లతో వాళ్ళ ఇల్లు కళాత్మకంగా ఉంటుంది. నా కథలకు బహుమతులు వచ్చినప్పుడు తనకు కూడా బహుమతి వచ్చింది. ఆ సందర్భంలో వారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చింది. ఇంటిచుట్టూ మొక్కలు… ముందు పూల మొక్కలు, వెనక కూరగాయలు! మొక్కలు అంటే ఇష్టం అంటూ అన్ని పనులు చేసుకుంటూ పనిమనిషి కూడా లేకుండా… ఆశ్చర్యపోయాను! అంత పని చేసుకుంటూ రచనలు, వంట, మొక్కలు, చిత్రలేఖనం, బొమ్మలు చేయటం! నాకు పనిమనిషి ఒక పూట రాకపోతే టెన్షన్. రవళి పొద్దున్నే లేచి, ఇల్లు శుభ్రం చేసి, పూలు కోసి, పూజ, వంట పూర్తిచేసుకుని ఆ మిగిలిన సమయాన్ని తన అభిరుచులకు కేటాయిస్తూంది అంటే, నేను చాలా చాలా నేర్చుకోవాలని తెలుసుకున్నాను.
అదే అంటే, “చాలులే! మా అమ్మ ఈ వయసులో అన్ని పనులను ఆమే చేసుకుంటూ ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బులతో నాన్న కాలం చేసిన అనాథలను చేరదీసి ఆశ్రమం నిర్వహిస్తోంది,” అంది.
“అవునా, నిజంగా మీరు అందరూ చాలా గ్రేట్!” అన్నాను మెచ్చుకుంటూ. అలాంటి వ్యక్తి మొదటిసారి మా ఇంటికి వస్తుందంటే సంబరంగా అన్పించింది. పనులు ముగించుకుని సాయంత్రం సభకి వెళ్లాను. ఆయనతో మాట్లాడి వివరాలు సేకరించాను. ఆయన బంధువుల కూతురు పెళ్లికి వచ్చారట. రేపు రాత్రికి హైదరాబాద్ వెళ్లిపోతారట.
నా ఫ్రెండ్ పేరు చెప్పకుండా “మా ఫ్రెండు మీ అభిమాని. మిమల్ని కలవాలి అనుకుంటోంది, ఎక్కడ కలవాలి?” అని అడిగాను.
“కళ్యాణమండపానికి వచ్చేయండి, వధూవరులను ఆశీర్వదించి, పెళ్లి భోజనం చేయండి!” అన్నారు ఆయన అభిమానంగా.
ఆయనతో మాట్లాడుతుంటే ఇదే మొదటిసారి కలిసి మాట్లాడటం అనిపించలేదు, ఎప్పటినుండో పరిచయమున్న వ్యక్తిలా మాట్లాడారు. “పెళ్లికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అండి, మా ఫ్రెండ్ వచ్చేసరికి రెండు అవుతుంది, కలుస్తాం. మీకు ఫర్వాలేదా?” అని అన్నాను.
“ఏమీ ఫర్వాలేదు,” ఈలోగా నిర్వాహకులు వేదిక మీదికి ఆహ్వానిస్తే, “రేపు కలుద్దాం.” అని మరోసారి చెప్పి వెళ్లారు.
బీభత్స కవితలు, అనుభూతి కవిత్వం ఆయన రాసిన కవితలు వినిపించారు. బీభత్స కవిత్వం వామ్మో అనిపించింది. అనుభూతి కవిత్వం హాయిగా ఉంది.
“కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు కానీ, కళ్ళు తడవకుండా సంసార సాగరాన్ని దాటలేము” అది విని ఆశ్చర్యపోయాను. అది ఒక జాతీయం అనుకున్నాను. అదే విషయం సభ అయినాక చెప్పాను.
“అది విన్నవారు, ‘మీ అమ్మగారు ఏం చదువుకున్నారు?’ అన్నారు. దాన్ని నిజంగానే చాలా సినిమాలు సీరియల్స్‌లో వాడుకున్నారు. చాలామంది మెచ్చుకున్నారు. ‘నీ వయసు ఏమిటి? నువ్వు రాసింది ఏంటి?’ అని కూడా అన్నారు అప్పుడు నా వయసు ఇరవై ఏళ్ళు మాత్రమే మరి!” అన్నారు నవ్వుతూ.
“మన కవిత అందరికీ అంత చేరువయ్యింది అంటే, సుకవి జీవించు ప్రజల నాలుకలపై అనేది ఎంత నిజం అనేది తెలుస్తుంది” అన్నాను. ఆనందపడ్డారు.
ఆ సభ ఫోటోస్ రవళికి పెట్టాను. “రేపు కలవమన్నారు, పెళ్లి భోజనం చేయమన్నారు” అని మెసేజ్ చేసాను.
“ఓకే, నా పేరు చెప్పలేదుగా!” అని మెసేజ్.
“నీ పేరు చెప్పలేదు,” అని మెసేజ్ పెట్టాను.
“రెండు గంటలకు వస్తాను” అన్నది కాస్తా ఫ్రెండ్ ఇంట్లో లేట్ అయిందని, దారికూడా తప్పేనని, “వసీరా గారి దగ్గరికి నాలుగు గంటలకు వెడదాం” అని ఫోన్ చేసి చెప్పింది. అదే విషయం ఆయనకి ఫోన్ చేసి చెప్పాను.
“ఫర్వాలేదు రండి, కళ్యాణ మంటపంలోనే ఉన్నాను,” అన్నారాయన.
నాలుగు దాటినా రవళి రాలేదు. ఫోన్ కలవడం లేదు. సిగ్నల్ లేదు! ఆయన ఎదురుచూస్తూ ఉంటారని బాధపడ్డాను.
‘ఏం చేస్తాం? ఎదురు చూడటం తప్ప!’ అని నిట్టూర్చాను. వాళ్లు వచ్చే దారిలోనే కళ్యాణ మండపం! ‘మీరు అక్కడ ఆయనని కలవండి. నేను వచ్చి కలుస్తాను. తర్వాత మా ఇంటికి వెడదాం’ అని మెసేజ్ పెట్టాను. ‘ఫోన్ కలవడం లేదు నీకు,’ అని.
కాసేపటి తర్వాత చూసుకుని, ‘ఓకే, గుడ్ ఐడియా!’ అని మెసేజ్ పెట్టింది, ‘నువ్వు బయల్దేరు’ అని.
“హమ్మయ్య, నా నిరీక్షణ ఫలించింది!” అని ఆటోలో బయలుదేరాను. నేను వెళ్ళడం, వాళ్ళ కారు ఆగడం ఒకేసారి జరిగింది. ఇద్దరం చాన్నాళ్ల తర్వాత కలిశాము ఒకరిని చూసి ఒకరు చాలా ఆనందపడ్డాము.
“సరే పద, వసీరా గారికి ఫోన్ చేస్తాను,” అన్నాను. ఇద్దరం వెళ్లి ఫోన్ చేసి ఎదురు చూస్తున్నాం.
ఆయన లిఫ్టులో వస్తారని అనుకుంటే, మెట్లు దిగి రవళిని చూసి అలా ఉండిపోయారు. ఒక నిమిషానికి తేరుకుని, “మీరు అనుకోలేదు,” అన్నారు ఆనందంగా చూస్తూ. సంబరపడ్డారు చిన్నపిల్లాడిలా.
“అమ్మయ్య సర్‌ప్రైజ్ సక్సెస్!” అనుకున్నాను. వారి ఆనందం చూసి నాకు ఆనందం వేసింది.
వారి భార్యనీ, కొత్తజంటనీ పరిచయం చేశారు ఆయన. ఒక కవిత చదివి వినిపించారు. రవళి ఆయనకి చిరు సత్కారం చేసింది. అమ్మపై గజల్ ఆలపించింది. వారి దగ్గర సెలవు తీసుకుని మా ఇంటికి బయలుదేరాం.
“మీ ఇంటికి ముందు, దారిలో మావారి వాళ్ళ ఫ్రెండ్‌ని కలవాలి. ఫర్వాలేదా?” అంది రవళి.
“సరే! కొత్త పరిచయాలు నాకు ఇష్టమే,” అన్నాను.
గూగుల్ చెప్పినట్లు ఆయన ఫ్రెండ్ ఇంటికి చక్కర్లు కొట్టి మొత్తానికి వెళ్ళాం. “ఇప్పుడు వెళ్ళేది మా ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి అంది నవ్వుతూ. ఆమె భర్త మావారికి సీనియర్. ఆయన రిటైర్ అయిపోయారు సైంటిస్ట్‌గా చేసి. వారి ఇంటికే!” అంది.
“ఆవిడ మేము కల్పకంలో ఉన్నప్పుడు పాటలు నేర్పేవారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. చాలా బాగా ఉన్నాం.” అంది రవళి.
ఆ భార్య, భర్త చాలా హుషారుగా ఉన్నారు. ఆత్మీయంగా ఆహ్వానించారు. హాల్లో ఆయన పెద్ద ఫోటో. అబ్దుల్ కలామ్‌గారి చేతులమీదుగా అవార్డు తీసుకుంటున్న ఫోటో! బాగుంది. బొమ్మలకొలువుకు సరిపడా బొమ్మలు ఉన్నాయి. ఉయ్యాల, దానిమీద సరిపడా పెద్ద పరుపు. అలమారలో రామాయణ, భారత, భాగవత పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి వారి అభిరుచిని తెలుపుతూ. నన్ను పరిచయం చేసింది రవళి.
ఆయన వెంటనే సెల్లులో ఫేస్‌బుక్‌లో నా ఫోటో చూపించి, “ఇది మీ ప్రొఫైలేనా?” అని అడిగారు.
“అవునండి” అన్నాను.
ఎనభై ఏళ్ళ ఆవిడ, ఆయన అమ్మగారు కర్ర పట్టుకుని వచ్చారు. ‘ఉత్సాహంగా ఉన్నారు ఆ వయసులో కూడా’ అని చాలా ఆశ్చర్యపోయాను.
“రవళీ, బావున్నావా?” అని అడిగారు ఆవిడ.
“కల్పకంలో చూశారు. ఇన్నేళ్లయినా బాగానే గుర్తు పట్టారు!” అని ఆశ్చర్యపోయింది రవళి కూడా.
“మా అమ్మకి జ్ఞాపకశక్తి ఎక్కువే,” అన్నారు మురిపెంగా ఆయన.
నేను మా మనవడి మాటలకు మురిసిపోయినట్టు ఆయనకు ఆనందం తల్లిని చూసి అని అనిపించింది.
ఆవిడ కూడా, “మా అత్తగారి లాంగ్ ఫ్రాక్ చూశారా? మెత్తగా ఉండాలని నా పాతచీర కుట్టాను” అని మురిసిపోతోంది. “అవును! మా కోడలి పాతచీర హాయిగా ఉంది. గట్టిగా ఉంటే కట్టుకోలేకపోతున్నాను,” అన్నారు బోసినోటితో నవ్వుతూ.
పెద్దవాళ్ళు ఎందుకు ఉన్నారా అనుకునేవారు, వారు బ్రతికుండగానే స్మశానంలో వదిలేసేవారు, గుడి దగ్గరో, ఎక్కడో అక్కడ వదిలేసేవారు, తల్లిదండ్రులని భారంగా భావించే వారు ఉన్న ఈ రోజుల్లో అత్తగారిని ఒక ముద్దుబిడ్డలా అపురూపంగా చూసుకోటం చూసి ఆ జంటకి పాదాభివందనం చేయాలనిపించింది. మరీ సినిమాటిక్‌గా ఉంటుందని ఆగిపోయి మామ్మగారికి మాత్రం నమస్కరించాను.
మా ఇంటికి వచ్చే దారిలో అంది రవళి, “వారు తల్లిని చూసే విధానం నీకు కొత్తగా అనిపించిందా? నాకు వారు పరిచయం అయిన కొత్తలో అలానే అనిపించింది. ఆయన తల్లి కష్టపడి పెంచింది, తండ్రి లేకపోయినా. ‘మాకు పిల్లలు లేరు అని బాధ లేదు. మా ఆవిడ, నేను మా అమ్మను అంత అపురూపంగా చూసుకుంటాము. మా అమ్మ ఉండగా మాకు వేరే పిల్లలు ఎందుకు? ఆవిడే మా ముద్దుబిడ్డ!’ అని, ఇంక పిల్లల కోసం ఏ ప్రయత్నాలు కూడా చేయలేదు వాళ్ళు” అంది.
“అవునా, నీవల్ల నాకు ఈ కుటుంబం, తల్లిని ముద్దుబిడ్డ చూసుకునే సంస్కారవంతమైన దంపతుల పరిచయం కలిగింది. చాలా కొత్తగా అద్భుతంగా అనిపించింది,” అన్నాను ఉద్వేగంగా.
“నిజమే, ఆ తల్లి నిజంగా అదృష్టవంతురాలు. ఆవిడ ఎంత కష్టపడి బిడ్డని పెంచినా, ఏరు దాటాక తెప్పను తగలేసే బిడ్డలు ఉన్న ఈ సమాజంలో, ఎంత తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగినా ఆయన ఆవిడని చూసుకోవటమే గొప్ప. ఆ విషయం అలా ఉంచితే, ఆయన భార్య కూడా అంత బాగా చూసుకోవడం ఉందే, అదీ అసలు గొప్ప. సొంత పిల్లలు లేరని అనుకోరు. అనాథపిల్లలకు ఎంతోసాయం చేస్తూ ఉంటారు. తల్లి ఒక్కరూ ఉండాల్సివస్తుందని ఎక్కడికీ వెళ్లరు,” అన్నారు రవళి భర్త.
“అవునండి, చూసానుగా! వీరిని చూసి చాలామంది నేర్చుకోవాలి, తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలో! చాలా ఆదర్శవంతమైన కుటుంబం,” అన్నాను ఆలోచనగా.