Menu Close
Nagamanjari-Gumma
అనామిక (ధారావాహిక)
నాగమంజరి గుమ్మా

నసీర్ బృందానికి పట్టిన గతిని చెట్ల చాటు నుండి నాలుగు కళ్ళు చూశాయి. వారిద్దరూ నగేష్ నియమించిన వ్యక్తులు. రాఘవరావు, విజయన్, జేమ్స్, నసీర్ లకు పని అప్పగించి చేతులు కట్టుకుని కూర్చోలేదతడు. వారు చేసిన, చేస్తున్న పనులను పరిశీలించి, ఎప్పటికప్పుడు తనకు విషయం అందజేయడానికి కొందరు వ్యక్తులను నియమించాడు. వారిలో ఇద్దరు నసీర్ బృందానికి తెలియకుండా వారిని అనుసరిస్తున్నారు. తేనెటీగల దాడి, అనుచరుల మృతి మొదలైన విషయాలు ఎప్పటికప్పుడు నగేష్ కు తెలియజేసారు వారు. ఆటవికులు వెళ్లిపోగానే ఆ ఇద్దరు వ్యక్తులు, నసీర్ బృందంతో సహా మరణించిన విషయం మొత్తం సెటిలైట్ ఫోన్ లో నగేష్ కు తెలియజేసారు. ఈశాన్య ప్రాంతంలో అన్వేషణ నగేష్ కు ఛాలెంజ్ గా మారింది. అక్కడ ఇంకొకరిని నియమించడమా, మిగతావారి ఫలితాలు తేలేవరకు వేచి చూడటమా అని నిర్ణయించుకోలేకపోయాడు నగేష్. మిగతా ముగ్గురికి నసీర్ మరణ వార్త చేరవేయడం ఇష్టం లేకపోయింది నగేష్ కి. అవసరమైనప్పుడు చెప్పవచ్చులే అని ఊరుకున్నాడు.

*****
బంగారానికి, బంగారు నగలకు, అనేక రకాలైన మణులకు, గనులకు పుట్టినిల్లు దక్కన్ పీఠభూమి ప్రాంతం. అందులో ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో బంగారం వినియోగం ఎక్కువ. దేవాలయాలలో దేవతా విగ్రహాలకు కూడా రకరకాలైన ఆభరణాలు అమర్చిపెట్టారు. కేరళ అటవీ ప్రాంతంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నప్పటికీ, ఆ ఆలయాల్లో ఆభరణాలు ఉన్నాయో లేదో తెలీదు, కాబట్టి ముందు పట్టణ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలలోని ప్రముఖ దేవాలయాలు సందర్శించాలని అనుకున్నాడు విజయన్. ఈలోగా కొంత వర్క్ చేసాడు. గ్రంథాలయాలకు వెళ్లి దేవాలయాలకు, నగలకు సంబంధించిన పురాతన గ్రంథాలు వెదికి వాటిలో చిత్రాలకు నకలు ప్రతులు గీయించాడు. అలా ఓ రెండు మూడు వందల హారాల నమూనాలు సేకరించాడు. వాటిలో తన దగ్గర ఉన్న మరకత మణి హారం నమూనా కూడా కలిపి పెట్టాడు. అవన్నీ పెద్ద ఫైల్ గా చేర్చి పెట్టాడు విజయన్.

వివిధ దేవాలయాలు సందర్శించి, తాను చేస్తున్న వ్యాపారాన్ని గురించి వాటి నిర్వాహకులకు, ధర్మకర్తలకు తెలియజేశాడు. ఆభరణాలు తీసుకురానవసరం లేదని, వాటి ఫోటో లేదా గీయించిన నకలు చిత్రమైనా చాలునని చెప్పాడు. ప్రత్యక్షంగా నగలు చూడనవసరం లేదని చెప్పడం వలన విజయన్ పని కాస్త సులువయ్యింది. వారు తెచ్చిన చిత్రాలపై ఆ దేవాలయం పేరు, దేవత పేరు, ఊరు రాసి పెట్టుకునేవాడు. కానీ ఏ చిత్రం మరకత మణి హారంతో సరిపోలలేదు. కాస్త అసంతృప్తిగా మరో దేవాలయానికి బయలుదేరేవాడు విజయన్.

కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో కల అదూర్ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి. పార్ధసారధి దేవాలయం, పందలం మహదేవ దేవాలయం, పట్టుపురకాల్ దేవి దేవాలయం, పుతేన్ కావిల్ భగవతి దేవాలయం మరియు శ్రీ నారాయణపురం మహావిష్ణు దేవాలయం అదూర్ లో ప్రసిద్ధి చెందినవి.

పందలం ప్యాలెస్ అచంకోవిల్ నది ఒడ్డున ఉంది. ఇది పందలం రాజ కుటుంబానికి స్వస్ధలం. రాజభవనం పందలం లో అదూర్ పట్టణానికి 10 కి.మీ.ల దూరంలో ఉంది. కేరళ చరిత్రలో ఈ రాచ కుటుంబం విశిష్ట స్ధానాన్ని కలిగి ఉంది. ఈ వంశస్ధులు, మదురై కు చెందిన పాండ్య రాజుల వంశీకులని చెపుతారు. ఇతిహాసాల మేరకు, స్వామి అయ్యప్ప పందలం రాజ వంశంలో జన్మించాడు. అయ్యప్ప విగ్రహం కల ఒక దేవాలయం అచంకోవిల్ నది ఒడ్డున ఉంది. ఈ దేవాలయం అచ్చంగా శబరిమలై దేవాలయ నమూనాలో ఉంటుంది. ఈ ప్రాంతంలో మకరవిళక్కు పండుగను విశిష్టతతో ఆచరిస్తారు. అయ్యప్పస్వామి ఆభరణాలు పందలం నుండి శబరిమలైకు ఒక ఘనమైన ఊరేగింపులో పండుగకు మూడు రోజుల ముందు తరలిస్తారు.

విజయన్ ఈ వివరాలన్నీ తెలుసుకున్న తరువాత స్త్రీ దేవతా స్వరూపాలకు మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన దేవాలయాలు మరకత మణిహారం కోసం వెతకాలి అనుకున్నాడు. కానీ ఒకటా రెండా? తన దగ్గర ఉన్న ఆభరణాల నకలులు అన్ని పెద్ద ఎత్తున కాపీలు తీయించాడు. తన అనుచరులందరికి సంప్రదాయ దుస్తులు వేసి, గుర్తింపు కార్డులు ఇచ్చి, తిరుమణి, విభూతి రేఖలతో సిద్ధం చేసాడు. ఇద్దరిద్దరిని ఒక జట్టుగా, నగల చిత్రాలను ఇచ్చి, ఒకేసారి వివిధ దేవాలయాలకు పంపించాడు. కొందరిని రాజవంశీకుల ఇళ్లకు పంపించాడు. నిజంగా ఆభరణాల తయారీలో ఆసక్తి, నైపుణ్యం ఉన్న కొందరు యువకులను కూడా చేరదీసాడు. వారికి చిత్రాలతో పాటు కొన్ని నకిలీ ఆభరణాలు కూడా ఇచ్చి గ్రామస్థాయికి పంపించాడు. తాను స్వయంగా ఖరీదైన ఆభరణాలు, వజ్రాలు తదితర విలువైన రాళ్లు పొదిగే దుకాణాలకు వెళ్ళాడు.

మొత్తానికి విజయన్ చేసే వ్యాపారం కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందింది. కొన్ని కొత్త కొత్త డిజైన్లు వచ్చి చేరుతున్నాయి. కొన్ని నగలకు ఆర్డర్లు వచ్చాయి. తమ దగ్గర ఉన్న స్వర్ణకారులతో ఆ ఆభరణాలు జాగ్రత్తగా చేయించి ఇచ్చేవాడు. ఇంత విస్తృతంగా ప్రచారం లభించి, ఎన్నో ఆభరణాల నమూనాలు సేకరించినా, అసలు హారం ఆచూకీ ఇంత వరకు దొరకలేదు. అసహనంగా ఉంది విజయన్ కి. ఒకప్పటి కంటే తన వ్యాపార విస్తృతి పెరిగింది. కానీ అనుకున్నది సాధించలేకపోతున్నాడు.

ఒకసారి మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించే నెపంతో పరిశీలించాలి అనుకున్నాడు విజయన్. తన పరివారాన్ని వెంటపెట్టుకొని, సకల సంబారాలతో మీనాక్షి అమ్మ దర్శనానికి వెళ్ళాడు. వచ్చిన వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త కావడంతో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, పురోహితులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి తాను చేయించిన ఒక వజ్ర ఖచిత హారాన్ని అమ్మవారికి సమర్పించాడు విజయన్. హారాన్ని అలంకరించిన తర్వాత అమ్మవారి దృష్టి మరింత కృపారసం తో అలరారుతున్నట్లు అందరికి కనిపించగా, దీపాల కాంతి వజ్రాలపై పడి, పరావర్తనం చెంది అమ్మవారి మోము క్రోధంగా, కళ్ళు మిక్కిలి ఎరుపు పూసుకున్న జ్యోతుల్లా విజయన్ కు అనుభూతి కలిగింది. గబుక్కున కళ్ళు మూసుకుని చేతులు జోడించాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మ ప్రసన్నవదనంతో కనిపించింది. పూజారులకు తనకు కలిగిన అనుభూతిని వివరించి చెప్పాడు. అప్పుడు ఆ గుడి పూజారులు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

శక్తిపీఠాల్లో మధురమీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనాల్లాంటి అందమైన విశాలనేత్రాలతో ఒకే ఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా, కులదేవతగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణం" లో మణిద్వీప వర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" రాత్రివేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తంమీద వేదపండితులు, బుత్విక్కులను పిలిచిన పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబళించేసింది అమ్మవారు. చేసిది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేదాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే.

అక్కడ క్షేత్రపాలకుడూ, అమ్మవారి అర్థభాగమైన సుందరేశ్వరుడు (శివుడు) కూడా అంతా చూస్తుండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్థభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకలమర్యాదలు చేశాడు. అయితే ఈ రోజు రాత్రి తాను మధురమీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాటవిని పాండ్యరాజు వణికిపోయాడు. "వద్దు స్వామీ! మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాపఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని" రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు. అంతా విన్న శంకరాచార్యులు "సన్యాసులు గృహస్తుల భిక్ష స్వీకరించేవరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి, జగన్మాత ఆలయానికి వెళతాను అడ్డు చెప్పొద్ద"న్నారు. దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. "యువసన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని" బాధపడసాగాడు.

చీకటిపడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆది శంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణరసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకూ అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్థనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగువేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యోగిని గమనించింది. "ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి, తనని చూస్తే అమ్మ ప్రేమ పెల్లుబుకుతోందేంటి?" అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటేవరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్త్వికరూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్లు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్లారా చూశారు. తల్లి ఎంత అంద విహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుందన్నట్టు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబళించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు.. ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను "నువ్వు ఎవరు?, నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అడ్డు తొలగు" అంది. "నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని" చెప్పింది మీనాక్షి అమ్మవారు.

అమ్మవారికి సాష్టాంగ దండప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా" అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. "అమ్మా! నాతో పాచికలాడతావా?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా.. కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా అందుకే నేను నా భర్తతో పాచిక లాడేటప్పుడు ఓ నిబంధన పెడతా" అంది మీనాక్షి. "నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. (ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు)".

"అమ్మా ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి.. నేను ఓడితే మొదట ఆహారం అవుతా" అన్నాడు శంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతికిరణం మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు.

పాచికలు సృష్టించిన అమ్మవారు "చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు" అంది. పసుపు కుంకుమలతో ఆటకు గళ్ళు గీశాడు ఆది శంకరుడు.

"పరమేశ్వరుడితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది." అన్నారు శంకరాచార్యులు. "నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లీ" అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్లలో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి.

"విజయం నాదే కదా" అంది మీనాక్షి అమ్మవారు. "పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవం యొక్క పాదాలను పట్టుకొనేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. "నాయనా! నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక" అని దీవించింది.

ఆట పూర్తయ్యేవరకూ గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్లి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంతస్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆదిశంకారాచార్యులి తొలి విజయం ఇదే. సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్లీ శాంతస్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెబుతూ, అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారేవరకూ సాగింది. అప్పటికే తేరుకున్న మధర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆటమీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు, సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు ఆదిశంకరాచార్యులు. దూరంగా శివభక్తుల రాక, నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి.

"నాయనా! చివరి పందెంనాది. నా పావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు.

"నీ చేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సింది ఏముంద"న్న శంకరాచార్యులు "ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది" అన్నారు.

"నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే, సహస్ర నామావళి నీ నామం. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీ ఉనికిని, నీవే అర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి నాశనం అవుతుందని" చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకూ పాచికలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని కానీ తనను అందులో ప్రతిష్టించాడు (బంధించాడు) అని కానీ అమ్మవారు గుర్తించలేదు.

అప్పుడు కళ్లు తెరిచిన పరమశివుడు... "దేవీ! నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి. అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైన నాకు మాత్రమే తెలుసు" అన్నాడు శివుడు.

అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీపరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు "ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదని" పాండ్యరాజుకి అభయం ఇచ్చాడు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రం మధురమీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంగణంలో మోకరిల్లినా ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు భక్తులు.

****సశేషం****

రచయిత్రి పరిచయం:

Nagamanjari-Gummaనాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..

కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల... ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి  పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.

అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.

ముందుమాట:

"అనామిక" అనే ఈ నవల 90' లలో మొదలైన ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? అనామిక ఎవరు? ఆ ప్రేమ జంటకి అనామికకు సంబంధం ఏమిటి? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది.

దైవిక శక్తులతో ఆటలాడడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాంటి వారిని శిక్షించే పని భగవంతుడే వివిధ రూపాలలో పూర్తి చేస్తారు. అలా జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈ నవల రూపు దిద్దుకుంది.

ఈ నవల మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ....మీ అభిప్రాయాలను, సూచనలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ.. "అనామిక" నవలను సీరియల్ గా ప్రచురిస్తున్న సిరిమల్లె సంపాదకులు మధు మరియు ఉమప్రియ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ...

- నాగమంజరి గుమ్మా, శృంగవరపుకోట

Posted in August 2025, కథలు

3 Comments

  1. చావలి శేషాద్రి సోమయాజులు

    చాలా ఆసక్తికరంగా,సృజనతో‌ రాసారు……పాఠకుడిని‌ సంతృప్తి పరచే‌ కలం‌ కదలిక‌ మీ‌ నైపుణ్యం ‌…. ప్రస్తుతం నవలలు చదివే‌ వారి‌ సంఖ్య చాలా తక్కువగా ఉంది ‌.. అయినా‌ ఈ ప్రక్రియ లో‌ మీ కృషి అభినందనీయం ‌.

  2. కాశీ విశ్వనాథం పట్రాయుడు

    Chala బాగుంది. తెలియని విషయాన్ని తెలియచేశారు. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *