మూర్తి ని చూడగానే అమృతవరం సర్పంచ్ ఆనందంగా లోపలికి ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేసుకున్నాక.
"అమ్మగారిని తీసుకు రాలేదా?" అంటూ అడిగాడు సర్పంచ్.
"తర్వాత వస్తుంది బాబాయ్" అన్నాడు మూర్తి.
మూర్తి ముఖకవళికలను పరిశీలిస్తూ...
"తర్వాత రావడమేంటి? ఏం జరిగింది?" అంటూ అడిగాడు సర్పంచ్. ప్రణవి పెళ్లయిన దగ్గర నుంచి జరిగినవన్నీ ఏకరువు పెట్టాడు మూర్తి.
అంతా విన్నాక ఆ గ్రామ సర్పంచ్ రామారావు,
"మీకు తగ్గ వాళ్లు కాదు. ఇలాంటి వాళ్ళు మీకు ఎక్కడ దొరికారు. బంగారం లాంటి పిల్ల! ఎవరి జోలికి వెళ్ళేది కాదు. చదువుల తల్లి. అలాంటి పిల్లను ఎంత దుఃఖ పెట్టోరో! పాపం..." అంటూ బాధపడ్డాడు.
"అవును బాబాయ్. చాలా బాగా మాట్లాడితే మంచి వాళ్లు అనుకున్నాము." బాధగా చెప్పాడు మూర్తి.
"అయినా పెళ్లయిన కొత్తల్లోనే వాళ్ళ వ్యవహారం బయట పడ్డప్పుడు... వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సింది," అన్నాడు.
"-------"
"ఇంట్లోంచి గెంటి వేసినప్పుడే కేసు పెట్టాల్సింది కదా! ఇన్నాళ్ళ వరకు అలాంటి దుర్మార్గులను శిక్షించకుండా, ఎందుకు ఆగారు?"
"మా అక్క ఒప్పుకుంటే కదా!" అన్నాడు మూర్తి.
"ఎంతో ఉత్తమురాలు మీ అక్కయ్యగారు. మేష్టారు లాగా మంచి మనస్సు. ఈ కాలంలో పుట్టాల్సింది కాదు. ఈ కాలం పిల్లలు స్వేచ్ఛ కోసం, చిన్న చిన్న మాట పట్టింపులకే కోర్టు బోను ఎక్కుతున్నారు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి విడాకులు తీసుకుంటున్నారు. పోనీలే ఇప్పటికన్నా కేసు పెట్టడానికి ఒప్పుకుంది," అన్నాడు రామారావు.
"అది ఎక్కడ మనస్పూర్తిగా ఒప్పుకొంది. అమ్మా, నేను ఒప్పించాము. నాకు ఓ అనుమానం బాబాయ్... ఇప్పుడు అక్కను వాళ్లు తరిమేసి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి అక్క ఇక్కడే ఉంది. మరి కేసు పెడితే నిలబడుతుందా? విడాకులు ఇచ్చేస్తారా?" అంటూ అమాయకంగా అడిగాడు మూర్తి.
"ఏంటి మూర్తి గారు? అన్ని తెలిసిన మీరే! ఇలా అయిపోయారు! చట్టపరంగా విడాకులు తీసుకోకుండా... విడిగా ఉన్నంత మాత్రాన విడాకులు అయిపోవు. ఇరువురి పరస్పర అంగీకారంతో మాత్రమే విడాకులు మంజూరు అవుతాయి. మీకు ఎందుకు బాబు నా చెవిలో వేసారు కదా! వాళ్ళను ఎలా వంచాలో అలా వంచుతాను. మీరు నిశ్చింతగా ఉండండి," అన్నాడు రామారావు.
"మీరంతా ఉన్నారనే ధైర్యం తోనే కేసు ఇక్కడ ఫైల్ చేద్దామని వచ్చా" అన్నాడు మూర్తి.
"తప్పకుండా... మాకు చేతనైన సహాయం మేము చేస్తాము," అని చెప్పి ఎవరెవరికో ఫోన్ చేసి మాట్లాడాడు రామారావు.
తర్వాత ఓ పేపర్ మీద ఏం రాయాలో అలా రాసేసి... మూర్తి కి ఇచ్చాడు.
మూర్తి దాన్ని చదివి, అమ్మో దీని మీద అక్కను సంతకం పెట్టమంటే పెట్టదు బాబాయి. అదో సత్యసందాన," అన్నాడు మూర్తి
ముల్లును ముల్లుతోనే తీయాలి. ఎలాంటి వాళ్ళకి అలాగే బుద్ది చెప్పాలి. మనం సత్యహరిశ్చంద్రుడి వారసుల్లా ఉంటే, వాళ్ళు మనల్ని ఫుడ్ బాల్ ఆడేసుకుంటారు. ఇలాగే రాయాలి.
ఇలా రాస్తేనే కేసు బలంగా ఉంటుంది. అక్క సంతకం పెట్టదు అనిపిస్తే...మీరు అక్క చేత ఓ తెల్లకాగితం మీద సంతకం పెట్టించుకు రండి. మీ మీద నమ్మకమేనా? పెడుతుందా?" అంటూ అడిగాడు రామారావు.
"హా తప్పకుండా పెడుతుంది. అలాగేమీలేదు," అన్నాడు మూర్తి.
"అలాగైతే సంతకం పెట్టించుకునిరా. దాని మీద తర్వాత మనం ఈ మేటర్ రాసి, మన పి.యస్ లో కంప్లేంట్ ఇద్దాం. ఈ ఊర్లో కేస్ పుటప్ చేయాలంటే కొన్ని కొన్ని జిమ్మిక్కులు తప్పవు," అన్నాడు రామారావు.
సరే బాబాయ్ అని చెప్పి, మూర్తి ఇంటికి వెళ్లి, ఎవరు వినకుండా తల్లి గిరిజకు మాత్రం అసలు విషయం చెప్పి, ప్రణవీ చేత తెల్లకాగితం మీద సంతకం పెట్టించుకుని, అది తీసుకుని అమృత వరం వెళ్ళి, రామారావు చేతికి ఇచ్చాడు మూర్తి.
ఆ కాగితం మీద రామారావు మేటర్ అంతా రాసేసి, మూర్తిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
అమృతవరం పోలీస్ స్టేషన్లో జంబేష్ కుటుంబం మీద కేసు పెట్టారు.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్‌ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.